ఖమ్మం వైద్యవిభాగం: మారుమూల ప్రాంతాల్లో గర్భిణులు అవస్థలు పడొద్దని.. సుఖ ప్రసవం జరగాలని.. తల్లీ బిడ్డ క్షేమంగా ఉండాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం 2017, జూన్ 2న అమ్మ ఒడి పథకాన్ని ప్రవేశపెట్టింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రసవాలు పెంచేలా కార్యాచరణ రూపొందించి.. అమలు చేస్తోంది. కేసీఆర్ కిట్ అందజేయడంతోపాటు ఆడపిల్ల పుడితే రూ.13వేలు, మగపిల్లాడు పుడితే రూ.12వేల చొప్పున అమ్మ ఒడి పథకం ద్వారా అందించేందుకు శ్రీకారం చుట్టింది. దీంతో జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య 15 నెలల కాలంలోనే రెట్టింపు అయింది. పథకానికి ముందు ప్రైవేటు ఆస్పత్రుల్లో ఏడాదికి 22వేలకు పైగా ప్రసవాలు జరగగా.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వాటి సంఖ్య 5వేలకు మించని పరిస్థితి. ప్రస్తుతం ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు పెరుగుతున్నా.. పీహెచ్‌సీలలో ఆశించిన మేర జరగకపోవడంతో పథకం లక్ష్యం నెరవేరకుండా పోతోంది.
పీహెచ్‌సీల్లో 8 శాతం మాత్రమే..
జిల్లాలో 22 పీహెచ్‌సీలు ఉండగా.. పథకం ప్రారంభమైన 15 నెలల కాలంలో కేవలం 8 శాతం మాత్రమే ప్రసవాలు జరగడం గమనార్హం. కల్లూరు పీహెచ్‌సీలో మాత్రమే 182 ప్రసవాలు జరిగాయి. వైరా 101, బోనకల్ 98 ప్రసవాలతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. కొన్ని పీహెచ్‌సీలలో రెండు అంకెలు కూడా దాటకపోవడం శోచనీయం. మంచుకొండ 2, సుబ్లేడు 3, కూసుమంచి 5, పెద్దగోపతి 6, కామేపల్లి పీహెచ్‌సీలలో 9 డెలివరీలు మాత్రమే చేయడంతో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. పథకం ప్రారంభం నుంచి ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా 12,606 ప్రసవాలు చేయగా.. పీహెచ్‌సీలలో 1,019 మాత్రమే చేశారు. ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నప్పటికీ పీహెచ్‌సీల్లో మాత్రం 8 శాతం మాత్రమే కావడం వల్ల ఆ శాఖ పనితీరు అర్థమవుతోంది.
92 శాతం వైద్య విధాన పరిషత్ ఆస్పత్రుల్లోనే..
జిల్లాలోని పెద్దాస్పత్రితోపాటు సత్తుపల్లి, పెనుబల్లి, మధిరలో వైద్య విధాన పరిషత్ ఆస్పత్రులున్నాయి. అయితే పీహెచ్‌సీలకన్నా వీటిలోనే అధికంగా ప్రసవాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా పట్టణ ప్రాంతాలు కావడంతో ఎక్కువ మంది గర్భిణులు ఆయా ప్రాంతాల్లో ప్రసవాలు చేయించుకునేందుకు వస్తున్నారు. ఇక్కడైతే మంచి సౌకర్యాలు ఉంటాయనే ఉద్దేశంతో వ్యయ ప్రయాసలకోర్చి వైద్య విధాన పరిషత్ ఆస్పత్రుల వైపు మొగ్గు చూపుతున్నారు. 15 నెలల కాలంలో 92 శాతం డెలివరీలు ఈ ఆస్పత్రుల్లోనే జరిగాయి.
పెద్దాస్పత్రిలో రికార్డు స్థాయిలో..
రాష్ట్రంలోనే అత్యధికంగా ప్రసవాలు హైదరాబాద్ తర్వాత ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో జరుగుతున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. 15 నెలల కాలంలో జిల్లావ్యాప్తంగా 12,606 ప్రసవాలు జరగగా.. ఒక్క పెద్దాస్పత్రిలోనే 10,082 ప్రసవాలు జరగడం గమనార్హం. ముఖ్యంగా మాతా, శిశు సంరక్షణ కేంద్రం ఏర్పాటు చేయడంతో ఇక్కడ ప్రసవాలు చేయించుకునేందుకు గర్భిణులు ఆసక్తి చూపుతున్నారు. పెద్దాస్పత్రిలో ప్రతి రోజు 20 నుంచి 30 వరకు ప్రసవాలు చేస్తున్నారు. 90 శాతం వరకు ఇక్కడే ప్రసవాలు జరుగుతున్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ లెక్కలు చెపుతున్నాయి. అయితే ఎక్కువ సంఖ్యలో గర్భిణులు పెద్దాస్పత్రికి వస్తుండడంతో ఇక్కడి వైద్యులపై మరింత భారం పడుతోంది. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో అత్యధికంగా ప్రసవాలు జరుగుతుండగా.. పీహెచ్‌సీల్లో ఇందుకు భిన్నమైన పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. పీహెచ్‌సీల్లో సరైన సౌకర్యాలు లేకపోవడం, మారుమూల ప్రాంత ప్రజల్లో అవగాహన కల్పించకపోవడం వంటి కారణాల వల్ల అక్కడ ప్రసవాలు చేయించుకునేందుకు గర్భిణులు ఇష్టపడట్లేదని తెలుస్తోంది.
సబ్‌సెంటర్ స్థాయిలో అవగాహన పెంచాలి..
పీహెచ్‌సీల్లో ప్రసవాలు చేయించుకోవాల్సిన ఆవశ్యకతను సబ్‌సెంటర్ స్థాయిలో ప్రచారం నిర్వహిస్తే మరింతగా పెరిగే అవకాశం ఉంటుంది. పీహెచ్‌సీల్లో కల్పిస్తున్న సౌకర్యాలు, ఆర్థికంగా వచ్చే ప్రయోజనం ఏఎన్‌ఎం, ఆశ కార్యకర్తల ద్వారా గర్భిణులకు వివరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కేసీఆర్ కిట్ల పథకం వచ్చాక ఎక్కువ మంది ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవం చేయించుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కేసీఆర్ కిట్‌తోపాటు ప్రోత్సాహకం కూడా ఇస్తుండడంతో గర్భం దాల్చిన వెంటనే పేర్లు నమోదు చేయించుకుంటున్నారు. జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 12,606 ప్రసవాలు జరగగా.. 11,225 మందికి కేసీఆర్ కిట్లు అందించారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. పీహెచ్‌సీలకు వచ్చేందుకు మాత్రం గర్భిణులు ఇష్టపడటం లేదు. ఆ విధానం మారాలంటే వైద్య, ఆరోగ్య శాఖ అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతోపాటు పీహెచ్‌సీల్లో ప్రసవాలు చేయించుకోవాల్సిన ఆవశ్యకతపై వివరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
పీహెచ్‌సీల్లో పెంచేందుకు ప్రణాళికలు
పీహెచ్‌సీల్లో ప్రసవాలు పెంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాం. సబ్‌సెంటర్లలోని ఆశ, ఏఎన్‌ఎం, సూపర్‌వైజర్ల ద్వారా గర్భిణులను గుర్తించి.. వారికి అవగాహన కల్పిస్తున్నాం. దగ్గర్లోని పీహెచ్‌సీల్లో ప్రసవాలు చేయించుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలపై వివరిస్తున్నాం. అలాగే తొలిసారి సాధారణ కాన్పు చేయించుకోవాలని అవగాహన కల్పిస్తున్నాం. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ద్వారా పీహెచ్‌సీల్లో ప్రసవాలు పెంచేందుకు ప్రయత్నిస్తున్నాం. - కళావతిబాయి, డీఎంహెచ్‌ఓ
నీరుగారుతున్న ప్రభుత్వ లక్ష్యం
Published Tue, Oct 9 2018 6:41 AM | Last Updated on Tue, Oct 9 2018 6:41 AM
1/1
Advertisement
Comments
Please login to add a commentAdd a comment