రాక్షస పాలన నుంచి రాజన్న పాలనకు
సాక్షి, కపిలేశ్వరపురం (తూర్పు గోదావరి): నాయకుడంటే ఇలా ఉండాలిరా అన్న రోజులు మళ్లీ వచ్చాయి. ఎప్పుడో 2004లో దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనా తీరును చూసి అప్పట్లో ప్రజలు వైఎస్సార్‌ను గొప్ప నాయకుడుగా చెప్పుకున్నారు. నియోజకవర్గంలోని వేలాది మంది ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం చేయించుకున్నారు. పింఛన్లు తీసుకుంటూ ఆసరా పొందారు. ఆయన మరణానంతరం కూడా వైఎస్సార్‌ను ప్రజలు తమ గుండెల్లో దాచుకున్నారంటే పాలకుడిగా ఏ మేరకు పనిచేశారో అర్థమవుతుంది. మళ్లీ అలాంటి పాలన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిలో చూస్తున్నామన్న అభిప్రాయం క్షేత్ర స్థాయిలో ప్రజల్లో వ్యక్తమవుతుంది. తమ మేలు కోరి చేసిన నిర్ణయాలు పట్ల వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేయడం, కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకోవడం ప్రజల సంతోషానికి ప్రతిబిబంగా నిలుస్తోంది.
నియోజకవర్గంలో ఇలా...
మండపేట పట్టణంతో పాటు, మండపేట రూరల్, రాయవరం, కపిలేశ్వరపురం మండలాల పరిధిలో 43 గ్రామాలున్నాయి. గోదావరి తీర ప్రాంతంలో అద్దంకివారిలంక, కేదారలంక గ్రామాలున్నాయి. 4 వేల ఎకరాల్లోని ఉద్యాన పంటలు ఆధారంగా లంక వాసులు జీవనం సాగిస్తున్నారు. ఇతర ప్రాంతాల్లో ప్రజలు 48,500 ఎకరాల్లో వరిని సాగు చేస్తున్నారు. పట్టణంలోని వ్యాపార సంస్థల్లో నెలసరి పరిమిత జీతాలతో కాలం వెళ్లదీస్తున్నారు. పట్టణంతో పాటు మండపేట రూరల్ గ్రామాల్లో కోళ్ల పరిశ్రమ, కపిలేశ్వరపురం, రాయవరం మండలాల్లో ఇటుక పరిశ్రమల్లో వేలాది మంది శ్రమిస్తున్నారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల నుంచి వలస వచ్చిన వారు నియోజకవర్గంలోని ఇటుక బట్టీల్లో పనిచేస్తున్నారు. వైఎస్ జగన్ సంక్షేమ పథకాలు అమలుతో వారి జీవితాలు మెరుగుపడనున్నాయి.
బెల్టు తీస్తున్న సర్కార్...
నియోజకవర్గంలో బెల్ట్ షాపుల నిర్వహణ విచ్చలవిడిగా సాగేది. మద్యం దుకాణాలు తొలగించాలంటూ 2017 జూలై 6న మండపేట గొల్లపుంతలో పలు మార్లు కపిలేశ్వరపురం మండలం వడ్లమూరు, వెదురుమూడిలలో మహిళలు ఆందోళనలు చేసినా ఫలితం లేకపోయింది. వైఎ స్‌జగన్ సీఎం కాగానే దశల వారీ మద్య నిషేదానికి కార్యాచరణను ప్రారంభించారు. గ్రామాల్లో ఎక్సైజ్ అధికారులు అవగాహన సదస్సులు నిర్వహిస్తూ మద్యం షాపుల ఎత్తివేతపై వివరణ ఇస్తున్నారు. రామచంద్రపురం ఎక్సైజ్ పరిధిలోని నాలుగు మండలాలకు నలుగురు అధికారులను నియమించి ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. నియోజకవర్గంలో 27 మద్యం దుకాణాలుండగా ఒక్కో షాపు పరిధిలో ఐదు నుంచి పది బెల్ట్ షాపులు నిర్వహణలో ఉన్నాయి. వాటిపై ప్రస్తుత ప్రభుత్వం ఆదేశాలు మేరకు ఎక్సైజ్ అధికారుల దాడులు చేసి మూయిస్తున్నారు.
ప్రజా సంకల్ప పాదయాత్ర నియోజకవర్గంలో కొనసాగుతున్నప్పుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి సీపీఎస్ రద్దుకు ఉపాధ్యాయులు, ఉద్యోగులు వినతిపత్రాలను అందజేశారు. అధికారంలోకి రాగానే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీపీఎస్‌ను రద్దు చేస్తున్నట్టు ప్రకటన చేశారు. అందుకోసం కమిటీని నియమించారు. నియోజకవర్గంలో సుమారుగా 710 మంది ఉపాధ్యాయులుండగా వారిలో 550 మందికి సీపీఎస్ వల్ల ప్రయోజనం కలుగుతుంది. ఇతర ప్రభుత్వం శాఖల్లో 150 మంది ఉద్యోగులకు మేలు చేకూరుతుంది.
చిరుద్యోగులు చిరునవ్వుతో ఉండాలని...
అంగన్‌వాడీలకు, ఆశ వర్కర్లకు జీతాలు పెంచడంతో నియోజకవర్గంలోని మండపేట పట్టణంలో సీహెచ్‌సీ, రూరల్ మండలంలో ద్వారపూడి పీహెచ్‌సీ, రాయవరం మండలంలోని మాచరవరం, రాయవరంలలో పీహెచ్‌సీలు, కపిలేశ్వరపురం మండలంలోని వాకతిప్ప, అంగర, అచ్యుతాపురంలలో పీహెచ్‌సీలు, కపిలేశ్వరపురంలో సీహెచ్‌సీ చిరుద్యోగుల్లో ఆనందం వెల్లివిరిసింది. రాయవరం మండలంలో 80, మండపేటలో 74, కపిలేశ్వరపురంలో 90 మొత్తం 244 మంది ఆశ వర్కర్లకు జీతాలు పెరిగాయి. నియోజకవర్గంలో సుమారుగా 300 కేంద్రాలుండగా అందులో పనిచేసే 600 మందికి పెరిగిన జీతాలు వర్తించనున్నాయి.
మెరుగైన చదువుల కోసం
ఎన్నికల హామీలు మేరకు అమ్మ ఒడి పథకానికి సీఎం జగన్ కార్యాచరణ ప్రక్రియను ప్రారంభించారు. పిల్లలను బడికి పంపిన అక్క చెల్లెమ్మలకు ఆర్థిక సాయంగా రూ.15 వేలు ఇస్తాన్న మాటకు కట్టుబడ్డారు. మరో అడుగు ముందుకేసి ఇంటర్మీడియట్ చదివిస్తున్న తల్లులకు కూడా అమ్మఒడిని వర్తింపజేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో నియోజకవర్గంలోని మండపేట అర్భన్, రూరల్, రాయవరం, కపిలేశ్వరపురం మండలాల్లో 122 ప్రాథమిక, 15 ప్రాథమికోన్నత, 27 ఉన్నత మొత్తం 164 పాఠశాలలున్నాయి. వీటికితోడు మరిన్ని ప్రైవేటు పాఠశాలలున్నాయి. ఆయా పాఠశాలల్లో చదివే సుమారు 16 వేల మంది విద్యార్థుల తల్లులకు రూ.15 వేలు చొప్పున ఆర్థిక సాయం అందనుంది. ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా వర్తింపజేస్తుండటంతో మరో 2 వేల మందికి ప్రయోజనకరంగా అమ్మ ఒడి పథకం ఉంది.
టీడీపీ పాలనలో...
ఇసుక ర్యాంపుల నిర్వహణ వాటాను అడిగిన మహిళలను కపిలేశ్వరపురం మండలంలోని కోరుమిల్లి ఇసుక ర్యాంపు వద్ద చావ బాదారు. కేసులు సైతం బనాయించింది అప్పటి సర్కారు. డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తానని మహిళా సంఘాలను అప్పుల ఊబిలోకి నెట్టింది. పైగా ఎన్నికల చివర పసుపుకుంకుమ అనే పవిత్ర పదాన్ని ప్రచారం చేస్తూ మహిళలకు రూ. పదివేలు ఇచ్చి మళ్ళీ గెలిచేందుకు ప్రయత్నం చేశారు నాటి పాలకులు. సీఎంగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రమాణం చేయగానే డ్వాక్రా రుణాలను తనదైన శైలిలో మాఫీ చేసే దిశగా కార్యాచరణను ప్రారంభించారు. ఆశ, అంగన్‌వాడీ, మ«ధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులు ఇలా మహిళలకు వేతనాలు పెంచి వారి ఆర్థిక ప్రగతికి అనుకూల నిర్ణయాలను తీసుకున్నారు.
శ్రమను గౌరవిస్తున్న సీఎం వైఎస్ జగన్...
పారిశుద్ధ్యాన్ని ప్రైవేటు పరం చేస్తూ అప్పటి చంద్రబాబు ప్రభుత్వం జీఓ 279ను జారీ చేసింది. దానికి వ్యతిరేకంగా మండపేటలో కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. కపిలేశ్వరపురం, రాయవరంలలో పారిశుద్ధ్య కార్మికులు వేతనాలు పెంపుకై అనేకసార్లు ఉద్యమాలు చేసినా చంద్రబాబు సర్కారు కరుణించలేదు. సీఎంగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది రోజుల్లోనే మున్సిపాలిటీల్లోని పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలను రూ.18 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. దీని వల్ల మండపేట మున్సిపాలిటీలోని సుమారు 85 మంది పారిశుద్ధ కార్మికులకు ప్రయోజనం.
మరెన్నో ప్రయోజనాలు
► అగ్రిగోల్డ్ బాధితులకు జగన్‌మోహన్‌రెడ్డి రూ.20వేలు లోపు వారికి నగదు చెల్లించేందుకు అందజేయన్నునట్టు ప్రకటించారు. కాగా రాయవరం మండలంలో 521 మంది బాధితులకు న్యాయం చేకూరనున్నట్టు సమాచారం.
► నియోజకవర్గంలో 32,200 మందికి పైగా రైతులు, కౌలు రైతులున్నారు. మార్కెట్ స్థిరీకరణ కోసం రూ.3 వేల కోట్లు బడ్జెట్‌లో కేటాయించనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.
► అక్టోబర్ 15 నుంచి రైతు భరోసా ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దీంతో రైతుకు రూ.12,500 ఆర్థిక సాయం అందనున్నది.
► పోలీసులకు వీక్లీ ఆఫ్ అమలుతో రాయవరం, మండపేట, రూరల్, పట్టణం, కపిలేశ్వరపురం మండలం అంగర పోలీస్ స్టేషన్‌లలోని సిబ్బందికి సెలవు వర్తించనున్నది.
Comments
Please login to add a commentAdd a comment