నల్లగొండ టౌన్ : మాతాశిశు మరణాల సంఖ్యను తగ్గించడంతో పాటు తల్లీబిడ్డ సంపూర్ణ ఆరోగ్యం కోసం, ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాన్పుల సంఖ్యను పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమ్మ ఒడి కార్యక్రమం జూన్ మూడో తేదీ నుంచి జిల్లాలో అమలు కానుంది. ఈ కార్యక్రమంలో భాగంగా గర్భిణులకు పౌష్టికాహారం అందిండం, చిన్నారులకు అన్ని రకాల వ్యాధి నిరోధక టీకాలు సకాలంలో వేయించడం వంటివి చేపట్టనున్నారు. జిల్లాలో ఇప్పటికే సుమారు పది వేల మంది గర్భిణులు తమ పేర్లను రిజిష్ట్రేషన్ చేయించుకున్నారు.
జిల్లాలోని 32 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు నల్లగొండ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రి, మిర్యాలగూడ, నాగార్జునసాగర్, దేవరకొండ ఏరియా ఆస్పత్రులు, నకిరేకల్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ల్లో ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు. ఇందులో భాగంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాన్పు అయిన వారికి ఆడబిడ్డ పుడితే రూ.13 వేలు, మగబిడ్డ పుడితే రూ.12 వేల ఆర్థిక సాయం అందించనున్నారు. ఆర్థిక సాయాన్ని నాలుగు విడతల్లో అందిస్తారు. మొదటి విడతలో గర్భవతిగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పేరును రిజిస్ట్రేషన్ చేయించుకున్న వెంటనే అందజేస్తారు.
రెండో విడతలో ప్రభుత్వ ఆస్పత్రిలో కాన్పు కాగానే ఆడపిల్ల పుడితే రూ.5 వేలు, మగబిడ్డ పుడితే రూ.4 వేలు అందజేస్తారు. మూడో విడతలో చిన్నారికి టీకాలు, పెంటావాలెంట్ టీకాలు వేయించిన తర్వాత మూడున్నర నెలలకు రూ.2వేలు ఇస్తారు. నాలుగో విడతలో చిన్నారికి తొమ్మిది నెలలకు ఇప్పించే టీకాలు పూర్తయిన తర్వాత రూ.3 వేల ఆర్థిక సాయం అందజేస్తారు. ఆర్థిక సాయాన్ని నేరుగా లబ్దిదారుల ఖాతాలో జమజేస్తారు. అదేవిధంగా ఆస్పత్రిలో కాన్పు కాగానే తల్లికి కేసీఆర్ కిట్‌ను అందజేస్తారు. ఇప్పటికే జిల్లాకు మూడొందల కేసీఆర్ కిట్‌లను రాష్ట్ర ప్రభుత్వం పంపించింది.
కేసీఆర్ కిట్‌లో ఏముంటాయంటే..
బిడ్డకు బేబి బెడ్(మస్కిటో ప్రొటెక్టింగ్ నెట్‌తో పాటు), బేబి డ్రస్సెస్ 2, బేబి టవల్స్ 2, బేబి నాపి (వాషబుల్ 6), జాన్సన్స్ బేబి పౌడర్ (200 గ్రా), జాన్సన్స్ బేబి షాంపూ(100మిల్లీ లీ.), జాన్సన్స్ బేబి అయిల్(200మిల్లీ లీ., జాన్సన్స్ బేబి సోప్ 2, బేబి సోప్ బాక్స్ 1, బేబి రాటిల్ టాయ్ 1, బాలింతకు మదర్ సోప్ (మైసూర్ శాండల్,), చీరలు 2, కిట్ బ్యాగ్ 1, ప్లాస్టిక్ బాస్కెట్ 1.
జూన్ మూడు నుంచి అమ్మఒడి
Published Thu, Jun 1 2017 12:59 AM | Last Updated on Wed, Aug 29 2018 4:18 PM
Advertisement
Advertisement