గుంటూరు జిల్లా పెనుమాకలో జరిగిన రాజన్న బడిబాట కార్యక్రమంలో బాలుడిని ఒడిలో కూర్చోబెట్టుకొని అక్షరాలు దిద్దిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్
సాక్షి, అమరావతి బ్యూరో: ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్ స్కూళ్లకు దీటుగా తీర్చిదిద్ది రాష్ట్రంలో చదువుల విప్లవం తెస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. రెండేళ్లలో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖల్ని మార్చేస్తామని చెప్పారు. శుక్రవారం గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాకలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ‘రాజన్న బడిబాట’లో ముఖ్యమంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. విద్యాశాఖ చేపట్టిన సామూహిక అక్షరాభ్యాసం సందర్భంగా చిన్నారుల చేత సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అక్షరాలు దిద్దించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పిల్లలను బడికి పంపించే తల్లులకు ‘అమ్మ ఒడి’ పథకం కింద ఏటా రూ.15 వేలు చొప్పున అందజేస్తామని ప్రకటించారు. పాదయాత్రలో తాను ప్రతి తల్లికి, చెల్లికి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ‘ప్రతి తల్లికి అన్నగా తోడుంటా. మీ పిల్లలను బడికి పంపిస్తే చాలు. ఆ చిన్నారులకు మామగా నేను అండగా ఉంటా’ అని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇంకా ఏమన్నారంటే..
పిల్లల చదువుల కోసం తల్లిదండ్రులు పడే ఆరాటం చూశా..
‘నా మనసుకు నచ్చిన కార్యక్రమం చేస్తున్నా కాబట్టి ఈరోజు చాలా సంతోషంగా ఉంది. నా ఆశ, కోరిక ఒక్కటే. బడి ఈడు పిల్లలు అందరూ బడికి వెళ్లాలి. బడుల నుంచి కాలేజీలకు వెళ్లాలి. ఉన్నత విద్యావంతులు కావాలి. డాక్టర్లు, ఇంజనీర్లు కావాలి. అయితే ఆ చదువుల కోసం ఏ తల్లితండ్రీ అప్పులు పాలు కాకూడదన్నదే నా ఉద్దేశం. 3,648 కిలోమీటర్ల పాదయాత్ర సందర్భంగా పేదల కష్టాలను స్వయంగా చూశా. వారు పడుతున్న బాధలు విన్నా. బిడ్డలను చదివించాలనే ఆరాటం ఉన్నా చదివించలేని పరిస్థితిలో ఉన్న తల్లిదండ్రులను చూశా. చదువుల ఖర్చు భరించలేక ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితిని చూశా. ఈ విద్యా వ్యవస్థలో సంపూర్ణమైన మార్పులు తెస్తామని అప్పుడు ప్రతి తల్లికి, చెల్లికి మాట ఇచ్చా. మీ పిల్లల చదువు బాధ్యతను ఇకపై నేను తీసుకుంటానని మాటిచ్చా. ఆ మాట నిలబెట్టుకునే రోజు ఇవాళ వచ్చినందుకు సంతోషంగా ఉంది. ప్రతి తల్లికి, చెల్లికి, ఒకే మాట చెబుతున్నా. మీ పిల్లలను బడులకు పంపించండి. మీరు చేయాల్సిందల్లా కేవలం బడులకు పంపించడమే. అలా పంపించిన తల్లిదండ్రులకు జనవరి 26వతేదీన రాష్ట్రవ్యాప్తంగా ఒక పండుగ రోజులా నిర్వహిస్తాం. ఏ తల్లి అయితే తమ పిల్లలను బడులకు పంపిస్తుందో వాళ్లకు ఆ రోజు రూ.15 వేలు చేతిలో పెడతాం. ఏ తల్లి కూడా తన పిల్లలను చదివించడానికి అవస్థ పడకూడదనే ఈ కార్యక్రమం చేపట్టాం.
ఈ వ్యవస్థను మార్చేస్తా
దేశవ్యాప్తంగా 2011 జనాభా లెక్కల ప్రకారం చదువురాని వారు సగటున 26 శాతం ఉంటే మన రాష్ట్రంలో 33 శాతం ఉన్నారు. ఇంత దారుణమైన పరిస్థితిలో ఎందుకున్నామని నా పాదయాత్రలో పరిశీలిస్తే.. పిల్లలకు సకాలంలో పుస్తకాలు అందడం లేదు. ఏప్రిల్, మే లోపు పుస్తకాలు పాఠశాలలకు చేరాలి. స్కూల్ తెరిచిన వెంటనే పుస్తకాలు, మూడు జతల యూనిఫాం అందజేయాలి. అయితే పిల్లలకు సెప్టెంబర్ దాటినా కూడా పుస్తకాలు అందలేదు. యూనిఫాం కూడా సరిగ్గా ఇవ్వని పరిస్థితి. ఇంత దారుణమైన పరిస్థితిలో రాష్ట్రంలో చదువులు కొనసాగుతున్నాయి. టీచర్ల కొరత ఉన్నా నియామకాలు చేపట్టడం లేదు. ప్రభుత్వ స్కూళ్లలో పరిస్థితి అధ్వాన్నంగా ఉంది. మరుగుదొడ్లు ఉండవు, నీళ్లు రావు, ఫ్యాన్లు లేవు, కనీసం కాంపౌండు వాల్ కూడా ఉండదు. ప్రభుత్వ స్కూళ్లలో చదివించాలంటే ఏ తల్లి అయినా భయపడాల్సిందే. మరోవైపు ప్రభుత్వ స్కూళ్లను నీరుగార్చి కార్పొరేట్ స్కూళ్లను ప్రోత్సహించే ప్రయత్నం చేశారు. ఇక ప్రైవేట్ స్కూళ్లలో ఫీజులు తల్లిదండ్రులు భరించలేని పరిస్థితిలో ఉన్నాయి. నారాయణ, శ్రీచైతన్య లాంటి స్కూళ్లు గ్రామస్థాయికి కూడా వెళ్లాలని ప్రయత్నిస్తున్నాయి. ఆ పాఠశాలల్లో ఎల్‌కేజీకి కూడా రూ.20 వేలు పైచిలుకు ఫీజులు వసూలు చేస్తున్నారు. రూ.40 వేలు అడిగిన పరిస్థితిని కూడా చూశా. ఇటువంటి అన్యాయమైన పరిస్థితుల్లో పిల్లలను చదివించాలంటే తల్లిదండ్రులు కష్టపడుతున్నారు. ఇవన్నీ కూడా మార్చేస్తానని మాటిస్తున్నా.
చిన్నారులతో అక్షరాభ్యాసం చేయించిన సీఎం వైఎస్ జగన్..
సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమంలో పాల్గొన్న సీఎం వైఎస్ జగన్ తొలుత సరస్వతి దేవి చిత్రపటానికి నమస్కరించారు. అనంతరం పలువురు చిన్నారులను తన ఒడిలో కూర్చోపెట్టుకుని అక్షరాభ్యాసం చేయించి దీవించారు. మొత్తం 2 వేల మంది చిన్నారులు ఈ కార్యక్రమంలో అక్షరాభ్యాసం చేశారు. ఈ సందర్భంగా విద్యాశాఖ రూపొందించిన అకడమిక్ క్యాలెండర్‌ను విడుదల చేశారు. పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు (10/10 గ్రేడు) సాధించిన విద్యార్థులకు ముఖ్యమంత్రి ప్రశంసాపత్రం, జ్ఞాపిక అందచేసి అభినందించారు. రాజన్న బడిబాట కార్యక్రమానికి హాజరైన ఓ చిన్నారి ముఖ్యమంత్రికి రూ.1.50 లక్షల చెక్కును అందజేసింది. చదువుతోనే సామాజిక అభివృద్ధి సాధ్యమన్న అంబేడ్కర్ స్ఫూర్తితో ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం రోజు ‘రాజన్న బడిబాట’ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ఆకాంక్ష మేరకు ప్రారంభించామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ స్కూళ్లను తీర్చిదిద్దుతామని చెప్పారు. కార్యక్రమంలో హోంమంత్రి మేకతోటి సుచరిత, గిరిజన సంక్షేమశాఖ మంత్రి పుష్పశ్రీవాణి, బాపట్ల ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్సీలు కేఎస్ లక్ష్మణరావు, ఏఎస్ రామకృష్ణ ఎమ్మెల్యేలు ముస్తఫా, ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, కాసు వెంకట మహేశ్వరరెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కిలారి రోశయ్య, మేరుగ నాగార్జున, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి, గుంటూరు జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్‌కుమార్, అధికారులు పాల్గొన్నారు.
మీ పిల్లలకు మామగా నేనున్నా..
‘ఈ కార్యక్రమానికి ముందుగా విద్యాశాఖతో సమీక్ష నిర్వహించా. రాష్ట్రంలో 40 వేల స్కూళ్లు ఉన్నాయి. ప్రస్తుతం ఆ స్కూళ్ల పరిస్థితి ఎలా ఉందో ఫొటోలు తీయమని చెప్పా. రెండేళ్లలో అభివృద్ధి ఎలా జరిగిందో మళ్లీ ఆ స్కూళ్ల ఫొటోలు తీసి చూపిస్తాం. పాఠశాలలకు కావాల్సిన అన్ని వసతులు కల్పిస్తాం. ప్రైవేట్ స్కూళ్లకు ఏమాత్రం తగ్గకుండా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతామని మాట ఇస్తున్నా. ప్రతి స్కూల్‌లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడతాం. ప్రతి స్కూల్‌లోనూ తెలుగు సబ్జెక్ట్‌ను తప్పనిసరి చేస్తాం. మన పిల్లలు దేశంలో ఎవరితో అయినా పోటీ పడేలా ఉండాలి. చదువుల విప్లవాన్ని తెచ్చి సర్కారు స్కూళ్లను మంచి పాఠశాలలుగా తీర్చిదిద్దుతాం. మీ పిల్లలను ప్రభుత్వ బడికి పంపించండి. ప్రతి తల్లికి, అన్నగా తోడుంటా. మీ పిల్లలకు మామగా నేనున్నా. పిల్లల అభివృద్ధికి బాటలు ఈ స్కూళ్ల నుంచే మొదలవ్వాలి. ప్రతి పిల్లాడు పాఠశాల బాట పట్టాలి’
‘రాజన్న బడిబాట’కు రూ.1,51,151 విరాళం
తాడేపల్లి రూరల్ (మంగళగిరి): రాజధాని ప్రాంతంలోని పెనుమాక గ్రామానికి చెందిన కుర్రె విజయభాస్కరరెడ్డి, పద్మావతి దంపతుల ఏకైక కుమార్తె కీర్తిరెడ్డి ‘రాజన్న బడి బాట’ కార్యక్రమానికి తమ వంతు సహాయంగా రూ.1,51,151 విరాళాన్ని అందచేసింది. శుక్రవారం పెనుమాకలో విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రాజన్న బడి బాట కార్యక్రమంలో ఈమేరకు చెక్కును అందచేసిన కీర్తిరెడ్డిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అభినందించారు.
అకడమిక్ క్యాలెండర్ విడుదల
పాఠశాల విద్యా శాఖ; రాష్ట్ర విద్యా, పరిశోధన, శిక్షణా సంస్థ రూపొందించిన ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల విద్యా విషయక క్యాలెండర్‌ను శుక్రవారం గుంటూరు జిల్లా పెనుమాక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యా శాఖ కమిషనర్ సంధ్యారాణి, ఎస్‌ఎస్‌ఏ స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ జి.శ్రీనివాస్ పాల్గొన్నారు.
ఈ విద్యా సంవత్సరం నుంచి ఆనంద వేదిక
2019 – 20 విద్యా సంవత్సరం ప్రారంభం నుంచే వినూత్న పద్ధతిలో ఆనంద వేదిక (హ్యాపీనెస్ కరిక్యులం) కార్యక్రమం అమలు చేస్తారు. రోజూ పాఠశాల ప్రారంభం కాగానే మొదటి పీరియడ్‌లో 30 నిమిషాల పాటు ఆనంద వేదిక (హ్యాపీనెస్ కరిక్యులం)కు కేటాయించారు. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలను ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4.10 గంటల వరకు, ఉన్నత పాఠశాలలను ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 4.45 గంటల వరకు నిర్వహిస్తారు. ఒంటిపూట బడులు ఉదయం 7.45 గంటల నుంచి 12.30 గంటల వరకు ఉంటాయి. తరగతికి నిర్ధారించిన ప్రమాణాలు సాధించలేకపోవడంలో సిలబస్ ఒక ముఖ్య కారణమని భావించి సరైన ప్రమాణాలు సాధించడం కోసం సిలబస్‌ను తగ్గించారు.
పాఠశాల పనిదినాలు 220 అయినప్పటికీ 160 పనిదినాలకనుగుణంగా సిలబస్‌ను తగ్గించారు. ఈ విద్యా సంవత్సరంలో ఆనంద వేదికతోపాటు ‘శనివారం సందడి’, ‘రోజూ సవరణాత్మక బోధన’ అనే ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. విద్యార్థుల్లో సృజనాత్మక నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు ప్రతి నెలలో మొదటి, మూడో శనివారాల్లో ‘శనివారం సందడి’ పేరుతో ‘నో స్కూల్ బ్యాగ్ డే’ అనే ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని రాష్ట్ర విద్యా, పరిశోధన, శిక్షణా సంస్థ డైరెక్టర్ దుక్కిపాటి మధుసూదనరావు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment