Andhra Pradesh: బోధనలో నవశకం  | CM Jagan Govt Give Tabs with byjus content for 8th class kids | Sakshi
Sakshi News home page

Andhra Pradesh: బోధనలో నవశకం 

Published Fri, Dec 16 2022 3:26 AM | Last Updated on Fri, Dec 16 2022 7:57 AM

CM Jagan Govt Give Tabs with byjus content for 8th class kids - Sakshi

ఎన్టీఆర్‌ జిల్లా నిడమానూరు జెడ్పీ హైస్కూల్‌లో విద్యార్థులకు ట్యాబ్‌ల పనితీరును వివరిస్తున్న టీచర్‌

సాక్షి, అమరావతి: పాఠశాల విద్యలో మరో విప్లవాత్మక కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీకారం చుడుతున్నారు. ప్రభుత్వ స్కూళ్లలో పాఠ్యాంశాల బోధనలో మరో కొత్త శకం ఆరంభం కానుంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను ప్రపంచ పౌరులుగా తీర్చిదిద్దేలా పాఠశాల విద్యా శాఖ ముందడుగు వేస్తోంది.

అత్యున్నత ప్రమాణాలతో కూడిన డిజిటల్‌ పాఠ్యాంశాలను అందించడానికి వీలుగా ఉచితంగా ట్యాబ్‌లను పంపిణీ చేయనుంది. ప్రపంచ ప్రఖ్యాత ఎడ్‌టెక్‌ సంస్థ బైజూస్‌కు చెందిన ఈ–పాఠ్యాంశాలతో కూడిన ట్యాబ్‌లను రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్‌ స్కూళ్లలోని 8వ తరగతి చదువుతున్న పిల్లలందరికీ అందించనున్నారు. సీఎం వైఎస్‌ జగన్‌ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఈనెల 21న ఆయన చేతుల మీదుగా ఈ ట్యాబ్‌లను అందించనున్నారు. 

4వ తరగతి నుంచే బైజూస్‌ కంటెంట్‌  
ప్రభుత్వ పాఠశాలల్లో 4 నుంచి 10వ తరగతి వరకు ఉన్న 32 లక్షల మంది విద్యార్థులకు బైజూస్‌ యాప్‌ ద్వారా డిజిటల్‌ పాఠ్యాంశాలను ప్రభుత్వం ఇప్పటికే అందుబాటులోకి తెచ్చింది. పిల్లల తల్లిదండ్రుల స్మార్ట్‌ ఫోన్ల ద్వారా వారికి ఈ పాఠాలు అందుబాటులో ఉంచారు. అయితే స్మార్ట్‌ ఫోన్లు అందరికీ అందుబాటులో ఉండకపోవడం, ఈ విద్యా సంవత్సరం నుంచి సీబీఎస్‌ఈ విధానాన్ని ప్రవేశపెట్టిన తరుణంలో 8వ తరగతిలోకి వచ్చే పిల్లలందరికీ ప్రభుత్వమే ఉచితంగా ట్యాబ్‌లు అందించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు.

ఈ విద్యార్థులు మూడేళ్లలో టెన్త్‌ పబ్లిక్‌ పరీక్షలను సీబీఎస్‌ఈ విధానంలో ఆంగ్ల మాధ్యమంలో రాయాల్సి ఉంటుంది. అందుకు వారిని సన్నద్ధం చేసేందుకు వీలుగా ఉన్నత ప్రమాణాలతో కూడిన కంటెంట్‌ను ట్యాబ్‌ల ద్వారా అందిస్తున్నారు. మూడేళ్ల పాటు వారికి ఈ ట్యాబుల ద్వారా బైజూస్‌ పాఠ్యాంశాలు అందుబాటులోకి వస్తాయి. ప్రతి ఏటా 8వ తరగతిలోకి వచ్చే దాదాపు 4.60 లక్షల మంది విద్యార్థులకు ట్యాబ్‌లు అందించనున్నారు.

వీరితోపాటు 8వ తరగతి నుంచి ఆపై తరగతులకు పాఠాలు చెప్పే 60 వేల మంది టీచర్లకు కూడా ఈ ట్యాబ్‌లను ఉచితంగా ఇస్తున్నారు. రాష్ట్రంలో జూన్‌ నుంచి దాదాపు 15 వేల స్కూళ్లలో డిజిటల్‌ క్లాస్‌ రూమ్‌లు అందుబాటులోకి వస్తాయి. తద్వారా ప్రతి తరగతి గదిలో ప్రత్యేక టీవీ ద్వారా విద్యార్థులకు మరింత స్పష్టంగా ఈ పాఠ్యాంశాలను వివరించవచ్చు. 
 
ట్యాబ్‌ల విలువ రూ.1,400–1,500 కోట్లు  
బైజూస్‌ కంటెంట్‌తో కూడిన ఈ ట్యాబ్‌ల విలువ రూ.1,400 కోట్ల నుంచి రూ.1,500 కోట్లు ఉంటుంది. ప్రైవేటుగా ట్యాబ్‌తో పాటు బైజూస్‌ యాప్‌ను తీసుకోవాలంటే దాదాపు రూ.30 వేల వరకు ఖర్చవుతుంది. ట్యాబ్‌కు రూ.15 వేలు, కంటెంట్‌కు రూ.15 వేలకు పైగానే చెల్లించాలి. ప్రస్తుతం 8వ తరగతి పిల్లలకు ఉచితంగా అందించే శ్యామ్‌సంగ్‌ ట్యాబ్‌ ఖరీదు రూ.15 వేలు. వీటి కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.700 కోట్ల వరకు ఖర్చు చేస్తోంది.

ఇక బైజూస్‌ కంటెంట్‌ ఒక ఏడాదికి ఒక తరగతికి బయట విద్యార్థులు రూ.15 వేల వరకు చెల్లించాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం వల్ల ఆ సంస్థ ఈ కంటెంట్‌ను విద్యార్థులకు ఉచితంగానే అందిస్తోంది. 
 
ఇంటి వద్ద కూడా అభ్యసనానికి వీలు  
బడిలో నాణ్యమైన విద్యను అందించడమే కాకుండా ఇంటికి వెళ్లిన తర్వాత కూడా పిల్లలు చదువుకోవడానికి వీలుగా ప్రభుత్వం ఈ ట్యాబ్‌లను అందిస్తోంది. నేటి కాలంలో తరగతిలో టీచర్‌ బోధనతో పాటు మొబైల్‌ యాప్‌ లేదా లెర్నింగ్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ ద్వారా పిల్లలకు అదనపు సపోర్టు అవసరమవుతోంది.

గతంలో పిల్లలకు ప్రత్యేకంగా ట్యూషన్‌ టీచర్లను పెట్టించడమో లేక ఇంట్లో పెద్ద వారు ప్రత్యేకంగా చదివించడమో ఉండేది. ఇప్పుడు అందుకు అవకాశాలు లేకుండా పోయాయి. డిజిటల్‌ సాంకేతిక వ్యవస్థ అభివృద్ధి చెందిన ప్రస్తుత కాలంలో పాఠ్య పుస్తకాలలో ఉన్న కంటెంట్‌ కన్నా మిన్నగా మంచి చిత్రాలతో త్రీ డైమన్షన్‌ ఫార్ములాతో, యానిమేషన్లతో రూపొందించిన కంటెంట్‌ను అందించడం వల్ల పిల్లలు చాలా సులభంగా పాఠ్యాంశాలను నేర్చుకోగలుగుతారు.

ఈ ఉద్దేశంతోనే సీఎం ఈ–కంటెంట్‌ను పిల్లలకు అందించేలా చర్యలు తీసుకున్నారు. తరగతిలోని టీచర్‌తో పాటు ఇంకో నైపుణ్యం కలిగిన టీచర్‌ ద్వారా వారికి అదనంగా బోధన చేయించేలా ట్యాబ్‌ల ద్వారా ఇచ్చే బైజూస్‌ కంటెంట్‌ వినియోగపడుతుంది. విద్యార్థులు తరగతుల్లో చెప్పిన అంశాలను రివైజ్‌ చేయడం, రిఫ్రెష్‌ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. 
 
ప్రతి విద్యార్థి పురోభివృద్ధే లక్ష్యంగా చర్యలు  
విద్యార్థులు తమంతట తాము చదువుకొనేలా ఈ కంటెంట్‌ను రూపొందించారు. సందేహాలుంటే ఒకటికి రెండుసార్లు మళ్లీ వీడియోలను చూసి వాటిని నివృత్తి చేసుకోవడానికి వీలవుతుంది. ముఖ్యంగా తరగతిలో టీచర్‌ పాఠాలు చెప్పిన తర్వాత దానిని రివైజ్, రివిజన్‌ చేసుకోవడానికి, ఇంటిదగ్గర ప్రాక్టీస్‌ చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది.

ఇంటిదగ్గరకు వెళ్లాక సందేహాలు వచ్చినా ట్యాబులోని కంటెంట్‌ను ఓపెన్‌చేసి తెలుసుకోవచ్చు. కంటెంట్‌ కూడా టెక్స్ట్‌ రూపంలో మాత్రమే కాకుండా వీడియో, ఆడియో చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రతి చాప్టర్‌ తరువాత క్వశ్చన్‌ బ్యాంకు ఉంటుంది. దాదాపు 50 – 60 వరకు వివిధ కసరత్తులతో కూడిన క్వశ్చన్లు ఉన్నాయి.

పిల్లలు చదువుకున్న తర్వాత ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ తమ స్థాయిని వారే అంచనా వేసుకొనేలా ట్యాబ్‌లో సెల్ప్‌ అసెస్‌మెంట్‌ విధానం కూడా ఉంది. కింది స్థాయి నుంచి క్రమేణా పై స్థాయిలోకి వెళ్లేలా వివిధ గ్రేడ్లలో ఈ మాక్‌ పరీక్షల విధానం ఉంది.  
 
పిల్లల అభ్యసనంపై సునిశిత పర్యవేక్షణ  
ఎనిమిదో తరగతి విద్యార్థులు ఈ ట్యాబ్‌ల ద్వారా నిర్వహించే అభ్యసనాన్ని సునిశితంగా పర్యవేక్షించేలా సాఫ్ట్‌వేర్‌ను రూపొందించడం విశేషం. ఒకసారి చార్జింగ్‌ చేశాక 10 గంటలపాటు బ్యాటరీ బ్యాకప్‌ ఉంది. ఇంటర్నెట్‌తో సంబంధం లేకుండా ఆఫ్‌లైన్లో కూడా విద్యార్థులు ఈ వీడియో పాఠ్యాంశాలను అభ్యసించేలా ప్రీలోడెడ్‌ కంటెంట్‌ ఉంటుంది. 3 ఏళ్ల పాటు వీటికి వారంటీ ఉంటుంది.

మధ్యలో ఏదైనా సమస్య వస్తే సమీపంలోని కంపెనీ సర్వీస్‌ సెంటర్‌కు వెళ్లి సరిచేయించుకోవచ్చు. పదో తరగతి వరకు విద్యార్థులు ఈ ట్యాబ్‌ ద్వారా పాఠాలు అందుకుంటారు. 8 నుంచి 9, 10 తరగతుల్లోకి విద్యార్థులు చేరగానే కంటెంట్‌ను ఐడీ ద్వారా అప్‌లోడ్‌ చేయిస్తారు. పిల్లలు ఎంత వరకు నేర్చుకున్నారో తెలుసుకోవడానికి వివిధ దశల్లో మాక్‌ టెస్టులు ఉంటాయి. ఆ మేరకు వారికి ట్యాబ్‌లోని సాఫ్ట్‌వేర్‌ బ్యాడ్జిలు (గ్రేడింగ్‌) ఇస్తుంది.  
 
అవాంఛనీయ సైట్లకు ఆస్కారం లేకుండా చర్యలు  
ఈ ట్యాబ్‌లలో అవాంఛనీయ సైట్లు రాకుండా ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ పెట్టారు. పిల్లలను పక్కదారి పట్టించే ప్రమాదకర సైట్‌లు ఓపెన్‌ అవ్వకుండా ప్రత్యేకమైన లాకింగ్‌ వ్యవస్థను ఏర్పాటు చేశారు. సిమ్‌ శ్లాట్‌ను లాక్‌ చేయడంతో అది ఓపెన్‌ అవ్వదు. ఆఫ్‌లైన్‌లో మాత్రమే బైజూస్‌ యాప్‌ ఓపెన్‌ అయ్యే విధంగా ఏర్పాటు చేశారు. గూగుల్‌ వంటివి ఓపెన్‌ అయినా వాటిలో కేవలం విద్యార్థులకు అదనపు సబ్జెక్టు అంశాలను నేర్చుకొనేవి మాత్రమే వచ్చేలా చర్యలు తీసుకున్నారు. 
 
8 భాషల్లో ఈ–కంటెంట్‌ రూపకల్పన  
ఈ ట్యాబ్‌ల్లోని ఈ–కంటెంట్‌ ఆంగ్లం, తెలుగుతో పాటు 8 భాషల్లో రూపొందించారు. ఆయా తరగతుల్లోని అన్ని టాపిక్స్‌ ఉన్నాయి. గణితం, సైన్స్‌లో బైలాజికల్, ఫిజికల్, కెమిస్ట్రీ, సోషల్‌లో హిస్టరీ, జియాగ్రఫీ, సివిక్స్‌ పాఠ్యాంశాల్లో పూర్తి స్థాయిలో బోధనా వీడియోలతో రూపొందించారు. విద్యార్థులకు సులభరీతిలో అర్థమయ్యే విధంగా యానిమేషన్, చిత్రాలు, విడియో వాయిస్‌తో పాఠ్యాంశాలను రూపొందించారు.

వీరి స్థాయిని పెంచడానికి, ఆసక్తి పెంపొందించడానికి యాప్‌లోనే మాక్‌ టెస్టులు, గత సంవత్సరం ఎగ్జామ్స్‌ పేపర్స్, సెల్ఫ్‌ టెస్టులు నిర్వహించుకునేందుకు వీలు కల్పించారు. పిల్లలు ఏ భాష కావాలంటే ఆ భాషలోకి వెళ్లి వీడియోలను చూసి నేర్చుకోవచ్చు.  

అత్యుత్తమ విద్యను అందించడమే లక్ష్యం  
ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు అత్యుత్తమ విద్యను అందించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ–కంటెంట్‌తో కూడిన ట్యాబ్‌లను పంపిణీ చేయిస్తున్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ హైస్కూళ్లలో సీబీఎస్‌ఈ విధానాన్ని ప్రవేశపెట్టాం. ఈ ఏడాది 1000 స్కూళ్లకు సీబీఎస్‌ఈ గుర్తింపు వచ్చింది.

విద్యార్థులను ఈ విధానానికి సన్నద్ధం చేయడంతో పాటు వారిని ఉన్నత ప్రమాణాలతో తీర్చిదిద్దేందుకు ట్యాబ్‌లు, కంటెంట్‌ వీలు కల్పిస్తుంది. మూడేళ్ల తర్వాత ఇప్పటి 8వ తరగతి పిల్లలు సీబీఎస్‌ఈ విధానంలో టెన్త్‌ పరీక్షలు రాసేందుకు ఈ ట్యాబ్, కంటెంట్‌ బాగా ఉపకరిస్తుంది. 
– ఎస్‌.సురేష్‌కుమార్, పాఠశాల విద్య కమిషనర్‌  
 
మరింత క్షుణ్ణంగా నేర్చుకోవచ్చు 
పిల్లలు తరగతిలో చెప్పే పాఠాలను ఇళ్లకు వెళ్లాక కూడా మరింత క్షుణ్ణంగా అభ్యాసం చేసేందుకు బైజూస్‌ కంటెంట్‌తో కూడిన ట్యాబ్‌లు ఎంతగానో ఉపయోగపడతాయి. ప్రభుత్వ, ఎయిడెడ్‌ స్కూళ్లలోని 8వ తరగతి విద్యార్థులందరికీ, 8వ తరగతి బోధించే టీచర్లకు.. మొత్తంగా 5.18 లక్షల మందికి ట్యాబ్‌లు అందిస్తున్నాం. వీటిని ఎలా వాడాలి.. కంటెంట్‌ను ఎలా చెప్పాలో టీచర్లకు శిక్షణ ఇస్తాం. సీబీఎస్‌ఈ విధానంలో బోధన చేసేలా ఉపాధ్యాయులకు ఇప్పటికే శిక్షణ ఇచ్చాం.  
– కాటమనేని భాస్కర్, పాఠశాల విద్య కమిషనర్‌ (ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌)  
 
విద్యార్థులకు వరం  
సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ట్యాబ్‌లు అందించడం కచ్చితంగా పెద్ద వరమే. ఉన్నతాధికారులు ప్రవీణ్‌ ప్రకాష్, కాటమనేని భాస్కర్‌లు మా స్కూల్‌కు వచ్చి.. పంపిణీ చేయనున్న ట్యాబ్‌లను పరిశీలన కోసం విద్యార్థులకు చూపించారు. కంటెంట్‌ అద్భుతంగా ఉందని పిల్లలు సంతోషపడ్డారు. విద్యా వ్యవస్థలో తీసుకొస్తున్న విప్లవాత్మకమైన మార్పుల ఫలితంగా ప్రమాణాలు మెరుగుపడ్డాయి. ప్రభుత్వ పాఠశాలలపై ఉన్న చిన్న చూపును తుడిచివేసి, కార్పొరేట్‌ పాఠశాలల తరహలో అభివృద్ధి చేస్తుండటం అభినందనీయం.  
– బట్టు సురేష్‌కుమార్, హెచ్‌ఎం, నిడమానూరు జెడ్పీ పాఠశాల 
  
సులభంగా అర్థమవుతున్నాయి  
కష్టతరమైన పాఠ్యాంశాలు కూడా ఈ ట్యాబ్‌లో ఉండే వీడియోల ద్వారా సులభంగా అర్థమవుతున్నాయి. పాఠ్యాంశాల వారీగా చిత్రాలు, బొమ్మలు, యానిమేషన్‌ వీడియోలు చాలా బాగున్నాయి. ఈ ట్యాబ్‌ ఎలా ఆపరేట్‌ చేయాలో ఉపాధ్యాయులు వివరించారు.  
– రిబికా, 8వ తరగతి, నిడమానూరు జెడ్పీ పాఠశాల 
 
జగన్‌మామకు కృతజ్ఞతలు  
మా భవిష్యత్‌ను ఉన్నతంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్న జగన్‌ మామకు కృతజ్ఞతలు. పేదలమైన మేము మంచి చదువులు చదువుకోవాలని అన్ని విధాలుగా ప్రోత్సహిస్తున్నారు. ఎంతో విలువైన ట్యాబ్‌లు, కంటెంట్‌ అందించి మా విద్యా ప్రమాణాలు పెంపొందిస్తున్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకుని మంచి ఉత్తీర్ణత సాధిస్తాను.  
– ఎ. నాగమల్లేష్, 8వ తరగతి, నిడమానూరు జెడ్పీ పాఠశాల 
 
కార్పొరేట్‌ స్కూల్‌ కంటే గొప్పగా.. 
ప్రభుత్వం మాకు మంచి విద్య అందించేందుకు అన్ని విధాలుగా సాయం చేస్తోంది. అమ్మ ఒడితో పాటు విద్యాకానుక, గోరుముద్ద పథకాలు ఎంతో అండగా ఉన్నాయి. ఇప్పుడు కార్పొరేట్‌ స్కూళ్ల కన్నా గొప్పగా ఉండేలా ట్యాబ్‌లు, బైజూస్‌ కంటెంట్‌ అందించడం వల్ల మరింత బాగా చదువుకోగలుగుతాం. 
– తేజస్విని, 8వ తరగతి, నిడమానూరు జెడ్పీ పాఠశాల 
 
మరింత బాగా చదువుకుంటాం 
మేము ఇంగ్లిష్‌ మీడియం చదువుకోవాలంటే ప్రైవేట్‌ స్కూలుకు వెళ్లాల్సిన అవసరం లేకుండా మా స్కూలులోనే ఆ మీడియం పెట్టారు. ఇప్పుడు సీబీఎస్‌ఈ విధానంలో పాఠాలను బోధిస్తున్నారు. మరింత బాగా చదువుకునేందుకు మాకు బైజూస్‌ కంటెంట్‌తో ఇస్తున్న ట్యాబ్‌లు ఎంతో ఉపయోగపడతాయి. 
– స్నేహిత, 8వ తరగతి, నిడమానూరు జెడ్పీ పాఠశాల 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement