అక్షయపాత్ర ట్రస్ట్ నిర్వాహకులు, అధికారులతో జరిగిన సమావేశంలో మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలకు ఇక మంచి రోజులు రానున్నాయి. 44 వేల స్కూళ్లలో మౌలిక సదుపాయాలు మెరుగు పర్చేందుకు చర్యలు తీసుకో వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాఠశాల విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని సమర్థంగా అమలు చేయాలని, విద్యార్థులకు నాణ్యమైన భోజనం సరఫరా చేయాలని సూచించారు. మధ్యాహ్న భోజన పథకంలో పనిచేసే కార్మికులకు ఇచ్చే గౌరవ వేతనాన్ని రూ.1,000 నుంచి రూ.3,000కు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.
విద్యా రంగానికి అధిక ప్రాధాన్యం
విద్యా వ్యవస్థ చక్కగా పని చేసినప్పుడే రాష్ట్రం అభివృద్ధి సాధిస్తుందని సీఎం జగన్ ఉద్ఘాటించారు. విద్యా రంగానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. గురువారం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జగన్‌మోహన్‌రెడ్డి తొలిసారిగా శుక్రవారం పాఠశాల విద్యాశాఖ, మధ్యాహ్న భోజన పథకం–అక్షయ పాత్ర, పాఠశాలల మౌలికాభివృద్ధిపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు, విద్యార్థులకు అందుతున్న ఆహరం నాణ్యత గురించి ముందుగా చర్చించారు. అక్షయ పాత్ర ఫౌండేషన్ ప్రతినిధులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇది ప్రాథమిక సమావేశమని, ఇంకా పూర్తిస్థాయి ప్రణాళికలతో మళ్లీ భేటీ కావాలని ముఖ్యమంత్రి సూచించారు. విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనం నాణ్యత విషయంలో రాజీ పడొద్దని ఆదేశించారు. ఇక ఈ పథకాన్ని ‘వైఎస్సార్ అక్షయ పాత్ర’గా పిలుస్తామని ప్రకటించారు.
సమగ్ర నివేదిక రూపొందించండి
విద్యార్థులకు నాణ్యమైన తాజా ఆహారం అందించాలని, సకాలంలో పాఠశాలలకు చేరేలా వంటశాలల ఏర్పాటు చేయాలని వైఎస్ జగన్ సూచించారు. మధ్యాహ్న భోజనం తయారీకి ఆధునిక వంటశాలలు ఉండాలని అన్నారు. పరిశుభ్రమైన వాతావరణంలో వంటలు తయారు చేయాలని పేర్కొన్నారు. పాఠశాలల్లో మరుగుదొడ్లు, శుభ్రమైన తాగునీరు, విద్యార్థులు కూర్చోవడానికి ఫర్నీచర్, తరగతి గదుల్లో ఫ్యాన్లు, బ్లాక్‌బోర్డులు, క్రీడా మైదానాలు, ప్రహరీ గోడలతో పాటుగా అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని జగన్ ఆదేశించారు. పాఠశాల భవనాలకు రంగులు వేయించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల స్థితిగతులపై ఫొటోలు తీయించి, ఒక నివేదికను సిద్ధం చేయాలని సూచించారు. తాను చెప్పిన మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి ఒక సమగ్రమైన నివేదికను రూపొందించి, తదుపరి సమీక్షా సమావేశానికి తీసుకురావాలని అధికారులను కోరారు.
గౌరవ వేతనం ఇక రూ.3,000
మధ్యాహ్న భోజన కార్మికులకు నెలకు ఇస్తున్న రూ.1,000 గౌరవ వేతనాన్ని రూ.3,000కు పెంచనున్నట్టు ముఖ్యమంత్రి జగన్ వెల్లడించారు. వారి విధుల నుంచి వంట చేసే పనిని క్రమంగా తొలగిస్తామన్నారు. వారిని ఇకపై కేవలం ఆహార పదార్థాల వడ్డనకే పరిమితం చేస్తామన్నారు. వాస్తవానికి జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర చేస్తున్నప్పుడు మధ్యాహ్న భోజనం తయారు చేసే కార్మికులు తమ కష్టాలను మొర పెట్టుకున్నారు. జగన్ అధికారంలోకి రాగానే మధ్యాహ్న భోజన కార్మికుల విషయంలో తగిన నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో చర్చిస్తూ వచ్చారు. శుక్రవారం వారి గౌరవ వేతనాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అక్షయపాత్ర సంస్థ సరఫరా చేసే భోజనాన్ని విద్యార్థులకు వడ్డించేందుకు వారి సేవలను వినియోగించుకుందామని ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 44 వేలకు పైగా ప్రభుత్వ పాఠశాలల్లో 30 లక్షల మందికిపైగా విద్యార్థులున్నారని, వీరంతా పాఠశాలలకు క్రమం తప్పకుండా హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని, అందుకు తగ్గట్టుగా స్కూళ్లలో మౌలిక సౌకర్యాలను అభివృద్ది చేయాలని ఆదేశించారు.
పాఠశాలలన్నింటిలో ఆంగ్ల మాధ్యమం
44 వేల సర్కారు బడులన్నింటిలోనూ ఇంగ్లిష్ మీడియం ప్రవేశ పెట్టడానికి అవసరమైన సదుపాయాలు, ఇతర అంశాలపై తదుపరి సమీక్ష నాటికి ఒక నివేదికను సిద్ధం చేసి తీసుకురావాలని జగన్ ఆదేశించారు. అయితే, ఈ బడులన్నింటిలోనూ తెలుగు కూడా కచ్చితంగా బోధించాలని అన్నారు. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ బడులను తీర్చిదిద్దితే విద్యార్థులు ఇటువైపే మొగ్గు చూపుతారని పేర్కొన్నారు. విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరేలా తగిన ప్రణాళికలు రూపొందించాలని అన్నారు. ఈ సమావేశంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శి ధనంజయరెడ్డి, పాఠశాల విద్యా కమిషనర్ సంధ్యారాణి, అక్షయ పాత్ర నిర్వాహకులు సత్య గౌడ చంద్రదాస్, వంశీధర దాస, నిష్కింజన దాస పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment