జిల్లా జనరల్ ఆస్పత్రి వద్ద 102 వాహనంలో ఎక్కుతున్న బాలింతలు
పాలమూరు : మాతా, శిశువుల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్రప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘102’ వాహనాలకు ఏడాది పూర్తయింది. గత ఏడాది జనవరిలో అందుబాటులోకి వచ్చిన ఈ వాహనాల ద్వారా జిల్లాలో వేలాది మందికి సేవలందాయి. గ్రామీణ ప్రాంతాల గర్భిణులు, బాలింతలు ప్రసవం, పరీక్షల కోసం ప్రభుత్వం ఆస్పత్రికి వచ్చే క్రమంలో ప్రైవేట్ వాహనాలు, ఆర్టీసీ బస్సులను ఆశ్రయించేవారు. తద్వారా నిర్ణీత పాయింట్లలో దిగి మళ్లీ ఆస్పత్రికి ఆటోల్లో రావాల్సిన పరిస్థితి ఉండేది. కానీ 102 వాహనాల ద్వారా నేరుగా ఇంటి నుంచి ఆస్పత్రికి, మళ్లీ ఇంటికి చేర్చే వెసలుబాటు అందుబాటులోకి రావడంతో గ్రామీణుల కష్టాలు తీరినట్లయింది.
‘అమ్మ ఒడి’లో భాగంగా...
అమ్మ ఒడి పథకాన్ని ప్రభుత్వం 2018 జనవరిలో ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగానే 102 అంబులెన్స్ వాహనాలను జిల్లాలో ప్రారంభించారు. అప్పట్లో 18 వాహనాలను అందుబాటులో తీసుకువచ్చారు. గర్భం దాల్చిన మొదటి నెల నుంచి ఏ ఇబ్బందులు ఎదురైనా ఆస్పత్రికి తీసుకెళ్లడం.. అవసరమైన పరీక్షలు, చికిత్స చేయించుకున్నాక ఇంటికి తిరిగి చేర్చడానికి ఈ వాహనాలు పనిచేస్తున్నారు. ప్రసవం కోసం కూడా ఆస్పత్రికి తీసుకెళ్లి, ప్రసవం అయ్యాక మళ్లీ ఈ వాహనంలోనే బాలింత ఇంటి వరకు చేరుకోవచ్చు. ఈ సేవలన్నీ ఉచితంగానే అందుబాటులోకి రావడంతో గ్రామీణులను చక్కగా వినియోగించుకుంటున్నారు. 102 నంబర్‌కు ఫోన్ చేసి వివరాలు చాలు.. వారు సూచించిన ప్రాంతానికి వాహనాలు వస్తున్నాయి. ఇక ప్రసవం తర్వాత పరీక్షలు, పిల్లలకు 9 నెలల వయస్సు వరకు ఈ వాహనాల సేవలను ఉపయోగించుకోవచ్చు. ఫలితంగా నిరుపేదలకు మేలు జరుగుతుండగా.. ఇంటి ప్రసవాలు తగ్గి సురక్షితమైన కాన్పుల సంఖ్య గణనీయంగా పెరిగింది.
వాహనం అవసరమైతే..
వాహనం అసరమైనప్పుడు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8గంటల వరకు 102 కు డయల్ చేయాల్సి ఉంటుంది. ఇలా 12గంటల పాటు మాత్రమే ఇది అందుబాటులో ఉంటుంది. రాత్రి 8 అనంతరం ఉదయం 8గంటల వరకు ఈ వాహనం అవసరమైతే 108కి కాల్ చేయాలి.
సేవలిలా అందుతాయి
- గర్భం దాల్చిన మహిళలు వైద్య పరీక్షల కోసం అమ్మ ఒడిని సద్వినియోగం చేసుకోవాలంటే 102 నంబర్‌కు ఫోన్ చేస్తే సరిపోతుంది.
- గర్భం దాల్చిన ప్రతీ మహిళా తన పేరును ఆశ కార్యకర్త వద్ద నమోదు చేసుకుని 9నెలల వరకు ప్ర తినెల యాంటినెంటల్ చెకప్(ఏఎంసీ) కోసం ఇం టి నుంచి ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లడానికి ఈ వాహన సేవలను ఉపయోగించుకోవచ్చు. వైద్య పరీక్షల తర్వాత అదే వాహనంలో ఇంటి వద్ద దిగబెడతారు.
- ఆల్ట్రా స్కానింగ్, రక్త పరీక్షలు, ఇతర వైద్య పరీక్షలకు రెఫర్ చేసిన గర్భిణులను ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి సీహెచ్‌సీకి లేదా ఏరియా, జనరల్ ఆస్పత్రికి తీసుకువెళ్తారు. నెలవారీగా చేయించుకునే వైద్య పరీక్షల కోసం గర్భిణులులు, బాలింతలు ఈ వాహన సేవలు వాడుకోవచ్చు.
- గర్భిణులకు మధ్యలో ఎప్పుడైనా ఏదైనా వైద్య పరీక్ష అవసరమని గుర్తిస్తే 102 నంబర్‌కు ఫోన్‌చేస్తే ఇంటికి వచ్చి ఆస్పత్రికి తీసుకువెళ్లి, వైద్య సేవల అనంతరం ఇంటి వద్ద దించుతారు.
- గర్భం దాల్చినప్పటి నుంచి మహిళలు విధిగా వైద్యుల సూచనలు పాటించాల్సి ఉంది. మూడు, ఆరు తొమ్మిది నెలల్లో వైద్యులను సంప్రదించి అవసరమైన సలహాలు తీసుకోవడానికి, పరీక్షలు చేసుకోవడానికి ఆస్పత్రికి తీసుకువెళ్లడం, మళ్లీ ఇంటిదగ్గర దిగబెట్టడం ఈ వాహనం ప్రవేశపెట్టడం వెనుక ప్రధాన ఉద్దేశం.
సౌకర్యంగా ఉంది
మా బాబుకు చికిత్స కోసం వచ్చాం. 102 వాహనం కోసం ఫోన్ చేయగానే వచ్చారు. ఇందులో ఆస్పత్రికి రావడం నాకు, బాబుకు చాలా సౌకర్యంగా ఉంది. ఆస్పత్రి వచ్చి వెళ్లడానికి డబ్బులు లేక ఇబ్బందిగా ఉన్న సమయంలో 102లో రావడం కలిసివచ్చింది. – చంద్రకళ, రామచంద్రాపూర్
సేవలను సద్వినియోగం చేసుకోవాలి
జిల్లాలో 102 సేవలు ఉపయోగించుకునే వారి సంఖ్య ఇంకా పెరగాలి. దీనికోసం ఆశ కార్యకర్తలు, అంగన్‌వాడీ కార్యకర్తల సాయంతో పల్లెలో అవగహన కార్యక్రమాలు చేపడుతున్నాం. ప్రస్తుతం 102 సేవలు బాగా నడుస్తున్నా.. మరింత పెంచడా నికి కృషి చేస్తాం. గర్భిణులు, బాలింతలు వీటిని అధికంగా ఉపయోగించుకునేలా వారిలో చైతన్యం రావాలి. మూడు నెలల గర్భిణి నుంచి 9నెలల శిశువు ఉన్న బాలింత వరకు ప్రతీ ఒక్కరు సేవలు ఉపయోగించుకోవచ్చు. – నసీరుద్దీన్, 102 ప్రోగ్రాం అధికారి, మహబూబ్‌నగర్
Comments
Please login to add a commentAdd a comment