జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి నుంచి 102 వాహనంలో ఇంటికి వెళ్తున్న రాణి
ప్రభుత్వం ప్రారంభించిన ‘అమ్మఒడి 102’ అంబులెన్స్ వాహనాలు గర్భిణులు, బాలింతలతో పాటు పుట్టిన పసిబిడ్డలకు వరంగా మారాయి. ప్రసవానికి ముందు వైద్య పరీక్షలకు తీసుకెళ్లడంతో పాటు ప్రసవం తర్వాత సురక్షితంగా ఇళ్లు చేరేందుకు ఇవి ఎంతగానో దోహదం చేస్తున్నాయి.
ఈ సేవలకు ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. జిల్లాలోని 18 మండలాల్లో అంబులెన్స్‌లు అందుబాటులోకి వచ్చాయి. మొత్తం 7 వాహనాలు సర్వీసులు అందిస్తున్నాయి. తల్లీబిడ్డలకు సకాలంలో, సురక్షితమైన వైద్య సేవలు అందడంలో కీలకంగా పని చేస్తున్నాయి. ఈ ఏడాది జనవరి 27వ తేదీన 200 వాహనాలతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకాన్ని ప్రారంభించారు.
తాండూరు : జిల్లాలోని 18 మండలాలకు కేటాయించిన 102 అంబులెన్స్ వాహనాల ద్వారా ఇప్పటి వరకు 878 కేసులను అటెండ్ చేసి తల్లీబిడ్డలను సురక్షితంగా ఇళ్లకు చేర్చారు. తల్లీబిడ్డలతో పాటు కుటుంబ సభ్యులు కూడా ఈ వాహనంలో ఇంటికి చేరుకుంటున్నారు. తాండూరు నుంచి 138 మంది, బషీరాబాద్ 160, వికారాబాద్ 130, పరిగి 101, కొడంగల్ 124, కుల్కచర్ల 129, మోమిన్‌పేట్ 96 మంది బాలింతలకు సేవలు అందించారు. ప్రతీవారం గర్భిణులకు నెలవారీ పరీక్షల కోసం స్థానిక ఆస్పత్రులకు వెళ్లేందుకు సైతం ఈ వాహనాలను వినియోగిస్తున్నారు.
అమ్మలకు అండగా...
అమ్మలకు అండగా ఉండేందుకు ప్రభుత్వం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టింది. మహిళలు గర్భం దాల్చిన రోజు నుంచి 16 నెలల పాటు ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య సేవలు పొందేందుకు అమ్మఒడి పథకం ద్వారా రవాణా భరోసా కల్పిస్తున్నారు. అంతేకాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సౌజన్యంతో ఒక్కో బాలింతకు రూ.13 వేల వరకు నగదు ప్రోత్సాహం అందిస్తున్నారు.
కేసీఆర్ కిట్ ద్వారా తల్లీబిడ్డకు కావాల్సిన వస్తువులు అందజేస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవం చేయిం చుకున్న వారికి కేసీఆర్ కిట్ అందుతోంది. సుఖప్రసవం తో పాటు తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని తెలుసుకున్నాకే 102 వాహనంలో ఇంటికి తీసుకెళ్లి దిగబెడుతున్నారు. దీనిపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
సేవలు బాగున్నాయి
ఆస్పత్రిలో వైద్య సేవలు ఎలా ఉన్నా 102 వాహనంలోకి ఎక్కగానే ఎంతో ఆనందం అనిపించింది. కేసీఆర్ కిట్‌ను తీసుకొని రూపాయి ఖర్చు లేకుండా 102లో బిడ్డతో సహా ఇంటికి చేరుకున్నాం. ఈ సేవలు అమ్మలకు ఎంతో అండగా నిలుస్తున్నాయి. పట్టణ ప్రాంతాలకన్నా గ్రామీణ ప్రాంతాల వారికి ఈ సేవలు అత్యవరసం. – రాణి, అయ్యప్పనగర్, తాండూరు
Comments
Please login to add a commentAdd a comment