అమ్మఒడి ఒక మార్గదర్శిని | Professor Kancha Ilaiah Article On Amma Odi | Sakshi
Sakshi News home page

అమ్మఒడి ఒక మార్గదర్శిని

Published Wed, Nov 6 2019 12:27 AM | Last Updated on Wed, Nov 6 2019 12:28 AM

Professor Kancha Ilaiah Article On Amma Odi - Sakshi

స్వాతంత్య్రానంతరం ఒక రాష్ట్రంలో తొలిసారి అమలుకానున్న విద్యా సంస్కరణగా అమ్మఒడి పథకం గుర్తింపు పొందనుంది. ఆంధ్రప్రదేశ్‌లో విద్యాపరమైన అసమానతలను తుడిచిపెట్టగల శక్తి దీనికి ఉంది. ఈ దేశంలో పుట్టిన పిల్లలందరి భవిష్యత్తును డబ్బు నిర్ణయిస్తున్న స్థితిలో పిల్లల సంక్షేమానికి తల్లుల బ్యాంకు ఖాతాలకు ఏటా రూ. 15 వేలతో ఆర్థిక భరోసాని కల్పించే వినూత్నపథకం ఇది. ఏపీ ప్రభుత్వం ఈ పథకం కోసం కేటాయించనున్న రూ. 6,455 కోట్లతో పేద పిల్లలు చదువుకునే పరిస్థితుల్లో సమూల మార్పు వస్తుంది. తెలుగు సబ్జెక్టును కొనసాగిస్తూనే అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియంను తప్పనిసరి చేస్తున్న కొత్త విద్యా పథకం దేశానికే మార్గదర్శకం కానుంది. ఒక్కమాటలో చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్‌ ఆరోగ్య, విద్యా, మార్కెట్‌పై అమ్మ ఒడి గణనీయమైన ప్రభావాలను చూపనుంది.

ఆర్థిక పరిస్థితులు దుర్భరంగా ఉంటూ కూడా తమ పిల్లలను బడికి పంపుతున్న తల్లులందరి బ్యాంక్‌ ఖాతాలోకి విద్యా ఖర్చు కింద రూ. 15,000లను బట్వాడా చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగ¯Œ మోహన్‌రెడ్డి కొద్ది రోజుల క్రితం ప్రకటించారు. ఈ పథకం పేరు అమ్మఒడి. ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక ప్రమాణాల రీత్యా, దారిద్య్ర రేఖకు దిగువన కనీస మాత్రం ఆదాయ వనరులను కలిగి ఉండి, తమ పిల్లలను 1 నుంచి 12వ తరగతి వరకు స్కూళ్లకు పంపుతున్న తల్లులు ఈ పథకం కింద నగదు సహాయం అందుకోగలరు. రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాల అమలుకు తప్పనిసరైన తెల్ల రేషన్‌ కార్డు ఉన్న వారికి ఈ పథకం వర్తిస్తుంది. దీనికోసం ఏపీ ప్రభుత్వం రూ. 6,455 కోట్లను కేటాయించింది. దీనికి ముందుగా సీఎం మరొక కీలక ప్రకటన చేశారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఒక తెలుగు సబ్జెక్టును తప్పనిసరిగా కలిగి ఉంటూనే ఇంగ్లిష్‌ మీడియంలోకి మార్చివేస్తున్నట్లు వైఎస్‌ జగన్‌ ప్రకటించారు. స్వాతంత్య్రానంతరం ఒక రాష్ట్రంలో తొలిసారి అమలుకానున్న విద్యా సంస్కరణగా ఇది గుర్తింపు పొందుతుంది. రాష్ట్రంలో విద్యా పరమైన అసమానతలను తుడిచిపెట్టగల శక్తి దీనికి ఉంది.

స్వాతంత్య్రం తర్వాత పాఠశాల విద్యా రంగాన్ని నిర్వహించుకునే అధికారం రాష్ట్రాలకు దఖలు పడినప్పటికీ, కేంద్రప్రభుత్వం దుర్మార్గమైన పాఠశాల విద్యా వ్యవస్థను నిర్వహించడానికి అనుమతించింది. దీని ప్రకారం పేదవారు అరకొర నిధులతో నడిచే ప్రాంతీయ భాషా ప్రభుత్వ పాఠశాలలకు మాత్రమే తమ పిల్లలను పంపించాలి. కానీ, తల్లిదండ్రులకు ఎలాంటి ఆర్థిక సహాయం లభించదు. మరోవైపున నగర, పట్టణ ప్రాంతాల్లోని సంపన్నులు మెరుగైన మౌలిక వసతులు ఉండే ఇంగ్లిష్‌ మీడియం ప్రైవేట్‌  స్కూళ్లకు తమ పిల్లలను పంపించగలిగేవారు. ఈ దేశంలో పుట్టిన ప్రతి పిల్లల భవిష్యత్తును డబ్బు నిర్ణయిస్తుందన్నమాట. కుల/వర్గ ప్రమాణాలను బట్టి చూస్తే శ్రామిక ప్రజారాసులతో ఉండే దిగువ కులాలను, ఇన్ని దశాబ్దాలుగా సరైన వసతులు కూడా లేని స్కూల్‌ విద్య కొనసాగుతున్న ప్రాంతీయ భాషల్లో చదువుకే పరిమితం చేశారు. అగ్రకులాల సంపన్నులు మాత్రం తమ పిల్లలను అంతర్జాతీయ అనుసంధానం ఉన్న ఇంగ్లిష్‌ మీడియం పాఠశాలలకు పంపిం చేవారు. ఇవి మెరుగైన వసతులతో ఉండేవని చెప్పనవసరం లేదు.

ఈ పథకంతోపాటు వచ్చే మూడేళ్లలో ప్రభుత్వ పాఠశాలల మౌలిక వసతులను మెరుగుపరుస్తామని వైఎస్‌ జగన్‌ వాగ్దానం చేశారు. జగన్‌ ప్రతిపాదించిన అదనపు చేర్పులేవీ లేకుండానే ఢిల్లీలో  కేజ్రీవాల్‌ ప్రభుత్వం దీన్ని అమలు చేసింది. కమ్యూనిస్టు పార్టీలు,  మితవాద జాతీయవాద పార్టీలైన బీజేపీ, శివసేన వంటి అన్ని రాజ కీయ పార్టీలు దేశంలో కాంగ్రెస్‌ ప్రతిపాదిత స్కూల్‌ విద్యా సూత్రాన్నే ఆమోదించాయి. ఎవరు అధికారంలో ఉన్నప్పటికీ ఒకే రకమైన విద్యావ్యవస్థను కొనసాగిస్తూ వచ్చాయి. చివరకు కపటత్వంతో కూడిన ఉదారవాద మేధావులు సైతం బోధనా మాధ్యమం గురించి, పేద తల్లులకు అత్యవసరమైన ఆర్థిక సహాయం అందించడం గురించి మాట్లాడకుండా నాణ్యమైన పాఠశాల విద్య గురించి లెక్చర్లు దంచుతూ వచ్చారు. ఏపీ ప్రభుత్వం ప్రకటించిన అమ్మఒడి తరహా ఆర్థిక సహాయం, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం అనేవి ఈ మసకను తొలగించేశాయి. దేశంలోనే ఇది మార్గదర్శకం కానుంది. 

దేశచరిత్రలో తొలిసారిగా అమ్మఒడి తరహా విద్యాపరమైన ఆర్థిక ప్యాకేజీ కింద తండ్రి ఖాతాలోకి కాకుండా తల్లి ఖాతాలోకి నేరుగా నగదు వచ్చి చేరనుంది. ఇది భారతీయ పాఠశాల విద్యావ్యవస్థ ప్రాథమిక నిర్మాణాన్ని దానితోపాటు మార్కెట్‌ని కూడా మార్చివేయనుంది. ఇది దేశంలో ఒక రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన అత్యుత్తమమైన భవిష్యత్‌ స్త్రీ–పురుష అధికారిక సంబంధాల వృద్ధి వ్యవస్థగా చెప్పాలి. ఈ తరహా విద్యా నమూనా రాష్ట్రంలోనూ, దేశంలోనూ కలిగించే ప్రభావాలు ఏమిటి? ఈ పథకంలో భాగంగా నాణ్యమైన ప్రభుత్వ ఇంగ్లిష్‌ మీడియం స్కూల్‌ విద్య మారుమూల పల్లెటూరి చిన్నారిని సైతం జాతీయ, ప్రాంతీయ విజ్ఞాన వ్యవస్థలతోపాటు అంతర్జాతీయ విజ్ఞాన వ్యవస్థలతో కూడా అనుసంధానం చేస్తుంది. కాబట్టి ప్రాంతీయ, ప్రపంచస్థాయి విజ్ఞానం చక్కగా అనుసంధానమవుతాయి. ఉత్పత్తి మూలాలను కలిగిన కుటుంబ నేప«థ్యం గల పిల్ల లకు స్కూలు చుట్టూ ఉన్న ఉత్పత్తి క్షేత్రాలు శ్రమపట్ల గౌరవం ప్రాతిపదికతో ఉండే జీవితంతో, విజ్ఞానంతో పెరిగే అవకాశాన్ని కల్పిస్తాయి. ఈ తరహా ఉత్పత్తి, విజ్ఞాన అనుసంధానంలో పట్టణ పిల్లలు బలహీనులు. పల్లె వాతావరణంలో లభించే ఉత్తమమైన విద్య భాషలను సత్వరం నేర్చుకునేలా పిల్లలను తీర్చిదిద్దుతాయి. తల్లిదండ్రుల కష్టాలు, సంతోషాలతో భాగమైన పిల్లలు హాస్టళ్లలో ఉండి చదువుకునే పిల్లలకంటే ఎక్కువ అనుభవజ్ఞులై ఉంటారు. 
నా దృష్టిలో అమ్మఒడి పథకం ఏపీలో ఒక కొత్త, సానుకూల మార్కెట్‌ వికాసాన్ని ఆవిర్భవింప చేస్తుంది. తండ్రిలాగా తల్లి తన ఖాతాకు జమ అయిన నగదును లిక్కర్‌ మార్కెట్‌కు ధారపోయదు. ఆమె దాన్ని మంచి స్కూల్‌ డ్రెస్, చక్కటి షూలు, నాణ్యమైన తిండిపై వెచ్చిస్తుంది. గ్రామాల్లో, పట్టణాల్లో ఈ తరహా కొత్త కొనుగోలు సామర్థ్యం మార్కెట్‌ వికాసాన్ని సృష్టిస్తుంది. ప్రభుత్వం అందించనున్న రూ. 6,455 కోట్ల డబ్బు పిల్లల శ్రేయస్సు, విద్యాపరమైన మెరుగుదల అవసరాలను తీర్చే మార్కెట్లలోకి ప్రవహిస్తుంది. ఇది ఒక కొత్త సాంస్కృతిక గ్రామాన్ని రూపొందిస్తుంది. పాఠశాల పిల్లల జీవితాన్ని మారుస్తుంది. పిల్లలు తమ తల్లిదండ్రుల జీవితాల్లో మార్పు తీసుకొస్తారు. నిరుపేద కుటుంబాల్లోని పిల్లల ఆరోగ్యాన్ని అమ్మ ఒడి గణనీయంగా మెరుగుపరుస్తుంది. తల్లి తన పిల్లలలో సంవత్సరానికి రూ. 15,000ను సంపాదించే అర్జనాపరులను చూస్తుంది. కాబట్టి పిల్లల సంరక్షణ అపారంగా పెరుగుతుంది. మంచి పాఠశాల, మంచి ఆహారం, మంచి డ్రెస్, గ్రామీణ వాతావరణంలో సాగే ఆటలు పిల్లల సర్వతోముఖాభివృద్ధిని మెరుగుపరుస్తాయి. 

ఇది యోగా కాదు.. వ్యవసాయ పనుల్లో పాల్గొంటూనే పరుగెత్తడం, హైజంప్, లాంగ్‌ జంప్‌ తీయడం, చెట్లు ఎక్కడం, చెరువులు, కాలువలు, నదుల్లో ఈత వంటి పల్లె ఆటలు పిల్లలను అత్యంత శక్తిమంతులైన భారతీయ పౌరులుగా తీర్చిదిద్దుతాయి. ప్రస్తుతం ఆరెస్సెస్‌/బీజేపీలు పాఠశాలల్లో ప్రోత్సహించాలనుకుంటున్న యోగా.. చిన్నపిల్లలను బాల్యంలోనే ముసలిపిల్లలుగా మారుస్తుంది. అంటే ఒక స్థలంలో మాత్రమే కొన్ని వ్యాయామాలు చేయగల ముసలి పిల్లలు అన్నమాట. యోగా తరహాలో కూర్చుని చేసే కార్యక్రమం కాకుండా పిల్లల శరీరాలు మరింత చురుకుదనంతో, మరింత చలన స్థితిలో ఉండాలి. అందుకే ప్రభుత్వ పాఠశాలలు యోగాను కాకుండా పై తరహా శారీరక వ్యాయామం గురించి ఆలోచించాలి. 

యూరోపియన్‌–అమెరికన్‌ తరహా స్కూళ్లలాగా పిల్లల ఊహాశక్తిని పెంచగల మంచి పాఠశాలలు పల్లెల్లో ఉంటే, వారిలో విమర్శనాత్మక ఆలోచన చాలావరకు మెరుగుపడుతుంది. ఇంటిలోని ప్రజాస్వామికమైన, శ్రామిక సంస్కృతి వాతావరణం అటు గ్రామంలోనూ, ఇటు స్కూల్లోనూ ఉండే కుల వ్యవస్థను బలహీనపరుస్తుంది. కులపరమైన దొంతరలను, అంటరానితనాన్ని నిర్మూలించడానికి కుటుంబం కంటే పాఠశాల ఉత్తమమైన సంస్థగా ఉంటుంది. దీనికి ఒకే ఒక షరతు ఏమిటంటే, స్కూల్‌ సిలబస్‌ శ్రమగౌరవం గురించిన పాఠాలను చక్కగా పొందుపర్చగలగాలి. పవిత్రత, మాలిన్యంకి సంబంధించిన అన్ని సిద్ధాంతాలను స్కూల్‌ పాఠ్య పుస్తకాల నుంచి తొలగించేయాలి. పాఠ్యపుస్తకాలు చర్మకార పని, బట్టలుతకడం, క్షురక వృత్తి, పొలం దున్నడం, కుండల తయారీ గురించి పిల్లలకు తప్పక చెప్పగలగాలి. స్కూలులో పాఠం చెప్పడం, పూజారి పని చేయడం రెండింటినీ ఒకే గౌరవంతో చూడాలి. అప్పుడే పిల్లల మనస్సుల్లో మానవ సమానత్వానికి సంబంధించిన బీజాలు మొలకెత్తుతాయి. అవే అన్ని సామాజికవర్గాలు, శ్రమ సంస్కృతుల పట్ల పిల్లల ప్రవృత్తిని తీర్చిదిద్దుతాయి. ఆంధ్రప్రదేశ్‌ ఆరోగ్య, విద్యా, మార్కెట్‌పై అమ్మ ఒడి గణనీయమైన ప్రభావాలను చూపనుంది. వచ్చే 20 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్‌ ఒక భిన్నమైన రాష్ట్రంగా ఉంటుందని ప్రకటించిన స్థాయిలో ఈ పథకాన్ని అమలు చేయగలగాలి. రాష్ట్ర స్థాయిలో అమలు చేసే ఈ విద్యా విధానం ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం రూపొం దించిన నూతన విద్యా విధానాన్ని సైతం మార్చివేయవచ్చు. (నేటితో ప్రజాసంకల్పయాత్రకు రెండేళ్లు. అమ్మ ఒడి పథకంఆ సంకల్పయాత్రలో ఇచ్చిన హామీల్లో భాగమే)

వ్యాసకర్త:  ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్‌,
 డైరెక్టర్, సెంటర్‌ ఫర్‌ స్టడీ ఆఫ్‌
సోషల్‌ ఎక్స్‌క్లూజన్‌ అండ్‌ ఇంక్లూజివ్‌ పాలసీ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement