ఇంగ్లిష్‌ వ్యతిరేకులను చీపుర్లతో స్వాగతించండి | Sakshi
Sakshi News home page

ఇంగ్లిష్‌ వ్యతిరేకులను చీపుర్లతో స్వాగతించండి

Published Sat, Apr 13 2024 5:46 AM

Professor Kancha Ailaiah interview with Sakshi

ఇంగ్లిష్‌ మీడియం విద్యే జగన్‌ను గెలిపించబోతోంది

ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం పెట్టాలని ఎప్పుడో గళమెత్తా 

వెంకయ్యనాయుడు, రమణ, చంద్రబాబు, బీజేపీ, పవన్‌ల పిల్లలను తెలుగు మీడియంలో చదివించాలి 

మేం మాత్రం మీరు అంటున్న దిక్కుమాలిన ఇంగ్లిష్లోనే చదువుకుంటాం  

‘సాక్షి’తో ప్రొఫెసర్‌ కంచ ఐలయ్య షెపర్డ్‌ 

‘ఆంధ్రప్రదేశ్‌ ఇప్పుడు భారతదేశానికే దిక్సూచిలా మారింది. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విద్యా విధానం భవిష్యత్తులో ప్రతీ ఒక్కరూ అనుసరించక తప్పదు. వద్దన్న వారికి చీపుర్లతో బుద్ధి చెప్పాలి’ అని ప్రముఖ విద్యావేత్త ప్రొఫెసర్‌ కంచ ఐలయ్య షెపర్డ్‌ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్లభాష అమలు, దాని ఫలాలపై ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన పంచుకున్న అభిప్రాయాలు ఆయన మాటల్లోనే.. 

దేశాన్ని మార్చే విద్యా విధానం..
ఇంగ్లిష్‌ మీడియం కోసం 1990 నుంచి నేను గళం విప్పాను. మండలి బుద్ధప్రసాద్, ఏబీకే ప్రసాద్, చుక్కా రామయ్య.. వీళ్లంతా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం అంటే నా మీద తీవ్ర స్థాయిలో విమర్శలతో దాడి చేశారు. ఈ విషయంలో సీఎం జగన్‌ చేసిన పోరాటం చాలా గొప్పది. ఆయన దేశాన్ని మార్చే విద్యా విధానం తీసుకొచ్చారు. మొత్తం బీజేపీ ప్రభుత్వ అజెండాను కూడా మార్చే శక్తి దానికుంది. నిజానికి గ్రామాల్లో నుంచి వచ్చే పిల్లలతో నగరాల్లోని పిల్లలు పోటీ పడలేరు. గ్రామీణ పిల్లలకు కేవలం కమ్యూనికేషన్‌ ఒక్కటే సమస్యగా ఉంటుంది. ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల పిల్లలు బాగా మాట్లాడుతున్నారు.

స్కూలు పిల్లల్ని బహిరంగ సభల్లో తెచ్చి మాట్లాడించిన నాయకుడ్ని నా జీవితంలో చూడలేదు. ఇంగ్లిష్‌ మీడియం విద్య జగన్‌ను గెలిపించబోతోంది. దీన్ని ఎవరూ ఆపలేరు. ఇటీవల రాహుల్‌ గాం«దీకి కూడా చెప్పా. దేశమంతా ఆంధ్ర మోడల్‌ తీసుకురండి.. బీజేపీని ఓడించగలుగుతారు అని. విజయవాడలో అంబేడ్కర్‌ విగ్రహం, మ్యూజియంలను నేను అంబేడ్కర్‌ గుడి అంటాను. 2002లో నేను మా ఊర్లో గుడ్‌ షెçపర్డ్‌ ఇంగ్లిష్‌ మీడియం స్కూల్‌ పెట్టి.. లంబాడి కూలోళ్ల పిల్లలకు ఇంగ్లిష్‌ చదువులు చెప్పించాను. ఇప్పుడు అద్భుతంగా వాళ్లు ఇంగ్లిష్‌లో మాట్లాడుతున్నారు.  

మీ పిల్లల్ని తెలుగు మీడియంలో చదివిస్తారా?  
వెంకయ్యనాయుడు, రమణ, చంద్రబాబు, పవన్‌కు చెబుతున్నా. మీ ఆధ్వర్యంలో తెలుగు మీడియం స్కూల్స్‌ పెట్టించండి. మీ పిల్లల్ని, అగ్రకులాల పిల్లల్ని తెలుగు మీడియంలో బాగా చదివించండి. మేం మాత్రం దిక్కుమాలిన ఇంగ్లిష్లోనే చదువుకుంటాం. మీరు తెచ్చిన నారాయణ, చైతన్య, విజ్ఞాన్‌ స్కూల్స్‌ను తెలుగు మీడియంకు మార్చండి. ఇంగ్లిష్‌ మీడియం వద్దన్న వారికి ఊరూరా మహిళలు చీపుర్లతో స్వాగతం చెప్పండి. అలాంటి మేధావులకు అంటిన మురికిని వదిలించడానికి చీపుర్లతో శుభ్రం చేయండి.  

తొలి మార్పు వైఎస్సార్‌ నుంచే 
వైఎస్సార్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక 2006లో 6 వేల స్కూల్స్‌లో ప్యారలల్‌ ఇంగ్లిష్‌ మీడియం ప్రవేశపెడితే పలువురు వ్యతిరేకించారు. ఈ విషయం మీద తనని కలిసిన వారిని మీ పిల్లలు, మనవళ్లు ఏ మీడియంలో చదువుతున్నారు అని వైఎస్సార్‌ ప్రశ్నించాక నోరు మూసుకున్నారు. మన పిల్లలకు ఇంగ్లిష్‌ చదువులు కావాలా? బీదల పిల్లలకి అక్కర్లేదా? అని వారందర్నీ మందలించారు. బహుశా అదే జగన్‌కు స్ఫూర్తినిచ్చి ఉంటుంది. పాదయాత్రలో పిల్లల పరిస్థితి చూసిన జగన్‌.. మేనిఫెస్టోలో ఇంగ్లిష్‌ విద్య గురించి పెట్టారు.

ఇచ్చింన మాట ప్రకారం ఆయన ఇంగ్లిష్‌ మీడియం తేవడానికి ప్రయత్నిస్తే వెంకయ్యనాయుడు, చంద్రబాబు, పవన్‌లాంటి వాళ్లంతా వ్యతిరేకించారు. నా దృష్టిలో వాళ్లంతా యూజ్‌లెస్‌.  కమ్యూనిస్ట్‌లు, నాతో పనిచేసిన వారు కూడా వ్యతిరేకించారు. ఆఖరికి అప్పట్లో సుప్రీంకోర్టు జడ్జిగా ఉన్న రమణ కూడా వీరికి జతకలిశారు. ఆయన తెలుగు భాష గురించి ఉపన్యాసాలు ఇస్తుంటారు. ఆయన అసలు ఏం తెలుగు రాశారని? వీళ్లందరికీ ఏం తెలుగు వచ్చని? లోక్‌ సత్తా జయప్రకాష్‌ నారాయణ్‌కు చెబుతున్నా. ఒక్కసారి ఆ పిల్లలతో ఇంగ్లిష్లో మాట్లాడు. మేధావితనం ముసుగు మాత్రమేనని నీకే తెలుస్తుంది.

Advertisement
 
Advertisement
 
Advertisement