ఎన్నికల నైతికత నెలకొనేనా? | Sakshi Guest Column On CM YS Jagan | Sakshi
Sakshi News home page

ఎన్నికల నైతికత నెలకొనేనా?

Published Wed, May 22 2024 5:19 AM | Last Updated on Wed, May 22 2024 5:19 AM

Sakshi Guest Column On CM YS Jagan

అభిప్రాయం

ఎన్నికల రంగంలో సాధారణంగా జరగాల్సిన నైతిక ప్రచారం... తమ పార్టీ గెలిస్తే ఏం చెయ్యబోతోందో ప్రజలకు అర్థమయ్యేలా చెప్పడం. జగన్‌ తన పార్టీ బహిరంగ సభల్లో తను గత ఐదేండ్లు చేసిన పనులు, గెలిస్తే చెయ్యబోయే పనులు చెబుతూ తిరిగారు. అనైతిక భాషను ఎవరి మీదా వాడటం కనిపించలేదు. కానీ చంద్రబాబు గానీ, ఆయనతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో మీటింగుల్లో పాల్గొన్న మోదీ గానీ ఆ నైతికతను పాటించలేదు. ఎదుటి నాయకుడిని నిందించే నైతికతను మాత్రమే పాటించారు. ఎన్నికల కమిషన్‌కు కూడా ఎన్నికల్లో ఏ చర్చ నీతివంతమైనది, ఏది కాదు అనే అంశంపై స్పష్టత లేదు. ఎన్నికల మొరాలిటీ, ప్రచారంలో వాడాల్సిన భాష మొదలగు అంశాలపై ఇంకా చాలా చర్చ జరగాల్సి ఉంది.

ప్రపంచంలో ఓటు ద్వారా ప్రజలు తమ పాలకులను ఎన్నుకోవడం మొదలైన దగ్గరి నుండి సమాజ నైతిక జీవనంలో గణనీయంగా మార్పు వచ్చింది. అంతకుముందు గుంపు నైతికతను మతం బోధించే ప్రయత్నం చేసింది. కానీ ఆ నైతికతకు జవాబుదారీతనం అనేది ఏమీ లేదు. రాజ్యవ్యవస్థలో రాజులు, నియంతలు ప్రజలకు జవాబుదారీగా లేరు. కండబలం– అంటే నిర్మిత సైన్యబలం, ప్రజల మధ్య కల్పించిన భయ వాతావరణం రాజ్యాలను నడిపించాయి.
 
భారతదేశంలో మతం–కులం ఒకదానికొకటి అండగా ఉండటం వల్ల, మత వ్యవస్థ ఎన్నడూ ఇక్కడ సోషల్‌ మొరాలిటీ(సామాజిక నైతికత)ని ప్రజల మధ్య ప్రచారం చెయ్యలేదు. కులాధిపత్యాన్ని, మతాధిపత్యాన్ని తద్వారా కుల మొరాలిటీని ప్రజలమధ్య ప్రచారం చేసి, ఉత్పత్తి శక్తులకు విద్య, మానవ సమానత్వం అందకుండా చాలా జాగ్రత్తగా నీతి రహిత సమాజ నిర్మాణాన్ని దైవ సృష్టి నిర్మాణంగా కొనసాగించారు. ఈ విధమైన నీతి రహిత సమాజ జీవనాన్ని ఎలక్షన్‌ మొరాలిటీ (ఎన్నికల నైతికత) ద్వారా మార్చవచ్చు అని అంబేడ్కర్‌ భావించారు. ఆ మార్పునకు మూలం రాజ్యాంగం.

అయితే భారతదేశంలో 1952 నుండి చాలాకాలం కాంగ్రెస్, కమ్యూనిస్టు– సోషలిస్టుల మధ్య ఎన్నికల పోరాటం జరిగింది. కాంగ్రెస్‌ దేశంలో చాలా సులభంగా ఎన్నికల్లో గెలవడం వల్ల, కమ్యూనిస్టులు అసలు రాజ్యాంగం మీదనే నమ్మకం లేని ఎన్నికల పోరాటంలో ఉన్నందువల్ల ఎన్నికల మొరాలిటీపై అసలు చర్చ జరగలేదు. ఈ దశ అంతా కూడా ఉత్పత్తి కులాల్లో బాగా చదువుకున్న యువకులు ఎక్కువగా లేనందున ఎన్నికల మొరాలిటీపై పత్రికల్లో కూడా చర్చ జరగలేదు. కమ్యూనిస్టులలో సిద్ధాంత పట్టు ఉన్నప్పటికీ, శ్రమ జీవుల పట్ల ప్రేమ ఉన్నప్పటికీ ఎన్నికల ద్వారా రాజకీయ నైతికతనీ, సామాజిక నైతికతనీ సమాజంలో పెంచవచ్చని వారు భావించలేదు. 

కాంగ్రెస్‌కు ప్రతిపక్షంగా ఆర్‌ఎస్‌ఎస్‌ పునాదిగా ఎదుగుతూ వచ్చిన జనసంఘ్‌/బీజేపీ ఎన్నికల వ్యవస్థను మతాధిపత్య రాజకీయంతో ముడెయ్యడం వల్ల దేశంలో కాంగ్రెస్, బీజేపీ నాయకత్వాల మధ్య ఎన్నికల మొరాలిటీపై చర్చ జరగలేదు. ఈ క్రమంలో విభిన్న రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలు ఏర్పడ్డాయి. జాతీయ స్థాయి ఎన్నికల మొరాలిటీపై చర్చ చేసే అవకాశం వాటికి అంతగా లేదు. కానీ రాష్ట్రాల స్థాయిలో ఉత్పత్తి కులాల నుండి వచ్చిన ప్రాంతీయ పార్టీల నాయకులు ఎదిగాక, ఎన్నికల నైతికతపై కొంత చర్చ మొదలుపెట్టారు. అయితే ఈ ఎన్నికల మొరాలిటీ, ప్రచారంలో వాడాల్సిన భాష మొదలగు అంశాలపై ఇంకా చాలా చర్చ జరగాల్సి ఉంది. ఎన్నికల కమిషన్‌కు కూడా ఎన్నికల్లో ఏ చర్చ నీతివంతమైనది, ఏది కాదు అనే అంశంపై స్పష్టత లేదు.
 
2024 ఎన్నికల్లో నాయకులు ప్రచార సభలలో వాడిన భాషను ఒక్కసారి చూద్దాం. చంద్రబాబు నాయుడు ఒక బహిరంగ సభలో జగన్‌మోహన్‌రెడ్డిని ఉద్దేశించి వాడిన ‘నీ అమ్మ మొగుడు చేశాడా’ లాంటి భాష ఏ ప్రజాస్వామ్య దేశంలో ఉపయోగించినా ఆయన్ని ఎన్నికల నుండి బహిష్కరించడమే కాక, తీవ్రమైన శిక్ష విధించే విలువలు ఉంటాయి. పాకిస్తాన్‌ వంటి అస్థిరమైన ప్రజాస్వామ్యంలో కూడా ఇటువంటి భాషను బహిరంగంగా వాడటాన్ని ప్రజల విలువలు ఒప్పుకోవు. కానీ ఇండియాలో ఇటువంటి భాష, దీని అనుసంధాన ప్రవర్తన ఎన్నికల రంగంలో మామూలుగా కనిపిస్తుంది. 

జగన్‌ ఇటువంటి భాషను బహిరంగ సభల్లో ఎవరి మీదా వాడటం కనిపించలేదు. అదే చంద్రబాబు ‘సైకో, సైకో’ అంటూ జగన్‌ను తిట్టగా చూశాం. ఎన్నికల రంగంలో సాధారణంగా జరగాల్సిన నైతిక ప్రచారం... తమ పార్టీ గెలిస్తే ఏం చెయ్యబోతోందో ప్రజలకు అర్థమయ్యేలా చెప్పడం. దీన్నే మనం మ్యానిఫెస్టో అంటాం. జగన్‌ తన పార్టీ బహిరంగ సభల్లో తను గత ఐదేండ్లు చేసిన పనులు, గెలిస్తే చెయ్యబోయే పనులు చెప్పుతూ తిరిగారు. కానీ చంద్రబాబు గానీ, ఆయనతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో మీటింగుల్లో పాల్గొన్న దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గానీ ఆ నైతికతను పాటించలేదు. ఎదుటి నాయకుడిని నిందించే నైతికతను మాత్రమే పాటించారు. 

ప్రధానమంత్రిగా మోదీ దేశ స్థాయిలో కూడా తన మ్యానిఫెస్టో గురించి గానీ, తను గత పదేండ్లుగా చేసిన పనుల గురించి గానీ చెప్పలేదు. రాహుల్‌ గాంధీ మీద ‘శహజాదా’ (యువరాజు) అనే పదజాలంతో నిరంతరం దాడి చేశారు. అంతకంటే ఘోరంగా ముస్లింలను ఉద్దేశించి ‘ఎక్కువమంది పిల్లల్ని కనేవాళ్ళు’ అనే పదజాలంతో దాడి చేయడం ఎన్నికల నైతికతకు పూర్తిగా భిన్నమైంది. ఈ దేశంలో ముస్లిమేతురులు, ముఖ్యంగా బీదవారు కూడా చాలామంది పిల్లల్ని కంటారు. ఆయనే స్వయంగా తన తల్లిదండ్రులకు ఆరుగురిలో ఒకరు. ఈ రచయిత తన తల్లిదండ్రులకు ఎనిమిది మంది పిల్లల్లో ఒకడు. 

ఈ భాష మతం ఎన్నుకొని పుట్టని పిల్లలపై దాడి చేస్తుంది. ఒక దేశ ప్రధానమంత్రి ఇలాంటి భాష వాడినప్పుడు అలా ఎక్కువ సంతానం ఉన్న అన్ని కుటుంబాల్లో, ముఖ్యంగా చిన్న పిల్లల్లో సైతం భయాందోళన మొదలవుతుంది. ఇది అటువంటి పిల్లలను జీవితాంతం భయభ్రాంతులకు గురిచేస్తుంది. ఎన్నికల నైతికతలో పిల్లల్ని, అమాయకుల్ని భయభ్రాంతుల్ని చేసే భాష అసలుండకూడదు. కానీ దేశ ప్రధానమంత్రే బహిరంగ సభల్లో ఇలా మాట్లాడితే, ఆ భాషకు ఎన్నికల కమిషన్‌ నుండి కూడా చెక్‌ లేకపోతే దేశంలో ఎన్నికల వ్యవస్థ కొనసాగడం కష్టం. క్రమంగా ఈ దేశ రాజ్యాంగానికీ, ప్రజాస్వామ్యానికీ ప్రమాదం ఇటువంటి ధోరణుల నుండే వస్తుంది. 

ఈ ఎన్నికల్లో రాజ్యాంగానికీ, రిజర్వేషన్లకూ ప్రమాదమున్నదనే ప్రచారాన్ని కాంగ్రెస్‌ పెద్ద ఎత్తున చేసింది. రాహుల్‌ గాంధీ ప్రతి బహిరంగ సభలో రాజ్యాంగాన్ని చూపిస్తూ బీజేపీ తిరిగి గెలిస్తే ప్రమాదముందని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అందుకు విరుగుడు రిజర్వేషన్లను కాపాడటం, పెంచడంలో ఉందని మొదటిసారి కాంగ్రెస్‌ ప్రచారం చేసింది. నిజంగానే ఆర్‌ఎస్‌ఎస్‌–బీజేపీ మళ్ళీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని క్రమంగా రద్దు చేసే అవకాశముందా? ఈ రాజ్యాంగాన్ని 1950లో ఆమోదించినప్పుడు ఆర్‌ఎస్‌ఎస్‌ ఒక పక్క, ఆనాటి కమ్యూనిస్టులు మరో పక్క వ్యతిరేకించారు. 

ఈ రాజ్యాంగం భారతీయ సంస్కృతిని (అంటే బ్రాహ్మణీయ సంస్కృతిని) ప్రతిబింబించదనీ, అది పాశ్చాత్య సంస్కృతిని ప్రతిబింబిస్తుందనీ ఆర్‌ఎస్‌ఎస్‌ స్పష్టంగా చెప్పింది. కమ్యూనిస్టులేమో శ్రామికవర్గ నియంతృత్వ రాజ్యాంగం కావాలి, ఇటువంటి బూర్జువా రాజ్యాంగం వద్దని ప్రకటించారు. ఇప్పుడు ఆర్‌ఎస్‌ఎస్‌– బీజేపీ బయటకు చెప్పేది వారి అసలైన అభిప్రాయం కాదు. 400 పైన స్థానాల్లో గెలిస్తే రాజ్యాంగాన్ని మారుస్తామని కొంతమంది ఎన్నికలకు ముందు ప్రకటించారు. ఈ రాజ్యాగ రక్షణకు మోదీ గ్యారెంటీ లాంటి వ్యక్తిగత ప్రకటనలు పనికిరావు. 

వంద సంవత్సరాల నుండి ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్ధాంతం ఏం చెబుతోంది అనేది లోతుగా చూడాలి. ఈ మధ్యకాలంలో సనాతన ధర్మాన్ని కాపాడాలని ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీల్లోని పై  కులస్థులతోపాటు ఓబీసీ అయిన మోదీ కూడా చాలాసార్లు మాట్లాడారు. సనాతన ధర్మం అంటే ఇప్పుడు అందరూ అనుకునే హిందూయిజం కాదు. సనాతన ధర్మం ప్రధానంగా వర్ణ ధర్మం (కుల వ్యవస్థ) కలిగివుంది. ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీల్లోని బీసీ, ఎస్సీలు... మళ్లీ వర్ణ ధర్మం పాత పద్ధతిలో నెలకొల్పాలంటే ఈ రాజ్యాంగాన్ని రద్దు చెయ్యకుండా సనాతన ధర్మాన్ని తిరిగి స్థాపించడం సాధ్యం కాదు అని అర్థం చేసుకోవాలి. ఆ నిర్మాణాల్లో ఉన్న శూద్రులు, బీసీలు, ఎస్సీలు, ఆదివాసులు ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్ధాంతం లోతు చూడకపోతే తాము మునిగి దేశాన్ని కూడా ముంచే అవకాశముంది. 

ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్‌ 
వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement