ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్‌లో తీసుకొచ్చిన విప్లవాత్మక విద్యా సంస్కరణలపై ప్రతి పక్షాలు చేస్తున్న విమర్శలను ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త ప్రొఫెసర్ కంచె ఐలయ్య షెపర్డ్ తీవ్రంగా తప్పుపట్టారు. పేద పిల్లలకు కార్పోరేట్ విద్య నేర్పిస్తే ఇందులో పెత్తందారులకు వచ్చే నష్టమేంటని ప్రశ్నించారు. గ్రామాల్లో చదువుకున్న పిల్లలకు ఇంగ్లిష్ నాలెడ్జ్ వస్తే ఆ పిల్లల్లో క్రియేటివిటీ అనేది 1000 రెట్లు పెరుగుతుందని స్పష్టం చేశారు. ఇంగ్లిష్ అనేది గ్లోబల్ లాంగ్వేజ్ అని, దాన్ని ప్రభుత్వ బడుల్లో చదివే పిల్లలకు అందుబాటులోకి సీఎం జగన్ తీసుకొస్తే మరి ఇందులో వారికి వచ్చిన నష్టమేంటో తెలియడం లేదన్నారు. ఏపీ రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా విద్యావ్యవస్థలో సీఎం జగన్ తీసుకొస్తున్న విప్లవాత్మక మార్పులపై ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్య్వూలో ఐలయ్య పలు విషయాలను పంచుకున్నారు.
రాబోయే పదేళ్లల్లో పల్లె విద్యలో కొత్త చరిత్ర
ప్రభుత్వ బడుల్లో ఇంగ్లిష్ మీడియాన్ని ప్రవేశపెట్టడాన్ని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ లాంటి వాళ్లు తప్పుపట్టడాన్ని తీవ్రంగా ఖండించారు ఐలయ్య. తమ పిల్లలకు గ్రామాల్లో ఉన్న పిల్లలు తీవ్రంగా పోటీ ఇస్తారని, తమ పిల్లలకు ఊళ్లల్లో పిల్లలు పోటీ వస్తారని ఆ కారణం చేతనే ప్రభుత్వ బడుల్లో ఇంగ్లిష్ మీడియాన్ని వ్యతిరేకిస్తున్నారన్నారు. కొన్ని కులాల్లో నేటికి విద్య అనేది సరిగా లేదని, రాబోయే కాలంలో ఊళ్లల్లో ఉన్న విద్యార్థులు.. అంబానీ, అదానీ స్కూళ్లలో చదివే పిల్లల్ని సైతం ఓడించగలరన్నారు. సీఎం జగన్ ప్రవేశపెట్టిన ప్రభుత్వ బడుల్లో ఇంగ్లిష్ మీడియం అనేది రాబోయే 10 ఏళ్లలో పల్లె విద్యలో కొత్త చరిత్ర సృష్టించడం ఖాయమన్నారు.
పవన్‌కు అసలు కామన్ సెన్స్ ఉందా?
ఏపీలో ప్రవేశపెట్టిన ప్రభుత్వ బడుల్లో ఇంగ్లిష్ మీడియాన్ని పవన్ కళ్యాణ్ గతంలో తప్పుబడుతూ చేసిన వ్యాఖ్యలపై కూడా ఐలయ్య ఘాటుగా స్పందించారు. ప్రధానంగా యూట్యూబ్‌లో చూసి ఇంగ్లిష్ నేర్చుకోవచ్చని, దాని కోసం ప్రభుత్వాలు వేల కోట్లు ఖర్చు పెట్టనవసరం లేదని చేసిన వ్యాఖ్యలను ఐలయ్య ఖండించారు.
అసలు పవన్ కళ్యాణ్ కామన్ సెన్స్‌తో మాట్లాడుతున్నారా? అని ప్రశ్నించారు. అంతా యూట్యూబ్‌లో చూసి నేర్చుకుంటే పిలల్ని కూడా కార్పోరేట్ స్కూళ్లలో చేర్చించాల్సిన అవసరమే ఉండదన్నారు. మరి మీ పిలల్ని పెద్ద పెద్ద స్కూళ్లలో ఎందుకు చదివిస్తున్నారో చెప్పాలని సూటిగా నిలదీశారు. పవన్ యాక్షన్ చేసి ఏవో డబ్బులు సంపాదించాడు తప్ప కనీసం నాలెడ్జ్ లేదన్నారు.
ప్రభుత్వ బడులకు బడ్జెట్ ఖర్చు పెడుతుంటే తప్పేంటన్నారు. రాష్ట్ర బడ్జెట్‌ను దేనిపైనా ఖర్చు పెట్టకుండా మరి సినిమాలు తీయమంటావా? లేక చంద్రబాబుతో కలిసి హైటెక్ సిటీ కట్టమంటావా? అని పవన్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
నీ మనవడితో తెలుగు మీడియం చదివించు
ఇంగ్లిష్ మీడియంలో చదివితే పిల్లలు ఏమవుతారో తెలుసా అంటూ గతంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యల్ని ఐలయ్య తప్పుపట్టారు. ‘ కొండ నాలుకకు మందేస్తే.. ఉన్న నాలుక పోయింది’ అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు ఐలయ్య తనదైన శైలిలో బదులిచ్చారు.
ఇదే నిజమైతే తన మనవడిని తెలుగు మీడియంలో చదివించొచ్చు కదా అంటూ ప్రశ్నించారు. మరి అటువంటప్పుడు తన మనవడి ఉన్న నాలుక(కొండ నాలుకకు మందేస్తే) ఎందుకు తీసేస్తున్నావ్ అంటూ ప్రశ్నించారు. అలా అయితే మీరు.. మీ పార్టీ వారి పిల్లల్ని రేపే తెలుగు మీడియంలో చేర్పించాలని డిమాండ్ చేశారు ఐలయ్య.
Comments
Please login to add a commentAdd a comment