యుద్ధప్రాతిపదికన రోడ్ల మరమ్మతులు | CM YS Jagan with Collectors And SPs And JCs In review on various development works | Sakshi
Sakshi News home page

యుద్ధప్రాతిపదికన రోడ్ల మరమ్మతులు

Published Wed, Jan 6 2021 3:14 AM | Last Updated on Wed, Jan 6 2021 10:43 AM

CM YS Jagan with Collectors And SPs And JCs In review on various development works - Sakshi

సాక్షి, అమరావతి: ఈ నెల 10వ తేదీ నుంచి 45 రోజుల పాటు యుద్ధ ప్రాతిపదికన రహదారుల మరమ్మతులు చేపట్టాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. రూ.560 కోట్లతో రహదారుల మరమ్మతులకు సంబంధించి ఈ నెల 10వ తేదీలోగా టెండర్లు పూర్తి చేస్తామని, ఈ పనులు త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మంగళవారం ఆయన స్పందన కార్యక్రమంలో భాగంగా పలు అభివృద్ధి పనులకు సంబంధించి తన క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో చివరి రెండేళ్లు రహదారుల మరమ్మతుల గురించి పట్టించుకోలేదని, మనం అధికారంలోకి వచ్చాక భారీ వర్షాల వల్ల రోడ్లు దెబ్బ తిన్నాయని తెలిపారు. ఈ ఏడాది అంతా రోడ్ల మరమ్మతులపైనే దృష్టి పెడుతున్నామని స్పష్టం చేశారు. మరో రూ.2 వేల కోట్లతో కూడా రహదారుల మరమ్మతులపై దృష్టి పెడుతున్నామని చెప్పారు. ఇందుకు సంబంధించి రుణం మంజూరు అయ్యేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ సమీక్షలో వివిధ అంశాలపై సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశాలు, సూచనలు ఇలా ఉన్నాయి. 

రూ.12 వేల కోట్లతో కొత్త రహదారులు 
► ఆర్‌ అండ్‌ బీకి సంబంధించి 31 ఎన్‌హెచ్‌ (నేషనల్‌ హైవే) ప్రాజెక్టులు ఉన్నాయి. రూ.9,571 కోట్ల ఖర్చుతో 915 కిలోమీటర్ల మేర రోడ్లు నిర్మిస్తున్నారు. వీలైనంత త్వరగా ఇందుకు సంబంధించి భూ సేకరణ పూర్తి చేయాలి.
► సుమారు రూ.12 వేల కోట్లతో కొత్త రోడ్ల పనులు మంజూరయ్యాయి. వీటికి సంబంధించి కూడా భూ సేకరణపై దృష్టి పెట్టాలి. నిర్ణయించిన తేదీ నుంచి 270 రోజుల్లోపు భూములను కాంట్రాక్టర్‌కు అప్పగించకపోతే కాంట్రాక్టరు డీస్కోపింగ్‌ (రేటు పెంచండని)కు అడిగే అవకాశం ఉంటుంది. 

ప్రాధాన్యతగా ఉపాధి పనులు
► గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి. గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, బల్క్‌ మిల్క్‌ కూలింగ్‌ యూనిట్లు (బీఎంసీయూ – భారీ పరిమాణంలో పాలను శీతలీకరణలో ఉంచే కేంద్రాలు), అంగన్‌వాడీ సెంటర్లు, విలేజ్‌ క్లినిక్స్‌ పనులను గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ప్రాధాన్యతగా పూర్తి చేయాలి. 
► ఒక మనిషికి లేదా ఒక ఏజెన్సీకి ఒక పని మాత్రమే అప్పగించాలి. ఎక్కువ పనులు అప్పగిస్తే ఒక పని అయిపోయే వరకు రెండో పని మొదలు పెట్టడం లేదు. దీనికి అనుగుణంగా వెంటనే మార్పులు చేయాలి. మార్చి 31లోగా అనుకున్న పనులన్నీ పూర్తి చేయాలి. 
► ఇందుకు సూక్ష్మ స్థాయిలో కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలి. గ్రామాల వారీగా ప్లాన్‌ ఉండాలి. ఈ పనులను అత్యంత ప్రాధాన్యతగా తీసుకోవాలి. అప్పుడే పూర్తి స్థాయిలో నిధులను వినియోగించుకునే అవకాశం ఉంటుంది.  

నిర్మాణాల్లో వేగం పెరగాలి
► గ్రామ సచివాలయాల నిర్మాణాలను వేగవంతం చేయాలి. గ్రామాల వారీగా పనులను ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలి. మండలాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని నిర్మాణాల ప్రగతిని సమీక్షించాలి. కలెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్లు ప్రణాళిక వేసుకుని ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. విలేజ్‌ ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలి.
► మన బడి నాడు–నేడు కింద స్కూళ్లలో చేపట్టిన మొత్తం పనులన్నీ వచ్చే నెలాఖరు నాటికి పూర్తి కావాలి. ప్రతి బిల్డింగును ఒక యూనిట్‌గా తీసుకుని జాయింట్‌ కలెక్టర్లు, కలెక్టర్లు పూర్తి స్థాయిలో దృష్టి సారించాలి. 
► ప్రొక్యూర్‌మెంట్‌కు ఆంధ్రప్రదేశ్‌ ఎడ్యుకేషన్‌ వెల్ఫేర్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఏపీఈడబ్ల్యూఐడీసీ)తో సమన్వయం చేసుకుని ముందుకు సాగాలి. క్రమం తప్పకుండా పర్యవేక్షణ చేయాలి. 

అంగన్‌ వాడీ కేంద్రాలు ప్రీ ప్రైమరీ స్కూళ్లుగా మార్పు
► అంగన్‌వాడీ కేంద్రాల నిర్మాణం పెండింగులో ఉన్న వాటికి వెంటనే స్థలాలను సేకరించాలి. అంగన్‌వాడీ కేంద్రాలను ప్రీ ప్రైమరీ స్కూళ్లుగా మార్చబోతున్నాం. ఈ కేంద్రాలకు కావాల్సిన స్థలాలను పూర్తి స్థాయిలో గుర్తించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్‌ను అభినందిస్తున్నా. 
► ఆరేళ్ల లోపు పిల్లల్లో 85 శాతం మెదడు అభివృద్ధి చెంది ఉంటుంది. అందువల్ల వారి పట్ల అత్యంత శ్రద్ధ చూపిస్తున్నాం. మంచి విద్యార్థులుగా వారిని తీర్చిదిద్దడానికి ఈ పనులన్నీ చేస్తున్నాం. ఇంగ్లిష్‌ సహా వారికి అన్నీ నేర్పిస్తాం.

ఎంపీఎఫ్‌సీల నిర్మాణానికి భూముల గుర్తింపు 
► బహుళ ప్రయోజన సౌకర్యాల కేంద్రాల (ఎంపీఎఫ్‌సీ – మల్టీ పర్పస్‌ ఫెసిలిటీ సెంటర్స్‌) కోసం ఆర్బీకేల సమీపంలో అర ఎకరా నుంచి ఒక ఎకరం వరకు స్థలం కావాలి. గోదాములు, శీతల గిడ్డంగులు, వ్యవసాయ ఉత్పత్తులను ఆరబెట్టడానికి అవసరమైన వేదిక (డ్రైయింగ్‌ ప్లాట్‌ఫాం), వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ కేంద్రాలు (కలెక్షన్‌ సెంటర్లు), ప్రాథమికంగా శుద్ధిచేసే పరికరాలు (ప్రైమరీ ప్రాసెసింగ్‌ ఎక్విప్‌మెంట్‌), అసైయింగ్‌ ఎక్విప్‌మెంట్‌ (పరీక్షించే పరికరాలు), సేకరణ పరికరాలు (ప్రొక్యూర్‌మెంట్‌ అక్విప్‌మెంట్‌) తదితర సదుపాయాల కోసం భూములు కావాలి.
► ట్రక్కులు వెళ్లేలా ఈ భూములు ఉండాలి. జనవరి 31 నాటికల్లా ఈ భూముల గుర్తింపు పూర్తి కావాలి. గ్రామాల్లోనే జనతా బజార్ల కోసం 5 సెంట్లు కావాలి. గ్రామం మధ్యలోనే ఉండేలా చూడాలి. వచ్చే ఏడాదిలో గ్రామ స్వరూపంలో పూర్తి మార్పు వస్తుంది. 
► ప్రతి గ్రామంలో గ్రామ సచివాలయం, ఆర్బీకే, విలేజ్‌ క్లినిక్, ప్రీప్రైమరీ స్కూల్, జనతాబజార్లతో మొత్తం గ్రామాల స్వరూపం మారుతుంది. ఆర్బీకేల పక్కనే ఎంపీఎఫ్‌సీలు వస్తాయి. దాదాపు రూ.10,235 కోట్ల ఆర్థిక వనరుల సమీకరణకు అనుసంధానం కూడా పూర్తవుతుంది.
► జనవరిలో పంట కోత ప్రయోగాలు (క్రాప్‌ కటింగ్‌ ఎక్స్‌పర్‌మెంట్స్‌) పూర్తయితే, ఫిబ్రవరిలో ప్లానింగ్‌ నివేదిక ఆధారంగా ఏప్రిల్‌ నాటికి రైతులకు ఇన్సూరెన్స్‌ అందించేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలి.

జనవరి 11న అమ్మ ఒడి
జనవరి 9న రెండో శనివారం, బ్యాంకులకు సెలవు కావడంతో జనవరి 11న అమ్మ ఒడి నిర్వహిస్తున్నాం. ప్రతి గ్రామ, వార్డు సచివాలయంలో డిసెంబర్‌ 21 నుంచి లబ్ధిదారుల జాబితాను ప్రదర్శించాం. జనవరి 7 వరకు ఆ  జాబితాలు గ్రామ, వార్డు సచివాలయాల్లో అందుబాటులో ఉంటాయి. స్కూళ్లకు సంబంధించిన షెడ్యూల్‌ కూడా ఆ రోజు ప్రకటిస్తాం. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను కూడా పరిగణనలోకి తీసుకుని ఆ మేరకు ప్రకటిస్తాం.

ఇంటింటికీ రేషన్‌ బియ్యం 
రేషన్‌ సరుకులను లబ్ధిదారుల ఇంటి వద్దే పంపిణీ చేసేందుకు ఈ నెల 20వ తేదీన 9,257 వాహనాలను ప్రారంభిస్తాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, అగ్రవర్ణాల్లోని పేదలకు కూడా అవకాశం ఇస్తూ వారికి వాహనాలు అందించే కార్యక్రమాన్ని చేపట్టాం. బియ్యం అందించే బ్యాగులను కూడా అదే రోజు ఆవిష్కరిస్తాం. రేషన్‌ సరఫరాలో భాగంగా స్వర్ణ రకం బియ్యం అందిస్తాం. విజయవాడలో మూడు జిల్లాలకు సంబంధించిన వాహనాలు ప్రారంభిస్తాం. మిగిలిన జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రారంభిస్తారు. ఫిబ్రవరి 1 నుంచి లబ్ధిదారులకు నాణ్యమైన బియ్యాన్ని వారి ఇళ్ల వద్దే అందజేస్తాం.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement