4 నెలల్లో 3,500 కి.మీ.రోడ్లు | CM YS Jagan Govt Focus On Restoration of roads Andhra Pradesh | Sakshi
Sakshi News home page

4 నెలల్లో 3,500 కి.మీ.రోడ్లు

Published Fri, Jul 14 2023 5:45 AM | Last Updated on Fri, Jul 14 2023 5:45 AM

CM YS Jagan Govt Focus On Restoration of roads Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి: వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభు­త్వం రాష్ట్రంలో రహదారుల పునరుద్ధరణను మరింత వేగవంతం చేసింది. కొత్తగా 3,500 కిలోమీటర్ల 437 రోడ్ల పనుల కోసం రూ.1,122 కోట్లు కేటాయించింది. ఆగస్టుకి టెండర్ల ప్రక్రియ చేపట్టి డిసెంబర్‌కి ఆ పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించింది. దీంతో టెండర్ల ప్రక్రియకు రోడ్లు, భవనాల (ఆర్‌ అండ్‌ బి) శాఖ చర్యలు చేపట్టింది. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఇప్పటికే నాలుగేళ్లలో రెండు దశల్లో రూ.4,492.99 కోట్లు వెచ్చించి 12,894 కి.మీ. రోడ్లు నిర్మించింది.

ఇప్పుడు మూడో దశ పనులకు నిధులు కేటాయించడం ప్రాధాన్యత సంతరించుకుంది. తాజాగా పునరుద్ధరించాల్సిన రోడ్ల­ను శాస్త్రీయంగా ఎంపిక చేశారు. ఆర్‌ అండ్‌ బి శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి అత్యధిక రద్దీ ఉన్న రోడ్లను ఎంపిక చేశారు. వీరిచ్చిన నివేదికను ప్రభుత్వం ఆమోదించింది. జిల్లా కేంద్రాలను అనుసంధానించే రోడ్లు, మండల కేంద్రాలను జిల్లా కేంద్రంతో అనుంధానించే 437 రోడ్లను తగిన నిష్పత్తిలో నిర్ణయించారు. వాటిలో 1,289.80 కి.మీ. మేర 132 రాష్ట్ర రహదారులు ఉన్నాయి. వీటిని రూ.490.80 కోట్లతో పునరుద్ధరించనున్నారు.

కొత్త జిల్లా కేంద్రాలకు మండల కేంద్రాలతో అనుసంధానించే రోడ్లకు ప్రాధాన్యమిచ్చారు. అందుకే జిల్లా ప్రధాన రహదారుల కేటగిరీలోని 2,210.20 కి.మీ. మేర 305 రోడ్లను రూ.631.20 కోట్లతో పునరుద్ధరించనున్నారు. 

ప్రాధాన్యక్రమంలో బిల్లుల చెల్లింపు 
రోడ్ల పునరుద్ధరణ పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపు కోసం ఆర్‌ అండ్‌ బి అధికారులు ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. ఇటీవల రూ.500 కోట్ల బిల్లులను చెల్లించారు. మిగిలిన బిల్లుల చెల్లింపును వేగవంతం చేశారు.

ఇక మూడో దశ కింద చేపట్టనున్న రోడ్ల పనుల బిల్లుల చెల్లింపునకు కూడా ముందస్తు ప్రణాళిక రూపొందిస్తున్నారు. పనులు పూర్తి చేసి బిల్లులు అప్‌లోడ్‌ చేసిన వెంటనే ప్రాధాన్యక్రమంలో చెల్లించే విధానాన్ని రూపొందించారు. దీనిపై కాంట్రాక్టర్లకు అవగాహన కల్పిస్తున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement