highways construction
-
4 నెలల్లో 3,500 కి.మీ.రోడ్లు
సాక్షి, అమరావతి: వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలో రహదారుల పునరుద్ధరణను మరింత వేగవంతం చేసింది. కొత్తగా 3,500 కిలోమీటర్ల 437 రోడ్ల పనుల కోసం రూ.1,122 కోట్లు కేటాయించింది. ఆగస్టుకి టెండర్ల ప్రక్రియ చేపట్టి డిసెంబర్‌కి ఆ పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించింది. దీంతో టెండర్ల ప్రక్రియకు రోడ్లు, భవనాల (ఆర్ అండ్ బి) శాఖ చర్యలు చేపట్టింది. వైఎస్ జగన్ ప్రభుత్వం ఇప్పటికే నాలుగేళ్లలో రెండు దశల్లో రూ.4,492.99 కోట్లు వెచ్చించి 12,894 కి.మీ. రోడ్లు నిర్మించింది. ఇప్పుడు మూడో దశ పనులకు నిధులు కేటాయించడం ప్రాధాన్యత సంతరించుకుంది. తాజాగా పునరుద్ధరించాల్సిన రోడ్లను శాస్త్రీయంగా ఎంపిక చేశారు. ఆర్ అండ్ బి శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి అత్యధిక రద్దీ ఉన్న రోడ్లను ఎంపిక చేశారు. వీరిచ్చిన నివేదికను ప్రభుత్వం ఆమోదించింది. జిల్లా కేంద్రాలను అనుసంధానించే రోడ్లు, మండల కేంద్రాలను జిల్లా కేంద్రంతో అనుంధానించే 437 రోడ్లను తగిన నిష్పత్తిలో నిర్ణయించారు. వాటిలో 1,289.80 కి.మీ. మేర 132 రాష్ట్ర రహదారులు ఉన్నాయి. వీటిని రూ.490.80 కోట్లతో పునరుద్ధరించనున్నారు. కొత్త జిల్లా కేంద్రాలకు మండల కేంద్రాలతో అనుసంధానించే రోడ్లకు ప్రాధాన్యమిచ్చారు. అందుకే జిల్లా ప్రధాన రహదారుల కేటగిరీలోని 2,210.20 కి.మీ. మేర 305 రోడ్లను రూ.631.20 కోట్లతో పునరుద్ధరించనున్నారు. ప్రాధాన్యక్రమంలో బిల్లుల చెల్లింపు రోడ్ల పునరుద్ధరణ పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపు కోసం ఆర్ అండ్ బి అధికారులు ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. ఇటీవల రూ.500 కోట్ల బిల్లులను చెల్లించారు. మిగిలిన బిల్లుల చెల్లింపును వేగవంతం చేశారు. ఇక మూడో దశ కింద చేపట్టనున్న రోడ్ల పనుల బిల్లుల చెల్లింపునకు కూడా ముందస్తు ప్రణాళిక రూపొందిస్తున్నారు. పనులు పూర్తి చేసి బిల్లులు అప్లోడ్ చేసిన వెంటనే ప్రాధాన్యక్రమంలో చెల్లించే విధానాన్ని రూపొందించారు. దీనిపై కాంట్రాక్టర్లకు అవగాహన కల్పిస్తున్నారు. -
కావలి–దుత్తలూరు రోడ్డు విస్తరణకు రూ.415 కోట్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో హైవేల అభివృద్ధికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి గతేడాది అక్టోబర్‌లో కేంద్రానికి ప్రతిపాదనలు పంపించారు. ఇందులో ప్రధానంగా రాష్ట్రంలో 5 పోర్టులకు అనుసంధానించేలా 400 కిలోమీటర్ల పొడవైన 25 రహదారుల నిర్మాణం చేపట్టాలని కేంద్రాన్ని కోరారు. ఈ నేపథ్యంలోనే పోర్టులను అనుసంధానించే కావలి–దుత్తలూరు మధ్య 70 కిలోమీటర్ల మేర రోడ్డు విస్తరణకు మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్‌పోర్టు అండ్ హైవేస్ ఇటీవలే రూ.415 కోట్లు కేటాయించింది. రాయలసీమ జిల్లాలకు కనెక్టివిటీ పెరిగేలా ఈ రహదారిని విస్తరిస్తారు. కర్ణాటకలోని రాంనగర్ నుంచి నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పోర్టుకు (ఎన్‌హెచ్–67) వెళ్లే రహదారికి రెండో మార్గంగా ఉన్న కావలి–ఉదయగిరి–సీతారామపురం మధ్య గల ఈ రెండు లేన్ల రహదారిని అభివృద్ధి చేస్తారు. మూడు జిల్లాలను కలిపేలా.. ప్రకాశం జిల్లాలోని రామాయపట్నం ఓడరేవు పూర్తయిన తర్వాత భవిష్యత్‌లో పెరిగే ట్రాఫిక్‌ను దృష్టిలో పెట్టుకుని నెల్లూరు, కడప, ప్రకాశం జిల్లాల మధ్య అంతర్గత మార్గాలను కలిపేవిధంగా కావలి–దుత్తలూరు రోడ్డు విస్తరణ తోడ్పడనుంది. దశాబ్దాలుగా ఈ రోడ్డును అప్‌గ్రేడ్ చేయడానికి ప్రతిపాదనలు ఉన్నా.. గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు. ఈ రహదారికి కేంద్రం నిధులు కేటాయించడంతో కావలి వద్ద ఎన్‌హెచ్–16 (చెన్నై–కోల్‌కతా), దుత్తలూరు వద్ద ఎన్‌హెచ్–565 (తెలంగాణ పరిధిలోని నకిరేకల్–ఆంధ్ర పరిధిలో ఏర్పేడు), సీతారాంపురం వద్ద ఎన్‌హెచ్ 167–బి (మైదుకూరు–సింగరాయకొండ)ల మధ్య కనెక్టివిటీ పెరుగుతుంది. -
డబుల్ లేన్లుగా సింగిల్ రోడ్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో జాతీయ రహదారులకు అనుసంధానంగా ఉన్న పలు సింగిల్ లేన్ రోడ్లు.. డబుల్ లేన్లుగా మారనున్నాయి. ట్రాఫిక్ అత్యధికంగా ఉండే ఈ రోడ్లను గతంలోనే ఆర్ అండ్ బీ నుంచి నేషనల్ హైవేస్ పరిధికి మార్చారు. ఏపీ రహదారుల అభివృద్ధి సంస్థ వీటికి సమగ్ర ప్రాజెక్టు నివేదికలు(డీపీఆర్) రూపొందించింది. వెంటనే ఈ డీపీఆర్‌లను మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ ఆమోదించింది. రూ.2,797 కోట్లతో 440 కి.మీ. మేర అభివృద్ధి చేయనున్న ఈ రోడ్లకు త్వరలో టెండర్లు పిలవనున్నారు. ఈ రోడ్లను మూడేళ్లలో పూర్తి చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ► చెన్నై–బళ్లారిని కలిపే ఎన్‌హెచ్–716లో భాగమైన ఎన్‌హెచ్–67(ముద్దనూరు), ఎన్‌హెచ్–40(కడప)పై ట్రాఫిక్ పెరిగిపోయింది. చిత్తూరు, అనంతపురం, వైఎస్సార్ జిల్లాలకు వెళ్లేందుకు ఇది ప్రధాన రహదారి. దీనిపై రోజుకు 9 వేల ప్యాసింజర్ కార్ యూనిట్ (పీసీయూ)ల ట్రాఫిక్ ఉంటోంది. ఈ మార్గంలో 51 కి.మీ. మేర రోడ్లను అభివృద్ధి చేయనున్నారు. ► ఏజెన్సీ గ్రామాలకు రంపచోడవరం నుంచి కొయ్యూరు (ఎన్‌హెచ్–516 ఈ) రోడ్డు ముఖ్యమైనది. ఈ రహదారిలో ఎక్కువ భాగం ఘాట్ రోడ్ నిర్మాణం చేపట్టాల్సి ఉంది. దీనికి సంబంధించి 74 కి.మీ. మేర రోడ్డును అభివృద్ధి చేయనున్నారు. ► పోరుమామిళ్ల–సీఎస్ పురం, సీఎస్ పురం–సింగరాయకొండ రోడ్ల అభివృద్ధికి కేంద్రం డీపీఆర్‌లను ఆమోదించింది. ఇవి అందుబాటులోకి వస్తే ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్ జిల్లాలకు వెళ్లే ప్రయాణికులకు ట్రాఫిక్ ఇబ్బందులు తొలగిపోతాయి. అలాగే తెలంగాణ–ఏపీని కలిపే జీలుగుమిల్లి– జంగారెడ్డిగూడెం– దేవరపల్లి – రాజమండ్రి రోడ్డుతో పాటు కొవ్వూరు నుంచి అశ్వారావుపేట, ఖమ్మం వరకు రోడ్లను అభివృద్ధి చేయనున్నారు. -
రహదారులపై ప్రధానంగా దృష్టి
న్యూఢిల్లీ: రహదారుల నిర్మాణం వంటి కీలకమైన మౌలిక సదుపాయాల కల్పనపై కేంద్రం ప్రధానంగా దృష్టి పెడుతోందని కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. 22 ఎక్స్‌ప్రెస్‌వేలతో పాటు అసంఖ్యాకంగా వ్యూహాత్మక టనెల్స్, వంతెనలు నిర్మిస్తున్న నేపథ్యంలో రాబోయే రెండేళ్లలో అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా వంటి సంపన్న దేశాల సరసన భారత్ కూడా నిలవగలదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. దాదాపు రూ. 3.10 లక్షల కోట్ల వ్యయంతో వీటిని నిర్మిస్తున్నట్లు గడ్కరీ పేర్కొన్నారు. మధ్యప్రదేశ్‌లో సుమారు రూ. 8,250 కోట్ల వ్యయంతో చంబల్ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణానికి సంబంధించిన చర్చలు తుది దశలో ఉన్నాయని, రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో చేపడుతున్న ఈ తరహా ప్రాజెక్టుల్లో ఇదే మొదటిది కాగలదని ఆయన వివరించారు. విద్యుత్ పంపిణీ వ్యవస్థను పటిష్టం చేసేందుకు విద్యుత్ శాఖ, ఆప్టికల్ ఫైబర్ కేబుల్ నెట్‌వర్క్‌ను విస్తరించేందుకు ఐటీ శాఖ ప్రణాళికలను సిద్ధం చేస్తున్నాయని, అలాగే రహదారుల వెంబడి గ్యాస్ పైప్‌లైన్ నిర్మాణం కూడా జరగనుందని మంత్రి చెప్పారు. పర్యావరణ అనుకూల 22 గ్రీన్ ఎక్స్‌ప్రెస్‌వేలకు సంబంధించి ఇప్పటికే ఏడు ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయని.. సుమారు రూ.1 లక్ష కోట్లతో తలపెట్టిన ఢిల్లీ–ముంబై ఎక్స్‌ప్రెస్‌వే కూడా వీటిలో ఉందని ఆయన తెలిపారు. ‘వ్యూహాత్మక టనెల్స్, వంతెనలు, హైవేలు వంటి కీలక ఇన్ఫ్రా ప్రాజెక్టులు అమలవుతున్న వేగం చూస్తుంటే వచ్చే రెండేళ్లలో భారత్ ముఖ స్వరూపం మారిపోతుందని ధీమాగా చెప్పవచ్చు. అమెరికా, బ్రిటన్, జర్మనీ, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో కనిపించే రహదారులు, టన్నెల్స్, వంతెనలు మొదలైన వాటిని మన దేశంలో కూడా చూడవచ్చు‘ అని గడ్కరీ చెప్పారు. 2 నెలల్లో జోజిలా టన్నెల్ పనులు ప్రారంభం... జమ్మూకశ్మీర్‌కి సంబంధించి దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న జీ–మోర్ టన్నెల్ ప్రాజెక్టుకు అనుమతులు మంజూరు చేసినట్లు, త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభం కానున్నట్లు మంత్రి చెప్పారు. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం సుమారు రూ. 2,379 కోట్లు. సాధారణంగా చలికాలంలో భారీగా మంచు కురుస్తుండటం వల్ల జమ్మూకశ్మీర్‌లోని కొన్ని ప్రాంతాల్లో రహదారులు మూసివేయాల్సి వస్తుంటుంది. అయితే, ఏడాది పొడవునా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా రవాణాకు అవరోధం లేకుండా చూసేందుకు జీ–మోర్, జోజిలా తదితర టన్నెల్స్ ఉపయోగపడనున్నాయి. జోజిలా టన్నెల్ పనులు రెండు నెలల్లో ప్రారంభమవుతాయని గడ్కరీ చెప్పారు. మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (ఎంఈఐఎల్) సంస్థ ఈ కాంట్రాక్టు దక్కించుకుంది. లార్సన్ అండ్ టూబ్రో, ఇర్కాన్ ఇంటర్నేషనల్ వంటి దిగ్గజాలు దీనికోసం పోటీపడ్డాయి. -
జిల్లా కేంద్రం వరకు రెండు వరుసల రోడ్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రం వరకు ఉన్న రోడ్లను రెండు వరుసల రహదార్లుగా విస్తరించనున్నారు. రహదారులపై శిథిలావస్థలో ఉన్న వంతెనలను పునర్నిర్మిస్తారు. ఇందుకోసం న్యూ డెవలప్మెంట్ బ్యాంకు(ఎన్డీబీ) 70 శాతం రుణం అందజేయనుంది. మిగతా 30 శాతం వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించనుంది. మొత్తం రూ.6,400 కోట్లతో ఏపీ మండల కనెక్టివిటీ అండ్ రూరల్ కనెక్టివిటీ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్టు(ఏపీఎంసీఆర్‌సీఐపీ), ఏపీ రోడ్స్ అండ్ బ్రిడ్జెస్ రీకన్స్ట్రక్షన్ ప్రాజెక్టులను (ఏపీఆర్‌బీఆర్‌పీ) రహదారులు, భవనాల శాఖ అధికారులు చేపట్టనున్నారు. 479 కొత్త వంతెనల నిర్మాణం రోజుకు 2 వేలకు పైగా వాహనాలు ప్రయాణించే రహదార్లన్నింటినీ రెండు వరుసలుగా మారుస్తారు. 3,103 కిలోమీటర్లకు పైగా రోడ్లను అభివృద్ధి చేయడంతో పాటు 479 కొత్త వంతెనల నిర్మాణం చేపట్టనున్నారు. ఈ ప్రాజెక్టులో రహదార్ల విస్తరణకు రూ.5,313 కోట్లు, వంతెనల నిర్మాణానికి రూ.1,087 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఎన్డీబీ, రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో చేపట్టనున్న రూ.6,400 కోట్ల పనులకు అదనంగా రూ.2,400 కోట్లు జోడించి.. మొత్తం రూ.8,800 కోట్లు కేటాయించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇటీవల అధికారులకు సూచించారు. రూ.2,978 కోట్లకు పరిపాలన అనుమతులు ఎన్డీబీ సాయంతో ఏపీలో తొలిదశ కింద 1,243.51 కిలోమీటర్ల మేర రహదారులు, వంతెనల విస్తరణకు గాను రూ.2,978.51 కోట్ల వ్యయానికి పరిపాలన అనుమతులు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం రెండు రోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 33 ప్యాకేజీల కింద రూ.2,978.51 కోట్లకు గాను పరిపాలన అనుమతులు మంజూరయ్యాయి. భూ సేకరణ, ఇతర అవసరాలకు రూ.30.88 కోట్లు కేటాయించారు. తొలి దశలో రహదారుల విస్తరణ, వంతెనల నిర్మాణానికి రూ.2,978 కోట్లు విడుదల చేశామని ఆర్ అండ్ బీ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు చెప్పారు. డిసెంబర్ ఆఖరు నాటికి టెండర్ల ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. మార్చి నెల నాటికి పనులు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. -
ఓట్ల కోసం కొత్త ‘దారులు’
సాక్షి, న్యూఢిల్లీ : రానున్న సార్వత్రిక ఎన్నికలను పలు సవాళ్ల మధ్య ఎదుర్కోనున్న క్రమంలో మోదీ సర్కార్ గెలుపు కోసం రహదారులపై ఆశలు పెట్టుకుంది. ఎన్నికల నేపథ్యంలో 2019 మార్చి నాటికి 15,000 కిమీ మేర 300 హైవే ప్రాజెక్టులను పూర్తిచేయాలని రోడ్డు రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ లక్ష్యంగా నిర్ధేశించుకుంది. ఈ ప్రాజెక్టులపై మంత్రిత్వ శాఖ రూ 1.5 లక్షల కోట్లు వెచ్చించనుంది. మధ్యప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్ధాన్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో పాలక బీజేపీకి ఓట్లు రాల్చే రూట్లలో ఈ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తిచేసేలా ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఈ రాష్ట్రాల్లో బీజేపీ 200 స్ధానాల్లో గెలుపొందడం గమనార్హం. మరోవైపు ఈ ప్రాజెక్టులను సత్వరమే పూర్తిచేసేందుకు చేపట్టాల్సిన చర్యలపై రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీలో ప్రాజెక్టు డైరెక్టర్లు, కన్సెషనరీస్‌తో మంత్రి గడ్కరీ 700 ప్రాజెక్టుల అమలు తీరును పర్యవేక్షిస్తారని అధికారులు తెలిపారు. మొత్తం 700 ప్రాజెక్టుల్లో తక్షణమే పూర్తిచేయాల్సిన 300 హైవే ప్రాజెక్టులను గుర్తిస్తారు. 2018ను నిర్మాణ సంవత్సరంగా గుర్తించిన క్రమంలో పెద్ద ఎత్తున రహదారుల ప్రాజెక్టులను చేపట్టిన సంగతి తెలిసిందే. మరోవైపు 2015కు ముందు అప్పగించిన ప్రాజెక్టు పనులను సత్వరమే పూర్తిచేయాలని గడ్కరీ ఇప్పటికే అధికారులు, కాంట్రాక్టర్లను కోరారు. ఇక ఢిల్లీ-మీరట్ ఎక్స్‌ప్రెస వే మిగిలిన రెండు దశలు సహా కీలక ప్రాజెక్టును మార్చి 2019 నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ధేశించింది. సమీక్షలో భాగంగా ఈ ప్రాజెక్టుల తీరుతెన్నులనూ మంత్రి పర్యవేక్షిస్తారని అధికారులు చెప్పారు. ఇక లక్ష్యాలకు అనుగుణంగా పనులను వేగవంతం చేసేందుకు అవసరమైన నిధుల కోసం దేశీయ, అంతర్జాతీయ సంస్ధల నుంచి రూ 60,000 కోట్లు సమీకరించేందుకు ఎన్హెచ్ఏఐ సన్నాహాలు చేస్తోంది. -
హైదరా‘బ్యాడ్’ రోడ్లు!
ఇలా ఎవరన్నారు? ఎందుకన్నారు? సోది లేకుండా స్ట్రెయిట్‌గా పాయింట్లోకి పోదాం.. ఎవరన్నారు? మారుతీ సుజుకీ రహదారి భద్రత సూచిక.. ఏటా ఆ సంస్థ ఈ నివేదికను విడుదల చేస్తుంది. 2017కి సంబంధించినది తాజాగా విడుదలైంది. ఆ నివేదికలో ఓవరాల్‌గా నగరానికి చివరి స్థానం దక్కింది. ఎందుకన్నారు? రహదారి భద్రత సూచిక కోసం ఓ 12 పరామితులను ప్రామాణికంగా పెట్టుకున్నారు. దాని ఆధారంగా దేశంలోని 10 ప్రముఖ నగరాల్లో క్షుణ్నంగా సర్వే చేశారు. ఒక్కో నగరానికి సంబంధించి 1,000–1,200 మందిని ప్రశ్నించి..వివిధ అంశాలపై అభిప్రాయాలను తీసుకున్నారు. అందులో తేలిన అంశాల ఆధారంగా ఈ నిర్ణయానికొచ్చారు. ఏమిటా 10 నగరాలు? ఏమిటా 12 పరామితులు? సర్వే చేసిన నగరాలు: హైదరాబాద్, రాయ్‌పూర్, ఇండోర్, ఢిల్లీ, పుణే, కోల్‌కతా, చెన్నై, అహ్మదాబాద్, బెంగళూరు, ముంబై పాదచారుల హక్కులు: రద్దీ ఉన్న రహదారులపై జీబ్రా క్రాసింగ్స్, సైకిలింగ్ ట్రాక్స్..కొన్ని చోట్ల నో వెహికల్ డేలు పాటించడం వంటివి జరగాలి. ముఖ్యంగా మెట్రో వంటి అభివృద్ధి పనులు జరుగుతున్నప్పుడు పాదచారులు నడవటానికి ప్రత్యామ్నాయ ఏర్పాటు ఉండాలి. ఇలాంటి పనులు జరిగినప్పుడు తాము చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నామని ఈ సర్వేలో పాల్గొన్న ప్రజలు చెప్పారు. - ఈ విభాగంలో విజేత: రాయ్‌పూర్ రోడ్ల నిర్వహణ, లైటింగ్: బహిరంగ ప్రదేశాలు, రోడ్లపై తగినంత లైటింగ్ ఉండాలి. సుందరీకరణలో భాగంగా విభిన్నమైన లైటింగ్‌ను ఏర్పాటు చేయడం, పర్యావరణ అనుకూలమైన సౌర విద్యుత్‌ను వినియోగించుకోవడం.. విజేత: కోల్‌కతా మోటారు చట్టాలు, ట్రాఫిక్ నియంత్రణ: రాత్రి వేళల్లో పెట్రోలింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు.. చట్ట ఉల్లంఘనలకు పాల్పడితే తగు జరిమానాలు..ప్రజల్లో అవగాహన కల్పించడానికి సోషల్ మీడియాను వినియోగించుకోవడం, రద్దీ వేళల్లో సమర్థవంతంగా ట్రాఫిక్‌ను నియంత్రించడం.. విజేత: చెన్నై అత్యవసర సేవలు: ఏ ఉత్పాతం జరిగినా తగు విధంగా స్పందించేలా అత్యవసర సేవల విభాగాలను తీర్చిదిద్దడం.. అంబులెన్సులు, అగ్నిమాపక వాహనాలు వంటివాటికి దారి ఇచ్చేలా వాహన చోదకులకు అవగాహన కల్పించడం, ఫుట్‌పాత్‌లు, రోడ్లపై అక్రమణలను తొలగించేలా చేయడం.. దీని వల్ల అత్యవసర సమయాల్లో ఎమర్జెన్సీ సర్వీసు వాహనాలు వెళ్లడానికి వీటిని వాడుకోవచ్చు. విజేత: అహ్మదాబాద్ రోడ్ల శుభ్రత: ఎప్పటికప్పుడు రోడ్లను శుభ్రం చేయడం.. ఇంటింటి నుంచి చెత్తను సేకరించడం.. చెత్త తరలించే వాహనాలు సక్రమంగా పనిచేస్తున్నాయో లేదో ట్రాకింగ్ చేయడం.. నగరంలో ఉత్పత్తయ్యే ప్లాస్టిక్‌ను రోడ్లు నిర్మాణం, రిపేర్లకు పునర్వినియోగించడం. విజేత: ఇండోర్ కనెక్టివిటీ: అంతర్గత రోడ్లకు, ప్రధాన రహదారులకు మధ్య కనెక్టివిటీ.. ఫ్లైఓవర్లు.. నగరంలో విస్తృతంగా మెట్రో, ట్రామ్, రైలు సదుపాయాలు.. విజేత: ఢిల్లీ రోడ్ ట్రాన్స్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్: బస్సుల ప్రయాణానికి ప్రత్యేకమైన లేన్లు, తగు పార్కింగ్ సదుపాయాలు, వరదలు వంటివి రాకుండా నీరు నిలవకుండా సమర్థవంతమైన డ్రైనేజీ వ్యవస్థ విజేత: అహ్మదాబాద్ రహదారి భద్రత: ప్రమాదాల నియంత్రణ, సీటుబెల్టు, హెల్మెట్లు పెట్టుకునేలా చూడటం.స్పీడ్ బ్రేకర్లు, స్పీడ్ గన్స్, ట్రాఫిక్ సైన్స్ ఏర్పాటు.. ట్రాఫిక్ నిబంధనలు పాటించడంలో ప్రజలు అనుసరించే తీరు.. విజేత: రాయ్‌పూర్ చిన్నపిల్లల భద్రతకు అనుకూలమైన వాతావరణం: స్కూళ్లు, నివాస ప్రాంతాల వద్ద స్పీడ్ బ్రేకర్ల ఏర్పాటు. సురక్షిత డ్రైవింగ్‌పై బస్సు డ్రైవర్లకు, రహదారి భద్రతపై విద్యార్థులకు అవగాహన కల్పించడం. విజేత: కోల్‌కతా దివ్యాంగులకు అనుకూలంగా: రవాణా వాహనాల్లో వీరికి ప్రత్యేకమైన సీట్లు ఏర్పాటు చేయడం.. రద్దీ ప్రదేశా ల్లో రోడ్లు దాటడానికి వాయిస్ ఇండికేటర్స్.. వాళ్ల కోసం ప్రత్యేకమైన క్యాబ్‌లు.. బస్సుల్లో రాయితీ టికెట్‌పై ప్రయాణం.. విజేత: ముంబై రోడ్ల నాణ్యత: గుంతలు లేకుండా అత్యుత్తమమైన రహదారుల నిర్మాణం.. ఎప్పటికప్పుడు పర్యవేక్షణ, తక్కువ సమయంలో మరమ్మతులు చేయడం.. విజేత: ఢిల్లీ భారీ వాహనాల ట్రాఫిక్ నియంత్రణ: రద్దీ సమయాల్లో నగరంలోకి ప్రవేశించకుండా కచ్చితమైన పర్యవేక్షణ, వాటి కోసం ప్రత్యేకమైన రహదారుల ఏర్పాటు..వాహనాల ఓవర్ లోడింగ్ నియంత్రణ విజేత: అహ్మదాబాద్.. చివరగా... ఈ 12 విభాగాల్లోనూ వచ్చిన మార్కుల ఆధారంగా రాయ్‌పూర్‌కు మొదటి స్థానం దక్కగా.. హైదరాబాద్‌కు చివరి స్థానం దక్కింది. రహదారుల భద్రత, చిన్నపిల్లల భద్రతకు అనుకూల వాతావరణం విభాగాల్లో తప్ప అన్నింటిలోనూ నగరానికి చివరి స్థానమే వచ్చింది. ఈ రెండింటిలో 9వ స్థానం దక్కింది. – సాక్షి, తెలంగాణ డెస్క్ -
'హైవేల నిర్మాణంలో తెలంగాణకు అన్యాయం'
జాతీయ రహదారుల నిర్మాణంలో తెలంగాణకు అన్యాయం జరిగిందని రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అన్నారు. అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో భాగంగా ఈరోజు జాతీయ రహదారులపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 70 ఏళ్లలో పాలకులు చేయలేనిది తాము రెండున్నరేళ్లలో చేశామని చెప్పారు. మొత్తం 2,776 కిలోమీటర్ల మేర కొత్త జాతీయ రహదారులను నిర్మించామన్నారు. 18 జాతీయ రహదారుల నిర్మాణానికి నిధులు మంజూరు అయ్యాయన్నారు. హైదరాబాద్ చుట్టూ మరో రింగ్ రోడ్డు నిర్మాణానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు కేసీఆర్ తెలిపారు. -
'హైవేల నిర్మాణంలో తెలంగాణకు అన్యాయం'