కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, ప్రధాని నరేంద్ర మోదీ (ఫైల్ ఫోటో)
సాక్షి, న్యూఢిల్లీ : రానున్న సార్వత్రిక ఎన్నికలను పలు సవాళ్ల మధ్య ఎదుర్కోనున్న క్రమంలో మోదీ సర్కార్ గెలుపు కోసం రహదారులపై ఆశలు పెట్టుకుంది. ఎన్నికల నేపథ్యంలో 2019 మార్చి నాటికి 15,000 కిమీ మేర 300 హైవే ప్రాజెక్టులను పూర్తిచేయాలని రోడ్డు రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ లక్ష్యంగా నిర్ధేశించుకుంది. ఈ ప్రాజెక్టులపై మంత్రిత్వ శాఖ రూ 1.5 లక్షల కోట్లు వెచ్చించనుంది. మధ్యప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్ధాన్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో పాలక బీజేపీకి ఓట్లు రాల్చే రూట్లలో ఈ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తిచేసేలా ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.
2014 లోక్‌సభ ఎన్నికల్లో ఈ రాష్ట్రాల్లో బీజేపీ 200 స్ధానాల్లో గెలుపొందడం గమనార్హం. మరోవైపు ఈ ప్రాజెక్టులను సత్వరమే పూర్తిచేసేందుకు చేపట్టాల్సిన చర్యలపై రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీలో ప్రాజెక్టు డైరెక్టర్లు, కన్సెషనరీస్‌తో మంత్రి గడ్కరీ 700 ప్రాజెక్టుల అమలు తీరును పర్యవేక్షిస్తారని అధికారులు తెలిపారు. మొత్తం 700 ప్రాజెక్టుల్లో తక్షణమే పూర్తిచేయాల్సిన 300 హైవే ప్రాజెక్టులను గుర్తిస్తారు. 2018ను నిర్మాణ సంవత్సరంగా గుర్తించిన క్రమంలో పెద్ద ఎత్తున రహదారుల ప్రాజెక్టులను చేపట్టిన సంగతి తెలిసిందే.
మరోవైపు 2015కు ముందు అప్పగించిన ప్రాజెక్టు పనులను సత్వరమే పూర్తిచేయాలని గడ్కరీ ఇప్పటికే అధికారులు, కాంట్రాక్టర్లను కోరారు. ఇక ఢిల్లీ-మీరట్ ఎక్స్‌ప్రెస వే మిగిలిన రెండు దశలు సహా కీలక ప్రాజెక్టును మార్చి 2019 నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ధేశించింది. సమీక్షలో భాగంగా ఈ ప్రాజెక్టుల తీరుతెన్నులనూ మంత్రి పర్యవేక్షిస్తారని అధికారులు చెప్పారు. ఇక లక్ష్యాలకు అనుగుణంగా పనులను వేగవంతం చేసేందుకు అవసరమైన నిధుల కోసం దేశీయ, అంతర్జాతీయ సంస్ధల నుంచి రూ 60,000 కోట్లు సమీకరించేందుకు ఎన్‌హెచ్‌ఏఐ సన్నాహాలు చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment