Jammu Kashmir: మాట ఇస్తే నిలబెట్టుకుంటా! | PM Narendra Modi inaugurates the Z-Morh tunnel in Sonamarg | Sakshi
Sakshi News home page

Jammu Kashmir: మాట ఇస్తే నిలబెట్టుకుంటా!

Published Mon, Jan 13 2025 12:57 PM | Last Updated on Tue, Jan 14 2025 5:11 AM

PM Narendra Modi inaugurates the Z-Morh tunnel in Sonamarg

సరైన సమయంలో సక్రమంగా పనులు: మోదీ  

జమ్మూ కశ్మీర్‌లో సోనామార్గ్‌ సొరంగం ప్రారంభం 

సోనామార్గ్‌: ‘‘మోదీ మాటిచ్చాడంటే తప్పడు. నెరవేర్చి తీరతాడు. అన్ని పనులనూ సరైన సమయంలో సక్రమంగా పూర్తి చేసి చూపిస్తా’’ అని ప్రధాని నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. జమ్మూకశ్మీర్‌లో వ్యూహాత్మకంగా కీలకమైన 6.5 కిలోమీటర్ల పొడవైన నూతన సొరంగాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు. నిర్మాణ దశలో జెడ్‌–మోర్హ్‌ టన్నెల్‌గా పిలిచిన ఈ సొరంగానికి సోనామార్గ్‌గా నామకరణం చేశారు. జమ్మూ కశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికల తర్వాత మోదీ ఇక్కడికి రావడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. 

‘‘మోదీ మాటిస్తే నెరవేరుస్తాడు. కేంద్రంలో మా ప్రభుత్వం తొలిసారి కొలువుతీరాకే అత్యంత సంక్లిష్టమైన ఈ సొరంగ పనులు మొదలయ్యాయి. మేం మొదలు పెట్టిన పనులను మేమే పూర్తి చేశాం. మూడోసారి అధికారంలోకి రాగానే సొరంగం నిర్మాణం పూర్తి చేశాం. గతంలో చలికాలంలో 3 నుంచి 4 నెలలు భారీ మంచు, కొండచరియలు విరిగిపడటం, హిమపాతం వంటి ప్రతికూల వాతావరణంతో ఈ ప్రాంతం గుండా రాకపోకలకు తీవ్ర ఇబ్బందులుండేవి. ఇప్పుడు ఏ సీజన్‌లోనైనా శ్రీనగర్, సోనామార్గ్, లేహ్‌ మధ్య రాకపోకలు సాగించవచ్చు. లద్దాఖ్‌ ప్రాంతానికి ఇకపై ఎలాంటి ప్రయాణ ఇబ్బందులు లేకుండా సాఫీగా చేరుకోవచ్చు’’ అని ప్రధాని చెప్పుకొచ్చారు.  

కశ్మీర్‌లో మార్పు తెచ్చేందుకు నిరంతరం కృషి చేస్తున్నాం 
‘‘ మా ప్రభుత్వ కృషి వల్లే కశ్మీర్‌ లోయలో పరిస్థితుల్లో మార్పులు వస్తున్నాయి. ఆంక్షల చట్రంలో నలిగిన శ్రీనగర్‌లోని లాల్‌చౌక్‌లో ఇప్పుడు ఎంతో మార్పులు చూస్తున్నాం. ఇప్పుడు ఐస్‌క్రీమ్‌ కోసం కుటుంబాలు రాత్రిపూట కూడా లాల్‌చౌక్‌కు వెళ్తున్నాయి. కళాకారులైన నా స్నేహితులు ఇక్కడి పోలో వ్యూ పాయింట్‌ను నేడు ముఖ్య వ్యాపార కూడలిగా మార్చేశారు. శ్రీనగర్‌లో జనం ఎంచక్కా కుటుంబంతో కలిసి సినిమాలకూ వెళ్లగలుగుతున్నారు. ఇంతటి పెను మార్పులు గతంలో ఏ ప్రభుత్వ హయాంలోనూ జరగలేదు. కొన్ని నెలల క్రితం శ్రీనగర్‌లో ఏకంగా అంతర్జాతీయ మారథాన్‌ జరిగింది. ఆరోజు మారథాన్‌ కార్యక్రమంలో ముఖ్యమంత్రి సైతం పాల్గొన్నారు. ఆ వీడియో వైరల్‌ అయింది. ఢిల్లీలో కలిసినప్పుడు ఆయన్ను మనస్ఫూర్తిగా అభినందించా’’ అని అన్నారు. 

నూతన శకమిది 
‘‘ఇది జమ్మూకశ్మీర్‌కు నిజంగా నూతన శకం. జమ్మూకశ్మీర్‌ భారత్‌కు కిరీటం. అదెప్పుడూ మరింత అందంగా, సుసంపన్నంగా ఉండాలి. జమ్మూకశ్మీర్‌లో శాంతియుత వాతావరణం వెల్లివిరుస్తోంది. అదిప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది. కశ్మీర్‌ తన సొంత అభివృద్ధి అధ్యయనాన్ని లిఖించుకుంటోంది’’ అని అన్నారు. టన్నెల్‌ను ప్రారంభించాక మోదీ ఓపెన్‌టాప్‌ వాహనంలో సొరంగంలోకి వెళ్లి పరిశీలించారు. 

అక్కడి నిర్మాణ కార్మికులతో మాట్లాడి వారిని అభినందించారు. టన్నెల్‌ నిర్మాణ సమయంలో గత ఏడాది అక్టోబర్‌ 20న కార్మికులపై ఉగ్రదాడి సందర్భంగా చనిపోయిన ఏడుగురికి మోదీ నివాళులరి్పంచారు. సున్నా డిగ్రీ సెల్సియస్‌ ఉష్ణోగ్రతను సైతం లెక్కచేయకుండా టన్నెల్‌ ప్రారంభోత్సవానికి సోనామార్గ్, గగన్‌గిర్, గుండ్, కంగన్‌ గ్రామాల నుంచి వేలాది మంది స్థానికులు రావడం విశేషం.  

దిల్, దిల్లీ మధ్య దూరం చెరిపే నేత మోదీపై ఒమర్‌ పొగడ్తలు 
కార్యక్రమంలో పాల్గొన్న జమ్మూకశ్మీర్‌ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా మోదీనుద్దేశించి మాట్లాడుతూ పొగడ్తల్లో ముంచెత్తారు. ‘‘ దిల్‌కు, దిల్లీకి మధ్య దూరాల ను చెరిపేసే నేత మీరు. ఇచ్చిన వాగ్దానాలను నెరవేరుస్తున్నారు. గత 15రోజుల్లోనే మీరు పాల్గొంటున్న రెండో కార్యక్రమం ఇది. జనవరి ఆరున జమ్మూ కోసం ప్రత్యేకంగా రైల్వేడివిజన్‌ ఏర్పాటుచేశారు.

 జమ్మూకశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పి నాలుగు నెలల్లోనే ఆ హామీ నెరవేర్చారు. ఇక ఈ ప్రాంతానికి మళ్లీ రాష్ట్రహోదా ఇస్తామన్న హామీనీ త్వరలో నెరవేరుస్తారని బలంగా విశ్వసిస్తున్నాం. సోనామార్గ్‌ టన్నెల్‌ వంటి ప్రాజెక్టుల పూర్తితో జమ్మూకశ్మీర్‌కు ఢిల్లీకి మధ్య దూరాలు తగ్గి అనుసంధానత పెరుగుతోంది’’ అని ఒమర్‌ అన్నారు.  

రూ.2,716 కోట్ల వ్యయంతో.. 
రూ.2,716 కోట్ల వ్యయంతో సముద్రమట్టానికి 8,650 అడుగుల ఎత్తులో ఈ సొరంగాన్ని నిర్మించారు. గందేర్‌బల్‌ జిల్లాలో శ్రీనగర్‌–లేహ్‌ జాతీయ రహదారిపై గగన్‌గిర్, సోనామార్గ్‌ గ్రామాల మధ్యలో ఒకేసారి ఇరువైపుల వాహనాలు వెళ్లేలా టన్నెల్‌ నిర్మాణం పూర్తిచేశారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణికులు సొరంగంలో చిక్కుకుపోతే బయట పడేందుకు వీలుగా సొరంగానికి సమాంతరంగా 7.5 మీటర్ల వెడల్పుల్లో ఎమర్జెన్సీ ఎగ్జిట్‌ ద్వారాలను నిర్మించారు. టన్నెల్‌ ప్రారంభ కార్యక్రమంలో కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ, సీఎం ఒమర్, జమ్మూకశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా సైతం పాల్గొన్నారు.   
 

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement