శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లో అభివృద్ధి కోసం కేంద్రంతో కలిసి పనిచేయాలనుకుంటున్నట్టు చెప్పారు ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా. కేంద్రంతో నిర్మాణాత్మక సంబంధాలను కొనసాగించడమే తమ లక్ష్యమని అన్నారు. ఇదే సమయంలో ఇలా చేయడం బీజేపీ పార్టీతో కలిసినట్టు కాదు అని క్లారిటీ ఇచ్చారు. కేంద్రంలో ఎవరు ఉన్నా తాము ఇలాగే ముందుకెళ్తామని స్పష్టం చేశారు.
సీఎం ఒమర్ అబ్దుల్లా కన్వాల్‌లో జాతీయ చానెల్‌తో మాట్లాడారు. ఈ సందర్భంగా ఒమర్.. రాష్ట్ర ప్రయోజనాల కోసమే నేను ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాను కలిశాను. నేను కేంద్రం తీరు పట్ల సానుకూలంగా ఏమీ లేను. ప్రభుత్వంతో కలిసి పనిచేయడం అంటే వారు చేసే ప్రతిదాన్ని నేను అంగీకరిస్తున్నాను అని కాదు. బీజేపీ చేసే పనిని నేను అంగీకరిస్తున్నానని దీని అర్థం కాదు. జమ్ముకశ్మీర్‌కు సంబంధించిన అంశాలపై మాత్రమే కేంద్రంతో అనుకూలంగా ఉంటున్నాం. అంతమాత్రాన మేము బీజేపీకి మద్దతు ఇచ్చినట్టు కాదు.
రాష్ట్రం పురోగతి సాధించాలంటే కేంద్రం అవసరం ఎంతో ముఖ్యం. అభివృద్ధి జరగడం, రాష్ట్ర హోదా పునరుద్ధరించడం మా ముందున్న లక్ష్యాలు. పార్టీలు ముఖ్యం కాదు.. కావాల్సింది అభివృద్దే. అవసరం లేని చోట నేను కేంద్రంతో పోరాటం ఎంచుకోవాలా? అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం పట్ల వ్యతిరేక ధోరణితో ఉంటే రాష్ట్రానికే నష్టం జరుగుతుంది అని చెప్పుకొచ్చారు.
ఇదిలా ఉండగా.. గత సంవత్సరం నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ జమ్ము కశ్మీర్ ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఒమర్ అబ్దుల్లా ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టారు. అనంతరం, రెండుసార్లు అమిత్ షాను కలిశారు. ఇటీవల సోనామార్గ్‌లో జరిగిన సొరంగం ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని మోడీని కలిశారు. దీంతో, ఒమర్..బీజేపీతో సన్నిహితంగా ఉంటున్నారనే వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ నేపథ్యంలో ఒమర్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment