
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో హైవేల అభివృద్ధికి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గతేడాది అక్టోబర్‌లో కేంద్రానికి ప్రతిపాదనలు పంపించారు. ఇందులో ప్రధానంగా రాష్ట్రంలో 5 పోర్టులకు అనుసంధానించేలా 400 కిలోమీటర్ల పొడవైన 25 రహదారుల నిర్మాణం చేపట్టాలని కేంద్రాన్ని కోరారు. ఈ నేపథ్యంలోనే పోర్టులను అనుసంధానించే కావలి–దుత్తలూరు మధ్య 70 కిలోమీటర్ల మేర రోడ్డు విస్తరణకు మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్‌పోర్టు అండ్ హైవేస్ ఇటీవలే రూ.415 కోట్లు కేటాయించింది. రాయలసీమ జిల్లాలకు కనెక్టివిటీ పెరిగేలా ఈ రహదారిని విస్తరిస్తారు. కర్ణాటకలోని రాంనగర్ నుంచి నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పోర్టుకు (ఎన్‌హెచ్–67) వెళ్లే రహదారికి రెండో మార్గంగా ఉన్న కావలి–ఉదయగిరి–సీతారామపురం మధ్య గల ఈ రెండు లేన్ల రహదారిని అభివృద్ధి చేస్తారు.
మూడు జిల్లాలను కలిపేలా..
ప్రకాశం జిల్లాలోని రామాయపట్నం ఓడరేవు పూర్తయిన తర్వాత భవిష్యత్‌లో పెరిగే ట్రాఫిక్‌ను దృష్టిలో పెట్టుకుని నెల్లూరు, కడప, ప్రకాశం జిల్లాల మధ్య అంతర్గత మార్గాలను కలిపేవిధంగా కావలి–దుత్తలూరు రోడ్డు విస్తరణ తోడ్పడనుంది. దశాబ్దాలుగా ఈ రోడ్డును అప్‌గ్రేడ్ చేయడానికి ప్రతిపాదనలు ఉన్నా.. గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు. ఈ రహదారికి కేంద్రం నిధులు కేటాయించడంతో కావలి వద్ద ఎన్‌హెచ్–16 (చెన్నై–కోల్‌కతా), దుత్తలూరు వద్ద ఎన్‌హెచ్–565 (తెలంగాణ పరిధిలోని నకిరేకల్–ఆంధ్ర పరిధిలో ఏర్పేడు), సీతారాంపురం వద్ద ఎన్‌హెచ్ 167–బి (మైదుకూరు–సింగరాయకొండ)ల మధ్య కనెక్టివిటీ పెరుగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment