న్యూఢిల్లీ: రహదారుల నిర్మాణం వంటి కీలకమైన మౌలిక సదుపాయాల కల్పనపై కేంద్రం ప్రధానంగా దృష్టి పెడుతోందని కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. 22 ఎక్స్‌ప్రెస్‌వేలతో పాటు అసంఖ్యాకంగా వ్యూహాత్మక టనెల్స్, వంతెనలు నిర్మిస్తున్న నేపథ్యంలో రాబోయే రెండేళ్లలో అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా వంటి సంపన్న దేశాల సరసన భారత్ కూడా నిలవగలదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. దాదాపు రూ. 3.10 లక్షల కోట్ల వ్యయంతో వీటిని నిర్మిస్తున్నట్లు గడ్కరీ పేర్కొన్నారు. మధ్యప్రదేశ్‌లో సుమారు రూ. 8,250 కోట్ల వ్యయంతో చంబల్ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణానికి సంబంధించిన చర్చలు తుది దశలో ఉన్నాయని, రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో చేపడుతున్న ఈ తరహా ప్రాజెక్టుల్లో ఇదే మొదటిది కాగలదని ఆయన వివరించారు.
విద్యుత్ పంపిణీ వ్యవస్థను పటిష్టం చేసేందుకు విద్యుత్ శాఖ, ఆప్టికల్ ఫైబర్ కేబుల్ నెట్‌వర్క్‌ను విస్తరించేందుకు ఐటీ శాఖ ప్రణాళికలను సిద్ధం చేస్తున్నాయని, అలాగే రహదారుల వెంబడి గ్యాస్ పైప్‌లైన్ నిర్మాణం కూడా జరగనుందని మంత్రి చెప్పారు. పర్యావరణ అనుకూల 22 గ్రీన్ ఎక్స్‌ప్రెస్‌వేలకు సంబంధించి ఇప్పటికే ఏడు ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయని.. సుమారు రూ.1 లక్ష కోట్లతో తలపెట్టిన ఢిల్లీ–ముంబై ఎక్స్‌ప్రెస్‌వే కూడా వీటిలో ఉందని ఆయన తెలిపారు. ‘వ్యూహాత్మక టనెల్స్, వంతెనలు, హైవేలు వంటి కీలక ఇన్‌ఫ్రా ప్రాజెక్టులు అమలవుతున్న వేగం చూస్తుంటే వచ్చే రెండేళ్లలో భారత్ ముఖ స్వరూపం మారిపోతుందని ధీమాగా చెప్పవచ్చు. అమెరికా, బ్రిటన్, జర్మనీ, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో కనిపించే రహదారులు, టన్నెల్స్, వంతెనలు మొదలైన వాటిని మన దేశంలో కూడా చూడవచ్చు‘ అని గడ్కరీ చెప్పారు.
2 నెలల్లో జోజిలా టన్నెల్ పనులు ప్రారంభం...
జమ్మూకశ్మీర్‌కి సంబంధించి దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న జీ–మోర్ టన్నెల్ ప్రాజెక్టుకు అనుమతులు మంజూరు చేసినట్లు, త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభం కానున్నట్లు మంత్రి చెప్పారు. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం సుమారు రూ. 2,379 కోట్లు. సాధారణంగా చలికాలంలో భారీగా మంచు కురుస్తుండటం వల్ల జమ్మూకశ్మీర్‌లోని కొన్ని ప్రాంతాల్లో రహదారులు మూసివేయాల్సి వస్తుంటుంది. అయితే, ఏడాది పొడవునా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా రవాణాకు అవరోధం లేకుండా చూసేందుకు జీ–మోర్, జోజిలా తదితర టన్నెల్స్ ఉపయోగపడనున్నాయి. జోజిలా టన్నెల్ పనులు రెండు నెలల్లో ప్రారంభమవుతాయని గడ్కరీ చెప్పారు. మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (ఎంఈఐఎల్) సంస్థ ఈ కాంట్రాక్టు దక్కించుకుంది. లార్సన్ అండ్ టూబ్రో, ఇర్కాన్ ఇంటర్నేషనల్ వంటి దిగ్గజాలు దీనికోసం పోటీపడ్డాయి.
Comments
Please login to add a commentAdd a comment