bridges construction
-
రూ.242 కోట్లతో కొత్తగా 16 వంతెనలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కొత్త వంతెనల నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణను వేగవంతం చేసింది. మొత్తం రూ.242.73 కోట్లతో 16 కొత్త వంతెనల నిర్మాణ ప్రణాళికను ఆమోదించింది. ఇప్పటికే మొదలైన వంతెనల పనులను పూర్తి చేయడంతోపాటు ఇంకా పనులు మొదలు పెట్టాల్సిన వంతెనల నిర్మాణానికి నిధుల సమస్య తలెత్తకుండా ప్రత్యామ్నాయ ప్రణాళికను రూపొందించింది. కోస్తా జిల్లాల పరిధిలోని ఏడు వంతెనలను ఎన్డీఆర్ఎఫ్ నిధులు రూ.137.03 కోట్లతోనూ, రాయలసీమ పరిధిలోని 9 వంతెనలను నాబార్డ్ నిధులు రూ.105.70 కోట్లతోనూ నిర్మించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆర్అండ్బీ శాఖ ప్రతిపాదనలకు ఆర్థికశాఖ ఆమోదించడంతో వంతెనల నిర్మాణం వేగవంతం కానుంది. -
రహదారులపై ప్రధానంగా దృష్టి
న్యూఢిల్లీ: రహదారుల నిర్మాణం వంటి కీలకమైన మౌలిక సదుపాయాల కల్పనపై కేంద్రం ప్రధానంగా దృష్టి పెడుతోందని కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. 22 ఎక్స్‌ప్రెస్‌వేలతో పాటు అసంఖ్యాకంగా వ్యూహాత్మక టనెల్స్, వంతెనలు నిర్మిస్తున్న నేపథ్యంలో రాబోయే రెండేళ్లలో అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా వంటి సంపన్న దేశాల సరసన భారత్ కూడా నిలవగలదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. దాదాపు రూ. 3.10 లక్షల కోట్ల వ్యయంతో వీటిని నిర్మిస్తున్నట్లు గడ్కరీ పేర్కొన్నారు. మధ్యప్రదేశ్‌లో సుమారు రూ. 8,250 కోట్ల వ్యయంతో చంబల్ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణానికి సంబంధించిన చర్చలు తుది దశలో ఉన్నాయని, రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో చేపడుతున్న ఈ తరహా ప్రాజెక్టుల్లో ఇదే మొదటిది కాగలదని ఆయన వివరించారు. విద్యుత్ పంపిణీ వ్యవస్థను పటిష్టం చేసేందుకు విద్యుత్ శాఖ, ఆప్టికల్ ఫైబర్ కేబుల్ నెట్‌వర్క్‌ను విస్తరించేందుకు ఐటీ శాఖ ప్రణాళికలను సిద్ధం చేస్తున్నాయని, అలాగే రహదారుల వెంబడి గ్యాస్ పైప్‌లైన్ నిర్మాణం కూడా జరగనుందని మంత్రి చెప్పారు. పర్యావరణ అనుకూల 22 గ్రీన్ ఎక్స్‌ప్రెస్‌వేలకు సంబంధించి ఇప్పటికే ఏడు ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయని.. సుమారు రూ.1 లక్ష కోట్లతో తలపెట్టిన ఢిల్లీ–ముంబై ఎక్స్‌ప్రెస్‌వే కూడా వీటిలో ఉందని ఆయన తెలిపారు. ‘వ్యూహాత్మక టనెల్స్, వంతెనలు, హైవేలు వంటి కీలక ఇన్ఫ్రా ప్రాజెక్టులు అమలవుతున్న వేగం చూస్తుంటే వచ్చే రెండేళ్లలో భారత్ ముఖ స్వరూపం మారిపోతుందని ధీమాగా చెప్పవచ్చు. అమెరికా, బ్రిటన్, జర్మనీ, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో కనిపించే రహదారులు, టన్నెల్స్, వంతెనలు మొదలైన వాటిని మన దేశంలో కూడా చూడవచ్చు‘ అని గడ్కరీ చెప్పారు. 2 నెలల్లో జోజిలా టన్నెల్ పనులు ప్రారంభం... జమ్మూకశ్మీర్‌కి సంబంధించి దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న జీ–మోర్ టన్నెల్ ప్రాజెక్టుకు అనుమతులు మంజూరు చేసినట్లు, త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభం కానున్నట్లు మంత్రి చెప్పారు. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం సుమారు రూ. 2,379 కోట్లు. సాధారణంగా చలికాలంలో భారీగా మంచు కురుస్తుండటం వల్ల జమ్మూకశ్మీర్‌లోని కొన్ని ప్రాంతాల్లో రహదారులు మూసివేయాల్సి వస్తుంటుంది. అయితే, ఏడాది పొడవునా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా రవాణాకు అవరోధం లేకుండా చూసేందుకు జీ–మోర్, జోజిలా తదితర టన్నెల్స్ ఉపయోగపడనున్నాయి. జోజిలా టన్నెల్ పనులు రెండు నెలల్లో ప్రారంభమవుతాయని గడ్కరీ చెప్పారు. మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (ఎంఈఐఎల్) సంస్థ ఈ కాంట్రాక్టు దక్కించుకుంది. లార్సన్ అండ్ టూబ్రో, ఇర్కాన్ ఇంటర్నేషనల్ వంటి దిగ్గజాలు దీనికోసం పోటీపడ్డాయి. -
అంతులేని జాప్యం
- నత్తనడకన హెచ్చెల్సీ ఆధునికీకరణ - అర్ధంతరంగా ఆగిన బ్రిడ్జిల నిర్మాణం - నేటికీ ప్రారంభం కాని యూటీ పనులు జిల్లాకు వరదాయని అయిన తుంగభద్ర ప్రధాన ఎగువ కాలువ (హెచ్చెల్సీ) ఆధునికీకరణపై నిర్లక్ష్యపు నీడలు కమ్ముకున్నాయి. తాగు, సాగు నీరందించే ఈ కాలువ గురించి రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. పనుల గడువు పొడిగించుకుంటూనే వెళ్తున్నారు. ఇప్పటికి మూడుసార్లు పొడిగించినా పురోగతి మాత్రం కన్పించడం లేదు. కణేకల్లు (రాయదుర్గం) : హెచ్చెల్సీ ఆధునికీకరణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. కాంట్రాక్టర్లు అలసత్వం చూపుతుండటంతో అనుకున్న పురోగతి కన్పించడం లేదు. కాలువ శిథిలావస్థకు చేరుకుని సాగునీటి సరఫరాకు అడుగడుగునా అవాంతరాలు ఎదురవుతుండటంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హెచ్చెల్సీ ఆధునికీకరణకు రూ.475 కోట్లు మంజూరు చేశారు. 2,400 క్యూసెక్కుల ప్రవాహ సామర్థ్యమున్న కాలువను 4,200 క్యూసెక్కులకు పెంచుతూ కాలువను వెడల్పు చేయాలని నిర్ణయించారు. ఆధునికీకరణ పనులను ఆరు ప్యాకేజీలుగా విభజించారు. 2008లో పనులు ప్రారంభమయ్యాయి. 2012లోనే పూర్తి కావాల్సి ఉండేది. ఆది నుంచి కాంట్రాక్టర్లు నిర్లక్ష్యం చేస్తూనే ఉన్నారు. హెచ్చెల్సీకి నీరు బంద్ అయిన వెంటనే పనులు ప్రారంభించకపోవడమే ఇందుకు కారణం. నీరు బంద్ అయిన రెండు, మూడు నెలలకు పనులు ప్రారంభించి.. జూలై రెండో వారం వరకు అడపాదడపా చేసి చేతులు దులిపేసుకుంటున్నారు. వీటి గురించి జిల్లా మంత్రులు, చీఫ్ విప్, ఎమ్మెల్యేలు సైతం పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి. కాంట్రాక్టర్ల కోరిక మేరకు ప్రభుత్వం ఇప్పటి వరకు మూడు సార్లు గడువు ఇచ్చింది. ఆగస్టు 2018లోగా పనులు పూర్తి చేయాలని తుది గడువు విధించింది. ఈ తొమ్మిదేళ్లలో ఒక్కో ప్యాకేజీలో 60 శాతం పనులు కూడా పూర్తి కాలేదు. ఈ నేపథ్యంలో తుది గడువులోపు కూడా పూర్తి కావడం అనుమానంగానే కన్పిస్తోంది. అసంపూర్తిగా బ్రిడ్జిలు హెచ్చెల్సీ వ్యవస్థలో కీలకమైన అండర్ టన్నెళ్లు (యూటీ), బ్రిడ్జిలు, అక్విడెక్ట్ పనుల్లో ఏమాత్రమూ పురోగతి లేదు. కొందరు కాంట్రాక్టర్లు బ్రిడ్జి పనులను ప్రారంభించారు. ఇవి కూడా పిల్లర్ల స్థాయిలో ఆగిపోయాయి. ఇప్పటి వరకు ఏ బ్రిడ్జి కూడా పూర్తిగా రూపుదిద్దుకోలేదు. ఇక యూటీ పనులు ఏ ఒక్కటీ ప్రారంభించలేదు. పాత యూటీలను తొలగిస్తే కొత్త వాటిని ఏమాత్రమూ ఆలస్యం చేయకుండా పూర్తి చేయాల్సి ఉంటుంది. కాలువకు నీరొచ్చే సమయానికే పూర్తి కావాలి. దీంతో కాలువకు నీరు బంద్ అయిన వెంటనే పనులు చేపట్టాలని హెచ్చెల్సీ ఉన్నతాధికారులు ఆదేశిస్తున్నా కాంట్రాక్టర్లు మాత్రం పట్టించుకోవడం లేదు. ప్రస్తుత పరిస్థితులను చూస్తే ఈ ఏడాది కూడా యూటీ పనులు జరగవనే తెలుస్తోంది. డిస్ట్రిబ్యూటరీలదీ అదే పరిస్థితి 2, 3 ప్యాకేజీల్లో డిస్ట్రిబ్యూటరీ పనులపై ప్రధాన కాంట్రాక్టర్లు నిర్లక్ష్యం చేయడంతో వాటిని హెచ్చెల్సీ అధికారులు ఎస్ఆర్ కంపెనీకి అప్పగించారు. రెండో ప్యాకేజీలో 2ఏ, 3వ డిస్ట్రిబ్యూటరీ పనులు, మూడో ప్యాకేజీలో 4, 5, 6బీ, 6బీ1ఆర్ డిస్ట్రిబ్యూటరీ పనులను ఎస్ఆర్ కంపెనీతో చేయిస్తున్నారు. నాల్గో ప్యాకేజీలో ప్రధాన కాంట్రాక్టర్ 7, 8వ డిస్ట్రిబ్యూటరీ పనులను పూర్తి చేశారు. మెయిన్ కెనాల్ లైనింగ్ పనులు 96 శాతం వరకు జరిగాయి. ఒకటో ప్యాకేజీలో కురువళ్లి, 2వ డిస్ట్రిబ్యూటరీ పనులు ప్రారంభం కాగా.. ఒకటో డిస్ట్రిబ్యూటరీ పనులు నేటికీ మొదలు కాలేదు. ప్యాకేజీ సంఖ్య నిధుల కేటాయింపు కేటాయించిన కి.మీలు పనిశాతం 1 రూ.65.55 కోట్లు 10 54 2 రూ.77.96 కోట్లు 15 52 3 రూ.69.92 కోట్లు 14 46 4 రూ.108 కోట్లు 18 58 5 రూ.66.655 కోట్లు 10 27 6 రూ.87.55 కోట్లు 17.50 52 గడువులోగా పూర్తి చేస్తాం కొన్ని ప్యాకేజీలకు జూన్, మరికొన్ని ప్యాకేజీలకు ఆగస్టు 2018 వరకు గడువు ఇచ్చాం. పనులను పర్యవేక్షిస్తున్న డీఈఈలతో 15రోజులకోసారి ప్రొగ్రెస్ రిపోర్ట్ తీసుకుంటున్నాం. పనులు వేగవంతమయ్యేలా చూస్తున్నాం. కాంట్రాక్టర్లకు మరోసారి గడువు ఇచ్చేది ఉండదు. యూటీ పనులు చేయాలనుకుంటే ఆలస్యం లేకుండా ప్రారంభించాలని సూచించాం. - కె.వెంకటరమణారెడ్డి, హెచ్చెల్సీ ఈఈ -
‘నీళ్ల’ వంతెనలు!
* నీటి నిల్వకు ఉపయోగపడేలా బ్రిడ్జీల నిర్మాణానికి సర్కారు నిర్ణయం * బహుళ ప్రయోజనకరంగా నమూనాల రూపకల్పన * నిలిచే నీరు సాగు, తాగు అవసరాలకు వినియోగం * మహారాష్ట్ర, కర్ణాటక తరహాలో అమలు సాక్షి, హైదరాబాద్: సాధారణంగా ఆనకట్టలు (రిజర్వాయర్లు) నీటిని నిల్వచేస్తాయి.. వాగులు, వంకల్లో చెక్‌డ్యాంలు ఆ పనిచేస్తాయి. కానీ ఇక ముందు రాష్ట్రంలోని సాధారణ వంతెనలూ నీటిని నిల్వ చేయనున్నాయి.. వానలు పడినప్పుడు నిలిచిన నీటితో సమీపంలోని సాగు, తాగు అవసరాలను తీర్చనున్నాయి. మహారాష్ట్ర, కర్ణాటకల్లో విజయవంతంగా అమలవుతున్న ఈ విధానాన్ని రాష్ట్రంలో అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో నీటి ఎద్దడిని తీర్చేందుకు ఇది దోహదపడగలదని భావిస్తోంది. ఈ మేరకు కొత్తగా నిర్మించనున్న అన్ని వంతెనల డిజైన్లను ఇందుకు అనుగుణంగా మార్చాలని రోడ్లు, భవనాల శాఖ(ఆర్ అండ్ బీ)ను ఆదేశించింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 360 వంతెనలను కొత్తగా నిర్మించేపనిలో ఉన్న ఆర్ అండ్ బీ శాఖ... వాటి డిజైన్లను మార్చే పని మొదలుపెట్టింది. ఈ మేరకు ఆ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తాజాగా ఆదేశాలు జారీ చేశారు. మంగళవారం నుంచి పిలవబోయే టెండర్లను ఆపి కొత్త డిజైన్ సిద్ధం చేసి టెండర్లు పిలవాలని సూచించారు. మంజీరా నదిపై ఓ వంతెన నిర్మాణానికి సోమవారం పిలవాల్సిన టెండర్‌ను కూడా నిలిపివేయించారు. ప్రయోజనాలెన్నో.. జోరు వానలప్పుడు నిండుగా కనిపించే చిన్న నదీపాయలు, వాగులు, వంకలు ఆ తర్వాత వట్టిపోయి ఎడారిని తలపిస్తాయి. దాంతో దగ్గరలో నీటి నిల్వ ఉండదు, భూగర్భ జలాలూ తగ్గిపోతాయి. ఇది తీవ్ర నీటి ఎద్దడికి కారణమవుతోంది. ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోవడానికి మహారాష్ట్ర, కర్ణాటకల్లో వంతెనలను నీటి నిల్వ నమూనాలో నిర్మిస్తున్నారు. దానివల్ల ఆయా ప్రాంతాల్లో నీళ్లు నిలిచి కొంత కాలంపాటు ఐదారు గ్రామాలకు సాగునీరు, తాగునీటిని సరఫరా చేసే అవకాశం ఉంటుంది. భూగర్భజలాలు పెరిగి బోర్లు వట్టిపోయే ప్రమాదమూ తప్పుతుంది. ఇదే తరహాలో రాష్ట్రంలో కృష్ణా, గోదావరి మినహా అన్ని ఉప నదులు, ప్రధాన వాగులపై నిర్మించే వంతెనలను బహుళ ప్రయోజనకరంగా నిర్మించాలని సర్కారు నిర్ణయించింది. అయితే డిజైన్ మార్పు వల్ల వంతెనల నిర్మాణ వ్యయం పెరుగుతుంది. ఈ మేరకు అదనంగా అయ్యే నిధులను అవసరమైతే నీటిపారుదల శాఖ నుంచి మళ్లించాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. సీఎంతో మంత్రి తుమ్మల భేటీ సందర్భంగా ఈ మేరకు హామీ ఇవ్వడంతో వంతెనల డిజైన్ల మార్పునకు రోడ్లు భవనాల శాఖ చకచకా ఏర్పాట్లు చేస్తోంది. కనీసం 500 మీటర్ల మేర చెక్‌డ్యాంలు లేని ప్రాంతాల్లో నిర్మించే వంతెనలన్నింటిని ఈ నమూనాలోకి మార్చనున్నారు. పంచాయతీరాజ్ శాఖ చేపట్టే వంతెనలకు కూడా దీన్ని వర్తింపజేయనున్నారు. వీలైనన్ని చోట్ల.. రోడ్డు అనుసంధానాన్ని మెరుగుపర్చడంతో పాటు నదులు, వాగులపై వీలైనన్ని ఎక్కువ వంతెనలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులోభాగంగా రాష్ట్రవ్యాప్తంగా 360 వంతెనలకు అనుమతినిచ్చింది. వీటికి దాదాపు రూ. 2 వేల కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా. అందులో ఈ ఏడాది రూ.400 కోట్లతో 61 వంతెనల నిర్మాణం మొదలైంది. ఈ వంతెనలను ప్రస్తుత అంచనా వ్యయానికి 30 శాతం అదనపు వ్యయంతో బహుళ ప్రయోజనకరంగా మార్చవచ్చు. ఈ లెక్కన రూ.400 కోట్లతో చేపట్టిన వంతెనలకు దాదాపు రూ.520 కోట్లు అవుతాయి. కానీ కొత్తగా చెక్‌డ్యాంలు కట్టే అవసరం ఉండదు. నీటి నిల్వ, ఇతర ప్రయోజనాలూ ఎక్కువ.