‘నీళ్ల’ వంతెనలు!
* నీటి నిల్వకు ఉపయోగపడేలా బ్రిడ్జీల నిర్మాణానికి సర్కారు నిర్ణయం
* బహుళ ప్రయోజనకరంగా నమూనాల రూపకల్పన
* నిలిచే నీరు సాగు, తాగు అవసరాలకు వినియోగం
* మహారాష్ట్ర, కర్ణాటక తరహాలో అమలు
సాక్షి, హైదరాబాద్: సాధారణంగా ఆనకట్టలు (రిజర్వాయర్లు) నీటిని నిల్వచేస్తాయి.. వాగులు, వంకల్లో చెక్‌డ్యాంలు ఆ పనిచేస్తాయి.
కానీ ఇక ముందు రాష్ట్రంలోని సాధారణ వంతెనలూ నీటిని నిల్వ చేయనున్నాయి.. వానలు పడినప్పుడు నిలిచిన నీటితో సమీపంలోని సాగు, తాగు అవసరాలను తీర్చనున్నాయి. మహారాష్ట్ర, కర్ణాటకల్లో విజయవంతంగా అమలవుతున్న ఈ విధానాన్ని రాష్ట్రంలో అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో నీటి ఎద్దడిని తీర్చేందుకు ఇది దోహదపడగలదని భావిస్తోంది. ఈ మేరకు కొత్తగా నిర్మించనున్న అన్ని వంతెనల డిజైన్‌లను ఇందుకు అనుగుణంగా మార్చాలని రోడ్లు, భవనాల శాఖ(ఆర్ అండ్ బీ)ను ఆదేశించింది.
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 360 వంతెనలను కొత్తగా నిర్మించేపనిలో ఉన్న ఆర్ అండ్ బీ శాఖ... వాటి డిజైన్లను మార్చే పని మొదలుపెట్టింది. ఈ మేరకు ఆ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తాజాగా ఆదేశాలు జారీ చేశారు. మంగళవారం నుంచి పిలవబోయే టెండర్లను ఆపి కొత్త డిజైన్ సిద్ధం చేసి టెండర్లు పిలవాలని సూచించారు. మంజీరా నదిపై ఓ వంతెన నిర్మాణానికి సోమవారం పిలవాల్సిన టెండర్‌ను కూడా నిలిపివేయించారు.
ప్రయోజనాలెన్నో..
జోరు వానలప్పుడు నిండుగా కనిపించే చిన్న నదీపాయలు, వాగులు, వంకలు ఆ తర్వాత వట్టిపోయి ఎడారిని తలపిస్తాయి. దాంతో దగ్గరలో నీటి నిల్వ ఉండదు, భూగర్భ జలాలూ తగ్గిపోతాయి. ఇది తీవ్ర నీటి ఎద్దడికి కారణమవుతోంది. ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోవడానికి మహారాష్ట్ర, కర్ణాటకల్లో వంతెనలను నీటి నిల్వ నమూనాలో నిర్మిస్తున్నారు. దానివల్ల ఆయా ప్రాంతాల్లో నీళ్లు నిలిచి కొంత కాలంపాటు ఐదారు గ్రామాలకు సాగునీరు, తాగునీటిని సరఫరా చేసే అవకాశం ఉంటుంది.
భూగర్భజలాలు పెరిగి బోర్లు వట్టిపోయే ప్రమాదమూ తప్పుతుంది. ఇదే తరహాలో రాష్ట్రంలో కృష్ణా, గోదావరి మినహా అన్ని ఉప నదులు, ప్రధాన వాగులపై నిర్మించే వంతెనలను బహుళ ప్రయోజనకరంగా నిర్మించాలని సర్కారు నిర్ణయించింది. అయితే డిజైన్ మార్పు వల్ల వంతెనల నిర్మాణ వ్యయం పెరుగుతుంది.
ఈ మేరకు అదనంగా అయ్యే నిధులను అవసరమైతే నీటిపారుదల శాఖ నుంచి మళ్లించాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. సీఎంతో మంత్రి తుమ్మల భేటీ సందర్భంగా ఈ మేరకు హామీ ఇవ్వడంతో వంతెనల డిజైన్ల మార్పునకు రోడ్లు భవనాల శాఖ చకచకా ఏర్పాట్లు చేస్తోంది. కనీసం 500 మీటర్ల మేర చెక్‌డ్యాంలు లేని ప్రాంతాల్లో నిర్మించే వంతెనలన్నింటిని ఈ నమూనాలోకి మార్చనున్నారు. పంచాయతీరాజ్ శాఖ చేపట్టే వంతెనలకు కూడా దీన్ని వర్తింపజేయనున్నారు.
వీలైనన్ని చోట్ల..
రోడ్డు అనుసంధానాన్ని మెరుగుపర్చడంతో పాటు నదులు, వాగులపై వీలైనన్ని ఎక్కువ వంతెనలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులోభాగంగా రాష్ట్రవ్యాప్తంగా 360 వంతెనలకు అనుమతినిచ్చింది. వీటికి దాదాపు రూ. 2 వేల కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా. అందులో ఈ ఏడాది రూ.400 కోట్లతో 61 వంతెనల నిర్మాణం మొదలైంది.
ఈ వంతెనలను ప్రస్తుత అంచనా వ్యయానికి 30 శాతం అదనపు వ్యయంతో బహుళ ప్రయోజనకరంగా మార్చవచ్చు. ఈ లెక్కన రూ.400 కోట్లతో చేపట్టిన వంతెనలకు దాదాపు రూ.520 కోట్లు అవుతాయి. కానీ కొత్తగా చెక్‌డ్యాంలు కట్టే అవసరం ఉండదు. నీటి నిల్వ, ఇతర ప్రయోజనాలూ ఎక్కువ.