ఈ ఏడాది 173 టీఎంసీల లభ్యత ఉంటుందని తుంగభద్ర బోర్డు అంచనా
సాక్షి, అమరావతి: ప్రస్తుత నీటి సంవత్సరం ప్రారంభంలో తుంగభద్ర బోర్డు అంచనా వేసిన 173 టీఎంసీల కంటే తుంగభద్ర డ్యామ్‌లో నీటి లభ్యత అధికంగా ఉండే అవకాశం ఉందని సాగునీటిరంగ నిపుణులు చెబుతుండటంతో ఆయకట్టు రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 2019, 2020, 2021, 2022 తరహాలోనే రాష్ట్రానికి దక్కాల్సిన వాటా నీటిని విడుదల చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
గతేడాది డ్యామ్‌లోకి కేవలం 114.58 టీఎంసీల ప్రవాహమే వచ్చినా.. రాష్ట్రానికి గరిష్ఠ స్థాయిలో నీటిని రాబట్టి ఆయకట్టు రైతుల ప్రయోజనాలను ప్రభుత్వం పరిరక్షించిందని గుర్తుచేస్తున్నారు. జూన్ 1 నుంచి శుక్రవారం ఉదయం 6 గంటల వరకు తుంగభద్ర డ్యామ్‌లోకి 249.02 టీఎంసీల ప్రవాహం వచ్చి0ది.
ఇందులో 104.70 టీఎంసీలను డ్యామ్‌లో నిల్వచేసి.. కాలువలకు 25 టీఎంసీలు విడుదల చేసి.. మిగిలిన 120 టీఎంసీలను గేట్లు ఎత్తి దిగువకు వదిలేశారు. తుంగభద్ర డ్యామ్‌లోకి నవంబర్ చివరి వరకు వరద ప్రవాహం కొనసాగుతుంది. ఈలెక్కన డ్యామ్‌లో నీటి లభ్యత బోర్డు అంచనా వేసిన 173 టీఎంసీల కంటే అధికంగా ఉంటుందని సాగునీటిరంగ నిపుణులు చెబుతున్నారు.
కోటా నీటిని రాబడితేనే రైతులకు ప్రయోజనం
తుంగభద్ర డ్యామ్‌లో 230 టీఎంసీల లభ్యత ఉంటుందని అంచనా వేసిన బచావత్ ట్రిబ్యునల్.. కర్ణాటకకు 151.49, ఏపీకి 72 (హెచ్చెల్సీ 32.50, ఎల్లెల్సీ 29.50, కేసీ 10.00), తెలంగాణకు 6.51 (రాజోలిబండ డైవర్షన్ స్కీం) టీఎంసీల చొప్పున కేటాయించింది. ఏటా పూడిక పేరుకుపోతుండటంతో డ్యామ్ నిల్వ సామర్థ్యం తగ్గుతూ వస్తోంది. 2016లో నిర్వహించిన సర్వేలో డ్యామ్ సామర్థ్యం 105.78 టీఎంసీలని తేలింది. తగ్గిన నిల్వ సామర్థ్యం, నీటిలభ్యత ఆధారంగా దామాషా పద్ధతిలో మూడు రాష్ట్రాలకు తుంగభద్ర బోర్డు పంపిణీ చేస్తూ వస్తోంది.
2019–20, 2020–21, 2021–22, 2022–23, 2023–24ల్లో తుంగభద్ర బోర్డు చరిత్రలో అత్యధిక స్థాయిలో రాష్ట్ర కోటా కింద హెచ్చెల్సీ, ఎల్లెల్సీ, కేసీ కెనాల్ వాటాను రాబట్టిన ప్రభుత్వం రైతుల ప్రయోజనాలను పరిరక్షించింది. నాలుగేళ్లు ఏటా సగటున 69 టీఎంసీలను బోర్డు నుంచి ప్రభుత్వం విడుదల చేయించింది.
గతేడాది తుంగభద్ర డ్యామ్‌లోకి కేవలం 114.58 టీఎంసీల ప్రవాహమే వచ్చినా.. 40 టీఎంసీలు రాష్ట్రానికి దక్కేలా చేసి రైతుల ప్రయోజనాలను పరిరక్షించింది. ఈ ఏడాది నీటి లభ్యత పెరిగిన నేపథ్యంలో 2019–23 మధ్య తరహాలోనే ఇప్పుడూ గరిష్ఠంగా నీటి వాటాను రాబట్టి ప్రయోజనాలను పరిరక్షించాలని రైతులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment