R & B Department
-
పెదపలకలూరు రోడ్డుకు త్వరలోనే మోక్షం
సాక్షి ప్రతినిధి, గుంటూరు: గుంటూరు నుంచి పెదపలకలూరు వెళ్లే రోడ్డుకు త్వరలో మోక్షం కలగనుంది. ప్రస్తుతం 40 నుంచి 55 అడుగుల మేర మాత్రమే ఉన్న ఈ రోడ్డును మాస్టర్ ప్లాన్ ప్రకారం 80 అడుగులకు విస్తరించేందుకు అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. టీడీపీ హయాంలో ఈ రోడ్డు పూర్తి నిర్లక్ష్యానికి గురైంది. ట్రాఫిక్ రద్దీ అధికంగా ఉన్నప్పటికీ టీడీపీ ప్రభుత్వం ఈ రోడ్డును అభివృద్ధి చేసిన పాపాన పోలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని మాస్టర్ ప్లాన్ ప్రకారం 80 అడుగుల రోడ్డుగా విస్తరించాలని నిర్ణయించింది. దీనికి ఆర్ అండ్ బీ నుంచి నిధులు మంజూరు చేయించి, కాంట్రాక్టర్‌ను కూడా ఖరారు చేశారు. ఇటీవలే గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ చేకూరి శ్రీకీర్తి ఆర్ అండ్ బీ ఎస్ఈతో సమావేశమై రోడ్డు నిర్మాణంపై చర్చించారు. రోడ్డు విస్తరణ వల్ల భవనాలను కోల్పోయే వారికి నష్టపరిహారం చెల్లింపునకు కూడా ఏర్పాట్లు చేశారు. డీపీఆర్ పూర్తయి భూ సేకరణ దశలో ఉన్న ఈ రోడ్డు పనులు మరో వారం, పది రోజుల్లో ప్రారంభించనున్నందున తాత్కాలిక మరమ్మతులు చేపట్టలేదు. అయితే, ఈ వాస్తవాలను విస్మరించి ‘ఈనాడు’ ‘ఇదీ రహదారే’ శీర్షికన తప్పుడు కథనం ప్రచురించింది. అధికారుల మధ్య సమన్వయ లోపమని అందులో పేర్కొంది. ఇదే నిజమైతే.. ఈ రహదారి విస్తరణ పనుల వల్ల ఎన్ని భవనాలకు నష్టం వాటిల్లుతుంది, ఎంతమేర నష్టపరిహారం చెల్లించాలి, ఎన్ని టీడీఆర్ బాండ్లు జారీ చేయాలనే అంశం కొలిక్కి రావడం, నష్టపోయే 57 మందిలో ఇప్పటికే 38 మంది భూములిచ్చేందుకు ముందుకొచ్చి అంగీకార పత్రాలు ఇవ్వడం, మిగిలిన వారు కూడా ముందుకొచ్చేందుకు సన్నద్ధం కావడం ఎలా సాధ్యమవుతుంది. కాగా, రహదారి విషయంలో నగరపాలక సంస్థ, ఆర్ అండ్ బీ అధికారుల మధ్య ఎలాంటి సమన్వయ లోపం లేదని, ఇప్పటికే అనేకమార్లు రెండు విభాగాల అధికారులు సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు నగరపాలక సంస్థ కమిషనర్ చేకూరి కీర్తి చెప్పారు. 2 వారాల్లో రోడ్డుకు ఇరువైపులా డ్రెయిన్ నిర్మాణం కూడా ప్రారంభిస్తున్నామని తెలిపారు. కాగా, ఈ రోడ్డుపై ఆర్ అండ్ బీ అధికారులు ఇప్పటికే తాత్కాలిక మరమ్మతులు కూడా చేపట్టారు. -
పోలీసు శాఖకురూ.6,465 కోట్లు
సాక్షి, హైదరాబాద్: పోలీసు శాఖకు గతేడాది కంటే నిర్వహణ వ్యయం పెరిగింది. పెరిగిన ధరలు, ఉద్యోగుల సంఖ్య, వారికి చెల్లించాల్సిన వేతనాలతో ఈసారి హోంశాఖ బడ్జెట్లో పెరుగుదల నమోదైంది. గతేడాది రూ.5,852 కోట్లుగా ఉన్న బడ్జెట్ ఈసారి ఏకంగా రూ.6,465 కోట్లకు చేరింది. అంటే గతేడాది కంటే దాదాపు రూ.586 కోట్లు పెరగడం గమనార్హం. గతేడాది దాదాపు 11 వేల మంది కానిస్టేబుళ్లు, 1,200 వరకు ఎస్సైలు, 11 మంది ఐపీఎస్‌లు కొత్తగా డిపార్ట్మెంటులో చేరారు. ఈసారి మరో ఐదుగురు ఐపీఎస్ అధికారులు, దాదాపు 4 వేల మంది స్టేట్ స్పెషల్ పోలీసులు విధుల్లో చేరనున్నారు. దీనికి తోడు త్వరలో దాదాపు 20 వేల మంది పోలీసు ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇందులో దాదాపు 19 వేలకు పైగా కానిస్టేబుల్ పోలీసులు కాగా, దాదాపు 450 వరకు సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులున్నాయి. వీటన్నింటినీ ఈసారి భర్తీ చేస్తామని ఇటీవల సీఎం, హోంమంత్రి వేర్వేరు సందర్భాల్లో తెలిపారు. ఈ పోస్టులు తప్పకుండా భర్తీ చేస్తామని ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ మంత్రులు పునరుద్ఘాటించడంతో అభ్యర్థుల్లో ఆశలు చిగురించాయి. కానీ, ఈ విషయాన్ని బడ్జెట్లో ప్రత్యేకంగా ప్రస్తావించలేదు. మూడు ప్రధాన కమిషనరేట్లయిన హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లకు కలిపి రూ.266.47 కోట్ల ప్రగతి పద్దు కేటాయించారు. రాష్ట్రంలో భద్రత కోసం ఇప్పటికే 6.65 లక్షల సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. అలాగే ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కమాండ్ కంట్రోల్ రూం కోసం రూ.125 కోట్లు కేటాయించింది. రీజినల్ రింగురోడ్డుకు రూ.750 కోట్లు సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ చుట్టూ ఔటర్ రింగురోడ్డుకు 30 కి.మీ. ఆవల 334 కి.మీ. నిడివితో ప్రతిపాదించిన రీజినల్ రింగురోడ్డుకు బడ్జెట్లో రూ.750 కోట్లు కేటాయించారు. ఈ రింగురోడ్డుకు సంబంధించి సంగారెడ్డి నుంచి చౌటుప్పల్ వరకు తొలి భాగానికి ఇటీవలే కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపిన విషయం తెలిసిందే. ఆ రోడ్డు నిర్మాణానికి కావాల్సిన భూసేకరణకు అధికారులు ఇప్పటికే కసరత్తు ప్రారంభించారు. ఇక రాష్ట్ర రహదారుల మరమ్మతులకు రూ.800 కోట్లు ఇచ్చారు. ఇటీవలి వర్షాలకు దెబ్బతిన్న రోడ్లను మెరుగుపరుస్తారు. జిల్లా కలెక్టర్, పోలీసు కార్యాలయ భవనాలు, హైదరాబాద్ లోని పోలీసు కమాండ్ కంట్రోల్ కేంద్ర భవనానికి రూ.725 కోట్లు ప్రతిపాదించారు. ద్వితీయశ్రేణి నగరాల్లో నిర్మించనున్న ఎయిర్‌స్ట్రిప్‌ల కోసం రూ.100 కోట్లు ప్రతిపాదించారు. మొత్తంగా రోడ్లు భవనాల శాఖకు రూ.8,788 కోట్లను ప్రతిపాదించింది. పర్యాటకానికి రూ.726 కోట్లు గత బడ్జెట్లో పర్యాటకశాఖను పట్టించుకోని ప్రభుత్వం ఈసారి రూ.726 కోట్లు ఇచ్చింది. ఇందులో కాళేశ్వరం ఆధారంగా అభివృద్ధి చేసే టూరిజం సర్క్యూట్ ఉంది. హెరిటేజ్ తెలంగాణకు ఈసారి కూడా నిరాశే మిగిలింది. ఇక అర్చకుల సంక్షేమం, ఆలయాల అభివృద్ధికి రూ.720 కోట్లు ఇచ్చారు. -
రిసెప్షన్ వేడుకకు హాజరైన వైఎస్ జగన్
సాక్షి, విజయవాడ : రాష్ట్ర రవాణ శాఖ, ఆర్ అండ్ బి ముఖ్యకార్యదర్శి కృష్ణబాబు కుమారుడి రిసెప్షన్ వేడుక విజయవాడలోని ఎస్.ఎస్.కన్వెన్షన్ హాల్లో గురువారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా రిసెప్షన్ వేడుకకు హాజరైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నూతన వధూ వరులు స్వరూప్, సోనాలి జంటను ఆశీర్వదించారు. కాగా వైఎస్ జగన్ వెంట మంత్రులు కొడాలి నాని, ధర్మాన కృష్ణదాస్, ఎమ్మెల్యేలు ఆళ్ల రామకృష్ణ రెడ్డి, జోగి రమేశ్, భూమన కరుణాకర్‌రెడ్డి, పార్థసారధి, పలువురు అధికారులు ఉన్నారు. -
రోడ్లన్నీ అతుకుల బొంతలే
సాక్షి, చీమకుర్తి(ప్రకాశం) : రూ.25 కోట్లతో 7 కి.మీ దూరం నిర్మించిన ఫోర్‌లైన్ రోడ్డు నిర్మాణం పూర్తయి రెండు మూడు నెలలు కూడా కాలేదు. అప్పుడే పగుళ్లు ఇచ్చాయి. వాటిని కనపడకుండా పైపైన సిమెంట్‌తో మాసికలు వేస్తూ వాటిని క్యూరింగ్ చేసేందుకు గోనెపట్టలతో కప్పేశారు. ఇదీ ఒంగోలు బైపాస్ నుంచి ఎస్ఎస్ఎన్ ఇంజినీరింగ్ కాలేజీ సమీపం వరకు కర్నూల్‌రోడ్డులో నిర్మించిన ఫోర్‌లైన్ రోడ్డు నిర్మాణం పరిస్థితి. కర్నూల్ రోడ్డులోని నవభారత్ బిల్డింగ్స్ సమీపంలో 1/750వ కి.మీ రాయి నుంచి 8/250వ కి.మీ రాయి వరకు నిండా 7 కి.మీ కూడా లేని ఫోర్‌లైన్ రోడ్డు నిర్మాణంలో మొదటి నుంచి నాణ్యతా లోపాలు ఉన్నాయి. అంతే కాకుండా ఫోర్‌లైన్ రోడ్డు నిర్మించే సమయంలో రోడ్డు మీదున్న ట్రాన్స్ఫార్మర్లు విద్యుత్ స్తంభాలు, ఆక్రమణలు తీయకుండా వాటిని వదిలేసి మిగిలిన ప్రాంతాల్లో రోడ్డు నిర్మించారు. ఆ తర్వాత ట్రాన్స్ఫార్మర్లు, ఆక్రమణలను తాపీగా తొలగించి ఆయా ప్రదేశాల్లో ముందు వేసిన సిమెంట్ రోడ్డుకు ఆనించి సిమెంట్‌రోడ్డు వేయటం వలన జాయింట్ల వద్ద అతుకులు కలవక పగుళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇలాంటి సంఘటనలు రోడ్డు మీద పలు చోట్ల ఉండటంతో రోడ్డు ఫోర్‌లైన్ కొత్తగా వేసినట్లు లేదని, అతుకులు గతుకుల రోడ్డుగా పాత రోడ్డుకు ప్యాచ్ వర్క్ చేసినట్లుగా ఉందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దానికి తగ్గట్టుగానే రోడ్డు నిర్మాణంలో స్థలాభావంతో పేర్నమిట్టలో ఫోర్‌లైన్ నిర్మించలేదు. అదే విధంగా క్విస్ హైస్కూలు సమీపంలో రోడ్డు మార్జిన్లో స్థలం యజమాని కోర్టుకు వెళ్లటంతో ఫోర్‌లైన్ నిర్మాణానికి సరిపోక డబుల్‌వేతో పరిపెట్టి ఎగువన, దిగువన ఫోర్‌లైన్ నిర్మించి అధికారులు, కాంట్రాక్టర్లు చేతులు దులుపుకున్నారు. డబుల్‌వే వద్ద మాత్రం ఫోర్‌లైన్ నుంచి నేరుగా అదే సెన్స్‌తో వేగంగా వచ్చే వాహనదారులకు ప్రమాదం జరగకుండా రోడ్డు మార్జిన్లో బారికేడ్లను ఏర్పాటు చేసి డేంజర్ సిగ్నల్స్‌ను అమర్చి మీ చావు మీరు చావండన్నట్లుగా అధికారులు వదిలేశారనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇక ఒంగోలు నుంచి ఫోర్‌లైన్ ప్రారంభమయ్యే ప్రదేశంలో రోడ్డు మార్జిన్లకు, సైడు కాలువలకు కూడా స్థలం లేకపోవడంతో ఇళ్లను ఆనించి మరీ ఫోర్‌లైన్ నిర్మించారు. రేపు వర్షాకాలంలో వచ్చే వరద నీరు ఎటుపోవాలోనని స్థానికలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక రోడ్డు నిర్మాణంలో డివైడర్ల ఏర్పాటులో వాస్తవానికి స్థానికంగా దొరికే మట్టితో నింపాలి. మున్సిపల్ కార్పొరేషన్ వారు మంచి మట్టి పోసి చెట్లు పెంచుతామన్నారని చెప్పినట్లుగా సాకుతో డివైడర్ల మధ్య మట్టిపోయకుండా దాదాపు ఏడాదికి పైగా రోడ్డు నిర్మాణం పూర్తయినా అలాగే ఖాళీగా ఉంచారు. ఇలా రూ.25 కోట్లతో నిర్మించిన ఫోర్‌లైన్ రోడ్డు నిర్మాణంలోని అవకతవకలను ఇంజినీరింగ్ అధికారులు పర్యవేక్షణా లోపం, ప్రభుత్వ ఒత్తిడిల కారణంగానే రోడ్డు నిర్మాణం లోపభూయిష్టంగా ఉందనే విమర్శలు స్థానిక ప్రజల నుంచి వ్యక్తం అవుతున్నాయి. -
అబ్బే.. అలాంటిదేం లేదు!
సాక్షి, హైదరాబాద్: మిడ్‌మానేరు ప్రాజెక్టు పరిహార మదింపు, గృహ పరిహార మదింపులో ఎలాంటి అక్రమాలూ జరగలేదని అటవీ, ఆర్అండ్బీ శాఖల సంయుక్త అధికారుల బృందం తేల్చిచెప్పింది. చట్టాలకు అనుగుణంగానే పరిహార మదింపు చేశామని, ఎక్కడా అక్రమాలు జరగలేదని స్పష్టం చేసింది. పూర్తి స్థాయిలో చెల్లించిన పరిహారం, పరిహార చెల్లింపు ఆలస్యాన్ని పరిగణనలోకి తీసుకుని వడ్డీతో సహా చెల్లించడంతో వ్యయం పెరిగిందని నివేదిక ఇచ్చింది. ఇదే రీతిన రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సైతం నివేదిక ఇచ్చినట్లు సమాచారం. అక్రమాలేవీ జరగలేదు.. మిడ్‌మానేరు ప్రాజెక్టుతో అనాపురం, సంకెపల్లి, చింతలతానా, చీర్లవంచ, కుదురుపాక, నీలోజిపల్లి, వర్దవెల్లి, శాభాజ్‌పల్లి, రుద్రారం, కోడిముంజ గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. ఈ గ్రామాల్లో ముంపు కారణంగా 6,829 గృహాలకు పరిహారం చెల్లించాల్సి ఉండగా, రెండు దఫాలుగా 4,864 గృహాలకు రూ.536 కోట్లు చెల్లింపులు చేశారు. అయితే గృహ నిర్మాణ పరిహారం చెల్లింపుల్లో అవకతవకలకు సంబంధించి 2009లోనే ఆరోపణలు వచ్చాయి. ఇందులో శాభాజ్‌పల్లి కూడా ఉండటంతో గతంలోనే విచారణ జరిపి అధికారులపై చర్యలు తీసుకున్నారు. అనంతరం ఇదే గ్రామంలోని గృహాల పరిహారంపై ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. ఈ గ్రామంలో 7 గృహాల పరిహారాన్ని పరిశీలిస్తే.. 2008లో గృహాల పరిహారాన్ని రూ.35.10 లక్షలుగా నిర్ణయించగా, తాజాగా దానిని రూ.4.85 కోట్లుగా నిర్ధారించినట్లు బయట పడింది. గృహ నిర్మాణ వయసు నిర్ధారించడం, కలప వినియోగాన్ని లెక్కించడం, భూమి విలువను లెక్కించడంలో ఆర్అండ్బీ, రెవెన్యూ, అటవీ అధికారులు అక్రమాలకు పాల్పడినట్లుగా ఆరోపణలు వచ్చాయి. దీనిపై ప్రభుత్వం సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌తో పాటు అటవీ, ఆర్అండ్బీ అధికారుల సంయుక్త సాంకేతిక అధికారుల బృందంచే విచారణ జరిపించింది. ఈ అధికారుల బృందం ఇటీవల నీటి పారుదల శాఖకు నివేదిక సమర్పించింది. ఈ నివేదిక ప్రకారం.. ‘శాభాజ్‌పల్లిలో గృహాల పరిహారాన్ని వాస్తవానికి 2009లో విలువ కట్టారు. అయితే 2017లో తిరిగి గృహాల పరిహార మదింపు చేశారు. ప్రభుత్వం తెచ్చిన కొత్త మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రతి గృహానికి 100 శాతం పరిహారం చెల్లించడంతో పాటు ఆగస్టు 2009 నుంచి ఆగస్టు 2010 వరకు 9 శాతం వడ్డీ, 2010 నుంచి 2017 జూలై వరకు 15 శాతం వడ్డీతో సహా చెల్లించాలని నిర్ణయం జరిగింది. దీనికి తగ్గట్టుగా గృహాల పరిహారాన్ని సవరించి ధరలు నిర్ణయం చేశారు. ఈ కారణంగానే పరిహార వ్యయం పెరిగింది’అని నివేదికలో పేర్కొన్నారు. సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సైతం ఇదే మాదిరిగా నివేదిక ఇచ్చారని అందులో తెలిపారు. అయితే ఈ అక్రమాలపై పూర్తి స్థాయి విచారణకు నీటి పారుదల శాఖ ఈ కేసును విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్కు సిఫార్సు చేయడం గమనార్హం. -
నత్తకు నడకలు
► ముందుకు సాగని పుష్కర పనులు ► అధికారుల అలసత్వానికి తోడు వర్షాలు ► జూలై 15 నాటికి పూర్తి కావడం గగనమే ► అన్ని శాఖల అధికారులతో నేడు సీఎం సమీక్ష సాక్షి, అమరావతి: కృష్ణా పుష్కరాలకు గడువు ముంచుకొస్తోంది. ఎక్కడికక్కడ అధికారులు, పాలకులు హడావుడి చేస్తున్నారు. దీనికి తగ్గట్టుగా పనులు మాత్రం ముందు కు కదలడం లేదు. ప్రస్తుతం వర్షాలు కురుస్తుండడంతో రోడ్ల నిర్మాణ పనులకు మరింత అడ్డంకులు ఏర్పడుతున్నాయి. పుష్కర ఘాట్లకు వెళ్లే ప్రధాన రహదారుల పనులు ఆర్అండ్బీ శాఖ ఆధ్వర్యంలో చేపట్టారు. 83 పనులకు రూ.170 కోట్లతో మే పదో తేదీ నాటికే టెండర్ల ప్రక్రియ పూర్తి చేశారు. అప్పటి నుంచి పనులు ప్రారంభించినప్పటికీ ఇంత వరకు పది శాతం పనులు కూడా పూర్తి కాలేదు. జూలై 15 నాటికి పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. ప్రస్తుతం పనులు సాగుతున్న తీరు చూస్తుంటే పుష్కరాల నాటికి పూర్తవడం కష్టమేనని అధికారులు చెబుతున్నారు. ప్రధానంగా గుంటూరు- అమరావతి, సత్తెనపల్లె-మాదిపాడు రోడ్లలను వెడల్పు చేస్తున్నారు. క్రోసూరు-అమరావతి, సత్తెనపల్లె-అమరావతి, తుళ్లూరు-అమరావతి, దుగ్గిరాల-కొల్లిపర, తెనాలి-వెల్లటూరు రోడ్లలను పటిష్ట పరుస్తున్నారు. అప్రోచ్ రోడ్లదీ అదే తీరు గురజాల నుంచి రేపల్లె వరకు ఘాట్లకు వెళ్లే అప్రోచ్ రోడ్లను పంచాయతీరాజ్ శాఖ పర్యవేక్షిస్తోంది. 58 పనులకు రూ.42 కోట్లతో పనులకు టెండర్లు పిలిచారు. ఈ పనులు కేవలం 20 శాతం మాత్రమే పూర్తయ్యాయి. పుష్కర ఘాట్ల పనులను నీటి పారుదల శాఖ చేపట్టింది. 80 ఘాట్లను రూ.109 కోట్లతో నిర్మిస్తున్నారు. ఈ పనులూ నత్తనడకన సాగుతున్నాయి. ప్రకాశం బ్యారేజీ కింద భాగంలోని మూడు ప్రధాన ఘాట్ల పనులు ఇప్పటికీ ప్రారంభం కాలేదు. నేడు సమీక్ష... రెండు జిల్లాలో పుష్కర పనులపై అన్ని శాఖల అధికాారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం విజయవాడలో సమీక్షించనున్నారు. నోట్: ప్రారంభంకాని సత్తెనపల్లె-మాదినపాడు రోడ్డు పనులు ఫోటోను సత్తెనపల్లె రిపోర్టర్ శ్రీనివాస్ పంపుతారు. -
ఆర్‌అండ్‌బీపై తమ్ముళ్ల పెత్తనం
► బిట్లు బిట్లుగా విభజించి పనులకు టెండర్ల ప్రక్రియ ► ఆన్లైన్లో సింగిల్ టెండర్‌కు టీడీపీ నేతల విశ్వప్రయత్నాలు ► ఒక్కో పనికి ఒకటికి మించి అదనంగా దాఖలైన టెండర్లు ► గతనెల 29వ తేదీ ఆఖరు.. నేటికీ ప్రకటించని అధికారులు ► మింగుడు పడక ఈ టెండర్లను రద్దు చేయించే యత్నం పొదలకూరు : ఆర్అండ్బీ శాఖ అధికారులు తమ్ముళ్ల పెత్తనం పెరిగింది. రాజకీయాలకు సంబంధం లేని చేపట్టే రూ.కోట్లాది పనుల వివరాలను ఆ శాఖ అధికారులు తెలుగు తమ్ముళ్ల నోటీసుకు తీసుకుని వెళ్లాల్సి వస్తోంది. టెండర్ల దగ్గర నుంచి పనులు ప్రారంభించేంత వరకు అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లో నిర్వహించాలనే వారు అధికారులపై ఒత్తిడి తెస్తుండటతో సతమతమవుతున్నారు. ఇప్పటి వరకు ఈ పరిస్థితి పంచాయతీరాజ్శాఖకే ఉండేది. కొత్తగా ఆర్‌అండ్‌బీకు సైతం పాకింది. పొదలకూరు ఆర్అండ్బీ సబ్‌డివిజన్ పరిధిలో ఆ శాఖ ఇంజనీరింగ్ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. పొదలకూరులోని రామనగర్గేటు సెం టర్లో ఎఫ్డీఆర్ రూ.50 లక్షల సిమెంటురోడ్ పనులను తమ్ముళ్లు నామినేటెడ్ కింద దక్కించుకుని చేపడుతున్నారు. సంగం-పొదలకూరు మార్గంలో రెండు బిట్లు, మనుబోలు-పొదలకూరు మార్గంలో ఒక బిట్ ఆర్అండ్బీ డబుల్ రోడ్ల నిర్మాణం టెండర్ల ప్రక్రియ పూర్తగా గోల్మాల్ జరిగినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. టెండర్ల ప్రక్రియ నచ్చని టీడీపీ నాయకులు జగిరిన టెండర్లను రద్దు చేయించే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. దీనికి కారణం తమకు అనుకూలం గా టెండర్ల ప్రక్రియ జరగలేదనే అక్కసుతోనే ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకుని వచ్చి జరిగిన టెండర్లను రద్దుచేయించి మళ్లీ కొత్తగా టెండర్లను పిలిచే ప్రయత్నాలు సాగుతున్నట్టు ప్రచారంఉంది. గతంలో సంగం-పొదలకూరు మార్గంలో 0 నుంచి 10 కిలోమీటర్ వరకు నాబార్డు నిధులు రూ.7 కోట్లతో టెండర్లప్రక్రియ పూర్తయినా పనులు మాత్రం ప్రారంభం కాలేదు. తర్వాత రూ.8.9 కోట్లతో రెండు బిట్లుగా 10/0 నుంచి 15/0 వరకు రూ.3.9 కోట్లు, 16/100 నుంచి 23/4 వరకు రూ.5 కోట్లతో అంచనాలు రూపొందించి గతనెల 29న టెండర్ల ప్రక్రియను పూర్తి చేశారు. అయితే ఈ పనులకు సింగిల్ టెండర్లను వేయించాలని టీడీపీ నేతలు విశ్వప్రయత్నం చేశారు. వారి ప్రయత్నాలు బెడిసి కొట్టి ఒకటి కంటే అదనంగా టెండర్లు ఆన్లైన్లో పడ్డాయి. దీంతో టీడీపీ నేతలు టెండర్లను రద్దుచేయించే యోచనలో ఉన్నారు. అయితే గతనెల 29న వేసిన టెండర్లను ఆర్అండ్బీ అధికారులు కూడా ఇప్పటివరకు తెరిచి పనులను ప్రకటించలేదు. మనుబోలు-పొదలకూరు మార్గంలో 15/0 నుంచి 18/0 వరకు డబుల్‌రోడ్డు నిర్మాణం కోసం రూ.3 కోట్లతో అధికారులు అంచనాలు రూపొందించారు. ఈ పనులకు సైతం 29నే టెండర్ల ప్రక్రియ జరిగింది. అయితే నేతల ప్రయత్నాలు ఫలించి రూ.3కోట్ల పనికి సింగిల్ టెండరే పడింది. దీంతో శాంతించిన నేతలు ఈ పనులను మాత్రం దక్కించుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. పనులు తమ అనునయులకు దక్కవనుకునే టెండర్లను మాత్రం టెండర్లను రద్దు చేయిస్తారనే ప్రచారం ఉంది. ఇందువల్ల పనులను చేపట్టడంలో జాప్యం జరుగుతోంది. ఇప్పటికే ఏళ్లతరబడి రోడ్ల పనులు జరక్క ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. టెండర్ల ప్రక్రియ పూర్తిచేశాం : -ఎల్.మాల్యాద్రి, డీఈ, పొదలకూరు సంగం-పొదలకూరు మార్గంలో రెండు బిట్లు రూ.8.9 కోట్లు, మనుబోలు-పొదలకూరు మార్గంలో రూ.3 కోట్లతో డబుల్‌రోడ్ల నిర్మాణ పనులకు టెండర్ల ప్రక్రియను పూర్తి చేశాము. ఇంకా టెండర్లను తెరిచి పనులను అప్పగించలేదు. ఎస్ఈ స్థాయిలో టెండర్లను తెరిచే ప్రక్రియ జరుగుతుంది. -
‘నీళ్ల’ వంతెనలు!
* నీటి నిల్వకు ఉపయోగపడేలా బ్రిడ్జీల నిర్మాణానికి సర్కారు నిర్ణయం * బహుళ ప్రయోజనకరంగా నమూనాల రూపకల్పన * నిలిచే నీరు సాగు, తాగు అవసరాలకు వినియోగం * మహారాష్ట్ర, కర్ణాటక తరహాలో అమలు సాక్షి, హైదరాబాద్: సాధారణంగా ఆనకట్టలు (రిజర్వాయర్లు) నీటిని నిల్వచేస్తాయి.. వాగులు, వంకల్లో చెక్‌డ్యాంలు ఆ పనిచేస్తాయి. కానీ ఇక ముందు రాష్ట్రంలోని సాధారణ వంతెనలూ నీటిని నిల్వ చేయనున్నాయి.. వానలు పడినప్పుడు నిలిచిన నీటితో సమీపంలోని సాగు, తాగు అవసరాలను తీర్చనున్నాయి. మహారాష్ట్ర, కర్ణాటకల్లో విజయవంతంగా అమలవుతున్న ఈ విధానాన్ని రాష్ట్రంలో అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో నీటి ఎద్దడిని తీర్చేందుకు ఇది దోహదపడగలదని భావిస్తోంది. ఈ మేరకు కొత్తగా నిర్మించనున్న అన్ని వంతెనల డిజైన్లను ఇందుకు అనుగుణంగా మార్చాలని రోడ్లు, భవనాల శాఖ(ఆర్ అండ్ బీ)ను ఆదేశించింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 360 వంతెనలను కొత్తగా నిర్మించేపనిలో ఉన్న ఆర్ అండ్ బీ శాఖ... వాటి డిజైన్లను మార్చే పని మొదలుపెట్టింది. ఈ మేరకు ఆ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తాజాగా ఆదేశాలు జారీ చేశారు. మంగళవారం నుంచి పిలవబోయే టెండర్లను ఆపి కొత్త డిజైన్ సిద్ధం చేసి టెండర్లు పిలవాలని సూచించారు. మంజీరా నదిపై ఓ వంతెన నిర్మాణానికి సోమవారం పిలవాల్సిన టెండర్‌ను కూడా నిలిపివేయించారు. ప్రయోజనాలెన్నో.. జోరు వానలప్పుడు నిండుగా కనిపించే చిన్న నదీపాయలు, వాగులు, వంకలు ఆ తర్వాత వట్టిపోయి ఎడారిని తలపిస్తాయి. దాంతో దగ్గరలో నీటి నిల్వ ఉండదు, భూగర్భ జలాలూ తగ్గిపోతాయి. ఇది తీవ్ర నీటి ఎద్దడికి కారణమవుతోంది. ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోవడానికి మహారాష్ట్ర, కర్ణాటకల్లో వంతెనలను నీటి నిల్వ నమూనాలో నిర్మిస్తున్నారు. దానివల్ల ఆయా ప్రాంతాల్లో నీళ్లు నిలిచి కొంత కాలంపాటు ఐదారు గ్రామాలకు సాగునీరు, తాగునీటిని సరఫరా చేసే అవకాశం ఉంటుంది. భూగర్భజలాలు పెరిగి బోర్లు వట్టిపోయే ప్రమాదమూ తప్పుతుంది. ఇదే తరహాలో రాష్ట్రంలో కృష్ణా, గోదావరి మినహా అన్ని ఉప నదులు, ప్రధాన వాగులపై నిర్మించే వంతెనలను బహుళ ప్రయోజనకరంగా నిర్మించాలని సర్కారు నిర్ణయించింది. అయితే డిజైన్ మార్పు వల్ల వంతెనల నిర్మాణ వ్యయం పెరుగుతుంది. ఈ మేరకు అదనంగా అయ్యే నిధులను అవసరమైతే నీటిపారుదల శాఖ నుంచి మళ్లించాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. సీఎంతో మంత్రి తుమ్మల భేటీ సందర్భంగా ఈ మేరకు హామీ ఇవ్వడంతో వంతెనల డిజైన్ల మార్పునకు రోడ్లు భవనాల శాఖ చకచకా ఏర్పాట్లు చేస్తోంది. కనీసం 500 మీటర్ల మేర చెక్‌డ్యాంలు లేని ప్రాంతాల్లో నిర్మించే వంతెనలన్నింటిని ఈ నమూనాలోకి మార్చనున్నారు. పంచాయతీరాజ్ శాఖ చేపట్టే వంతెనలకు కూడా దీన్ని వర్తింపజేయనున్నారు. వీలైనన్ని చోట్ల.. రోడ్డు అనుసంధానాన్ని మెరుగుపర్చడంతో పాటు నదులు, వాగులపై వీలైనన్ని ఎక్కువ వంతెనలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులోభాగంగా రాష్ట్రవ్యాప్తంగా 360 వంతెనలకు అనుమతినిచ్చింది. వీటికి దాదాపు రూ. 2 వేల కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా. అందులో ఈ ఏడాది రూ.400 కోట్లతో 61 వంతెనల నిర్మాణం మొదలైంది. ఈ వంతెనలను ప్రస్తుత అంచనా వ్యయానికి 30 శాతం అదనపు వ్యయంతో బహుళ ప్రయోజనకరంగా మార్చవచ్చు. ఈ లెక్కన రూ.400 కోట్లతో చేపట్టిన వంతెనలకు దాదాపు రూ.520 కోట్లు అవుతాయి. కానీ కొత్తగా చెక్‌డ్యాంలు కట్టే అవసరం ఉండదు. నీటి నిల్వ, ఇతర ప్రయోజనాలూ ఎక్కువ. -
కాగితం వంతెనలు
ఏలూరు : జిల్లాలోని 15 ప్రధాన ప్రాంతాల్లో రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబీ)ల నిర్మాణానికి దశాబ్దాల తరబడి ప్రతిపాదనలు చేస్తున్నా బుట్టదాఖలవుతున్నాయి. కాగితాలకే పరిమి తం అవుతున్న వీటిని ఈ ప్రాంత ప్రజలు ముద్దుగా కాగితం వంతెనలు అని పిలిచుకుంటున్నారు. దక్షిణ మధ్య రైల్వేకు జిల్లా నుంచి భారీగా ఆదాయం సమకూరుతున్నా ఈ ప్రాం తంపై ఆ శాఖ అధికారులు శీతకన్ను వేస్తున్నారు. ప్రధాన రహదారులపై ఉన్న రైల్వే లెవెల్ క్రాసింగ్‌ల వద్ద ట్రాఫిక్ సమస్యను నివారించేందుకు ఆర్వోబీలను నిర్మించడం లేదు. జిల్లా వ్యాప్తంగా 15చోట్ల వీటి నిర్మాణాలకు ఐదు దశాబ్దాలుగా ఆర్ అండ్ బీ శాఖ నుంచి తరచూ ప్రతిపాదనలు వెళుతున్నా ఒక్కదానికి కూడా నేటికీ గ్రీన్‌సిగ్నల్ రాలేదు. కనీసం ఏడాదికి ఒక్క ఆర్వోబీ నిర్మాణానికి నిధులిచ్చినా ఏనాడో వీటి నిర్మాణాలు పూర్తయ్యేవి. ఇవీ ప్రతిపాదనలు ఏలూరు మార్కెట్ యార్డు, భీమడోలు లెవెల్ క్రాసింగ్-368, చేబ్రోలు లెవెల్ క్రాసింగ్-365, బాదంపూడి-ఉంగుటూరు, ప్రత్తిపాడు-ఆరుగొలను, నవాబ్‌పాలెం, ఆకివీడు-ఉండి, ఉండి-భీమవరం, భీమవరం-మంచిలి, శృంగవృక్షం-పాలకొల్లు, నరసాపురం లెవెల్ క్రాసింగ్, భీమవరం (బైపాస్ రోడ్డు), ఏలూరు పవర్‌పేట, నిడదవోలు, కైకరం రైల్వే లెవెల్ క్రాసింగ్ వద్ద ఆర్వోబీల నిర్మాణానికి ఎన్నోసార్లు ప్రతిపాదనలు వెళాలయి. వీటిలో కేవలం నిడదవోలు, ఏలూరు పవర్‌పేట లెవెల్ క్రాసింగ్‌ల వద్ద లైన్ అలైన్‌మెంట్‌ను పరి శీలించారు. కాగా అంచనా వ్యయం తడిసిమోపెడు కావడంతో నిర్మాణాలకు వెనుకంజ వేస్తున్నారు. ఒక్కొక్క వంతెన నిర్మాణానికి సగటున రూ.40 కోట్ల అవుతుందని గతంలో అంచనా వేస్తే ఆ మొత్తం రూ.600 కోట్లకు దాటిపోయింది. మూడేళ్ల క్రితం వట్లూరులో ఆర్వోబీ మంజూరు కాగా, అధికారులు ఇటీవల పనులను ప్రారంభింపచేశారు. నిత్యం ప్రమాదాలే రైల్వే లెవెల్ క్రాసింగ్‌ల వద్ద ట్రాఫిక్ సమస్య రోజురోజుకు జఠిలం అవుతోంది. ఆర్వోబీల నిర్మాణానికి ప్రతిపాదించిన 15 రైల్వే క్రాసింగ్‌లు ప్రధాన రహదారులపైనే ఉన్నాయి. అక్కడ ఐదేసి నిమిషాలకు ఒకసారి రైల్వే గేట్లు వేయడం వల్ల కిలోమీటర్ల కొద్దీ ట్రా ఫిక్ నిలచిపోతోంది. వివిధ పనులపై వెళ్లేవారు, విధులకు హాజరయ్యే ఉద్యోగులు, పాఠశాలలకు వెళ్లే చిన్నారులు సమయాభావం వల్ల గేటు వేసినా కిందనుంచి రాకపోకలు సాగిస్తూ మృత్యువాత పడుతున్నారు. తరచూ ఏదో ఒకచోట రైలు దాటుతూ విగతజీవులు అవుతున్న ఘటనలు నమోదవుతున్నాయి. ఇలాంటి ప్రమాదాలను నిర్మూలించి ప్రయాణాలు సాఫీగా సాగాలంటే ఆర్వోబీల నిర్మాణమే శరణ్యమ ని అధికారులు నెత్తీనోరూ బాదుకుంటున్నారు. అరుునా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. ప్రజాప్రతినిధులూ.. పట్టించుకోరే ఆర్వోబీల నిర్మాణానికి రైల్వేశాఖ, రాష్ట్ర ప్రభుత్వం (ఆర్ అండ్ బీ) నిర్ధేశించిన మేరకు సకాలంలో వాటా నిధులను విడుదల చేస్తేనే వాటికి మోక్షం కలుగుతుంది. రైల్వేశాఖ కేవలం రైల్వేగేటు వరకు మాత్రమే నిర్మాణాలకు నిధులిస్తోంది. వంతెన పూర్తిచేయడంతోపాటు అటూఇటూ అప్రోచ్ రోడ్ల నిర్మాణానికి అధిక శాతం నిధులను ఆర్ అండ్ బీ శాఖ వెచ్చించాల్సి ఉంటుంది. వీటిని మంజూరు చేయించే విషయంలో పార్లమెంట్ సభ్యులు, రాజ్యసభ సభ్యులు శ్రద్ధ చూపడం లేదు. -
ప్రభుత్వ స్థలం కబ్జాకు విఫలయత్నం
లంగర్‌హౌస్, న్యూస్‌లైన్: నకిలీ పత్రాలు సృష్టించి రూ. 5 కోట్లు విలువ చేసే భూమిని కాజేసేందుకు కొందరు ప్రయత్నం చేశారు. కబ్జాదారులను ‘సాక్షి’ ప్రతినిధులు అడ్డుకోవడంతో వారు పరారయ్యారు. వివరాల్లోకి వెళితే.. ఆసిఫ్‌నగర్ మండల పరిధిలోని మొఘల్‌నగర్ రింగ్‌రోడ్ వద్ద అత్తాపూర్ వెళ్లే దారిలో పీవీ నర్సింహారావు ఎక్స్‌ప్రెస్‌వే పిల్లర్ నెంబర్-110 ఎదురుగా విద్యుత్‌సబ్‌స్టేషన్ ఆనుకొని సర్వే నెంబర్ 503/ఎ/1/2లో 1200 గజాల ప్రభుత్వ స్థలం ఉంది. దీని విలువ రూ. 5 కోట్లు ఉంటుంది. విద్యుత్ సబ్‌స్టేషన్ పరిధిలో ఉన్న ఈ స్థలాన్ని 1982లో టోల్గేట్ భవనం, రోడ్డు నిర్మాణం వసూళ్ల కోసం ఆర్అండ్బీ శాఖకు ప్రభుత్వం అందజేసింది. కొన్నేళ్లుగా ఖాళీగా ఉన్న ఈ స్థలంపై కొందరి కన్ను పడింది. బినామీ పేర్లతో తప్పుడు పత్రాలు సృష్టించి వివిధ శాఖల ఉన్నతాధికారులతో కుమ్మక్కై ఈ స్థలాన్ని కాజేయడానికి ప్రయత్నిస్తున్నారు. గతంలో ఆర్అండ్బీ శాఖ అధికారులు ఈ కబ్జా విషయమై పలువురిని సంప్రదించినా ప్రయోజనం లేకుండా పోయింది. అయితే తాజాగా వివిధ ఉన్నతాధికారులకు కొంత ముట్టజెప్పి బడాబాబుల అండదండలతో ఈ స్థలాన్ని కబ్జా చేసేందుకు ఆదివారం ప్రయత్నించారు. ఆ ప్రాంతంలో నిర్మాణ పనులు ప్రారంభించారు. సమాచారం అందుకున్న ‘సాక్షి’ ప్రతినిధి అక్కడికి చేరుకొని అక్రమ నిర్మాణాలను చిత్రీకరిస్తుండటంతో కొందరు అడ్డుకుని.. ఉన్నతాధికారులకు ఫోన్ చేశారు. వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో కబ్జాదారులు అక్కడి నుంచి పారిపోయారు. విషయం తెలుసుకున్న లంగర్‌హౌస్ ఇన్స్పెక్టర్ ఎన్.బి.రత్నం, అదనపు ఇన్స్పెక్టర్ వెంకట్, ఎస్ఐ మహేష్‌గౌడ్ అక్కడికి చేరుకొని నిర్మాణ పనులు చేస్తున్న వారిని పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. అనంతరం దీనిపై ఆర్అండ్బీ ఏఈ ధరణిదాస్రెడ్డి, ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని పోలీసులు కబ్జాదారుల కోసం గాలిస్తున్నారు. పాత బస్తీకి చెందిన అన్వర్ ఈ స్థలం నకిలీ పత్రాలను సృష్టించారని, కొందరు పెద్దలు బినామీగా మహ్మద్ ఇబ్రహీంతో పాటు పలువురు ఈ స్థలాన్ని కాజేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ స్థల వివాదం కోర్టులో ఉందని ఆర్అండ్బీ అధికారులపై అనేకమార్లు కబ్జాదారులు దాడికి ప్రయత్నించారని ఆయన పేర్కొన్నారు. గత 20 రోజుల క్రితం అందరూ చూస్తుండగా మొఘల్‌నగర్ రింగ్‌రోడ్ వద్ద దాడి చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.