లంగర్‌హౌస్, న్యూస్‌లైన్: నకిలీ పత్రాలు సృష్టించి రూ. 5 కోట్లు విలువ చేసే భూమిని కాజేసేందుకు కొందరు ప్రయత్నం చేశారు. కబ్జాదారులను ‘సాక్షి’ ప్రతినిధులు అడ్డుకోవడంతో వారు పరారయ్యారు. వివరాల్లోకి వెళితే.. ఆసిఫ్‌నగర్ మండల పరిధిలోని మొఘల్‌నగర్ రింగ్‌రోడ్ వద్ద అత్తాపూర్ వెళ్లే దారిలో పీవీ నర్సింహారావు ఎక్స్‌ప్రెస్‌వే పిల్లర్ నెంబర్-110 ఎదురుగా విద్యుత్‌సబ్‌స్టేషన్ ఆనుకొని సర్వే నెంబర్ 503/ఎ/1/2లో 1200 గజాల ప్రభుత్వ స్థలం ఉంది. దీని విలువ రూ. 5 కోట్లు ఉంటుంది. విద్యుత్ సబ్‌స్టేషన్ పరిధిలో ఉన్న ఈ స్థలాన్ని 1982లో టోల్‌గేట్ భవనం, రోడ్డు నిర్మాణం వసూళ్ల కోసం ఆర్‌అండ్‌బీ శాఖకు ప్రభుత్వం అందజేసింది.
కొన్నేళ్లుగా ఖాళీగా ఉన్న ఈ స్థలంపై కొందరి కన్ను పడింది. బినామీ పేర్లతో తప్పుడు పత్రాలు సృష్టించి వివిధ శాఖల ఉన్నతాధికారులతో కుమ్మక్కై ఈ స్థలాన్ని కాజేయడానికి ప్రయత్నిస్తున్నారు. గతంలో ఆర్‌అండ్‌బీ శాఖ అధికారులు ఈ కబ్జా విషయమై పలువురిని సంప్రదించినా ప్రయోజనం లేకుండా పోయింది. అయితే తాజాగా వివిధ ఉన్నతాధికారులకు కొంత ముట్టజెప్పి బడాబాబుల అండదండలతో ఈ స్థలాన్ని కబ్జా చేసేందుకు ఆదివారం ప్రయత్నించారు. ఆ ప్రాంతంలో నిర్మాణ పనులు ప్రారంభించారు.
సమాచారం అందుకున్న ‘సాక్షి’ ప్రతినిధి అక్కడికి చేరుకొని అక్రమ నిర్మాణాలను చిత్రీకరిస్తుండటంతో కొందరు అడ్డుకుని.. ఉన్నతాధికారులకు ఫోన్ చేశారు. వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో కబ్జాదారులు అక్కడి నుంచి పారిపోయారు. విషయం తెలుసుకున్న లంగర్‌హౌస్ ఇన్‌స్పెక్టర్ ఎన్.బి.రత్నం, అదనపు ఇన్‌స్పెక్టర్ వెంకట్, ఎస్‌ఐ మహేష్‌గౌడ్ అక్కడికి చేరుకొని నిర్మాణ పనులు చేస్తున్న వారిని పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. అనంతరం దీనిపై ఆర్‌అండ్‌బీ ఏఈ ధరణిదాస్‌రెడ్డి, ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని పోలీసులు కబ్జాదారుల కోసం గాలిస్తున్నారు.
పాత బస్తీకి చెందిన అన్వర్ ఈ స్థలం నకిలీ పత్రాలను సృష్టించారని, కొందరు పెద్దలు బినామీగా మహ్మద్ ఇబ్రహీంతో పాటు పలువురు ఈ స్థలాన్ని కాజేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ స్థల వివాదం కోర్టులో ఉందని ఆర్‌అండ్‌బీ అధికారులపై అనేకమార్లు కబ్జాదారులు దాడికి ప్రయత్నించారని ఆయన పేర్కొన్నారు. గత 20 రోజుల క్రితం అందరూ చూస్తుండగా మొఘల్‌నగర్ రింగ్‌రోడ్ వద్ద దాడి చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
ప్రభుత్వ స్థలం కబ్జాకు విఫలయత్నం
Published Mon, Nov 18 2013 1:26 AM | Last Updated on Wed, Oct 3 2018 6:52 PM
Advertisement