నత్తకు నడకలు
► ముందుకు సాగని పుష్కర పనులు
► అధికారుల అలసత్వానికి తోడు వర్షాలు
► జూలై 15 నాటికి పూర్తి కావడం గగనమే
► అన్ని శాఖల అధికారులతో నేడు సీఎం సమీక్ష
సాక్షి, అమరావతి: కృష్ణా పుష్కరాలకు గడువు ముంచుకొస్తోంది. ఎక్కడికక్కడ అధికారులు, పాలకులు హడావుడి చేస్తున్నారు. దీనికి తగ్గట్టుగా పనులు మాత్రం ముందు కు కదలడం లేదు. ప్రస్తుతం వర్షాలు కురుస్తుండడంతో రోడ్ల నిర్మాణ పనులకు మరింత అడ్డంకులు ఏర్పడుతున్నాయి. పుష్కర ఘాట్‌లకు వెళ్లే ప్రధాన రహదారుల పనులు ఆర్‌అండ్‌బీ శాఖ ఆధ్వర్యంలో చేపట్టారు. 83 పనులకు రూ.170 కోట్లతో మే పదో తేదీ నాటికే టెండర్ల ప్రక్రియ పూర్తి చేశారు. అప్పటి నుంచి పనులు ప్రారంభించినప్పటికీ ఇంత వరకు పది శాతం పనులు కూడా పూర్తి కాలేదు.
జూలై 15 నాటికి పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. ప్రస్తుతం పనులు సాగుతున్న తీరు చూస్తుంటే పుష్కరాల నాటికి పూర్తవడం కష్టమేనని అధికారులు చెబుతున్నారు. ప్రధానంగా గుంటూరు- అమరావతి, సత్తెనపల్లె-మాదిపాడు రోడ్లలను వెడల్పు చేస్తున్నారు. క్రోసూరు-అమరావతి, సత్తెనపల్లె-అమరావతి, తుళ్లూరు-అమరావతి, దుగ్గిరాల-కొల్లిపర, తెనాలి-వెల్లటూరు రోడ్లలను పటిష్ట పరుస్తున్నారు.
అప్రోచ్ రోడ్లదీ అదే తీరు
గురజాల నుంచి రేపల్లె వరకు ఘాట్‌లకు వెళ్లే అప్రోచ్ రోడ్లను పంచాయతీరాజ్ శాఖ పర్యవేక్షిస్తోంది. 58 పనులకు రూ.42 కోట్లతో పనులకు టెండర్లు పిలిచారు. ఈ పనులు కేవలం 20 శాతం మాత్రమే పూర్తయ్యాయి. పుష్కర ఘాట్‌ల పనులను నీటి పారుదల శాఖ చేపట్టింది. 80 ఘాట్‌లను రూ.109 కోట్లతో నిర్మిస్తున్నారు. ఈ పనులూ నత్తనడకన సాగుతున్నాయి. ప్రకాశం బ్యారేజీ కింద భాగంలోని మూడు ప్రధాన ఘాట్ల పనులు ఇప్పటికీ ప్రారంభం కాలేదు.
నేడు సమీక్ష...
రెండు జిల్లాలో పుష్కర పనులపై అన్ని శాఖల అధికాారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం విజయవాడలో సమీక్షించనున్నారు.
నోట్: ప్రారంభంకాని సత్తెనపల్లె-మాదినపాడు రోడ్డు పనులు ఫోటోను సత్తెనపల్లె రిపోర్టర్ శ్రీనివాస్ పంపుతారు.