సాక్షి, హైదరాబాద్: మిడ్‌మానేరు ప్రాజెక్టు పరిహార మదింపు, గృహ పరిహార మదింపులో ఎలాంటి అక్రమాలూ జరగలేదని అటవీ, ఆర్‌అండ్‌బీ శాఖల సంయుక్త అధికారుల బృందం తేల్చిచెప్పింది. చట్టాలకు అనుగుణంగానే పరిహార మదింపు చేశామని, ఎక్కడా అక్రమాలు జరగలేదని స్పష్టం చేసింది. పూర్తి స్థాయిలో చెల్లించిన పరిహారం, పరిహార చెల్లింపు ఆలస్యాన్ని పరిగణనలోకి తీసుకుని వడ్డీతో సహా చెల్లించడంతో వ్యయం పెరిగిందని నివేదిక ఇచ్చింది. ఇదే రీతిన రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సైతం నివేదిక ఇచ్చినట్లు సమాచారం.
అక్రమాలేవీ జరగలేదు..
మిడ్‌మానేరు ప్రాజెక్టుతో అనాపురం, సంకెపల్లి, చింతలతానా, చీర్లవంచ, కుదురుపాక, నీలోజిపల్లి, వర్దవెల్లి, శాభాజ్‌పల్లి, రుద్రారం, కోడిముంజ గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. ఈ గ్రామాల్లో ముంపు కారణంగా 6,829 గృహాలకు పరిహారం చెల్లించాల్సి ఉండగా, రెండు దఫాలుగా 4,864 గృహాలకు రూ.536 కోట్లు చెల్లింపులు చేశారు. అయితే గృహ నిర్మాణ పరిహారం చెల్లింపుల్లో అవకతవకలకు సంబంధించి 2009లోనే ఆరోపణలు వచ్చాయి. ఇందులో శాభాజ్‌పల్లి కూడా ఉండటంతో గతంలోనే విచారణ జరిపి అధికారులపై చర్యలు తీసుకున్నారు. అనంతరం ఇదే గ్రామంలోని గృహాల పరిహారంపై ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. ఈ గ్రామంలో 7 గృహాల పరిహారాన్ని పరిశీలిస్తే.. 2008లో గృహాల పరిహారాన్ని రూ.35.10 లక్షలుగా నిర్ణయించగా, తాజాగా దానిని రూ.4.85 కోట్లుగా నిర్ధారించినట్లు బయట పడింది.
గృహ నిర్మాణ వయసు నిర్ధారించడం, కలప వినియోగాన్ని లెక్కించడం, భూమి విలువను లెక్కించడంలో ఆర్‌అండ్‌బీ, రెవెన్యూ, అటవీ అధికారులు అక్రమాలకు పాల్పడినట్లుగా ఆరోపణలు వచ్చాయి. దీనిపై ప్రభుత్వం సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌తో పాటు అటవీ, ఆర్‌అండ్‌బీ అధికారుల సంయుక్త సాంకేతిక అధికారుల బృందంచే విచారణ జరిపించింది. ఈ అధికారుల బృందం ఇటీవల నీటి పారుదల శాఖకు నివేదిక సమర్పించింది. ఈ నివేదిక ప్రకారం.. ‘శాభాజ్‌పల్లిలో గృహాల పరిహారాన్ని వాస్తవానికి 2009లో విలువ కట్టారు.
అయితే 2017లో తిరిగి గృహాల పరిహార మదింపు చేశారు. ప్రభుత్వం తెచ్చిన కొత్త మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రతి గృహానికి 100 శాతం పరిహారం చెల్లించడంతో పాటు ఆగస్టు 2009 నుంచి ఆగస్టు 2010 వరకు 9 శాతం వడ్డీ, 2010 నుంచి 2017 జూలై వరకు 15 శాతం వడ్డీతో సహా చెల్లించాలని నిర్ణయం జరిగింది. దీనికి తగ్గట్టుగా గృహాల పరిహారాన్ని సవరించి ధరలు నిర్ణయం చేశారు. ఈ కారణంగానే పరిహార వ్యయం పెరిగింది’అని నివేదికలో పేర్కొన్నారు. సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సైతం ఇదే మాదిరిగా నివేదిక ఇచ్చారని అందులో తెలిపారు. అయితే ఈ అక్రమాలపై పూర్తి స్థాయి విచారణకు నీటి పారుదల శాఖ ఈ కేసును విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌కు సిఫార్సు చేయడం గమనార్హం.
అబ్బే.. అలాంటిదేం లేదు!
Published Wed, Dec 20 2017 1:36 AM | Last Updated on Fri, Aug 30 2019 8:19 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment