
సాక్షి ప్రతినిధి, గుంటూరు: గుంటూరు నుంచి పెదపలకలూరు వెళ్లే రోడ్డుకు త్వరలో మోక్షం కలగనుంది. ప్రస్తుతం 40 నుంచి 55 అడుగుల మేర మాత్రమే ఉన్న ఈ రోడ్డును మాస్టర్ ప్లాన్ ప్రకారం 80 అడుగులకు విస్తరించేందుకు అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. టీడీపీ హయాంలో ఈ రోడ్డు పూర్తి నిర్లక్ష్యానికి గురైంది. ట్రాఫిక్ రద్దీ అధికంగా ఉన్నప్పటికీ టీడీపీ ప్రభుత్వం ఈ రోడ్డును అభివృద్ధి చేసిన పాపాన పోలేదు.
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని మాస్టర్ ప్లాన్ ప్రకారం 80 అడుగుల రోడ్డుగా విస్తరించాలని నిర్ణయించింది. దీనికి ఆర్ అండ్ బీ నుంచి నిధులు మంజూరు చేయించి, కాంట్రాక్టర్‌ను కూడా ఖరారు చేశారు. ఇటీవలే గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ చేకూరి శ్రీకీర్తి ఆర్ అండ్ బీ ఎస్‌ఈతో సమావేశమై రోడ్డు నిర్మాణంపై చర్చించారు.
రోడ్డు విస్తరణ వల్ల భవనాలను కోల్పోయే వారికి నష్టపరిహారం చెల్లింపునకు కూడా ఏర్పాట్లు చేశారు. డీపీఆర్ పూర్తయి భూ సేకరణ దశలో ఉన్న ఈ రోడ్డు పనులు మరో వారం, పది రోజుల్లో ప్రారంభించనున్నందున తాత్కాలిక మరమ్మతులు చేపట్టలేదు. అయితే, ఈ వాస్తవాలను విస్మరించి ‘ఈనాడు’ ‘ఇదీ రహదారే’ శీర్షికన తప్పుడు కథనం ప్రచురించింది.
అధికారుల మధ్య సమన్వయ లోపమని అందులో పేర్కొంది. ఇదే నిజమైతే.. ఈ రహదారి విస్తరణ పనుల వల్ల ఎన్ని భవనాలకు నష్టం వాటిల్లుతుంది, ఎంతమేర నష్టపరిహారం చెల్లించాలి, ఎన్ని టీడీఆర్ బాండ్లు జారీ చేయాలనే అంశం కొలిక్కి రావడం, నష్టపోయే 57 మందిలో ఇప్పటికే 38 మంది భూములిచ్చేందుకు ముందుకొచ్చి అంగీకార పత్రాలు ఇవ్వడం, మిగిలిన వారు కూడా ముందుకొచ్చేందుకు సన్నద్ధం కావడం ఎలా సాధ్యమవుతుంది.
కాగా, రహదారి విషయంలో నగరపాలక సంస్థ, ఆర్ అండ్ బీ అధికారుల మధ్య ఎలాంటి సమన్వయ లోపం లేదని, ఇప్పటికే అనేకమార్లు రెండు విభాగాల అధికారులు సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు నగరపాలక సంస్థ కమిషనర్ చేకూరి కీర్తి చెప్పారు. 2 వారాల్లో రోడ్డుకు ఇరువైపులా డ్రెయిన్ నిర్మాణం కూడా ప్రారంభిస్తున్నామని తెలిపారు. కాగా, ఈ రోడ్డుపై ఆర్ అండ్ బీ అధికారులు ఇప్పటికే తాత్కాలిక మరమ్మతులు కూడా చేపట్టారు.