పింఛన్లకు ‘అధికార’ గ్రహణం | TDP leaders preventing authorities from giving pensions to many people | Sakshi
Sakshi News home page

పింఛన్లకు ‘అధికార’ గ్రహణం

Published Thu, Jul 4 2024 4:35 AM | Last Updated on Thu, Jul 4 2024 4:35 AM

శ్రీసత్యసాయి జిల్లా కలెక్టరేట్‌ వద్ద బైఠాయించిన రామగిరి మండలం ఎంసీపల్లి  పెన్షన్‌దారులు

శ్రీసత్యసాయి జిల్లా కలెక్టరేట్‌ వద్ద బైఠాయించిన రామగిరి మండలం ఎంసీపల్లి పెన్షన్‌దారులు

శ్రీసత్యసాయి జిల్లాలో పలువురికి పింఛన్లు నిలిపివేత

కాకినాడ జిల్లా ఎల్డీపేటలో 18 మందికి ఆపేసిన వైనం

టీడీపీ నేతల ఫిర్యాదులే కారణం

బత్తలపల్లి/గాండ్లపెంట/పుట్టపర్తి అర్బన్‌/కోటనందూరు: రాష్ట్రంలో పెన్షన్లకు ‘అధికార’ గ్రహణం పట్టింది. టీడీపీ నేతలు పలువురికి పెన్షన్లు ఇవ్వకుండా అధికారుల్ని అడ్డుకుంటున్నారు. వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులని చెప్పి అధికారులపై తీవ్ర ఒత్తిడి తెచ్చి అర్హులకు కూడా పింఛన్‌ నగదు అందకుండా చేస్తున్నారు. ఏళ్ల తరబడి వస్తున్న పింఛన్‌ను ఇప్పుడు ఇవ్వకపోవడంతో బాధితులు నిరసన తెలుపుతున్నారు. శ్రీసత్యసాయి జిల్లా బత్తలపల్లి మండలం మాల్యవంతం పంచాయతీ పరిధిలో 40 మందికి పింఛన్‌ ఇవ్వకుండా టీడీపీ నేతలు అడ్డుకున్నారు. దీంతో వారు బుధవారం వైఎస్సార్‌సీపీ నాయకులతో కలసి ఎంపీడీవో కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. 

ఎంపీడీవో శివనాగప్రసాద్‌ వారితో చర్చించారు. పంచాయతీ కార్యదర్శి గంగరత్న, వెల్ఫేర్‌ అసిస్టెంట్‌ ఫ్రాన్సిస్‌ను ఆరాతీశారు. అందరికీ పింఛన్లు ఇవ్వాలని తాము భావించామని, అయితే టీడీపీ నాయకులు ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని వారు వాపోయారు. ప్రస్తుతానికి సైట్‌ క్లోజ్‌ అయిందని, వచ్చేనెల రెండునెలల పింఛన్‌ మొత్తాన్ని ఇస్తామని చెప్పారు. అప్పుడు కూడా ఇస్తారన్న గ్యారెంటీ ఏమిటని వైఎస్సార్‌సీపీ నాయకులు నిలదీశారు. తామేమీ చేయలేమని అధికారులు చేతులెత్తేశారు. దీంతో కలెక్టర్‌ను కలవాలని బాధితులు నిర్ణయించుకున్నారు. 

⇒ గాండ్లపెంట మండలం ఎలుగూటివారిపల్లిలో దివ్యాంగులైన నలుగురు లబ్ధిదారులకు పింఛన్‌ మంజూరైనా అధికారులు పంపిణీ చేయలేదు. దీంతో బాధితులు కె.రమాదేవి, ఎం.నారాయణరెడ్డి, ఎం.లక్ష్మీదేవి, బి.లక్ష్మీదేవి బుధవారం ఎంపీడీవో రామానాయక్‌కు ఫిర్యాదు చేయాలని కార్యాలయానికి ఎంపీడీవో లేకపోవడంతో నిరసన వ్యక్తం చేశారు. 20 సంవత్సరాలుగా తీసుకుంటున్న పింఛన్‌ను ఇప్పుడు నిలిపేశారని, దీనిపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని వారు చెప్పారు. 

⇒ స్థానిక టీడీపీ నాయకులను కలిసి వస్తేనే పింఛన్‌ ఇస్తామంటూ మూడురోజుల నుంచి తిప్పుకొన్న సచివాలయ సిబ్బంది చివరకు సైట్‌ క్లోజ్‌ అయిందంటూ పింఛన్‌ సొమ్ము ఎగ్గొట్టారని రామగిరి మండలం ఎంసీపల్లి 1, 2 సచివాలయాలకు చెందిన పెన్షన్‌దారులు బుధవారం పుట్టపర్తిలోని శ్రీసత్యసాయి జిల్లా కలెక్టర్‌ కార్యాలయం వద్ద బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గతంలో ఏ రోజూ ఇలా జరగలేదని, వలంటీర్లు ఇంటికే వచ్చి పింఛన్‌ మొత్తాన్ని ఇచ్చేవారని చెప్పారు. 

ప్రభుత్వం మారగానే పింఛన్‌ ఎగ్గొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టరేట్‌ సిబ్బంది సూచన మేరకు వారు డీఆర్‌డీఏ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ పీడీ నరసయ్య లేకపోవడంతో అధికారి శివమ్మ వద్ద గోడు వెళ్లబోసుకుని వినతిపత్రం ఇచ్చారు. దీనిపై డీఆర్‌డీఏ పీడీ నరసయ్యను వివరణ కోరగా .. ఈ విషయాన్ని పరిశీలించాలని రామగిరి ఎంపీడీవోని ఆదేశించామని, వివరాలు తెలుసుకుని చర్యలు తీసుకుంటామని చెప్పారు. 

⇒ కాకినాడ జిల్లా కోటనందూరు మండలం ఎల్డీపేటలో 18 మంది పింఛనుదారులకు అధికారులు పింఛన్‌ నిలిపేశారు. సోమ, మంగళవారాల్లో లబ్ధిదారుల ఇంటికి తెచ్చి ఇవ్వాల్సిన పింఛన్‌ ఇవ్వకపోగా సచివాలయానికి వెళ్లినా పట్టించుకోలేదు. మంగళవారం రాత్రి ఏడుగంటల వరకు  సచివాలయంలోనే ఉన్నామని, ఎందుకు ఆపేశారని అడిగినా అధికారులు సమాధానం చెప్పలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. 

వారు సమస్యను బుధవారం ఎంపీపీ లగుడు శ్రీనివాసుకి వివరించారు. పింఛన్లు ఇప్పించాలని కోరుతూ ఎంపీపీ ఆధ్వర్యంలో ఎంపీడీవో జయమాధవికి వినతిపత్రమిచ్చారు. దీనిపై ఎంపీడీవో జయమాధవిని వివరణ అడగగా.. నిబంధనలకు విరుద్ధంగా పింఛన్లు తీసుకుంటున్నారని 18 మందిపై ఫిర్యాదు అందడంతో వారికి పింఛన్లు ఆపేశామన్నారు. విచారించి వారు అర్హులైతే వచ్చేనెల నుంచి ఇస్తామని చెప్పారు. 

ఇంత దారుణం ఎన్నడూ చూడలేదు 
ఇంత దారుణం నా జీవితంలో ఎన్నడూ చూడలేదు. గత ప్రభుత్వంలో ఒక్కనెల కూడా ఇలా ఇబ్బంది పెట్టలేదు. కలెక్టర్‌ స్పందించి మా సమస్యను పరిష్కరించాలి. 
- సిద్ధయ్య, ఎంసీపల్లి, రామగిరి మండలం 

అప్పుడు ఎవరికీ తొలగించలేదు 
జగన్‌ సీఎంగా ఉన్నప్పుడు ఏ ఒక్కరికీ పెన్షన్‌ తొలగించలేదు. ఒకవేళ మా నాయకులు తప్పుచేస్తే నాకు చెప్పండి లేదా కోర్టుకు వెళ్లండని చెప్పిన గొప్ప నాయకుడు. అర్హులు ఎంతమంది ఉంటే అంతమందికి పింఛన్‌ ఇచ్చారు. ఇప్పుడు మాత్రం టీడీపీ వాళ్లు అందుకు భిన్నంగా చేస్తున్నారు. 
- నరసింహారెడ్డి, ఎంసీపల్లి, రామగిరి మండలం 

సుగాలీలకు ఇంత అన్యాయం చేస్తారా? 
నా కుమార్తె నందివర్ధినీబాయికి తలసేమియా పెన్షన్‌ వస్తోంది. పాపను ఎత్తుకుని నా భార్య మూడురోజుల పాటు సచివాలయం చుట్టూ తిరిగింది. టీడీపీ వాళ్లను కలిసి ఫోన్‌చేయిస్తే ఇస్తామని చెప్పారు. లోకల్‌ లీడర్ల ప్రెజర్‌ ఉందని, వాళ్లను కలవాలని సెక్రటరీ, ఎంపీడీవో చెప్పడం అన్యాయం. సుగాలీలకు ఇంత అన్యాయం చేస్తారా? గతంలో సుగాలీల గురించి మాట్లాడిన పవన్‌ ఇప్పుడు స్పందించి నందివర్ధినీబాయికి బాసటగా నిలవాలి. 
- ముత్యాలనాయక్, ఆర్‌.కొత్తపల్లి, రామగిరి మండలం 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement