
శాసన మండలిలో ప్రభుత్వంపై వైఎస్సార్‌సీపీ మండిపాటు
గతేడాది జూన్ నాటికి రాష్ట్రంలో పింఛన్ లబ్ధిదారులు 65.18 లక్షలు
ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి 63.59 లక్షలకు తగ్గిన వైనం
ఈ లెక్కన ఏకంగా 1.58 లక్షల పింఛన్లపై వేటు
కూటమికి ఓటు వేయలేదని తొలగిస్తున్న దుస్థితి
పది నెలల్లో కొత్తగా ఒక్క పింఛన్ కూడా ఇవ్వని ప్రభుత్వం
ఆడ బిడ్డ నిధి ఎప్పటి నుంచి ఇస్తారని నిలదీత
సాక్షి, అమరావతి : పది నెలల కూటమి పాలనలో కొత్తగా ఒక్క సామాజిక భద్రతా పింఛన్ కూడా మంజూరు చేయకపోగా, ఏకంగా లక్షల మంది ఫించన్లను తొలగించారని వైఎస్సార్‌సీపీ ధ్వజమెత్తింది. అభాగ్యులకు పింఛన్లు తొలగించడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేసింది. సామాజిక భద్రతా పింఛన్లపై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు అడిగిన ప్రశ్న గురువారం మండలిలో చర్చకు వచ్చిoది. ఈ సందర్భంగా సెర్ఫ్ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ 2024 జూన్ నాటికి రాష్ట్రంలో 65,18,496 మంది పింఛన్ లబ్దిదారులుండగా, ఈ ఏడాది ఫిబ్రవరికి ఆ సంఖ్య 63,59,907కు తగ్గిందని.. గత ఏడాది జూన్ నుంచి 14,967 పింఛన్లు మాత్రమే తొలగించామన్నారు.
మంత్రి సమాధానం పట్ల ప్రతిపక్ష సభ్యులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఏకంగా 1.58 లక్షల పింఛన్లు తగ్గడం కళ్లెదుటే కనిపిస్తుంటే కేవలం 14 వేలే తొలగించామని మంత్రి చెప్పడం దుర్మార్గమని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మండిపడ్డారు. వెరిఫికేషన్ పేరిట ప్రభుత్వం వృద్ధులు, వికలాంగులు, మంచంపై నుంచి లేవలేని స్థితిలో ఉన్న వారి పింఛన్లు తొలగించడం అన్యాయమని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతిపక్ష పార్టీ వారికి ఎలాంటి మేలు చేయొద్దని సాక్షాత్తు ముఖ్యమంత్రే చెబుతుండటంతో ఇష్టానుసారం పింఛన్లు తొలగిస్తున్నారని మండిపడ్డారు.
మరో ఎమ్మెల్సీ రమేశ్ యాదవ్ మాట్లాడుతూ.. కూటమికి ఓటు వేయలేదన్న కక్షతో గ్రామాల్లో పింఛన్లు తొలగిస్తున్నారని ఆరోపించారు. తమ ప్రభుత్వంలో కులం, మతం, ప్రాంతం, రాజకీయం చూడకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పింఛన్ ఇచ్చామన్నారు. 2019 నాటికి 53,85,776 పింఛన్ లబి్ధదారులు ఉంటే, 2024 నాటికి 65,18,496కు పెరిగినట్టు వివరించారు. ఎమ్మెల్సీ మొండితోక అరుణ్‌కుమార్ మాట్లాడుతూ.. గతంలో పింఛన్ అర్హతకు సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ ఉండేదని, ఇప్పుడు దాన్ని 13–స్టెప్ వెరిఫికేషన్‌గా మార్చారన్నారు.
ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి జోక్యం చేసుకుంటూ 13–స్టెప్ వెరిఫికేషన్ లేదన్నారు. దీంతో పింఛన్ వెరిఫికేషన్ కోసం ప్రభుత్వం రూపొందించిన 13 అంశాలను మొండితోక అరుణ్‌కుమార్ సభలో చదివి వినిపించారు. సదరం సరి్టఫికెట్‌కు 15 రోజుల గడువు పెట్టారని, అయితే స్లాట్ దొరకడానికే నెలలు పడుతోందన్నారు. ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలో కొత్త పింఛన్లు ఎప్పటి నుంచి మంజూరు చేస్తారని అడిగారు. కార్యాచరణ రూపొందిస్తున్నామని, త్వరలో దరఖాస్తుల స్వీకరిస్తామని మంత్రి కొండపల్లి తెలిపారు.
‘ఆడ బిడ్డ నిధి’ అంతేనా?
‘ఆడ బిడ్డ నిధి’ పథకాన్ని ఎప్పటి నుంచి అమలు చేస్తారో చెప్పాలని వైఎస్సార్‌సీపీ మహిళా ఎమ్మెల్సీలు వరుదు కళ్యాణి, టి.కల్పలత ప్రభుత్వాన్ని నిలదీశారు. ఈ పథకం అమలుపై నిర్దిష్ట కాల పరిమితిపై స్పష్టత ఇవ్వాలన్నారు. ప్రశ్నోత్తరాల సమయంలో వారు మాట్లాడుతూ.. ఆడబిడ్డలకు తమ ప్రభుత్వం రాగానే నెలకు రూ.1500 ఇస్తామని చంద్రబాబు ఇచ్చిన హామీని గుర్తు చేశారు.
ఒక ఇంట్లో ఎంత మంది మహిళలలుంటే అంతమందికీ వర్తింపజేస్తామని ప్రచారం చేశారన్నారు. పది నెలలైనా పథకం ఊసే లేదని, కనీసం సమీక్ష కూడా నిర్వహించలేదని, ప్రభుత్వ వైఖరి ఏమిటో స్పష్టం చేయాలని నిలదీశారు. దీనిపై మంత్రి శ్రీనివాస్ స్పందిస్తూ మరికొంత సమయం పడుతుందంటూ సమాధానం దాటవేశారు.
Comments
Please login to add a commentAdd a comment