
2014 నుంచి జరిగిన కుంభకోణాలపై చర్చకు మేము సిద్ధం
అప్పటి అక్రమాలపై ప్రశ్నిస్తుంటే ఎందుకు భుజాలు తడుముకుంటున్నారు?
శాసన మండలిలో అధికార పక్షం తీరును ఎండగట్టిన ప్రతిపక్షం
సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశ పెడితే, వాటిని స్కాములుగా చిత్రీకరించేందుకు టీడీపీ ప్రయత్నం చేస్తోందని శాసన మండలిలో వైఎస్సార్‌సీపీ సభ్యులు మండిపడ్డారు. స్కాములన్నీ చేసింది టీడీపీ ప్రభుత్వమేనని ధ్వజమెత్తారు. ధైర్యం ఉంటే 2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై వేసిన సిట్ నివేదికలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. గురువారం శాసనన మండలిలో ‘2019–24 మధ్య జరిగిన కుంభకోణాలు’పై లఘు చర్చ జరిగింది.
టీడీపీ సభ్యురాలు అనురాధ చర్చను ప్రారంభిస్తూ గత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. దీంతో విపక్ష సభ్యులు అడ్డుపడి.. ప్రభుత్వానికి ధైర్యం ఉంటే విచారణ చేసి, మాట్లాడాలని అనడంతో ఆమె నీళ్లు నమిలారు. విశాఖలో విజయసాయిరెడ్డి బినామీ పేర్లతో భూములు కొన్నారని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి అటవీ భూములను ఆక్రమించారంటూ ఆమె విమర్శలకు దిగారు. సభలో లేని వ్యక్తుల పేర్లు ఎలా ప్రస్తావిస్తారంటూ వైఎస్సార్‌సీపీ సభ్యులు అరుణ్‌కుమార్, రమేష్‌యాదవ్ మండిపడ్డారు. అవి ఆక్రమించిన భూమలు కాదని స్థానిక కలెక్టర్లు నివేదిక కూడా ఇచ్చారని స్పష్టం చేశారు.
దెయ్యాలు వేదాలు వల్లించినట్టుంది..
వైఎస్సార్‌సీపీ సభ్యుడు కుంభా రవిబాబు మాట్లాడుతూ.. కుంభకోణాలపై టీడీపీ మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టుందని అన్నారు. ఆనాడు ఓటుకు కోట్లు కుంభకోణంలో చిక్కుకుని రాత్రికి రాత్రే సర్దుకుని విజయవాడకు వచ్చేశారని చంద్రబాబు ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. అప్పటి నుంచి ఏపీలో స్కాములపర్వం మొదలెట్టి, రాష్ట్రాన్ని అవినీతిలో నంబర్ 1గా నిలబెట్టారని మండిపడ్డారు. రాజధాని పేరుతో అంతర్జాతీయ స్థాయిలో రియల్ ఎస్టేట్ స్కామ్ చేశారని దుయ్యబట్టారు.
నైపుణ్యాభివృద్ధి పేరుతో ప్రజాధనాన్ని దోచేసిన కేసులో చంద్రబాబును న్యాయస్థానం జైల్లో పెట్టిందన్నారు. విచారణకు సహకరించకుండా ఆయన పీఏను దేశాలు దాటించేశారని ఎద్దేవా చేశారు. రాజధాని ప్రకటనకంటే ముందే టీడీపీ నాయకులు బినామీ పేర్లతో దళితులు, నిరుపేదల అసైన్డ్ భూములను చౌకగా కొట్టేశారన్నారు.
హెరిటేజ్ పేరిట కూడా 14 ఎకరాలు కొన్నారన్నారు. పోలవరాన్ని చంద్రబాబు ఏటీఎంలా వాడుకున్నారని 2019 ఎన్నికల్లో ప్రధాని మోదీనే చెప్పారని అన్నారు. రూ.150 కోట్లు కూడా ఖర్చవ్వని తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ భవనాలకు రూ.1,115 కోట్లు వెచ్చి0చారంటే ఎంత అవినీతి జరిగిందో స్పష్టమవుతోందని అన్నారు.
23 సీట్లకు ఎందుకు పడిపోయింది?
రాజధానిలో అవినీతికి పాల్పడకపోతే 2019 ఎన్నికల్లో టీడీపీ 23 సీట్లకు ఎందుకు పడిపోయిందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు ప్రశ్ని0చారు. పోర్టులు, స్కిల్ కాలేజీలు, వర్సిటీల నిర్మాణం, భారీగా కంపెనీలను తేవడం స్కాములు ఎలా అవుతాయని అన్నారు. 2019–24 మధ్య కుంభకోణాలపై చర్చకు నోటిసిస్తే పాతవన్నీ తోడటం సరికాదంటూ మంత్రి అచ్చెన్నాయుడు అడ్డుపడ్డారు.
స్కిల్ కేసులో చంద్రబాబుకు క్లీన్‌చిట్ ఇచ్చేసినట్టు చెప్పుకొచ్చారు. దీనిపై ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ స్పందిస్తూ.. అధికారపక్ష సభ్యులు పేపర్ల కథనాలు చూపించి కుంభకోణాలు అంటున్నారని, ఒక్క దానిపైనైనా రుజువులు చూపారా అని నిలదీశారు.
విశాఖ భూములపై సిట్ నివేదిక బయటపెట్టండి
టీడీపీ ప్రభుత్వం 2016లో విశాఖ భూములపై వేసిన సిట్ నివేదికను బయట పెట్టాలని బొత్స డిమాండ్ చేశారు. అందులోని వ్యక్తులు ఎవరైనా రాజకీయాలకు అతీతంగా శిక్షించాలని అన్నారు. అందులో విలువైన దసపల్లా భూములున్నాయని, ఎందుకు భుజాలు తడుముకుంటున్నారని అధికారపక్షాన్ని నిలదీశారు.
గత ప్రభుత్వాధినేత భూ బకాసురుడిగా మారి అనుయాయులతో కలిపి దోపిడీ చేశారని మంత్రి అనగాని సత్యప్రసాద్ అనడంతో బొత్స తీవ్రంగా స్పందించారు. ఇలాంటి దుష్ట సంప్రదాయాన్ని ప్రదర్శిస్తున్న సభలో ఉండలేం అంటూ వాకౌట్ చేశారు.
ఆధారాల్లేకుండా బురదజల్లుడా?
మండలిలో ఇవాళ జరిగిన ప్రశ్నోత్తరాల్లోగానీ, స్వల్పకాలిక చర్చలోగానీ ప్రభుత్వం నుంచి నిర్దిష్ట సమాధానాలు రాలేదని బొత్స చెప్పారు. మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ మీద, తమ నాయకుడి మీద ఆధారాల్లేకుండా ఆరోపణలు చేసినందునే సభ నుంచి వాకౌట్ చేశామన్నారు.
మేము భారత్‌లో అడుగుపెట్టిన తర్వాత బీహార్‌లో వ్యాపారం చేయాలంటే దుర్భర పరిస్థితులు ఉంటాయని వినిపించింది. అన్ని విమానాశ్రయాల్లో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఏపీ నంబర్ 1 అని చూశాం. కానీ, ఐదేళ్లలో మాకు బీహార్ చక్కటి ప్రణాళిక, సుపరిపాలనతో దూసుకెళ్తుండగా, ఏపీ పూర్తి అయోమయంగా, అవగాహన లేకుండా ఉంది. ఏపీలో అనిశ్చిత పరిస్థితుల దృష్ట్యా మాకు వచ్చిన రాజధాని డిజైన్ ప్రతిపాదనలను విరమించుకుని బయటకు వెళ్లిపోయాం.. –జపాన్ ఆర్కిటెక్చర్ సంస్థ సీఈవో వారి మేగజైన్‌లో ఏప్రిల్ 2017 సంచికలో రాసిన వ్యాసంలో చెప్పిన ఈ వివరాలను మండలిలో వైఎస్సార్‌సీపీ సభ్యుడు కుంభా రవిబాబు ప్రస్తావించారు.
Comments
Please login to add a commentAdd a comment