రూ.6.5 లక్షల కోట్ల పెట్టుబడులు.. 4 లక్షల ఉపాధి అవకాశాలా? | war of words between TDP and YSRCP in ap legislative council | Sakshi
Sakshi News home page

రూ.6.5 లక్షల కోట్ల పెట్టుబడులు.. 4 లక్షల ఉపాధి అవకాశాలా?

Published Wed, Feb 26 2025 5:23 AM | Last Updated on Wed, Feb 26 2025 5:23 AM

war of words between TDP and YSRCP in ap legislative council

ఎక్కడో చూపించండి?.. మండలిలో నిలదీసిన వైఎస్సార్‌సీపీ

సాక్షి, అమరావతి: ‘టీడీపీ కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో రూ.6.5 లక్షల కోట్ల పెట్టుబడులు.. 4 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించారా..? ఎక్కడో చూపించండి..!’ అని వైఎస్సార్‌సీపీ సభ్యులు శాసనమండలిలో నిలదీశారు. గవర్నర్‌ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంలో చర్చ సందర్భంగా మండలిలో మంగళవారం ఈ అంశంపై అధికార, విపక్ష సభ్యుల మధ్య కొద్దిసేపు వాడివేడిగా చర్చ జరిగింది. చివరికి సమాధానం చెప్పలేక మంత్రులు నీళ్లు నమలాల్సి వచ్చింది.   

నాలుగు ఉద్యోగాలూ కల్పించలేదు
ఏకంగా 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన ఈ ప్రభుత్వం తొమ్మిది నెలలుగా ఒక్క ఉద్యోగం కాదు కదా.. కనీసం ఒక్క నోటిఫికేషన్‌ కూడా ఇవ్వలేదని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు ధ్వజ­మెత్తారు. గవర్నర్‌ ప్రసంగంలో నిరుద్యోగ భృతి గురించి ప్రస్తావనే లేదన్నారు. గవర్నర్‌ ప్రసంగంలో నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్పించారని ఎమ్మెల్సీ వరుదు కల్యాణి విమర్శించారు. ఏ శాఖలో.. ఏ కంపె­నీలో.. ఎంత మందికి ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. నాలుగు లక్షలు కాదు.. నలుగురికి కూడా ఉద్యోగాలివ్వలేదని మండిపడ్డారు.

ఈ సమయంలో మంత్రి నారా లోకేశ్‌ జోక్యం చేసుకుంటూ.. ‘రూ.6.5 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించాం. 4 లక్షల ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పామే కానీ.. కల్పించినట్లుగా ఎక్కడా చెప్పలేదు’ అని ఇంగ్లీషు వెర్షన్‌లో ఉన్న గవర్నర్‌ ప్రసంగాన్ని చదివి బుకాయించబోయారు. తెలుగులో గవర్నర్‌ ప్రసంగాన్ని చదవాలని సభ్యులు పట్టుబట్టడంతో.. ‘ఇంగ్లీషులో చదువుతున్నా కదా’ అంటూ ఆంగ్లంలో ఉన్న ప్రసంగం పాఠాన్ని మరోసారి చదివి వినిపించారు.  

పొరపాటును లోకేశ్‌ ఒప్పుకోవాలన్న బొత్స 
శాసన మండలిలో వైఎస్సార్‌సీపీ ఫ్లోర్‌ లీడర్‌ బొత్స సత్యనారాయణ జోక్యం చేసుకుని తెలుగు ప్రసంగ పాఠంలో ఉన్న అంశాలను చదివి వినిపించారు. ‘4 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పించబడింది’ అని అందులో స్పష్టంగా ఉందన్నారు. తెలుగులో తర్జుమా చేయడంలో పొరపాటు జరిగి ఉంటుందని, అదే విషయాన్ని హుందాగా అంగీకరించి సరిచేస్తామని చెబితే సరిపోతుంది కదా! అని హితవు పలికారు. 

నాడు రాష్ట్ర ప్రయోజనాలు కనిపించలేదా? 
టీడీపీ, జనసేన ఎంపీలపై ఆధారపడి కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం కొనసాగుతున్నందున ఏపీకి ప్రత్యేక హోదా ఎందుకు సాధించలేకపోతున్నారని ఎమ్మెల్సీ వరుదు కల్యాణి ప్రశ్నించారు. తాము బేషరతుగానే మద్దతు ఇస్తున్నట్లు లోకేశ్‌ చెప్పారు. ‘2014లో మీకు రాష్ట్ర ప్రయోజనాలు కనిపించలేదా? అప్పుడు ప్రత్యేక హోదా వద్దని ప్యాకేజీ ఎందుకు తీసుకున్నారు?’ అని మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రశి్నంచారు. దీనికి మంత్రులు సమాధానం దాట వేశారు.  

ఏఐ... తెలుగులో ఉంటుందా? 
వైఎస్సార్‌సీపీ హయాంలో ఇంగ్లీష్‌ మీడియం బోధన ప్రవేశపెట్టి మన విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడేలా చేసిందని ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు పేర్కొన్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వం తెలుగు, ఇంగ్లీషు మీడియంలలో దేన్ని అనుసరిస్తుందో చెప్పలేకపోతోందన్నారు. సీఎం చంద్రబాబు తరచూ చెప్పే ఆర్టిఫిíÙయల్‌ ఇంటెలిజెన్స్, సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీ తెలుగులో ఉంటాయా? అని ప్రశ్నించారు. తెలుగును అవమానిస్తు­న్నారని మంత్రులు అనిత, సవిత అభ్యంతరం వ్యక్తం చేయడంతో.. తానేమీ తప్పుగా మాట్లాడలేదని, ఇంగ్లీషు మీడియం విషయంలో ప్రభుత్వ వైఖరిని గవర్నర్‌ ప్రసంగంలో ప్రస్తావించలేదని తూమాటి పేర్కొన్నారు.

ఉచిత గ్యాస్‌ అంటూ 9 నెలల్లో ఒక్క సిలిండర్‌ మాత్రమే ఇచ్చారన్నారు. వైఎస్సార్‌సీపీ హయాంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో 17 కొత్త మెడికల్‌ కాలేజీలకు శ్రీకారం చుట్టగా ఐదు కాలేజీలను ప్రారంభించడంతోపాటు మరో కాలేజీకి అనుమతి సాధించామన్నారు. మిగిలిన కళాశాలలు ప్రభు­త్వం ఆధ్వర్యంలో ఉంటాయా? ప్రైవేట్‌కు అప్పగిస్తారా? అనేది చెప్పడం లేదన్నారు. ఐదేళ్లలో 30 వేల మంది మహిళలు మిస్సింగ్‌ అని ఆరోపణలు చేశారని, 700 మంది మాత్రమే మిస్సింగ్‌ అని ఆనాడే డీజీపీ స్థాయి అధికారులు తేలి్చనా పదేపదే అవే ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.

నాడు తొలి ఆర్నెలల్లోనే 1.25 లక్షల ఉద్యోగాలు.. 
వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి ఆరు నెలల్లోనే ఏకంగా 1.25 లక్షల ఉద్యోగాలు ఇచ్చిందని ఎమ్మెల్సీ వరుదు కల్యాణి గుర్తు చేశారు. సీఎం చంద్రబాబు మెగా డీఎస్సీ అంటూ ఇప్పటికీ ఇవ్వలేదన్నారు. కూటమి ప్రభుత్వ పాలనలో అన్ని వర్గాల ప్రజల జీవితాలు తలకిందులయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. సూపర్‌ సిక్స్‌ హామీలను ఎగ్గొట్టడం.. రూ.లక్ష కోట్లకుపైగా అప్పులు చేయడం.. బెల్టు షాపులతో మద్యం ఏరులై పారించడం.. మెగా డీఎస్సీ ఇవ్వకపోవడం.. 83 లక్షల మందికి తల్లికి వందనం ఎగ్గొట్టడం.. ప్రజలపై రూ.15 వేల కోట్ల విద్యుత్‌ చార్జీల భారం మోపడం.. పోలవరం ఎత్తు తగ్గించడం సుపరిపాలనా? అని నిలదీశారు.

జనవరి 1వ తేదీన ఇస్తామన్న జాబ్‌ క్యాలెండర్‌ ఏమైందన్నారు. ఉద్యోగులకు ఐఆర్, పీఆర్సీ అని చెప్పి పీఆర్సీ చైర్మన్‌ను బెదిరించి వెళ్లగొట్టారన్నారు. అధికారంలోకి వస్తే వలంటీర్లకు రూ.5 వేలు కాదు.. రూ.10 వేలు ఇస్తామని చివరికి వారిని రోడ్డు పాలు చేశారని మండిపడ్డారు. గత 8 నెలల్లో ఒక్క రూపాయి కూడా విద్యుత్‌ చార్జీలు పెంచలేదని మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ చెప్పారు. 2023లో వలంటీర్లను రెన్యువల్‌ చేయకపోవడం వల్లే జీతాలు ఇవ్వలేకపోయామని, కొనసాగించలేకపోయామని మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి పేర్కొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement