బ్రోకర్‌.. జోకర్‌.. సర్కారే! | Unauthorized poker clubs Under Chandrababu Govt TDP Leaders | Sakshi
Sakshi News home page

బ్రోకర్‌.. జోకర్‌.. సర్కారే!

Published Sun, Aug 11 2024 5:05 AM | Last Updated on Sun, Aug 11 2024 5:05 AM

Unauthorized poker clubs Under Chandrababu Govt TDP Leaders

జాకీ, క్వీన్, కింగ్, ఆస్‌ అంటూ ఊరూరా అనధికార పేకాట క్లబ్బులు

ఎక్కడికక్కడ జేబులు నింపుకుంటున్న ‘తమ్ముళ్లు’

నగరాలు, పట్టణాలు, పల్లెల్లో యథేచ్ఛగా సాగుతున్న దందా

అధికార, అనధికార క్లబ్‌లు దాదాపు 100 

వారానికి టర్నోవర్‌ రూ.3,900 కోట్లు 

టీడీపీ నేతలకు కమీషన్‌ రూ.390 కోట్లు  

అన్ని జిల్లాల్లో రోజు రోజుకూ విస్తరిస్తున్న సంస్కృతి

ఆటగాళ్లకు సకల వసతులూ సమకూరుస్తున్న నిర్వాహకులు.. ‘ఫోన్‌’లో కూడా లావాదేవీలు

అటువైపు కన్నెత్తి చూడకుండా పోలీసులకూ మామూళ్లు

కోరిన మందు, ఫుడ్డు కోసం ప్రత్యేక ఏర్పాట్లు.. అక్కడికక్కడే అప్పులిచ్చే వాళ్లూ సిద్ధం

వెరసి ఆస్తుల అమ్మకాలు.. కుటుంబాల్లో కలతలు

‘పేకాట ప్రియుల్లారా.. రండి రండి.. అనువైన చోటు, తిండీ తిప్పల బాధ్యత మాదే.. ముక్కలూ మావే.. మీరు కేవలం డబ్బు తెచ్చుకుంటే చాలు.. అదీ కష్టం అనుకుంటే ఫోన్‌ పే/గూగుల్‌ పే అయినా ఓకే. ఇన్నాళ్లూ మీరు ఈ అదృష్టానికి దూరమయ్యారు.. ఈ ఆనందం కోసం ఎక్కడెక్కడికో పొరుగు రాష్ట్రాలకు వెళ్లాల్సిన పనిలేదిక.. మా శిబిరానికి రండి.. మీ భద్రతకు మాదీ పూచి.. మీకు ఏం కావాలన్నా తెచ్చి పెట్టడానికి చేతి కింద ఎంతో మంది ‘జాకీ’లూ సిద్ధం.. మీరు డబ్బు గెలుచుకోవాలే గానీ ‘క్వీన్‌’ కూడా రెడీ.. పైన ‘కింగ్‌’ మనోడే.. ఇంకెందుకు ఆలోచిస్తారు? జోకర్‌ పడకపోయినా కూడా ‘షో’ చెప్పొచ్చు.. ట్రిపులెట్‌లా మీ జీవితం వెలిగిపోవచ్చు.. మీ అదృష్టం పరీక్షించుకోండి..’ అని రాష్ట్రంలో పేకాడేవాళ్లను అధికార టీడీపీ నేతలు ఎక్కడికక్కడ ఆహ్వానిస్తున్నారు. ఇసుక రీచ్‌లలో అడ్డగోలు తవ్వకాలతో జేబులు నింపుకుంటున్నది సరిపోదన్నట్టు పేకాటపై పడ్డారు. చంద్రబాబు చెప్పినట్లు సొంతానికి ‘ఇలా’ సంపద సృష్టించుకుంటున్నారు.

సాక్షి, అమరావతి/సాక్షి నెట్‌వర్క్‌ : ఎన్నో కుటుంబాలను చిధ్రం చేసిన చరిత్ర జూదానిది. పండుగలు, పబ్బాలకు జరిగే జూదంతోనే ఎందరో ఆస్తులమ్ముకుంటున్నారు. పేకాట వల్ల గతంలో ఎన్ని వేల కుటుంబాలు అప్పుల పాలయ్యాయో, ఎంత మంది ఐపీ పెట్టారో ప్రభుత్వ పెద్దలకు తెలియంది కాదు. అలాంటిది చంద్రబాబు ప్రభుత్వం వచ్చీ రాగానే రాష్ట్రంలో సామాన్యుల బతుకులతో పేకాడేస్తోంది. టీడీపీ కూటమి ప్రభుత్వ మంత్రులు, ప్రజాప్రతినిధుల సిండికేట్ల ఆధ్వర్యంలో మూడు ముక్కలు.. ఆరు ఆటలుగా పేకాట దందా బరితెగించి సాగుతోంది. 

శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు తెరుచుకున్న అధికారిక, అనధికారిక పేకాట క్లబ్బుల ద్వారా రోజూ అధికార పార్టీ నేతలు కోట్లాది రూపాయలు కొల్లగొట్టేందుకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోంది. రాష్ట్రంలో జూదానికి అడ్డుకట్ట వేసేందుకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పడిన కష్టాన్ని బూడిదలో పోసిన పన్నీరుగా చేస్తోంది. దశాబ్దాలుగా రాష్ట్రంలో సాగిన పేకాట క్లబ్బుల దందాకు గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అడ్డుకట్ట వేసింది. రాష్ట్ర వ్యాప్తంగా పేకాట క్లబ్బుల అనుమతులను రద్దు చేసింది. అనధికార పేకాట క్లబ్బుల దందానూ అణచి వేసింది. 

తద్వారా మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతి ప్రజల సర్వస్వాన్ని దోచుకుంటున్న పేకాట క్లబ్బుల దందాకు ముగింపు పలికింది. ఎన్ని ఒత్తిడులు వచ్చినా సరే తలొగ్గ లేదు. అయితే, చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించగానే పేకాట క్లబ్బుల సిండికేట్లు మరోసారి జూలు విదిల్చాయి. ఏకంగా టీడీపీ కూటమి ప్రభుత్వంలోని మంత్రులు, ఎమ్మెల్యేలే స్వయంగా పేకాట క్లబ్బుల సిండికేట్‌కు నాయకత్వం వహిస్తుండటం విభ్రాంతి కలిగిస్తోంది.

ఒకరిని చూసి మరొకరు..
కొన్ని జిల్లాల్లో పెద్ద ఎత్తున పేకాట నిర్వహిస్తుండటం చూసి ఇతర జిల్లాల కూటమి పార్టీల నేతలు సైతం ఈ దందాను ప్రారంభిస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో మూడు క్లబ్‌లతో పాటు కొన్ని ప్రత్యేక ప్రాంతాల్లో పేకాట శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఇందుకు భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) అండదండలున్నాయని, ప్రధానంగా ఎమ్మెల్యే కుమారుడు నిర్వాహకులకు మద్దతుగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. పాలకొల్లులో రెండు క్లబ్బుల్లో పేకాట జోరుగా సాగుతోంది. 

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో కొందరు ఇళ్ల వద్ద, వ్యక్తిగత గెస్ట్‌ హౌస్‌లలో, పొలాల్లో, ఊరికి దూరంగా ఉండే ఖాళీ స్థలాల్లో పేకాట నిర్వహిస్తున్నారు. రావులపాలెం, ఆత్రేయపురం, ఐ.పోలవరం, సఖినేటిపల్లి మండలాల్లో ఈ తరహా పేకాట కొనసాగుతోంది. పొలాల్లో పేకాట ఆడేవారిపై పోలీసులు రైడింగ్‌లు, కేసులు నమోదు చేస్తున్నారు తప్ప గెస్ట్‌ హౌస్‌లలో పేకాట జోలికి వెళ్లడం లేదన్న విమర్శలు ఉన్నాయి. కాకినాడ జిల్లా తుని, ప్రత్తిపాడుల్లో పేకాట స్థావరాలు ఏర్పాటయ్యాయి. నిర్మానుష్య ప్రాంతాలు, ఎత్తైన భవంతులు, అటవీ ప్రాంతాలు ఇందుకు వేదికయ్యాయి.  

వైఎస్సార్, ప్రకాశం జిల్లాల్లో జోరు
వైఎస్సార్‌ జిల్లా ప్రొద్దుటూరు మండలం చౌటపల్లెలో అధికార పార్టీనేత లక్ష్మిరెడ్డి, నాగార్జునరెడ్డి పేకాట నిర్వహిస్తున్నారు. వీరు స్థానిక ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డికి ముఖ్య అనుచరులు. ప్రొద్దు­టూరు మండలం దొరసానిపల్లెలో టీడీపీ నేత శివ, ఆయన సోదరుడి ఆధ్వర్యంలో పేకాట జరుగుతోంది. ప్రొద్దుటూరు మండలం సోములవారిపల్లె పంచాయతీ ఈశ్వరరెడ్డినగర్‌లో పక్కీర్‌రెడ్డి, బండ రాముడు పెద్ద ఎత్తున పేకాట నిర్వహిస్తున్నారు. పులివెందుల, సింహాద్రిపురం, లింగాల మండలాల్లోని పలు ప్రాంతాలలో టీడీపీ చోటా నాయకులు పేకాట దందా నడిపిస్తున్నారు.  

బ్రహ్మంగారిమఠంలో పేకాట స్థావరం త్వరలో మొదలవుతుందని తెలిసింది. చెన్నూరు మండలం బలసింగాయపల్లె, కనపర్తి, కైలాసగిరి ప్రాంతాల్లో దట్టమైన చెట్లున్న ఏరియాలో టీడీపీ నేతలు పేకాట స్థావరాలు ఏర్పాటు చేశారు. అన్నమయ్య జిల్లా కలికిరి, చిన్నమండెం, పెద్దమండెం, గుర్రంకొండ సమీపంలోని పాత చిత్తూరు జిల్లా సరిహద్దులోని గుట్ట ప్రాంతాల్లో మొబైల్‌ గ్యాంబ్లింగ్‌ నిర్వహి­స్తున్నారు. రోజుకొక చోట శిబిరాలను నడిపిస్తు­న్నారు. 

కొంతమంది పోలీసులు, అధికార పార్టీ నాయకుల ప్రమేయంతో ఈ వ్యవహారం జరు­గుతోంది. మదనపల్లె, రైల్వేకోడూరు ప్రాంతాల్లో కూడా మామిడి తోటల్లో పేకాట కొనసాగుతోంది. ఒంగోలు నడిబొడ్డున గాంధీ రోడ్డులోని ఒక వీధిలో, ఒంగోలు–దశరాజుపల్లి మార్గంలోని ఒక పాత బిల్డింగ్‌లో పేకాట శిబిరాలు సాగుతున్నాయి. కొండపి నియోజకవర్గంలోని టంగుటూరు, జరుగుమల్లి, పొన్నలూరు, మర్రిపూడి మండలాల్లోని పలు గ్రామాల్లో రోజూ పేకాట సాగుతోంది.  
రేపల్లె నియోజకవర్గంలోని ఓ పేకాట శిబిరంలో లోన–బయట ఆటకు రెడీ  

అన్ని జిల్లాల్లోనూ అదే దందా
విశాఖపట్నం, కాకినాడ, విజయవాడ, గుంటూరు, తిరుపతి, నెల్లూరు వంటి నగరాల్లో అధికారికంగా మూడేసి చొప్పున పేకాట క్లబ్బులు తెరుచుకోగా.. శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, రాజమహేంద్రవరం, ఏలూరు, ఒంగోలు, అనంతపురం, కర్నూలు, నంద్యాల, కడప వంటి జిల్లా కేంద్రాల్లో అధికారికంగా ఒకటి రెండు క్లబ్బులకు తలుపులు తెరిచి.. అనధికారింగా లెక్కలేనన్ని కేంద్రాలు ఓపెన్‌ చేసేశారు. ఎంపిక చేసిన హోటళ్లు, గెస్ట్‌ హౌస్‌లు, ఊరి బయట పొలాల్లో అనధికార పేకాట క్లబ్బులు వెలిశాయి. 

రాష్ట్రం మొత్తం మీద ఇప్పటికే దాదాపు 100కుపైగా అధికారిక, అనధికారిక పేకాట క్లబ్బులు దందా సాగిస్తున్నాయి. కొన్ని చోట్ల ఏకంగా పోలీసులను కాపలా పెట్టి మరీ పేకాట దందా సాగిస్తుండటం విస్మయ పరుస్తోంది. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు పేకాట క్లబ్బుల జోరు అడ్డూ అదుపు లేకుండా సాగుతోంది. ఒక్కోక్లబ్బులో సోమవారం నుంచి శుక్రవారం వరకు రోజుకు సగటున రూ.3 కోట్ల వరకు.. శని, ఆదివారాల్లో రోజుకు రూ.12 కోట్ల వరకు దందా సాగుతున్నట్లు సమాచారం. 

ఆ ప్రకారం సోమవారం నుంచి శుక్రవారం వరకు రాష్ట్రంలో రూ.1500 కోట్లు.. శని, ఆదివారాల్లో రూ.2,400 కోట్ల వరకు పేకాట దందా సాగుతోంది. పేకాట క్లబ్బుల నిర్వహణకు కొమ్ముకాస్తున్న టీడీపీ కూటమి ప్రభుత్వ మంత్రులు, ప్రజా ప్రతినిధులు ఇందులో 10 శాతం చొప్పున కమీషన్‌ తీసుకుంటున్నారు. ఆ ప్రకారం టీడీపీ కూటమి మంత్రులు, ప్రజాప్రతినిధులు వారానికి కమీషన్ల రూపంలోనే దాదాపు రూ.400 కోట్ల వరకు కొల్లగొడుతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో క్లబ్బుల సంఖ్య, టీడీపీ నేతల కమీషన్‌ కూడా పెరగనుంది.  

‘అనంత’లో దందాకు ఎక్కడా నో డ్రాప్‌
అనంతపురం జిల్లా ఉరవకొండలో ఓ హెడ్‌కా­నిస్టేబుల్‌ పేకాట నిర్వహణకు రింగ్‌ మాస్టర్‌గా వ్యవహరిస్తున్నాడు. పై అధికారులకు ఆదాయంలో వాటా ఇస్తున్నారని సమాచారం. ఇదే నియోజక­వర్గంలోని కూడేరులోనూ పేకాట జోరుగా సాగుతోంది. తాడిపత్రి నియోజకవర్గంలో అడ్డూ అదుపు లేకుండా పోయింది. పట్టపగలే యథే­చ్ఛగా పేకాట ఆడుతున్నా పట్టించుకునే వారు లేరు. కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని కుందుర్పి, బ్రహ్మ­సముద్రం, శెట్టూరు, కంబదూరు మండలాల్లో టీడీపీ నేతల కనుసన్నల్లో అటవీ ప్రాంతాల్లో పేకాట శిబిరాలు నడుస్తున్నా­యి. 

ఇక్కడికి కర్ణాటక నుంచి సైతం పేకాట­రాయుళ్లు భారీగా వస్తున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పరిధిలో పెనుకొండ, పుట్టపర్తి, హిందూపురం ప్రాంతాల్లో పేకాట విచ్చలవిడిగా సాగుతోంది. కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లో రాత్రింబవళ్లు జరుగుతోందని స్థానికులు చెబుతున్నారు. ప్రతి రోజూ ఒక్కో స్థావరంలో రూ.లక్షలు చేతులు మా­రుతున్నాయి. పుట్టపర్తిలో టీడీపీకి చెందిన రామ్‌– లక్ష్మణ్‌ సోదరులు గోవా నుంచి కర్ణాటక మీదుగా ఆంధ్రప్రదేశ్‌ వరకు జూద నిర్వహణలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. 

ఒక్కో స్థావరం నుంచి రోజుకు రూ.3 లక్షల చొప్పున కమీషన్‌ రూపంలో పోలీ­సులకు వెళ్తోంది. రూ.లక్షకు రూ.2 వేల కమీషన్‌ తీసుకుంటూ అప్పుగా ఇస్తున్న వారు కూడా పెరి­గిపోయారు. చాలా మంది టీడీపీ నేతలు జూద కేంద్రాలను ఆదాయ వనరులుగా మలుచుకుంటు­న్నారు. ప్రతి జూద కేంద్రం నుంచి 20 శాతం కమీ­షన్‌ తీసుకుని నడిపిస్తున్నారు. ఇటీవల పెనుకొండ మండలం శెట్టిపల్లి సమీపంలో 15 మంది పేకాట­రాయుళ్లు దొరికారు. వారి వద్ద నుంచి రూ.17 లక్షలు, ఐదు వాహనాలు స్వాధీనం చేసుకున్నారు.

కుప్పంలో రోజూ రూ.2 కోట్లు
చిత్తూరు జిల్లా కేంద్రంలో నెల రోజులుగా పేకాట స్థావరాలు మొదలయ్యాయి. తుమ్మిందపాళ్యం–మాపాక్షి మార్గం, గంగనపల్లె, చర్చీవీధిలో  జూదం నిర్వహిస్తున్నారు. ఓ టీడీపీ ప్రధాన నాయకుడి తమ్ముడి ఆదేశాలతో ఈ శిబిరాలు నడుస్తున్నాయి. ఇందుకోసం ప్రస్తుతం అతడికి రోజుకు రూ.2 లక్షలు ముట్టజెపు­తున్నట్లు తెలుస్తోంది. పూతలపట్టులోని బంగారుపాళ్యం అటవీ ప్రాంతంలో, పలమనేరు కౌండిన్య అడవుల్లో రోజుకు రూ.లక్ష చొప్పున పోలీసులు మామూళ్లు తీసుకుని పేకాట జరుపుకోవడానికి అనుమతి ఇచ్చినట్లు ప్రచారం సాగుతోంది. 

గంగాధరనెల్లూరులో ఓ కీలక నాయకుడి తమ్ముడి ఆదేశాలతో పేకాట నిర్వహిస్తున్నారు. నగరిలో తడుకుపేట–­తమిళనాడు సరిహద్దు ప్రాంతాల్లో జరుగుతున్న జూదానికి ఓ మండల టీడీపీ నేత ఇటీవల పచ్చజెండా ఊపారు. పుంగనూరులో నక్కగుంట, బోయకొండ ప్రాంతాలు నిత్యం పేకాటరాయుళ్లతో కనిపిస్తున్నాయి. రోజూ జరిగే మొత్తంలో 20 శాతం స్థానిక టీడీపీ నాయకు­లకు ఇస్తున్నారు. కుప్పంలో గుడివంక సరిహద్దు ప్రాంతాల్లో, శాంతిపురం–కర్ణాటక సరిహద్దు అటవీ ప్రాంతాల్లో జరుగుతున్న ఆటకు రెండు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో పందెంరాయుళ్లు వస్తున్నారు. 

నామినేటెడ్‌ పోస్టులో ఉన్న ఓ టీడీపీ నేత, పోలీసులతో కలిసి ఈ శిబిరం నిర్వహిస్తున్నారు. ఇక్కడ ప్రతి రోజూ రూ.2 కోట్ల వరకు లావాదేవీలు నడుస్తున్నాయి. తిరుపతి, శ్రీకాళహస్తి పుత్తూరు, రేణిగుంట, వెంకటగిరి, సూళ్లూరుపేట ప్రాంతాల్లో పేకాట శిబిరాలు నడుస్తున్నాయి. తిరుపతిలో ఇద్దరు టీడీపీ నేతల కనుసన్నల్లో దందా సాగుతోంది. లాడ్జి ఓనర్లతో ఒప్పందాలు కుదుర్చుకుని ఆట సాగిస్తున్నారు. పోలీసుల నుంచి ఇబ్బంది ఉండదని భరోసా ఇస్తున్నారు. శ్రీకాళహస్తిలో టీడీపీ ప్రధాన నాయకుడు రోజుకు ఒక పల్లెలో పేకాట శిబిరాన్ని విస్తరిస్తున్నాడు.  

కర్నూలు జిల్లాలో పెద్ద మొత్తాలే!
బనగానపల్లి నియోజకవర్గం ఇస్రేనాయక్‌ తండా పరిధిలోని కంబగిరి స్వామి సమీపంలోని ఎర్రమలలో పేకాట నడుస్తోంది. ఇక్కడ ‘హైస్టేక్స్‌’ ఆడతారు. రూ.లక్ష, రూ.2 లక్షల చొప్పున ఆడతారు. ఇక్కడి నుండి నంద్యాలలోని ఓ జిల్లా పోలీసు అధికారికి రోజూ రూ.2 లక్షలు పంపేవారు. ఇటీవల ఆయన బదిలీ అయ్యారు. అయినా పేకాట ఆగలేదు. ఇక్కడికి ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, కడప, పులివెందుల తదితర ప్రాంతాల నుంచి కూడా వస్తున్నారు. 

కర్నూలుకు చెందిన ఓ వ్యక్తి అలంపూరు, గద్వాల ప్రాంతాల్లో జోరుగా పేకాట ఆడిస్తున్నారు. కొణిదెల పేరుతో వాట్సాప్‌ గ్రూప్‌ ఏర్పాటు చేసి అందులో పేకాటరాయుళ్లను సభ్యులుగా చేర్చి జూద శిబిరం నిర్వహించే ప్రాంతం, సమయం మెసేజ్‌ రూపంలో పంపి జోరుగా పేకాట ఆడిస్తున్నారు. ఇటీవల తెలంగాణ పోలీసులు దాడి చేసి రూ.20 లక్షల దాకా నగదు స్వాధీనం చేసుకున్నారు. 

నెలన్నరగా కర్నూలు చుట్టుప్రక్కల ప్రాంతాల్లో పేకాట శిబిరాలు భారీగా పుట్టుకొస్తున్నాయి. ఆలూరు నియోజకవర్గం అగ్రహారం, హత్తి బెళగల్, కల్లెవంక పరిధిలో రోజుకో చోట పేకాట ఆడిస్తున్నారు. ఓ ప్రజాప్రతినిధికి చెందిన ఆరుగురు ప్రధాన అనుచరులు ఈ శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. 

కర్నూలు సిటీలో వెంకటరమణ కాలనీ,  జొహరాపురంలోని ఓ ఇంట్లో, పుల్లయ్య ఇంజనీరింగ్‌ కాలేజీ వెనుక వైపు ఉన్న విల్లాలో, కర్నూలు–నంద్యాల ఔటర్‌ రింగ్‌రోడ్డు పరిధిలో కొండకు దగ్గరగా ఉన్న ఓ వెంచర్‌లో, మహానంది మండలం గాజులపల్లె సమీపంలోని బసాపురంలో, నంద్యాల పరిధిలోని పులిమద్దిలో, ఆత్మకూరు సమీపంలోని అటవీ ప్రాంతంలో, ఆదోని చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీగా పేకాట శిబిరాలు కొనసాగుతున్నాయి. 

ఆదోని వద్ద ఉన్న శిబిరానికి బళ్లారి నుంచి పెద్ద సంఖ్యలో వ్యాపారులు వస్తున్నారు. జూలై 18న ఆళ్లగడ్డ నియోజకవర్గం దొర్నిపాడులో ‘భూమా గోడౌన్‌’లో అఖిలప్రియ చిన్నాన్న భూమా బ్రహ్మానందరెడ్డి పేకాట ఆడిస్తుంటే పోలీసులు దాడి చేశారు. 20 మంది టీడీపీ నేతలను అదుపులోకి తీసుకున్నారు. జూలై 29న శిరివెళ్ల మండలం బోయిలకుంట వద్ద శిబిరంపై పోలీసులు దాడి చేసి, కేవలం ఏడుగురిని మాత్రమే అదుపులోకి తీసుకున్నారు. భారీగా పట్టుపడినప్పటికీ, కొంత డబ్బు మాత్రమే దొరికినట్లు చూపారు.  

పేకాట కేంద్రాల అడ్డాగా రేపల్లె
బాపట్ల జిల్లా రేపల్లెలో మంత్రి అనగాని సత్య­ప్రసాద్‌ మద్దతుతో పేకాట శిబిరాలు జోరుగా సాగుతున్నాయి. ఇటీవల నగరం మండలం వెలమ­వారిపాలెం వద్ద  ఆటగాళ్ల వాహనాల పార్కింగ్‌కు అనువుగా ఉండేలా దాదాపు ఎకరం స్థలంలో పేకాట కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్రం నలు­మూలల నుంచి ఆటగాళ్లను రప్పిస్తున్నారు. రోజూ రూ.కోట్లలోనే ఆట నడుస్తోంది. ఈ ఒక్క కేంద్రం నుంచే ముఖ్యనేత బంధువుకు రోజూ రూ.లక్షల్లో కమీ­షన్‌ వెళుతోంది. 

రేపల్లె ఓల్డ్‌టౌన్‌లో గుడ్డికాయ­లంక, పద్మావతీ టాకీస్‌ సెంటర్, బస్టాండ్‌ ఏరియాలో పేకాట కేంద్రాలు నడుపుతున్నారు. చెరకుపల్లి మండల కేంద్రంలోని భవానీపురం, నిజాంపట్నం మండల కేంద్రం సమీపంలోని ఒక గ్రామంలో పేకాట కేంద్రాలు నిర్వహిస్తున్నారు. ఒక్క రేపల్లె నియోజ­కవర్గంలోనే 20 కేంద్రాలు నడుస్తున్నాయి. మాజీ మంత్రి నక్కా ఆనందబాబు మద్దతులో వేమూరు నియోజకవర్గంలోని కొల్లూరు, భట్టి­ప్రోలు, వేమూరు­లోనూ పేకాట నడుస్తోంది. 

కొందరు అధికార పార్టీ నేతల గెస్ట్‌హౌస్‌లు సైతం పేకాట కేంద్రాలుగా మారాయి. పర్చూరు మండలం కారంచేడు, స్వర్ణ, ఆదిపూడి, దగ్గుపాడు గ్రామాల పరిధిలో నిత్యం పేకాట నడుస్తోంది. ఇక్కడ పొలాల్లోనే ఆట నడిపిస్తు­న్నారు. అద్దంకి, బాపట్ల నియోజకవర్గాల్లోనూ పేకాటలు నిత్యం నడుస్తు­న్నాయి. పేకాట శిబిరాలకు మంత్రి మద్దతు ఉండటంతో పోలీసులు పట్టించుకోవడం లేదు.

గుంటూరు, కృష్ణాలో సకల సౌకర్యాల మధ్య..
గుంటూరు నగరంలో నిత్యం పేకాట రూ.కోట్లలో నడుస్తోంది. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు క్లబ్‌లలో యథేఛ్చగా సాగుతోంది. కొరిటెపాడు వద్ద గల ఎల్‌వీఆర్‌ క్లబ్‌లో నెలన్నరగా పేకాట ప్రారంభించారు. పేకాట ఆడే వారికి అన్ని రకాల సదుపాయాలు, మద్యం, బిర్యానీలతో పాటు వడ్డీ వ్యాపారులు సైతం సిద్ధంగా ఉండేలా క్లబ్‌ నిర్వాహకులు శ్రద్ధ తీసుకుంటున్నారు. గూగుల్‌పే, ఫోన్‌పే ద్వారా కూడా లావాదేవీలు జరుపుతున్నారు. 

ఈ క్లబ్‌ను ఓ మాజీ మంత్రి కనుసన్నల్లో నడిపి­స్తున్నారని సమాచారం. ఇక్కడికి అరండల్‌పేట పోలీస్‌ స్టేషన్‌కు కూత వేటు దూరంలో ఉన్నప్పటికీ పోలీసులు అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. ఈ క్లబ్‌లో 40 టేబుళ్లపై ఆట సాగుతోందని సమాచారం. తద్వారా క్లబ్‌కు రోజూ రూ.20 లక్షలకు పైగానే ఆదాయం వస్తున్నట్లు తెలిసింది. 

గుంటూరు జిల్లా పోలీస్‌ కార్యాలయానికి, ఇటు పట్టాభిపురం పోలీస్‌ స్టేషన్‌కు కూత వేటు దూరంలో ఉన్న నార్త్‌ క్లబ్‌లో, పలకలూ­రులోని గుంటూరు క్లబ్‌లో పేకాట యథేచ్ఛగా సాగుతోంది. నగర శివారులోని నల్లపాడు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో కూడా పలుచోట్ల పేకాట ఆడుతు­న్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం, పెడన, గన్నవరం, పెనమలూరు, గుడివాడ, పామర్రులోని పలు ప్రాంతాల్లో టీడీపీ నేతలు పేకాట శిబిరాలు నిర్వహిస్తున్నారు.  

జూద కేంద్రంగా మారిన పుట్టపర్తి
ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమైన పుట్టపర్తిని జూద కేంద్రంగా మార్చిన కవల సోదరులను పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకోవాలి. మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి జూద కేంద్రాలను ప్రోత్సహించడం సరికాదు. జూదం కారణంగా ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్నం అవుతాయనే విషయాన్ని సీఎం చంద్రబాబునాయుడు గుర్తుంచుకుంటే మంచిది. ఆ ఇద్దరినీ నియంత్రిస్తే పుట్టపర్తి ప్రశాంతంగా ఉంటుంది.
– ఆడపాల వేమనారాయణ, సీపీఐ జిల్లా సమితి సభ్యుడు

కుటుంబాలు నలిగిపోతాయి
రాష్ట్ర ప్రభుత్వం పేకాటను ఇలా ప్రోత్సహిస్తూ పోతే వేల కుటుంబాలు వీధిన పడతాయి. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం పేకాటలను ఇంతలా ప్రోత్సహించిన దాఖలాలు లేవు. ఈ ప్రభుత్వం పేకాటను అధికారికం చేస్తే పేద, మధ్య తరగతి కుటుంబాలతో పాటు సంపన్న కుటుంబాలు సైతం ఆర్థికంగా నలిగిపోయే ప్రమాదం ఉంది. ప్రభుత్వం పట్టించుకోకపోతే మహిళా లోకం పోరాటానికి దిగడం ఖాయం. ఈ ప్రభుత్వాన్ని గద్దెనెక్కించిన మహిళలే తిరిగి గద్దె దించే పరిస్థితి వస్తుంది.
– లాస్య, మచిలీపట్నం, కృష్ణాజిల్లా

పోరాటానికి ఐద్వా సిద్ధమవుతోంది
రాష్ట్రంలో పేకాట క్లబ్‌లకు, పేకాట స్థావరాలకు ఇంత విచ్చలవిడిగా ప్రభుత్వం అనధికార అనుమ­తులి­వ్వడం దారుణం. సమా­జాన్ని నాశనం చేసే పేకాట పట్ల ఈ ప్రభుత్వం ఇలా మద్దతు ఇవ్వడం సరికాదు. ఇప్పటికే ప్రభుత్వం ప్రజలకిచ్చిన వాగ్దానాలను పక్కన పెట్టి, పేకాట వంటి అంశాలకు ప్రాధాన్యత నివ్వటం తగదు. పరిస్థితిలో మార్పు రాకపోతే ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఉద్యమించటానికి ఐద్వా సిద్ధమవుతోంది.
– గాదె ఆదిలక్ష్మి, కార్యదర్శి, ఐద్వా విజయవాడ పశ్చిమం

సంపద ఇలా సృష్టిస్తారా? 
రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభు­త్వం ఏర్పాటైన రెండు నెలల్లోనే పేకాటను ప్రోత్సహించడం దారుణం. ఇప్పటి వరకు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాన్‌ నోరు మెదపటం లేదు. సంపద సృష్టించి యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని, ప్రజలకు సంక్షేమ పథకాలు ఇస్తామని ప్రకటించారు. పేకాల క్లబ్‌లను ఏర్పాటు చేసి అందులో యువతకు ఉద్యోగాలు కల్పిస్తారా? క్లబ్‌ల నుంచి వచ్చే ఆదాయంతో సంక్షేమ పథకాలు అమలు చేస్తారా? ప్రభుత్వం సమాధానం చెప్పాలి. పిల్లల స్కూల్‌ ఫీజులు సైతం చెల్లించలేని స్థితిలోకి ఎందరో వెళ్లిపోతారు. ఏ గృహిణి మెడలోనూ పుస్తెలు ఉండవు.  
– కోట సామ్రాజ్యం, గృహిణి, విజయవాడ 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement