రోడ్లన్నీ అతుకుల బొంతలే  | Ongole-Kurnool Highway Has Quality Less Roads | Sakshi
Sakshi News home page

రోడ్లన్నీ అతుకుల బొంతలే 

Published Wed, Jun 12 2019 9:05 AM | Last Updated on Wed, Jun 12 2019 9:07 AM

Ongole-Kurnool Highway Has Quality Less Roads - Sakshi

పగుళ్లకు పూతలు వేస్తున్న వర్కర్‌లు

సాక్షి, చీమకుర్తి(ప్రకాశం) : రూ.25 కోట్లతో 7 కి.మీ దూరం నిర్మించిన ఫోర్‌లైన్‌ రోడ్డు నిర్మాణం పూర్తయి రెండు మూడు నెలలు కూడా కాలేదు. అప్పుడే పగుళ్లు ఇచ్చాయి. వాటిని కనపడకుండా పైపైన సిమెంట్‌తో మాసికలు వేస్తూ వాటిని క్యూరింగ్‌ చేసేందుకు గోనెపట్టలతో కప్పేశారు. ఇదీ ఒంగోలు బైపాస్‌ నుంచి ఎస్‌ఎస్‌ఎన్‌ ఇంజినీరింగ్‌ కాలేజీ సమీపం వరకు కర్నూల్‌రోడ్డులో నిర్మించిన ఫోర్‌లైన్‌ రోడ్డు నిర్మాణం పరిస్థితి. కర్నూల్‌ రోడ్డులోని నవభారత్‌ బిల్డింగ్స్‌ సమీపంలో 1/750వ కి.మీ రాయి నుంచి 8/250వ కి.మీ రాయి వరకు నిండా 7 కి.మీ కూడా లేని ఫోర్‌లైన్‌ రోడ్డు నిర్మాణంలో మొదటి నుంచి నాణ్యతా లోపాలు ఉన్నాయి.

అంతే కాకుండా ఫోర్‌లైన్‌ రోడ్డు నిర్మించే సమయంలో రోడ్డు మీదున్న ట్రాన్స్‌ఫార్మర్‌లు విద్యుత్‌ స్తంభాలు, ఆక్రమణలు తీయకుండా వాటిని వదిలేసి మిగిలిన ప్రాంతాల్లో రోడ్డు నిర్మించారు. ఆ తర్వాత ట్రాన్స్‌ఫార్మర్‌లు, ఆక్రమణలను తాపీగా తొలగించి ఆయా ప్రదేశాల్లో ముందు వేసిన సిమెంట్‌ రోడ్డుకు ఆనించి సిమెంట్‌రోడ్డు వేయటం వలన జాయింట్‌ల వద్ద అతుకులు కలవక పగుళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇలాంటి సంఘటనలు రోడ్డు మీద పలు చోట్ల ఉండటంతో రోడ్డు ఫోర్‌లైన్‌ కొత్తగా వేసినట్లు లేదని, అతుకులు గతుకుల రోడ్డుగా పాత రోడ్డుకు ప్యాచ్‌ వర్క్‌ చేసినట్లుగా ఉందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

దానికి తగ్గట్టుగానే రోడ్డు నిర్మాణంలో స్థలాభావంతో పేర్నమిట్టలో ఫోర్‌లైన్‌ నిర్మించలేదు. అదే విధంగా క్విస్‌ హైస్కూలు సమీపంలో రోడ్డు మార్జిన్‌లో స్థలం యజమాని కోర్టుకు వెళ్లటంతో ఫోర్‌లైన్‌ నిర్మాణానికి సరిపోక డబుల్‌వేతో పరిపెట్టి ఎగువన, దిగువన ఫోర్‌లైన్‌ నిర్మించి అధికారులు, కాంట్రాక్టర్‌లు చేతులు దులుపుకున్నారు. డబుల్‌వే వద్ద మాత్రం ఫోర్‌లైన్‌ నుంచి నేరుగా అదే సెన్స్‌తో వేగంగా వచ్చే వాహనదారులకు ప్రమాదం జరగకుండా రోడ్డు మార్జిన్‌లో బారికేడ్‌లను ఏర్పాటు చేసి డేంజర్‌ సిగ్నల్స్‌ను అమర్చి మీ చావు మీరు చావండన్నట్లుగా అధికారులు వదిలేశారనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

ఇక ఒంగోలు నుంచి ఫోర్‌లైన్‌ ప్రారంభమయ్యే ప్రదేశంలో రోడ్డు మార్జిన్‌లకు, సైడు కాలువలకు కూడా స్థలం లేకపోవడంతో ఇళ్లను ఆనించి మరీ ఫోర్‌లైన్‌ నిర్మించారు. రేపు వర్షాకాలంలో వచ్చే వరద నీరు ఎటుపోవాలోనని స్థానికలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక రోడ్డు నిర్మాణంలో డివైడర్ల ఏర్పాటులో వాస్తవానికి స్థానికంగా దొరికే మట్టితో నింపాలి. మున్సిపల్‌ కార్పొరేషన్‌ వారు మంచి మట్టి పోసి చెట్లు పెంచుతామన్నారని చెప్పినట్లుగా సాకుతో డివైడర్‌ల మధ్య మట్టిపోయకుండా దాదాపు ఏడాదికి పైగా రోడ్డు నిర్మాణం పూర్తయినా అలాగే ఖాళీగా ఉంచారు. ఇలా రూ.25 కోట్లతో నిర్మించిన ఫోర్‌లైన్‌ రోడ్డు నిర్మాణంలోని అవకతవకలను ఇంజినీరింగ్‌ అధికారులు పర్యవేక్షణా లోపం, ప్రభుత్వ ఒత్తిడిల కారణంగానే రోడ్డు నిర్మాణం లోపభూయిష్టంగా ఉందనే విమర్శలు స్థానిక ప్రజల నుంచి వ్యక్తం అవుతున్నాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement