Contractors negligence
-
కూలిన భవనం స్లాబ్
హైదరాబాద్: కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం కార్మికుల ప్రాణాల మీదకు తెస్తోంది. నగరంలో ఇటీవల జరిగిన రెండు ఘటనల్లో కార్మికులు మృతి చెందిన చేదు జ్ఞాపకాలు మరువక ముందే.. నాణ్యతా ప్రమాణాలకు తిలోదకాలివ్వడంతో తాజాగా ఆదివారం పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని మామిడిపల్లిలో ఇద్దరు కార్మికులు బలయ్యారు. ఇన్స్పెక్టర్ సతీష్, స్థానికుల కథనం ప్రకారం.. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు సంజీవ్ ముదిరాజ్ బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మామిడిపల్లి శివారులో ఇంటి నిర్మాణం చేపట్టాడు. ఇందుకు సంబంధించి నాగరాజు అనే వ్యక్తికి కాంట్రాక్ట్ అప్పగించాడు. మొదటి అంతస్తు పూర్తికాగా.. రెండో అంతస్తు స్లాబ్ పనులను ఆదివారం చేపట్టారు. ఒడిశా రాష్ట్రానికి చెందిన జగదీష్ బీడికర్ (49), ఉత్తరప్రదేశ్‌కు చెందిన కాంక్రీట్ మిషన్ వర్కర్ తిలక్ సింగ్ (33), శ్రీకాంత్, దినేష్, ఉపేందర్, ఆంజనేయులుతో పాటు మరో పది మందిని హయత్‌నగర్‌లోని భవన నిర్మాణ రంగ కార్మికుల అడ్డాపై నుంచి తీసుకొచ్చారు. స్లాబ్ వేస్తున్న క్రమంలో మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఒక్కసారిగా కూలడంతో జగదీష్, తిలక్‌సింగ్ అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడ్డ మరో నలుగురిని చికిత్స నిమిత్తం శంషాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. కాగా ఈ నిర్మాణానికి సంబంధించి అనుమతులు లేనట్లు తెలిసింది. నాణ్యతా ప్రమాణాలు పాటించని కారణంగా ఈ ప్రమాదం జరిగిందని అధికారులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. బాధ్యులపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని పహాడీషరీఫ్ ఇన్స్పెక్టర్ సతీష్ తెలిపారు. గోడ కూలిన ఘటనలో మరొకరు.. దూద్‌బౌలి: నగరంలోని దూద్‌బౌలి ప్రాంతంలో శిథిలావస్థలో ఉన్న భవనం గోడ కూలి 60 ఏళ్ల వ్యక్తి మృతి చెందిన ఘటన కామాటిపుర పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. దూద్‌బౌలి ప్రాంతంలో ఓ పురాతన భవనంలో నివసిస్తున్న నందుకుమార్ జైస్వాల్‌కు ఆదివారం రాత్రి 10 గంటల ప్రాంతంలో కిటికి నుంచి పెద్ద శబ్దం రావడంతో ఆయన బయటికి వచ్చారు. శిథిలావస్థకు చేరిన పురాతన భవనం గోడ కూలి ఆయనపై పడింది. విషయం తెలుసుకున్న స్థానికులు గాయపడిన జైస్వాల్‌ను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు. జీహెచ్ఎంసీ అధికారులు, పోలీసులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. -
రోడ్లన్నీ అతుకుల బొంతలే
సాక్షి, చీమకుర్తి(ప్రకాశం) : రూ.25 కోట్లతో 7 కి.మీ దూరం నిర్మించిన ఫోర్‌లైన్ రోడ్డు నిర్మాణం పూర్తయి రెండు మూడు నెలలు కూడా కాలేదు. అప్పుడే పగుళ్లు ఇచ్చాయి. వాటిని కనపడకుండా పైపైన సిమెంట్‌తో మాసికలు వేస్తూ వాటిని క్యూరింగ్ చేసేందుకు గోనెపట్టలతో కప్పేశారు. ఇదీ ఒంగోలు బైపాస్ నుంచి ఎస్ఎస్ఎన్ ఇంజినీరింగ్ కాలేజీ సమీపం వరకు కర్నూల్‌రోడ్డులో నిర్మించిన ఫోర్‌లైన్ రోడ్డు నిర్మాణం పరిస్థితి. కర్నూల్ రోడ్డులోని నవభారత్ బిల్డింగ్స్ సమీపంలో 1/750వ కి.మీ రాయి నుంచి 8/250వ కి.మీ రాయి వరకు నిండా 7 కి.మీ కూడా లేని ఫోర్‌లైన్ రోడ్డు నిర్మాణంలో మొదటి నుంచి నాణ్యతా లోపాలు ఉన్నాయి. అంతే కాకుండా ఫోర్‌లైన్ రోడ్డు నిర్మించే సమయంలో రోడ్డు మీదున్న ట్రాన్స్ఫార్మర్లు విద్యుత్ స్తంభాలు, ఆక్రమణలు తీయకుండా వాటిని వదిలేసి మిగిలిన ప్రాంతాల్లో రోడ్డు నిర్మించారు. ఆ తర్వాత ట్రాన్స్ఫార్మర్లు, ఆక్రమణలను తాపీగా తొలగించి ఆయా ప్రదేశాల్లో ముందు వేసిన సిమెంట్ రోడ్డుకు ఆనించి సిమెంట్‌రోడ్డు వేయటం వలన జాయింట్ల వద్ద అతుకులు కలవక పగుళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇలాంటి సంఘటనలు రోడ్డు మీద పలు చోట్ల ఉండటంతో రోడ్డు ఫోర్‌లైన్ కొత్తగా వేసినట్లు లేదని, అతుకులు గతుకుల రోడ్డుగా పాత రోడ్డుకు ప్యాచ్ వర్క్ చేసినట్లుగా ఉందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దానికి తగ్గట్టుగానే రోడ్డు నిర్మాణంలో స్థలాభావంతో పేర్నమిట్టలో ఫోర్‌లైన్ నిర్మించలేదు. అదే విధంగా క్విస్ హైస్కూలు సమీపంలో రోడ్డు మార్జిన్లో స్థలం యజమాని కోర్టుకు వెళ్లటంతో ఫోర్‌లైన్ నిర్మాణానికి సరిపోక డబుల్‌వేతో పరిపెట్టి ఎగువన, దిగువన ఫోర్‌లైన్ నిర్మించి అధికారులు, కాంట్రాక్టర్లు చేతులు దులుపుకున్నారు. డబుల్‌వే వద్ద మాత్రం ఫోర్‌లైన్ నుంచి నేరుగా అదే సెన్స్‌తో వేగంగా వచ్చే వాహనదారులకు ప్రమాదం జరగకుండా రోడ్డు మార్జిన్లో బారికేడ్లను ఏర్పాటు చేసి డేంజర్ సిగ్నల్స్‌ను అమర్చి మీ చావు మీరు చావండన్నట్లుగా అధికారులు వదిలేశారనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇక ఒంగోలు నుంచి ఫోర్‌లైన్ ప్రారంభమయ్యే ప్రదేశంలో రోడ్డు మార్జిన్లకు, సైడు కాలువలకు కూడా స్థలం లేకపోవడంతో ఇళ్లను ఆనించి మరీ ఫోర్‌లైన్ నిర్మించారు. రేపు వర్షాకాలంలో వచ్చే వరద నీరు ఎటుపోవాలోనని స్థానికలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక రోడ్డు నిర్మాణంలో డివైడర్ల ఏర్పాటులో వాస్తవానికి స్థానికంగా దొరికే మట్టితో నింపాలి. మున్సిపల్ కార్పొరేషన్ వారు మంచి మట్టి పోసి చెట్లు పెంచుతామన్నారని చెప్పినట్లుగా సాకుతో డివైడర్ల మధ్య మట్టిపోయకుండా దాదాపు ఏడాదికి పైగా రోడ్డు నిర్మాణం పూర్తయినా అలాగే ఖాళీగా ఉంచారు. ఇలా రూ.25 కోట్లతో నిర్మించిన ఫోర్‌లైన్ రోడ్డు నిర్మాణంలోని అవకతవకలను ఇంజినీరింగ్ అధికారులు పర్యవేక్షణా లోపం, ప్రభుత్వ ఒత్తిడిల కారణంగానే రోడ్డు నిర్మాణం లోపభూయిష్టంగా ఉందనే విమర్శలు స్థానిక ప్రజల నుంచి వ్యక్తం అవుతున్నాయి. -
హైవే పనులకు బ్రేక్
పాల్వంచరూరల్ (ఖమ్మం): జాతీయ రహదారి నిర్మాణ పనులు మూడేళ్లుగా నత్తనడకన సాగుతున్నాయి. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. పనులు అస్తవ్యస్తంగా చేపట్టడంతో ప్రమాదకరంగా మారాయి. గత మార్చి నాటికి పనులు పూర్తిచేయాల్సి ఉండగా కాంట్రాక్టర్, అధికారుల నిర్లక్ష్యం కారణంగా జాప్యం జరుగుతోంది. గత పక్షం రోజులుగా పనులు పూర్తిగా నిలిచిపోయాయి. 30వ జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా మూడో ప్యాకేజీ కింద సారపాక నుంచి రుద్రంపూర్ వరకు 42 కిలోమీటర్ల పనులు మూడేళ్ల క్రితం చేపట్టారు. నాలుగు వరుసలుగా నిర్మిస్తున్నారు. అయితే రోడ్డుకు ఒకవైపు కూడా రహదారి పనులు పూర్తికాలేదు. రోడ్డు పక్కన డ్రెయినేజీ పనులను అస్తవ్యస్తంగా చేపట్టారు. పాల్వంచ మండలంలోని కేవశవాపురం నుంచి ఇందిరానగర్ కాలనీ వరకు ఇటీవల వరకు నిర్మాణ పనులు కొనసాగాయి. ఆరోగ్యమాత చర్చ నుంచి సీ కాలనీ గేటు, బస్టాండ్ సెంటర్ నుంచి అంబేడ్కర్ సెంటర్ వరకు ఒక వైపు నిర్మాణం జరిపారు. కానీ అసంపూర్తిగా చేపట్టారు. కల్వర్టులపై స్లాబ్‌లు నిర్మాణం చేయకుండా అర్ధంతరంగా వదిలేశారు. ఒకవైపు రోడ్డు ఎత్తుగా మరోవైపు తక్కువ ఎత్తు ఉండటంతో వాహనదారులకు ప్రమాదకరం మారింది. పెద్దమ్మగుడి సమీపంలోని జగన్నాథపురంలో ఒకవైపు రోడ్డు నిర్మాణం కోసం గుంతలు తవ్వి నిర్లక్ష్యంగా వదిలేశారు. నిర్మాణం జరిగే మార్గంలో కనీసం హెచ్చరిక బోర్డులను కూడా ఏర్పాటు చేయలేదు. కొన్నిచోట్ల ఇసుక బస్తాలను, మరికొన్ని చోట్ల డ్రమ్‌లను ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్నారు. రాత్రి వేళల్లో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. నవభారత్ నుంచి ఇల్లెందు క్రాస్ రోడ్డు వరకు కూడా రోడ్డు పరిస్థితి ఇలాగే ఉంది. హైవేకు ఇరువైపులా నిర్మించిన డ్రెయినేజీ అసంపూర్తిగా ఉంది. డివైడర్ మధ్యలో అక్కడ అక్కడ నిర్మాణ పనులు నాసిరకంగా ఉన్నాయి. వర్షాలు ప్రారంభమైన తర్వాత జూలై నుంచి హైవే పనులు నత్తనడకన సాగగా, ఇటీవల పూర్తిగా నిలిచిపోయాయి. అయినా సంబంధితశాఖ అధికారులు పట్టించుకోవడంలేదనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. వర్షాల కారణంగా పనులు నిలిచిపోయాయి వర్షాల వల్ల జాతీయ రహదారి పనులు పక్షం రోజులుగా నిలిచిపోయాయి. కాంట్రాక్టర్‌కు నోటీసులు జారీ చేశాం. కొత్తగూడెం పట్టణంలో 6 కిలోమీటర్ల మేరకు వాటర్ పైపులైన్ తొలగించకపోవడం వల్ల పనులు చేయలే ని పరిస్థితి నెలకొంది. మూ డుచోట్ల కల్వర్టు పనులు కూడా వర్షంలోనే చేపట్టాం. వర్షాలు తగ్గితే డిసెంబర్ నెలాఖరుకు పాల్వంచ, కొ త్తగూడెం పట్టణాల పరిధి లో పనులు పూర్తి చేస్తాం. నాసిరకం పనులు నిర్వస్తే చర్యలు తీసుకుంటాం. మళ్లీ నిర్మా ణం చేయిస్తాం. –పద్మారావు, ఎన్‌హెచ్ ఈఈ -
నత్త కన్నా చెత్తగా...
మందగమనంలో మంచినీటి పథకాలు * పూర్తి అయ్యింది ఒక్కటే * పనులు జరుగుతున్నవి ఎనిమిది * ప్రారంభం కానివి నాలుగు * రూ.131.8 కోట్లకు ఖర్చు చేసింది రూ.14.50 కోట్లే * ఇదీ ఎన్‌ఆర్‌డీడబ్ల్యూపీ పనితీరు ఏలూరు : జిల్లాలో ఏటా ఎన్ని మంచినీటి పథకాలకు కార్యాచరణ ప్రణాళికలు రచిస్తున్నా...ఆచరణలో మాత్రం సురక్షిత తాగునీరు అందరికీ అందని ద్రాక్షగానే మారుతోంది. అధికారుల పర్యవేక్షణ లోపం... స్థలాల కొరత... కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం...నిధుల లేమి వెరసి గుక్కెడు మంచినీటి కోసం పల్లెలు వెంపర్లాడాల్సిన దుస్థితే రాజ్యమేలుతోంది. ఎన్ని ప్రాజెక్టులున్నా పచ్చని పశ్చిమలో తాగునీటి కోసం ప్రజలు నోళ్లు వెళ్లబెట్టాల్సిన పరిస్థితి ఉంటోంది. ఈ కోవలోకే జాతీయ గ్రామీణ తాగునీటి అభివృద్ధి కార్యక్రమం (ఎన్‌ఆర్‌డీడబ్ల్యూపీ) చేరింది. జిల్లాలో 256 గ్రామాలకు పూర్తిస్థాయిలో తాగునీరందించేందుకు రూ.131.8 కోట్లతో చేపట్టిన మంచినీటి పథకాలు మందగమనంలోనే ఉంటున్నాయి. ఇప్పటి వరకు కేవలం 10 శాతం లోపు నిధులే ఖర్చు అవ్వడంతో రానున్న వేసవి నాటికి పథకాలు ప్రజలకు అక్కరకొచ్చే అవకాశం తక్కువే. ఈ ఏడాదిలో రూ.14.49 కోట్లు ఖర్చు చేసినట్టు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. గతంలో చేపట్టి ఇంకా పూర్తి కాని పనులను కూడా ఇందులో చూపిస్తున్నప్పటికీ అవి కూడా సంవత్సరాలు పట్టే వీలున్నట్టు తెలుస్తోంది. ప్రధానంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పర్యవేక్షణ, సమన్వయంతో నిధులు సకాలంలో విడుదల కాకపోవడంతో పనులన్నీ నత్తతో పోటీ పడుతున్నాయి. ఈ ఏడాది సాధారణ ఎన్నికలు జరిగి ప్రభుత్వాలు కొలువుతీరి పనులపై దృష్టి పెట్టేటప్పటికి దాదాపుగా కాలం ఇట్టే కరిగిపోయింది. ఒక్కటే పూర్తి.... పురోగతి అంతంత మాత్రమే జిల్లాలో ఎన్‌ఆర్‌డీడబ్ల్యూపీ కింద రూ.20 కోట్లతో చేపట్టిన ఉంగుటూరు మంచినీటి ప్రాజెక్టు ఒక్కటే పూర్తి అయినట్టు అధికారులు చెబుతున్నారు. ఉంగుటూరు మండలం నాచుగుంటలో నాలుగేళ్ల క్రితం ప్రారంభించిన ధర్మ చెరువు వద్ద రిజార్వాయర్ నిర్మాణం మందకొడిగా సాగుతోంది. దీని ద్వారా బాదంపూడి, వెల్లమిల్లి, నాచుగుంట, నీలాద్రిపురం గ్రామాలకు పైపులైన్ ద్వారా సురక్షిత మంచినీరు సరఫరా చేయాల్సి ఉంది. ఈ పథకానికి సుమారు రూ.6 కోట్లు మంజూరయ్యాయి. చింతలపూడి నియోజకవర్గంలోని కామవరపుకోట మండలంలో రూ.6.50 కోట్లతో ఐదు నివాసిత ప్రాంతాలకు నీరందించే ప్రాజెక్టుకు ఇప్పటి వరకు రూ.62 లక్షలే ఖర్చు చేశారు. చింతలపూడి మండలంలో రూ.10 కోట్లతో చేపట్టి 10 ఊళ్లకు నీరివ్వాల్సిన ప్రాజెక్టుకు రూ.45 లక్షలు, తాడేపల్లిగూడెం మండలంలో రూ.17.50 కోట్లతో చేపట్టి 10 ఊళ్లకు నీరిచ్చే ప్రాజెక్టుకు రూ.3.51లక్షలు కేటారుుంచారు. తాళ్లపూడి మండలంలో రూ.6కోట్లతో 17 ఊళ్లకు నీరిచ్చే ప్రాజెక్టు పునాది దశలోనే ఉంది. నర్సాపురం, మొగల్తూరు మండలాల్లోని 39 ఊళ్లకు రూ.5 కోట్ల వ్యయంతో నిర్మించాల్సిన నీటి పథకం పనులు రూ.1.13 కోట్ల మేర జరిగాయి. 2013 నవంబర్ నెలాఖరు నాటికి పూర్తి కావాల్సిన పాలకొల్లు మండలంలోని లంకలకోడేరు మంచినీటి పథకం పనులు 10 శాతం కూడా పూర్తి కాలేదు. రూ.3 కోట్ల వ్యయంతో 45 గ్రామాలకు నీరందించాల్సిన ఈ ప్రాజెక్టు పనులు పూర్తికాకపోవడంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. తణుకు మండలం మండపాకతో పాటు మరో 14 ఊళ్లకు నీరందించే రూ.19 కోట్ల ప్రాజెక్టులో ఇప్పటి వరకు రూ.50 వేలే ఖర్చు చేశారు. అత్తిలి గ్రామంలో 30 ఊళ్లకు నీరిందించే రూ.10 కోట్ల ప్రాజెక్టుకు కేవలం రూ.42వేలు ఖర్చు చేశారు. ప్రారంభించాల్సిన నాలుగు ప్రాజెక్టులివే నర్సాపురం మండలంలోని కొప్పర్రు, వేములదీవి గ్రామాల మీదుగా 27 ఊళ్లకు తాగునీటిని అందించే ప్రాజెక్టుకు రూ.20 కోట్లతో, తాళ్లపూడి మండలంలోని 16 ఊళ్లకు నీరందించేందుకు చేపట్టే ప్రాజెక్టుకు రూ.20 కోట్లతో అధికారులు అంచనాలు సిద్ధం చేశారు. వీటికి టెండరు పిలవాల్సి ఉంది. ఉప్పునీటి సమస్య నివారణకుగాను భీమవరం మండలంలోని 13 హేబిటేషన్లకు రూ.9 కోట్లతో నీరందించే ప్రాజెక్టుకు భూసేకరణ పూర్తికావాల్సి ఉంది. ఇక్కడే తీర ప్రాంతంలో రూ.4 కోట్లతో నాలుగు ఊళ్లకు నీరిచ్చే ప్రాజెక్టు భూసేరణ పూర్తి అయింది. పనులు చేపట్టడానికి టెండర్లు పిలిచారు. వర్క్ ఆర్డర్ ఇవ్వాల్సి ఉంది.