హైదరాబాద్: కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం కార్మికుల ప్రాణాల మీదకు తెస్తోంది. నగరంలో ఇటీవల జరిగిన రెండు ఘటనల్లో కార్మికులు మృతి చెందిన చేదు జ్ఞాపకాలు మరువక ముందే.. నాణ్యతా ప్రమాణాలకు తిలోదకాలివ్వడంతో తాజాగా ఆదివారం పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని మామిడిపల్లిలో ఇద్దరు కార్మికులు బలయ్యారు. ఇన్‌స్పెక్టర్ సతీష్, స్థానికుల కథనం ప్రకారం.. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు సంజీవ్ ముదిరాజ్ బడంగ్‌పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మామిడిపల్లి శివారులో ఇంటి నిర్మాణం చేపట్టాడు.
ఇందుకు సంబంధించి నాగరాజు అనే వ్యక్తికి కాంట్రాక్ట్ అప్పగించాడు. మొదటి అంతస్తు పూర్తికాగా.. రెండో అంతస్తు స్లాబ్ పనులను ఆదివారం చేపట్టారు. ఒడిశా రాష్ట్రానికి చెందిన జగదీష్ బీడికర్ (49), ఉత్తరప్రదేశ్‌కు చెందిన కాంక్రీట్ మిషన్ వర్కర్ తిలక్ సింగ్ (33), శ్రీకాంత్, దినేష్, ఉపేందర్, ఆంజనేయులుతో పాటు మరో పది మందిని హయత్‌నగర్‌లోని భవన నిర్మాణ రంగ కార్మికుల అడ్డాపై నుంచి తీసుకొచ్చారు. స్లాబ్ వేస్తున్న క్రమంలో మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఒక్కసారిగా కూలడంతో జగదీష్, తిలక్‌సింగ్ అక్కడికక్కడే మృతి చెందారు.
గాయపడ్డ మరో నలుగురిని చికిత్స నిమిత్తం శంషాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. కాగా ఈ నిర్మాణానికి సంబంధించి అనుమతులు లేనట్లు తెలిసింది. నాణ్యతా ప్రమాణాలు పాటించని కారణంగా ఈ ప్రమాదం జరిగిందని అధికారులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. బాధ్యులపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని పహాడీషరీఫ్ ఇన్‌స్పెక్టర్ సతీష్ తెలిపారు.
గోడ కూలిన ఘటనలో మరొకరు..
దూద్‌బౌలి: నగరంలోని దూద్‌బౌలి ప్రాంతంలో శిథిలావస్థలో ఉన్న భవనం గోడ కూలి 60 ఏళ్ల వ్యక్తి మృతి చెందిన ఘటన కామాటిపుర పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. దూద్‌బౌలి ప్రాంతంలో ఓ పురాతన భవనంలో నివసిస్తున్న నందుకుమార్ జైస్వాల్‌కు ఆదివారం రాత్రి 10 గంటల ప్రాంతంలో కిటికి నుంచి పెద్ద శబ్దం రావడంతో ఆయన బయటికి వచ్చారు. శిథిలావస్థకు చేరిన పురాతన భవనం గోడ కూలి ఆయనపై పడింది. విషయం తెలుసుకున్న స్థానికులు గాయపడిన జైస్వాల్‌ను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు. జీహెచ్‌ఎంసీ అధికారులు, పోలీసులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment