ఇది ఎన్డీఎస్‌ఏ ఆర్డర్‌ | Uttam Kumar Reddy Comments On KTR Over Water Storage In Medigadda Barrage, More Details Inside | Sakshi
Sakshi News home page

ఇది ఎన్డీఎస్‌ఏ ఆర్డర్‌

Published Sat, Jul 27 2024 4:34 AM | Last Updated on Sat, Jul 27 2024 10:41 AM

Uttam Kumar Reddy Comments On KTR Over Water Storage In Medigadda Barrage

బరాజ్‌లలో నీటిని నిల్వ చేయవద్దని ఎన్డీఎస్‌ఏ కమిటీ స్పష్టం చేసింది

నీరు నిల్వచేస్తే బరాజ్‌లు కొట్టుకుపోయి తీవ్ర ఆస్తి, ప్రాణ నష్టం సంభవిస్తుంది 

కేటీఆర్‌ అదే కోరుకుంటున్నట్టు ఉంది 

కేటీఆర్, కేసీఆర్‌ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి.. విలేకరుల సమావేశంలో మంత్రి ఉత్తమ్‌

సాక్షి, హైదరాబాద్‌: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లలో నీటిని నిల్వ చేయరాదని నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ(ఎన్డీఎస్‌ఏ) నిపుణుల కమిటీ కోరిందని..వారికంటే కేటీఆర్‌కు కొద్దిగా ఎక్కువ పరిజ్ఞానం ఉన్నట్టుందని రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఎద్దేవా చేశారు. దేశంలోనే అత్యంత నిపుణులైన ఆరుగురితో ఎన్డీఎస్‌ఏ ఈ కమిటీ ఏర్పాటు చేసిందని, వారి సూచనల ప్రకారమే ప్రభుత్వం ముందుకు పోవాలా? కేటీఆర్‌ చెప్పినట్టు పోవాలా? అని ప్రశ్నించారు.

నీరు ఉన్నా పంపింగ్‌ చేయడం లేదని తప్పుడు ప్రచారం చేస్తున్న కేటీఆర్‌ తన పేరును జోసెఫ్‌ గోబెల్స్‌గా మార్చుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. జలసౌధలో శుకవ్రారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆగస్టు 2లోగా కాళేశ్వరం పంప్‌హౌస్‌లను ఆన్‌ చేయకుంటే 50వేల మంది రైతులతో కలిసి తామే ఆన్‌ చేస్తామని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అలి్టమేటం జారీ చేయడంపై స్పందిస్తూ.. లోక్‌సభ ఎన్నికల్లో ఒక్క ఎంపీ సీటు గెలవకపోవడంతోనే ఇలా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  

పంపింగ్‌ సాధ్యం కాదు 
పంపింగ్‌ చేయాలంటే అన్నారం బరాజ్‌లో కనీసం 11 మీటర్లు, సుందిళ్ల బరాజ్‌లో కనీసం 9 మీటర్ల ఎత్తులో నీరు నిల్వ ఉండాలని, రెండు బరాజ్‌లలో 5 మీటర్ల నీటిమట్టంలోపే బుంగలు పడి ఉండడంతో పంపింగ్‌ సాధ్యం కాదని ఉత్తమ్‌ స్పష్టం చేశారు. బరాజ్‌ల గేట్లు దింపి పంప్‌హౌస్‌ల ద్వారా వాటిలోకి నీరుఎత్తిపోస్తే అవి కొట్టుకుపోతాయని, కేటీఆర్‌ అదే కోరుకుంటున్నట్టు ఉందని అనుమానం వ్యక్తం చేశారు. బరాజ్‌లు కొట్టుకుపోతే భారీ ప్రాణ, ఆస్తినష్టం వాటిల్లుతుందన్నారు.

దిగువ ఉన్న సమ్మక్క బరాజ్, సీతమ్మసాగర్‌ బరాజ్‌లూ కొట్టుకుపోతాయని, భద్రాచలం, ఏటూరునాగారంతో పటు 44 గ్రామాలు పూర్తిగా నీట మునుగుతాయని తెలిపారు. నీళ్లు మళ్లించడానికి తక్కువ నిల్వ సామర్థ్యంతో బరాజ్‌లు నిర్మిస్తారని, ఏకంగా 16 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో మేడిగడ్డ బరాజ్‌ను నిర్మించారని తప్పుబట్టారు. ప్లానింగ్, డిజైన్లు, క్వాలిటీ కంట్రోల్, నిర్మాణం, నిర్వహణ, పర్యవేక్షణ లోపాలతోనే బరాజ్‌లు విఫలమయ్యాయని.. ఎన్డీఎస్‌ఏ కమిటీ నివేదిక ఇచి్చందని గుర్తు చేశారు.  

కేటీఆర్, కేసీఆర్‌ క్షమాపణలు చెప్పాలి  
కమీషన్ల కక్కుర్తితో రీఇంజనీరింగ్‌ చేసి రూ.లక్ష కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారని కేసీఆర్‌పై మంత్రి ఉత్తమ్‌ ఆరోపణలు చేశారు. ప్రాజెక్టు పూర్తయ్యేసరికి రూ.1.47లక్షల కోట్లకు వ్యయం పెరుగుతందని కాగ్‌ తేల్చిందన్నారు. రాష్ట్ర ప్రజలపై ఆర్థికభారం మోపినందుకుగాను మీరు, మీ తండ్రి కేసీఆర్‌.. తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు.  

2 రోజుల్లో ఎల్లంపల్లి నుంచి పంపింగ్‌ 
బరాజ్‌లు మినహా కాళేశ్వరం ప్రాజెక్టులోని మిగిలిన భాగాల ను వాడుకుంటామని మంత్రి ఉత్తమ్‌ స్పష్టం చేశారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి మిడ్‌మానేరుకు నీటిని పంపింగ్‌ చేసే ప్రక్రియ రెండు రోజుల్లో ప్రారంభిస్తామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన రామడుగు, అనంతగిరి, ఇమామాబా ద్, మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్‌తో పాటు ఎగువ మానేరుకు సైతం ఎల్లంపల్లి నీటినే తరలిస్తామని చెప్పారు. ఎల్లంపల్లిలో 14 టీఎంసీల నిల్వలను కొనసాగిస్తూ మిగిలిన నీళ్లను పంపింగ్‌ చేస్తామన్నారు. శ్రీరాంసాగర్‌ నిండిన వెంటనేనీళ్లను ఎత్తిపోస్తామన్నారు. 

విహార యాత్రలకు బీఆర్‌ఎస్‌ నేతలు: జీవన్‌రెడ్డి  
మేడిగడ్డ బరాజ్‌ను బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే నిర్మించగా, వారి హయాంలోనే కుంగిందని ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి స్పష్టం చేశారు. మేడిగడ్డ ఘటన వెనక అనుమానాలున్నాయని కేటీఆర్‌ అనడాన్ని తప్పుబట్టారు. విహార యాత్రల కోసం కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్లారని విమర్శించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement