అంతులేని జాప్యం | hlc bridges construction slow | Sakshi
Sakshi News home page

అంతులేని జాప్యం

Published Thu, Feb 16 2017 11:16 PM | Last Updated on Tue, Sep 5 2017 3:53 AM

అంతులేని జాప్యం

అంతులేని జాప్యం

- నత్తనడకన హెచ్చెల్సీ ఆధునికీకరణ
- అర్ధంతరంగా ఆగిన బ్రిడ్జిల నిర్మాణం
- నేటికీ ప్రారంభం కాని యూటీ పనులు


జిల్లాకు వరదాయని అయిన తుంగభద్ర ప్రధాన ఎగువ కాలువ (హెచ్చెల్సీ) ఆధునికీకరణపై నిర్లక్ష్యపు నీడలు కమ్ముకున్నాయి. తాగు, సాగు నీరందించే ఈ కాలువ గురించి రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. పనుల గడువు పొడిగించుకుంటూనే వెళ్తున్నారు. ఇప్పటికి మూడుసార్లు పొడిగించినా పురోగతి మాత్రం కన్పించడం లేదు.

కణేకల్లు (రాయదుర్గం) : హెచ్చెల్సీ ఆధునికీకరణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. కాంట్రాక్టర్లు అలసత్వం చూపుతుండటంతో అనుకున్న పురోగతి కన్పించడం లేదు. కాలువ శిథిలావస్థకు చేరుకుని సాగునీటి సరఫరాకు అడుగడుగునా అవాంతరాలు ఎదురవుతుండటంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి హెచ్చెల్సీ ఆధునికీకరణకు రూ.475 కోట్లు మంజూరు చేశారు. 2,400 క్యూసెక్కుల ప్రవాహ సామర్థ్యమున్న కాలువను 4,200 క్యూసెక్కులకు పెంచుతూ కాలువను వెడల్పు చేయాలని నిర్ణయించారు. ఆధునికీకరణ పనులను ఆరు ప్యాకేజీలుగా విభజించారు. 2008లో పనులు ప్రారంభమయ్యాయి.

2012లోనే పూర్తి కావాల్సి ఉండేది. ఆది నుంచి కాంట్రాక్టర్లు నిర్లక్ష్యం చేస్తూనే ఉన్నారు. హెచ్చెల్సీకి నీరు బంద్‌ అయిన వెంటనే పనులు ప్రారంభించకపోవడమే ఇందుకు కారణం. నీరు బంద్‌ అయిన రెండు, మూడు నెలలకు పనులు ప్రారంభించి.. జూలై రెండో వారం వరకు అడపాదడపా చేసి చేతులు దులిపేసుకుంటున్నారు. వీటి గురించి జిల్లా మంత్రులు, చీఫ్‌ విప్, ఎమ్మెల్యేలు సైతం పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి. కాంట్రాక్టర్ల కోరిక మేరకు ప్రభుత్వం ఇప్పటి వరకు మూడు సార్లు గడువు ఇచ్చింది. ఆగస్టు 2018లోగా పనులు పూర్తి చేయాలని తుది గడువు విధించింది. ఈ తొమ్మిదేళ్లలో ఒక్కో ప్యాకేజీలో 60 శాతం పనులు కూడా పూర్తి కాలేదు. ఈ నేపథ్యంలో తుది గడువులోపు కూడా పూర్తి కావడం అనుమానంగానే కన్పిస్తోంది.

అసంపూర్తిగా బ్రిడ్జిలు
హెచ్చెల్సీ వ్యవస్థలో కీలకమైన అండర్‌ టన్నెళ్లు (యూటీ), బ్రిడ్జిలు, అక్విడెక్ట్‌ పనుల్లో ఏమాత్రమూ పురోగతి  లేదు. కొందరు కాంట్రాక్టర్లు బ్రిడ్జి పనులను ప్రారంభించారు. ఇవి కూడా పిల్లర్ల స్థాయిలో ఆగిపోయాయి. ఇప్పటి వరకు ఏ బ్రిడ్జి కూడా పూర్తిగా రూపుదిద్దుకోలేదు. ఇక యూటీ పనులు ఏ ఒక్కటీ ప్రారంభించలేదు. పాత యూటీలను తొలగిస్తే కొత్త వాటిని ఏమాత్రమూ ఆలస్యం చేయకుండా పూర్తి చేయాల్సి ఉంటుంది. కాలువకు నీరొచ్చే సమయానికే పూర్తి కావాలి. దీంతో కాలువకు నీరు బంద్‌ అయిన వెంటనే పనులు చేపట్టాలని హెచ్చెల్సీ ఉన్నతాధికారులు ఆదేశిస్తున్నా కాంట్రాక్టర్లు మాత్రం పట్టించుకోవడం లేదు. ప్రస్తుత పరిస్థితులను చూస్తే ఈ ఏడాది కూడా యూటీ పనులు జరగవనే తెలుస్తోంది.

డిస్ట్రిబ్యూటరీలదీ అదే పరిస్థితి
2, 3 ప్యాకేజీల్లో డిస్ట్రిబ్యూటరీ పనులపై ప్రధాన కాంట్రాక్టర్లు నిర్లక్ష్యం చేయడంతో వాటిని హెచ్చెల్సీ అధికారులు ఎస్‌ఆర్‌ కంపెనీకి అప్పగించారు. రెండో ప్యాకేజీలో 2ఏ, 3వ డిస్ట్రిబ్యూటరీ పనులు, మూడో ప్యాకేజీలో 4, 5, 6బీ, 6బీ1ఆర్‌ డిస్ట్రిబ్యూటరీ పనులను ఎస్‌ఆర్‌ కంపెనీతో చేయిస్తున్నారు. నాల్గో ప్యాకేజీలో ప్రధాన కాంట్రాక్టర్‌ 7, 8వ డిస్ట్రిబ్యూటరీ పనులను పూర్తి చేశారు. మెయిన్‌ కెనాల్‌ లైనింగ్‌ పనులు 96 శాతం వరకు జరిగాయి. ఒకటో ప్యాకేజీలో కురువళ్లి, 2వ డిస్ట్రిబ్యూటరీ పనులు ప్రారంభం కాగా.. ఒకటో డిస్ట్రిబ్యూటరీ పనులు నేటికీ మొదలు కాలేదు.

ప్యాకేజీ సంఖ్య    నిధుల కేటాయింపు       కేటాయించిన కి.మీలు         పనిశాతం
1            రూ.65.55 కోట్లు                                     10            54
2            రూ.77.96 కోట్లు                                     15            52
3            రూ.69.92 కోట్లు                                     14            46
4            రూ.108 కోట్లు                                        18            58
5            రూ.66.655 కోట్లు                                   10            27
6            రూ.87.55 కోట్లు                                    17.50          52

గడువులోగా  పూర్తి చేస్తాం
  కొన్ని ప్యాకేజీలకు జూన్‌, మరికొన్ని ప్యాకేజీలకు ఆగస్టు 2018 వరకు గడువు ఇచ్చాం. పనులను పర్యవేక్షిస్తున్న డీఈఈలతో 15రోజులకోసారి ప్రొగ్రెస్‌ రిపోర్ట్‌ తీసుకుంటున్నాం. పనులు వేగవంతమయ్యేలా చూస్తున్నాం. కాంట్రాక్టర్లకు మరోసారి గడువు ఇచ్చేది ఉండదు. యూటీ పనులు చేయాలనుకుంటే ఆలస్యం లేకుండా ప్రారంభించాలని సూచించాం.  
- కె.వెంకటరమణారెడ్డి, హెచ్చెల్సీ ఈఈ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement