దేశానికి స్వాతంత్య్రం లభించిన ఈ ఏడున్నర దశాబ్దాల కాలంలో భారత ఆర్థిక వ్యవస్థ పలు సందర్భాలలో సంక్షోభాల వలయంలో చిక్కుకొన్నప్పటికీ, ఇప్పటి పరిస్థితి అన్నింటికంటే దయనీయంగా ఉంది. సంక్షోభం ఏ ఒక్క రంగానికో పరిమితం కాకుండా సర్వవ్యాపితంగా కనిపిస్తోంది. సెంచరీ దాటిపోయిన పెట్రోల్, డీజిల్ ధరలు ఏడాదవుతున్నా కిందకి దిగడం లేదు. గ్యాస్ సిలిండర్ ధర రూ. 1,100 దాటింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ ఈ 8 ఏళ్లలో దాదాపు 42 శాతం మేర పతనం అయింది. వాస్తవం ఈ విధంగా ఉంటే ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ రూపాయి క్షీణించలేదు... డాలర్ బలపడిందంటూ చేసిన ప్రకటన క్రూర పరిహాసమే!
దేశంలో ద్రవ్యోల్బణం అదుపు తప్పి చాలాకాలమే అయింది. నూనెలు, పప్పు ధాన్యాలు, పండ్లు, కూరగాయలు, బియ్యం, గోధుమలు వంటి నిత్యావసరాల ధరలు పైపైకి పోతున్నాయి. నిరుద్యోగం తీవ్రంగా ఉంది. ఎరువుల ధరలు పెరగడంతో వ్యవసాయ రంగంలో రైతుల ఆదాయం గణనీయంగా పడిపోయింది. కరోనా వల్ల మందగించిన పారిశ్రామిక ఉత్పత్తి పెరుగుదల రేటు కొంత మెరుగయినప్పటికీ ఆశించిన స్థాయిలో లేదు. దేశంలో దిగుమతులు పెరిగాయి. ఎగు మతులలో క్షీణత నమోదవుతోంది. ఫలితంగా కరెంట్ ఎకౌంట్ బ్యాలెన్స్‌లో లోటు పెరిగిపోతోంది. విదేశీ మారక ద్రవ్య నిల్వలు క్రమంగా అడుగంటుతున్నాయి. ఇక, రూపాయి శీఘ్రంగా పతనం అవుతూ సెంచరీ కొట్టే దిశగా సాగిపోతోంది. కేంద్ర ప్రభుత్వం కొత్తగా విధిస్తున్న పన్నులు, సెస్సులు అంతకంతకూ పెరిగిపోతున్నా, ఇబ్బడి ముబ్బడిగా విదేశీ రుణాలు తీసుకొంటున్నా, బడ్జెట్ అవసరాలను తీర్చలేక కేంద్ర ప్రభుత్వం సతమతమవుతోంది.
ఆర్థికరంగం ముఖచిత్రం ఇంత ఘోరంగా తయారవుతుంటే, కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం ఇందుకు బాధ్యత వహించకుండా, ఉక్రెయిన్–రష్యా యుద్ధం, అమెరికా డాలర్ బలపడటం వంటి బయటి అంశాలే కారణమని ఎటువంటి వెరపు లేకుండా సమర్థించు కోవడం అందర్నీ నిశ్చేష్టుల్ని చేస్తోంది. ఎవరు అధికారంలో ఉన్నా... సమస్యలు ఉత్పన్నం కావడం సహజం. కానీ, వాటిని ఎదుర్కొని ప్రతికూల పరిణామాల ప్రభావం ప్రజలపై దీర్ఘకాలం పాటు పడకుండా చూడడమే ప్రభుత్వ బాధ్యత. కేంద్రంలోని ఎన్డీయే తీరు ఎంత బాధ్యతారహితంగా ఉన్నదంటే.. తమ తప్పుల్ని గత పాలకుల పాపాలుగా చూపి చేతులు దులుపుకొనే ప్రయత్నమే చేస్తోంది.
ప్రపంచ మార్కెట్‌లో ముడి చమురు ధర బ్యారెల్‌కు సగటున 90 డాలర్లు మాత్రమే ఉన్నప్పటికీ. దేశీయ మార్కెట్‌లో లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలు రూ.110 కిందికి దిగడం లేదు. 2013లో బ్యారెల్ ధర 140 డాలర్లు పలికినపుడు కూడా లీటర్ పెట్రోల్ రూ. 70 కే లభించిం దికదా? అని ఎవరైనా ప్రశ్నిస్తే... ఆయిల్ కంపెనీలకు కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన బకాయిల్ని చెల్లించడానికి ధర పెంచాం అనే సమాధానం ఇస్తున్నారు. కశ్మీర్‌లో శాంతిభద్రతలు అదుపు తప్పితే.. అందుకు దేశ తొలి ప్రధాని నెహ్రూని నిందిస్తారు. ఆకలి సూచీలో భారత్ ర్యాంకు దిగజారిందంటే, అవన్నీ తప్పుడు లెక్కలని దబాయి స్తున్నారు. రూపాయి పతనానికి వింత భాష్యం చెప్పారు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్. డాలర్‌తో రూపాయి మారకం విలువ ఈ 8 ఏళ్లలో దాదాపు 42 శాతం మేర పతనం అయింది.
ఇటీవలికాలంలో విదేశీ మారకద్రవ్య నిల్వల నుండి దాదాపు ఒక బిలియన్ డాలర్లు వెచ్చించి పటిష్ట స్థాయిలో ఉంచడానికి ప్రయత్నం చేసినా రూపాయి బలపడలేకపోయింది. 642 బిలియన్ డాలర్ల మేర ఉన్న విదేశీ మారక ద్రవ్య నిల్వలు క్రమంగా తరిగిపోతున్నాయి. ఈ మారకం నిల్వలు కేవలం 9 నెలల దిగుమతులకే సరిపోతాయి. కనీసం రెండేళ్ల దిగుమ తులకు సరిపడా విదేశీ మారక ద్రవ్యం ఉంటే... అది ఆరోగ్యకరమైన స్థాయిగా పరిగణిస్తారు. వాస్తవం ఈ విధంగా ఉంటే ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ రూపాయి క్షీణించలేదు... డాలర్ బలపడిం దంటూ చేసిన ప్రకటన క్రూర పరిహాసమే.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పినట్లు నిజంగానే ఇతర కరెన్సీల కంటే రూపాయి మెరుగ్గానే ఉందా? అని ప్రశ్నించు కొంటే సమాధానం దొరకదు. ఉదాహరణకు విదేశాలలో విద్యనభ్య సిస్తున్న భారతీయ విద్యార్థులు ఫీజులు, ప్రయాణ ఖర్చులు, వసతి మొదలైన వాటికయ్యే ఖర్చును డాలర్లలోనే చెల్లించాల్సి ఉంటుంది. ఒక్క బ్రిటన్‌లోనే పౌండ్లలో చెల్లిస్తారు. అంటే, ఇతర కరెన్సీలతో పోలిస్తే రూపాయి మెరుగ్గా ఉందని చెçప్పుకొన్నప్పటికీ... చెల్లింపులన్నీ డాలర్లలో చేసేటప్పుడు అదనపు భారాన్ని ఎవరు మోస్తున్నట్లు? తమ కరెన్సీ విలువ ఎంతో నిర్ధారించుకోవడానికి అన్ని దేశాలు ఫ్లోటింగ్ మారక రేటునే పాటించాలి. కనుక రూపాయి పటిష్టంగా ఉంటే డాలర్‌కు 82 నుంచి 84 రూపాయలు ఎందుకు చెల్లిస్తున్నట్లు? రూపాయి విలువ క్షీణించడం వల్ల విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్‌ఐఐలు) పెట్టుబడులను ఉపసంహరించు కుంటున్నారు.
ద్రవ్యోల్బణం అదుపులో ఉండి, రుణ భారాన్ని తగ్గించుకొంటూ ఆర్థిక సుస్థిరత దిశగా అడుగులు వేసినప్పుడే పరిస్థితులు మెరుగ వుతాయి. విదేశీ వాణిజ్య లోటును తగ్గించుకోవాలంటే దిగుమతుల్ని తగ్గించాలి. ప్రస్తుతం వాణిజ్య లోటు రూ. 2,600 కోట్ల డాలర్ల మేర ఉంటుందని రిజర్వ్ బ్యాంక్ నివేదిక వెల్లడించింది. ముడి చమురు, ఎరువుల దిగుమతులకు అధిక శాతం విదేశీ మారక ద్రవ్య నిల్వలు ఖర్చవుతున్న నేపథ్యంలో పర్యాటకం, పారిశ్రామిక రంగాలను ప్రోత్స హించి విదేశీ కరెన్సీ రాబడి పెరిగేలా చూడాలి. అది జరగాలంటే... దేశంలో శాంతిభద్రతలు మెరుగవ్వాలి. మౌలిక సదుపాయాలు విస్తరించాలి. దిగుమతులలో అత్యధికంగా ఉన్న నూనెగింజలు, పప్పు ధాన్యాలను దేశీయంగానే సాగు చేస్తామని అధికారంలోకి వచ్చిన తొలినాళ్లల్లో ప్రధాని నరేంద్రమోదీ ఇచ్చిన హామీ ఆచరణలోకి రాలేదు.
ఈ అంశంలో నీతి ఆయోగ్ వెలువరించిన విధాన పత్రం ఏమయిందో తెలియదు. కాగా, ఇటీవల బియ్యం ఎగుమతులపై భారీ సుంకం విధించడంతో వాటి ఎగుమతులు మందగించి విదేశీ మారకద్రవ్యం ఆర్జించే అవకాశాలు తగ్గాయి. రష్యాతో చమురు దిగుమతుల ఒప్పందం కుదుర్చుకొన్నాక ఆ చెల్లింపులను డాలర్లలో కాక రూపాయిల్లోనే జరపడం కొంత ఊరట నిచ్చే అంశం. మేకిన్ ఇండియా ద్వారా అనేక ఉత్పత్తులను దేశీయంగా తయారు చేసు కొంటాం అని కేంద్రం నమ్మకంగా చెప్పిన విషయం ఆచరణలో తేలిపోయింది. చైనా ఆర్థికరంగంతో పదేపదే పోల్చుకొంటున్నప్పుడు, చైనా మాదిరిగా అన్ని రంగాలకు అవసరమైన యంత్రాలు, ఇతర సాధన సంపత్తిని ఎందుకు సమకూర్చుకోలేక పోతున్నామో సమీక్షిం చుకోవాల్సిన అవసరం ఉంది.
వ్యక్తిగత రుణాలను ఇచ్చేందుకు బ్యాంకులు విముఖత చూపడంతో వేలాదిమంది రుణ యాప్‌ల ద్వారా అప్పులు తీసుకొని ఆ ఊబిలో కూరుకుపోతున్నారు. రుణయాప్ నిర్వాహకుల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నారు. అదేవిధంగా పబ్లిక్ రంగ బ్యాంకుల బ్రాంచీల సంఖ్యను కుదించడం వల్ల గ్రామీణ ప్రాంతాలలో రైతాంగానికి పరపతి సౌకర్యం మునుపటిలా సజావుగా అందడం లేదన్న ఆరోపణలు ఎక్కువయ్యాయి. దీన్నిబట్టి బ్యాంకింగ్ వ్యవస్థ కేవలం సంపన్న వర్గాల సేవలకే పరిమితం అవుతున్నట్లు భావించాల్సి వస్తోంది.
నిజానికి, కేంద్ర ప్రభుత్వానికి ఇబ్బడిముబ్బడిగా ఆదాయం సమకూరుతుంది. జీఎస్టీ వసూళ్లు గణనీయంగా పెరిగాయి. సెస్సుల ద్వారా రాష్ట్రాలకు వాటా ఇవ్వని ఆదాయం కేంద్రానికి సమకూరు తోంది. ఇదికాక, ఎల్‌ఐసీ వంటి పబ్లిక్ రంగ సంస్థల ప్రైవేటీకరణ ద్వారా లభిస్తున్న నిధులు, ప్రభుత్వ ఆస్తుల అమ్మకం, ‘పీఎం కేర్స్’కు అందుతున్న విరాళాలు... ఇవి చాలవన్నట్లు విదేశీ అప్పులు! ఈ విధంగా పెద్దఎత్తున కేంద్రానికి నిధులు అందుబాటులో ఉన్నాయి. అయితే, ప్రాధాన్యతలను ఎంచుకోవడంలో సరైన విధానం లేకపోవ డంతోపాటు, రాజకీయ వ్యూహాలపై అధిక సమయం వెచ్చిస్తూ దేశాభి వృద్ధిని నిర్లక్ష్యం చేయడం స్పష్టంగా కనిపిస్తోంది. కరోనా కల్లోలం తర్వాత పరిస్థితులు క్రమంగా కుదుటపడినప్పటికీ అన్ని రకాల సేవలు, వస్తువుల ధరలు అనూహ్యంగా పెరిగిన నేపథ్యంలో తమ ఆదాయాల్లో ఏమాత్రం పెరుగుదల లేని సామాన్యులు, మధ్యతరగతి ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలు, కన్నీళ్లకు తక్షణం కేంద్ర ప్రభుత్వం ముగింపు పలకాలి.
సి.రామచంద్రయ్య
వ్యాసకర్త శాసన మండలి సభ్యులు, ఆంధ్రప్రదేశ్
Comments
Please login to add a commentAdd a comment