2024–25పై డెలాయిట్ అంచనా
దేశీయ డిమాండ్ కారణం
న్యూఢిల్లీ: భారత్ ఆర్థిక వ్యవస్థ మార్చితో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2024 ఏప్రిల్– 2025 మార్చి) 6.5 నుంచి 6.8 శాతం శ్రేణిలో వృద్ధి చెందుతుందని ఆర్థిక సేవల దిగ్గజం– డెలాయిట్ అంచనావేసింది. 2025–2026 ఆర్థిక సంవత్సరంలో ఈ రేటు 6.7–7.3 శాతం శ్రేణిలో నమోదవుతుందని అంచనావేసింది. దేశీయ వినియోగం, డిమాండ్ ఎకానమీ పురోగతికి దోహదపడే ప్రధాన అంశాలని వివరించింది. ఈ నెల ప్రారంభంలో భారత రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) 2024– 2025 ఆర్థిక సంవత్సరానికి వృద్ధి అంచనాను 7.2 శాతం నుండి 6.6 శాతానికి తగ్గించిన నేపథ్యంలో తాజా డెలాయిట్ నివేదిక వెలువడింది.
ఎకానమీ పటిష్టమే..
2024–25 ఆర్థిక సంవత్సరపు మొదటి అర్ధభాగంలో వృద్ధి రేట్లు అంచనాలకు తగ్గట్టుగా లేవని డెలాయిట్ ఇండియా ఆర్థిక శాస్త్రవేత్త రుమ్కీ మజుందార్ పేర్కొన్నారు. (క్యూ1, క్యూ2ల్లో వరుసగా 6.7 శాతం, 5.4 శాతం వృద్ధి) ఎన్నికల అనిశ్చితి, భారీ వర్షపాతం, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు డిమాండ్– ఎగుమతులపై ప్రభావం చూపినట్లు ఆయన విశ్లేషించారు. అయితే, వినియోగ ధోరణులు, సేవల వృద్ధి, ఎగుమతుల్లో తయారీ రంగం వాటా పెరగడం, పెట్టుబడులకు సంబంధించి మూలధన మార్కెట్ల స్థిరత్వం వంటి కొన్ని ముఖ్య అంశాల్లో భారత్ ఇప్పటికీ పటిష్టంగా ఉందని అన్నారు. మౌలిక సదుపాయాల అభివృద్ధి, డిజిటైజేషన్, విదేశీ సంస్థాగత పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) ఆకర్షణపై నిరంతరం దృష్టి సారించడం వంటి ప్రభుత్వ చొరవలు వృద్ధిని మరింత పెంచే అంశాలుగా ఉంటాయని మజుందార్ చెప్పారు. తాయా ఆయా అంశాలపై పూర్తి ఆశావాదంతో ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు.
నివేదికలోని మరిన్ని ముఖ్యాంశాలు..
→ తయారీకి సంబంధించి ఎల్రక్టానిక్స్, సెమీ కండక్టర్లు, రసాయనాల వంటి రంగాల్లో ఎగుమతులు పెరుగుతున్నాయి. ప్రపంచ సరఫరాల చైన్‌లో భారత్ స్థానాన్ని పటిష్టపరిచే పరిణామిది.
→ గత రెండున్నర నెలలుగా విదేశీ పెట్టుబడిదారులు వెనక్కివెళ్లినప్పటికీ, రిటైల్ దేశీయ సంస్థల పెట్టుబడుల వల్ల మూలధన మార్కెట్లు స్థిరంగా ఉన్నాయి.
→ 2025 అంతటా డిమాండ్ బాగుంటుందని అంచనా. గ్రామీణ, పట్టణ డిమాండ్ రెండూ కీలక పాత్ర పోషించనున్నాయి. వ్యవసాయ ఆదాయాలు, సబ్సిడీల వినియోగం, సామాజిక సంక్షేమ కార్యక్రమాలు, ప్రభుత్వ ఉపాధి ప్రోత్సాహాలు, డిజిటైజేషన్ అభివృద్ధి, సేవల రంగం వృద్ధి వంటి అంశాలు వినియోగాన్ని విస్తరించడంలో సహాయపడతాయి.
→ భారత ఆర్థిక వ్యవస్థ అంతర్జాతీయ సవాళ్లను అధిగమించి వృద్ధిని కొనసాగించాల్సి ఉంది. భౌగోళిక రాజకీయ ఉద్రికత్తలు, వాణిజ్య వివాదాలు, సరఫరా వయవస్థల్లో అంతరాయం, వాతావరణ మార్పుల ప్రభావం దీర్ఘకాల ఆర్థిక స్థిరత్వాన్ని ప్రభావితం చసే అవకాశం ఉంది.
→ భారత ఆర్థిక వ్యవస్థను అంతర్జాతీయ అనిశ్చితుల నుండి దూరంగా ఎలా ఉంచాలన్న అంశంపై దృష్టి సారించాలి. అధిక సంఖ్యలో ఉన్న యువ శక్తి వినియోగం, నైపుణ్యల మెరుగు, మౌలిక సదుపాయాలను బలపరచడం వంటి అంశాలు వృద్ధికి దోహదపడతాయి.
→ సవాళ్లను అధిగమిస్తూ, స్వయం సమృద్ధి కలిగిన తయారీ రంగం పటిష్టతపై దృష్టి సారించాలి. గ్లోబల్ వ్యాల్యూ చైన్ సెగ్మెంట్లను లక్ష్యంగా పెట్టుకోవడం ద్వారా భారత్ కొత్త అవకాశాలను సృష్టించుకునే అవకాశాలు ఉన్నాయి.
→ భవిష్యత్ పురోగతికి సంబంధించి వ్యూహాత్మక పెట్టుబడులు, విధాన చర్యలు ప్రకటించే అవకాశాలు ఉన్న రాబోయే బడ్జెట్‌పై (2025–26) ప్రస్తుతం అందరి దృష్టి
కేంద్రీకృతమై ఉంది.
Comments
Please login to add a commentAdd a comment