
2029 నాటికి 85 శాతం వృద్ధి
ఎఫ్‌ఐఎఫ్‌ఎస్, డెలాయిట్ నివేదిక
న్యూఢిల్లీ: దేశీయంగా స్పోర్ట్స్ టెక్నాలజీ మార్కెట్ వేగంగా విస్తరిస్తోంది. వచ్చే నాలుగేళ్లలో 85 శాతం వృద్ధి చెందనుంది. 2029 నాటికి రూ. 49,500 కోట్లకు చేరనుంది. ఫ్యాంటసీ గేమ్స్ సంస్థ ఎఫ్‌ఐఎఫ్‌ఎస్, డెలాయిట్ విడుదల చేసిన సంయుక్త నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం 2024 ఆర్థిక సంవత్సరంలో భారతీయ స్పోర్ట్స్–టెక్ మార్కెట్ రూ. 26,700 కోట్ల స్థాయిలో ఉంది. యాప్‌లు, డివైజ్‌లు, సెన్సార్లు మొదలైనవి స్పోర్ట్స్ టెక్ కేటగిరీలోకి వస్తాయి.
డిజిటల్ టెక్నాలజీల రాకతో క్రీడాకారులు పనితీరును మెరుగుపర్చుకునేందుకు అవసరమైన డేటాను అందించడంతో పాటు అభిమానులు కూడా క్రీడలను ఆస్వాదించేందుకు మరింత మెరుగైన అనుభూతిని అందించేందుకు వీలవుతోందని డెలాయిట్ ఇండియా పార్ట్‌నర్ ప్రశాంత్ రావు తెలిపారు. దీంతో కొత్త వ్యాపార అవకాశాలు తెరపైకి వస్తున్నాయని పేర్కొన్నారు. ఈ పరిణామక్రమానికి ఫ్యాంటసీ స్పోర్ట్స్ సారథ్యం వహించగలదని ఆయన చెప్పారు.
గణనీయంగా ఉద్యోగాలు కల్పించడంతో పాటు ఆర్థికంగా సానుకూల ప్రభావాలు కూడా చూపిస్తోందని వివరించారు. 2029 ఆర్థిక సంవత్సరం వరకు పరిశ్రమ ఏటా 7 శాతం మేర వృద్ధి చెందుతుందని, 2027 ఆర్థిక సంవత్సరం నాటికి 17,500 ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలను కల్పిస్తుందని ప్రశాంత్ రావు తెలిపారు. ఇటు క్రీడాకారులు, అటు అభిమానులకు మరో స్థాయిలో స్పోర్ట్స్ అనుభూతిని టెక్నాలజీ అందించగలదని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఫ్యాంటసీ స్పోర్ట్స్ (ఎఫ్‌ఐఎఫ్‌ఎస్) డైరెక్టర్ జనరల్ జాయ్ భట్టాచార్య తెలిపారు.
ఫ్యాంటసీ స్పోర్ట్స్‌పై జీఎస్‌టీ ఎఫెక్ట్..ఫ్యాంటసీ స్పోర్ట్స్ విభాగంపై గ్యాంబ్లింగ్ ట్యాక్స్ రేట్ల స్థాయిలో 28 శాతం జీఎస్‌టీ విధించాలన్న ప్రభుత్వ నిర్ణయంతో 2025 ఆర్థిక సంవత్సరంలో ఈ విభాగం 10 శాతం మేర క్షీణించే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది. జీఎస్‌టీ దెబ్బతో ఫ్యాంటసీ స్పోర్ట్స్ కంపెనీల మార్జిన్లపై 50 శాతం మేర ప్రతికూల ప్రభావం పడుతోందని వివరించింది. జీఎస్‌టీ నిబంధనతో 2023లో ఈ విభాగంపై పెట్టుబడులు 90 శాతం పడిపోయాయని, 2024లో కొత్తగా పెట్టుబడులు రాలేదని నివేదిక పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment