
చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) ఇటీవల విడుదలైన చైనీస్ ఏఐ టూల్ ‘డీప్‌సీక్’ను యుద్ధేతర కార్యకలాపాలకు వాడుతున్నట్లు నిర్ధారించింది. ముఖ్యంగా సైనిక ఆసుపత్రుల్లో చికిత్స ప్రణాళికలను రూపొందించడంలో వైద్యులకు సహాయపడటానికి ఉపయోగిస్తున్నట్లు పేర్కొంది. పీఎల్ఏ ఆస్పత్రులు, పీపుల్స్ ఆర్మ్‌డ్ పోలీస్ (పీఏపీ), నేషనల్ డిఫెన్స్ మొబిలైజేషన్ ఆర్గనైజేషన్లలో డీప్‌సీక్ ఓపెన్ సోర్స్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ (ఎల్ఎల్ఎం)ను వినియోగిస్తున్నట్లు హాంకాంగ్‌కు చెందిన సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ తెలిపింది.
ఈ నెల ప్రారంభంలో జనరల్ ఆసుపత్రి పీఎల్ఏ సెంట్రల్ థియేటర్ కమాండ్ డీప్‌సీక్‌కు చెందిన ఆర్ 1-70బీ ఎల్ఎల్ఎం వాడకానికి అనుమతిచ్చినట్లు ప్రకటించింది. ఇది వైద్యులకు మద్దతుగా నిలుస్తూ చికిత్స ప్రణాళిక సూచనలను అందిస్తుందని తెలిపింది. ఆసుపత్రుల్లోని రోగుల వివరాలు గోప్యంగా ఉంచడానికి, డేటా భద్రతకు ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొంది. ఈ మొత్తం డేటాను స్థానిక సర్వర్లలో నిల్వ చేయనున్నట్లు చెప్పింది. ‘301 ఆసుపత్రి’ అని పిలువబడే బీజింగ్‌లోని ఎలైట్ పీఎల్‌ఏ జనరల్ ఆసుపత్రితో సహా దేశవ్యాప్తంగా ఉన్న ఇతర పీఎల్ఏ హాస్పటల్‌ల్లో దీన్ని ఉపయోగిస్తున్నట్లు స్పష్టం చేసింది. ఇక్కడ చైనా సీనియర్ సైనిక అధికారులు చికిత్స పొందుతారు.
ఆధునీకరణలో భారీగా పెట్టుబడులు పెడుతున్న పీఎల్ఏ కృత్రిమ మేధపై ఎక్కువగా ఆధారపడొద్దని తన సాయుధ దళాలను హెచ్చరించడం గమనార్హం. కృత్రిమ మేధ మార్గనిర్దేశం చేసే సాధనంగా ఉండాలి కానీ యుద్ధభూమిలో మానవ నిర్ణయాలకు ప్రత్యామ్నాయం కాకూడదని తెలిపింది. ఎందుకంటే ఏఐకు స్వీయ అవగాహన సామర్థ్యం లేదని పేర్కొంది. మానవ ఏజెన్సీని భర్తీ చేయడం కంటే కమాండ్ సమర్థతను మెరుగుపరచడానికి నిర్ణయాలు తీసుకునేవారితో కృత్రిమ మేధ కలిసి పనిచేయాలని స్పష్టం చేసింది.
ఇదీ చదవండి: ఏప్రిల్ నుంచి కార్ల ధరలు అప్
ఇటీవల డీప్‌సీక్‌పై సైబర్‌దాడి
జనరేటివ్ ఏఐ సేవలందిస్తున్న చైనీస్ టెక్ స్టార్టప్ డీప్‌సీక్(DeepSeek)పై సైబర్‌దాడి జరిగినట్లు ఇటీవల ప్రకటించింది. ఈ దాడి కారణంగా కొత్త వినియోగదారుల రిజిస్ట్రేషన్లను తాత్కాలికంగా పరిమితం చేస్తున్నట్లు గతంలో కంపెనీ తెలిపింది. ఓపెన్ ఏఐకు సవాలు విసురుతూ జనరేటివ్ ఏఐ రంగంలో విప్లవాత్మక మార్పునకు పునాది వేసింది. చాటీజీపీటీ పెయిడ్ వర్షన్ అందించే సేవలకు ధీటుగా డీప్‌సీక్‌కు చెందిన ఆర్-1 ఉచితంగానే సర్వీసు అందిస్తున్నట్లు కంపెనీ ఇప్పటికే ప్రకటించింది. దాంతో అమెరికన్ టెక్ కంపెనీ స్టాక్‌లు ఇటీవల గణనీయంగా పడిపోయాయి. కంపెనీపై జరిగిన సైబర్ దాడి వినియోగదారుల్లో ఆందోళన కలిగిస్తుంది.