
దేశంలో వివిధ టెలికాం సంస్థలు 5జీ నెట్‌వర్క్ పరిధిని విస్తరిస్తున్నాయి. ఇందుకోసం అవసరమయ్యే మౌలిక సదుపాయాలపై భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. ఇటీవల విడుదలైన ‘నోకియా 2024 మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ ఇండెక్స్ రిపోర్ట్’ దేశీయ 5జీ నెట్‌వర్క్ విస్తరణను విశ్లేషించింది. దేశవ్యాప్తంగా మెరుగవుతున్న టెలికాం కనెక్టివిటీని ఈ నివేదిక హైలైట్ చేసింది. అందులోకి కీలక అంశాలు కింది విధంగా ఉన్నాయి.
పెరుగుతున్న 5జీ వినియోగం
2024లోనే 5జీ డేటా ట్రాఫిక్ మూడు రెట్లు పెరగడం గమనార్హం. మెట్రోపాలిటన్ ప్రాంతాల్లో మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ వాడకంలో 5జీ నెట్‌వర్క్ ప్రస్తుతం 43% వాటాను కలిగి ఉంది. 2023 నుంచి ఈ వాటా దాదాపు రెట్టింపు అయింది. 2024లో ప్రతి వినియోగదారుడి సగటు నెలవారీ డేటా వినియోగం 27.5 జీబీకి చేరుకుంది. గత ఐదేళ్లలో 19.5% సమ్మిళిత వార్షిక వృద్ధి రేటు (సీఏజీఆర్) చొప్పున ఈ వినియోగం పెరిగింది. స్మార్ట్‌ఫోన్లు పెరగడం, మెరుగైన ఇంటర్నెట్ సేవలు, డిజిటల్ కంటెంట్ వ్యాప్తి ఈ పెరుగుదలకు కారణమవుతున్నాయి.
నెట్‌వర్క్ వ్యవస్థ విస్తరణ
దేశంలో 5జీ ఎకోసిస్టమ్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. అందుకు కావాల్సిన పరికరాలు, మౌలిక సదుపాయాలు రెట్టింపు అవుతున్నాయి. 2025 నాటికి దేశంలో దాదాపు 90% స్మార్ట్‌ఫోన్లు 5జీ సామర్థ్యాన్ని కలిగి ఉంటాయని అంచనా. దేశంలో యాక్టివ్ 5జీ డివైజ్‌ల సంఖ్య 2024 నాటికి రెట్టింపై 271 మిలియన్లకు చేరుకుంది. తదుపరితరం వినియోగదారులు అధునాతన కనెక్టివిటీ కోసం సిద్ధంగా ఉంటారని ఇది నిర్ధారిస్తుంది.
ఇదీ చదవండి: అపార్ట్‌మెంట్లు విక్రయించిన అక్షయ్ కుమార్
ఫిక్స్‌డ్ వైర్‌లెస్ యాక్సెస్ ప్రభావం
హైస్పీడ్ ఇంటర్నెట్‌ను అందించడంలో ఫిక్స్‌డ్ వైర్‌లెస్ యాక్సెస్ (ఎఫ్‌డబ్ల్యూఏ) టెక్నాలజీకి పెరుగుతున్న ఆదరణను ఈ నివేదిక ఎత్తిచూపింది. 5జీ ఎఫ్‌డబ్ల్యూఏ వినియోగదారులు సగటు మొబైల్ వినియోగదారుల కంటే 12 రెట్లు ఎక్కువ డేటాను వినియోగించారు. ఇది వెనుకబడిన ప్రాంతాల్లో కనెక్టివిటీ సవాళ్లను పరిష్కరించే సామర్థ్యాన్ని నొక్కి చెబుతుంది. మొత్తం 5జీ డేటా ట్రాఫిక్ 2026 ప్రారంభం నాటికి ప్రస్తుత 4జీ ట్రాఫిక్‌ను మించిపోతుందని నివేదిక అంచనా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment