
ఐఫోన్ 17 అమ్మకాలు షురూ..
న్యూఢిల్లీ: భారత్‌లో శుక్రవారం అందుబాటులోకి వచ్చిన యాపిల్ ఐఫోన్ 17 అభిమానుల్లో మేనియా సృష్టించింది. లేటెస్ట్ ఫోన్‌ను ముందుగా దక్కించుకునేందుకు యాపిల్ స్టోర్స్ ముందు ఫ్యాన్స్ బారులు తీరారు. కొందరు ముందు రోజు రాత్రి నుంచే దాదాపు 21 గంటల పాటు కూడా నిరీక్షిస్తూ కూర్చున్నారు. ముంబై, ఢిల్లీ, బెంగళూరులో చాంతాడంత క్యూలు కనిపించాయి. ఐఫోన్ 17ని మొదటి రోజునే ముందుగా దక్కించుకున్నవారు మిగతా వారితో తమ సంతోషాన్ని పంచుకున్నారు. రికార్డు స్థాయిలో కొనుగోలుదారులు వెల్లువెత్తినట్లు రిటైలర్లు తెలిపారు.
‘నేను పొద్దుటి నుంచే క్యూలో ఉన్నాను. ఈ రంగు ఐఫోన్‌ను కొనుక్కోవడం చాలా సంతోషంగా ఉంది‘ అంటూ ఢిల్లీలోని అష్రఫ్ అనే కొనుగోలుదారు తెలిపారు. బెంగళూరులో కొత్తగా ప్రారంభించిన యాపిల్ హెబ్బాల్ స్టోర్‌లో కూడా ఇలాంటి సందడే నెలకొంది. అటు ముంబైలోని స్టోర్ దగ్గర గుమికూడిన కస్టమర్ల మధ్య ఉదయం సుమారు 6 గంటల ప్రాంతంలో గొడవ తలెత్తడంతో, సెక్యూరిటీ సిబ్బంది పరిష్కరించాల్సి వచ్చింది. ఇటీవల ప్రవేశపెట్టిన ఐఫోన్ 17 సిరీస్ ధర శ్రేణి రూ. 82,900 నుంచి రూ. 2,29,900 వరకు ఉంది.