
న్యూఢిల్లీ: రిలయన్స్ రిటైల్‌కు చెందిన స్పోర్ట్స్‌వేర్ వ్యాపారం ‘పెర్‌ఫార్మెక్స్’ భారీ వృద్ధి ప్రణాళికలతో అడుగులు వేస్తోంది. వచ్చే మూడేళ్లలో సంస్థ వ్యాపారం ఐదు రెట్లు వృద్ధి చెందుతుందని అంచనా వేస్తున్నట్టు రిలయన్స్ రిటైల్ ఫ్యాషన్ అండ్ లైఫ్‌స్టయిల్ ప్రెసిడెంట్ అఖిలేష్ ప్రసాద్ తెలిపారు. క్రీడా కార్యకలాపాలు పెరగడం, ఆరోగ్యకరమైన జీవనం పట్ల అవగాహన విస్తృతం కావడం, ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతుండడం డిమాండ్‌కు సానుకూలంగా పేర్కొన్నారు.
ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్‌తో (ఏఐఎఫ్‌ఎఫ్) పెర్‌ఫార్మెక్స్ తాజాగా భాగస్వామ్యం కుదుర్చుకుంది. భారత ఫుట్‌బాల్ జట్టుకు కిట్, మర్చండైజ్ భాగస్వామిగా పెర్‌ఫార్మెక్స్ వ్యవహరించనుంది. ‘‘ప్రస్తుతం భారత్‌లో స్పోర్ట్స్‌వేర్ పరిమాణం చాలా చిన్న స్థాయిలోనే ఉంది. ఎక్కువ శాతం స్థానిక బ్రాండ్లే ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. కనుక వృద్ధి చెందేందుకు భారీ అవకాశాలున్నాయి. ఈ విషయంలో రిలయన్స్ రిటైల్ ప్రేరణగా నిలవనుంది.
ప్రముఖ అంతర్జాతీయ బ్రాండ్లతో పోలిస్తే అందుబాటు ధరలకే నాణ్యమైన ఉత్పత్తులు అందించడంపై దృష్టి సారించాం’’అని ప్రసాద్ తెలిపారు. రిలయన్స్ రిటైల్ హైదరాబాద్, బెంగళూరు, ముంబై, ఢిల్లీలో ఇప్పటికే 11 స్టాండలోన్ స్పోర్ట్స్‌వేర్ స్టోర్లను ఏర్పాటు చేసింది. నాన్ మెట్రో సహా దేశవ్యాప్తంగా ఇతర పట్టణాల్లోనూ స్టోర్లను తెరిచే ప్రణాళికతో ఉంది. స్టాండలోన్ స్టోర్ల పరంగా తాము మంచి స్పందన చూస్తున్నట్టు ప్రసాద్ వివరించారు. పెర్‌ఫార్మెక్స్ ఉత్పత్తులు ట్రెండ్స్, ఇతర చైన్ స్టోర్లలోనూ లభిస్తాయని చెప్పారు.
ప్రజలకు పెద్ద ఎత్తున అందుబాటులోకి తీసుకొచ్చేందుకు పంపిణీ మార్గాన్ని కూడా ఎంపిక చేసుకుంటున్నట్టు చెప్పారు. ప్రజలు ఆరోగ్యపరంగా స్పృహను కలిగి ఉంటున్నారని, స్పోర్ట్స్‌వేర్ విభాగంలో అందుబాటు ధరలకే నాణ్యమైన ఉత్పత్తులు లభించడం కష్టంగా ఉందన్నారు. ఈ విభాగంలో అంతర్జాతీయ బ్రాండ్లు ఎన్నో ఉన్నప్పటికీ వాటి ధరలు ఎంతో ఖరీదుగా ఉంటున్నాయని, ఎగువ మధ్య తరగతి వారికి సైతం ఇవి అందుబాటులో లేవని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment