
రెండేళ్లలో 250 మంది నియామకం
హైటెక్ సిటీ సమీపానికి కార్యాలయ మార్పు
సరికొత్త డిజిటల్ స్పోర్ట్స్ ఇన్నొవేషన్ సెంటర్
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ స్పోర్ట్స్ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ఫనాటిక్స్ భారత్‌లో తన కార్యకలాపాలను విస్తరించనుంది. ఐసీసీతోపాటు పలు దేశాల్లోని లీగ్‌పోటీలకు, క్రీడాకారులకు జెర్సీలు, జ్ఞాపికలు, ఇతర వాణిజ్య వస్తువుల డిజైనింగ్, తయారీ, మార్కెటింగ్ పనులు ఫనాటిక్స్ వ్యాపారం. ప్రపంచవ్యాప్తంగా సుమారు 80 కేంద్రాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ సంస్థ ఆరేళ్ల క్రితం హైదరాబాద్‌లోనూ ఒక కేంద్రాన్ని ప్రారంభించింది.
అయితే పెరుగుతున్న అవసరాలకు తగినట్లుగా ఈ కేంద్రాన్ని విస్తరించేందుకు నిర్ణయించామని, ఇందులో భాగంగా అభిషేక్ దశ్‌మనాను వైస్ ప్రెసిడెంట్, జనరల్ మేనేజర్‌గా నియమించామని ఫనాటిక్స్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ మథియాస్ స్పైచర్ తెలిపారు. అంతేకాకుండా.. రానున్న రెండేళ్లలో హైదరాబాద్ కేంద్రం ఉద్యోగుల సంఖ్యను 250 నుంచి 500కు పెంచుతామని, వచ్చే ఏడాది తొలినాళ్లలోనే హైటెక్ సిటీ సమీపంలో సుమారు 1,20,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న విశాలమైన ఆఫీసుకు వెళ్లనున్నామని ఆయన వివరించారు.
ఈ కేంద్రం నుంచే ప్రపంచవ్యాప్తంగా ఉన్న పది కోట్ల మంది క్రీడాభిమానులకు ఉత్పత్తులు, సేవలు అందిస్తామని చెప్పారు. సంస్థ కార్యకలాపాలన్నింటికీ హైదరాబాద్ కేంద్ర బిందువుగా మారనుందని అన్నారు. కృత్రిమ మేధ, మెషీన్ లెర్నింగ్ వంటి అనేక అత్యాధునిక టెక్నాలజీలను హైదరాబాద్ కేంద్రంలో ఉపయోగించనున్నామని చెప్పారు. ప్రోడక్ట్ డెవలప్‌మెంట్, డేటా అనలిటిక్స్, ఏఐ అప్లికేషన్స్, ఫనాటిక్స్ గ్లోబల్ కార్యకలాపాలన్నింటికీ అవసరమైన బ్యాక్‌ఎండ్ టెక్నాలజీలను ఇక్కడ అభివృద్ధి చేస్తామన్నారు.
ఈ సందర్భంగా అభిషేక్ దశ్‌మనా మాట్లాడుతూ.. భారత్‌లో క్రీడలపై ఆసక్తి ఏటికేడాదీ పెరుగుతోందని.. క్రీడాభిమానుల మనసు గెలుచుకునేందుకు ఫనాటిక్స్ హైదరాబాద్ కేంద్రం కార్యకలాపాలు ఉపకరిస్తాయన్నారు. ఫనాటిక్స్ ద్వారా ప్రపంచంలోని ఏ మూలనున్న స్పోర్ట్స్ టీమ్ తాలూకూ జెర్సీ, ఇతర వాణిజ్యవస్తువులను భారత్‌లో కూర్చుని తెప్పించుకునేందకు అవకాశం ఏర్పడిందని అన్నారు.
సుమారు 190 దేశాలకు ఫనాటిక్స్ ఉత్పత్తులు రవాణా అవుతూంటాయని, ఇందుకోసం 80కిపైగా తయారీ కేంద్రాలుండగా.. మొత్తం 900 మంది భాగస్వాములతో కలిసి వీటిని ఉత్పత్తి చేస్తున్నామని వివరించారు. ఐపీఎల్ లాంటి భారతీయ క్రీడల్లో భాగస్వామ్యం వహించే ఆలోచన ప్రస్తుతానికి లేదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. మెర్చండైజ్ తయారీ వంటివి భవిష్యత్తులో తగిన సమయంలో చేపట్టే అవకాశం లేకపోలేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment