expands
-
ఫిలిప్పీన్స్‌లో ఇండియన్ కంపెనీ.. 48 దేశాల్లో హవా
ప్రముఖ టూ వీలర్ తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ తన ఉనికిని నిరంతరం విస్తరిస్తూనే ఉంది. ఇందులో భాగంగానే బ్రాండ్ అమ్మకాలను ఇతర దేశాలకు కూడా విస్తరిస్తోంది. ఈ తరుణంలో కంపెనీ తన కార్యకలాపాలను ఫిలిప్పీన్స్‌లో ప్రారంభించింది.కొలంబియన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌లో భాగమైన టెర్రాఫిర్మా మోటార్స్ కార్పొరేషన్ (TMC).. ఫిలిప్పీన్స్‌లోని హీరో మోటోకార్ప్ ఉత్పత్తుల అసెంబ్లర్, విక్రయదారుగా ఉంటుంది. ఈ భాగస్వామ్యం అక్టోబర్ 2022లో ప్రకటించినప్పటికీ ఇప్పటికి అమలు అయ్యింది. దీంతో హీరో మోటోకార్ప్ వాహనాలు ఆగ్నేయాసియా మార్కెట్లోకి కూడా విస్తరిస్తున్నాయి.ఫిలిప్పీన్స్‌లోని లగునాలో టెర్రాఫిర్మా మోటార్స్ కార్పొరేషన్లో అసెంబ్లీ యూనిట్, విడిభాగాల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. సుమారు 600 చదరపు మీటర్ల విస్తీరణంలో ఉన్న ఈ సదుపాయంలో సంవత్సరానికి 1.5 లక్షల యూనిట్ల ఉత్పత్తి సాధ్యమవుతుందని తెలుస్తోంది.ఈ కొత్త తయారీ కేంద్రంలో ఎక్స్‌పల్స్ 200 4వీ, హంక్ 160ఆర్ 4వీ, జూమ్ వంటి టూ వీలర్లను ఉత్పత్తి చేయనున్నట్లు సమాచారం. హీరో మోటోకార్ప్ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా సుమారు 48 దేశాల్లో తన కార్యకలాపాలను నిర్వహిస్తోంది. రాబోయే రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నాము. -
ఫ్రీడమ్ విస్తరణకు ప్రణాళికలు - కేరళ, తమిళనాడులో ప్రవేశించడానికి సన్నద్ధం..
BRAND SUTRA: భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న సన్‌ఫ్లవర్ ఆయిల్ బ్రాండ్ 'ఫ్రీడమ్'.. 2024లో బ్రాండ్ కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోకి కూడా ప్రవేశిస్తుందని, ఆ తరువాత మహారాష్ట్రలో అరంగేట్రం చేయనున్నట్లు సేల్స్ అండ్ మార్కెటింగ్, జెమినీ ఎడిబుల్స్, ఫ్యాట్స్ ఇండియా SVP పి చంద్ర శేఖర రెడ్డి వెల్లడించారు. కంపెనీ అతి పెద్ద నగరాల్లో ప్రవేశించిన తరువాత మరిన్ని ఫ్రీమియం ఆఫర్ల కోసం ప్లాన్ చేస్తున్నట్లు చంద్ర శేఖర రెడ్డి తెలిపారు. ఈయన 2009లో బ్రాండ్ పేరు రూపొందించడానికి ముందు, చాలా కాలం ఎడిబుల్ ఆయిల్స్ విభాగంలో ఉన్నారు. ఆ తరువాత సంస్థ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ 'ప్రదీప్ చౌదరి' బృందం సహకారంతో బ్రాండ్ వేగంగా స్థిరపడింది. 2010లో బ్రాండ్ దాని స్వంత రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో మార్కెట్ లీడర్‌గా అవతరించింది. దక్షిణ భారతదేశంలో సన్‌ఫ్లవర్ ఆయిల్ వినియోగం ఎక్కువగా ఉండటం వల్ల రెడ్డి బృందం ఇతర ప్రాంతాలను కవర్ చేయడానికి ప్రణాళికలు రూపొందించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తరువాత ఒరిస్సా, కర్ణాటకలో బ్రాండ్ ప్రారంభమైంది. ఆ తరువాత చత్తీస్‌గఢ్‌లో కూడా ప్రారంభమైంది. 2024లో తమిళనాడు, కేరళలో ప్రారంభించనున్నట్లు చంద్ర శేఖర రెడ్డి వెల్లడించారు. బ్రాండ్ ప్రారంభమై దాదాపు 13 సంవత్సరాలు కావొస్తోంది. అప్పటి నుంచి వివిధ ప్రాంతాల్లో బ్రాండ్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు, రానున్న రోజుల్లో మరింత వృద్ధి పొందటానికి కావలసిన ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లు చంద్ర శేఖర రెడ్డి తెలిపారు. ఇది కేవలం మార్కెటింగ్ మాత్రమే కాదు, సరఫరా అవసరాలను నిర్వహించడానికి మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడం కూడా. ప్రారంభంలో కొంత మందకొడిగా ఉన్నప్పటికీ 2014 - 15 నాటికి దేశంలోని వివిధ రాష్ట్రలో నెంబర్ వన్ బ్రాండ్‌గా నిలిచింది. ఆ తరువాత 2022 నాటికి జాతీయ స్థాయిలో కూడా పొందగలిగినట్లు ఆయన వెల్లడించారు. ప్రస్తుతం భారత మార్కెట్‌కు అవసరమైన 2.2 మిలియన్ టన్నులలో దాదాపు 95 శాతం దిగుమతి ఉంది. ఇందులో 22 నుంచి 23 శాతం ఫ్రీడమ్ ఉండటం గర్వించదగ్గ విషయం. -
జీవితం విస్తరాకు.. తిన్నాక మరి ఉంచరు! ఏమీ లేకుండానే నిన్ను కూడా!
జీవితం క్షణ భంగురం అని తెలిసి కూడా చేయరాని పనులు చేసి మనిషి ఎన్నో అగచాట్లు పడుతుంటాడు. కొందరు అధికారం, అహం, ఆవేశం, అసూయ అనే 'అ'అక్షరం పట్టుకుని ఆఖరికి.. 'ఆ!'.... అని అర్రుల చాచుతూ ఆక్రందన చేసే పరిస్థితిని కొనితెచ్చుకుంటారు. మరికొందరు కామం, క్రోధం, అనే వాటితో క్షమార్హమైన పనులకు పాల్పడి కష్టాల కడలిలో కొట్టుకుపోతుంటారు. పగ, పిసినారితనం, అనే 'ప' అక్షరాన్ని పట్టుకుని పడరాని పాట్లు పడి పెడబొబ్బలు పెడుతుంటారు మరికొందరు. ఆ తర్వాత ఏదో జబ్బు చేసో లేక అనుకోని ప్రమాదంలోనో తనువు చాలిస్తారు. మన జీవితం ఎలా ఉంది అని ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే అసహ్యం కలగకూడదు. ఏంటిది! జీవితం ఇలా వృథా చేసుకున్నానా? అని తెలుసుకునేలోపే మన కథ ముగిసిపోతుంది. అందుకే అంటారు పెద్దలు బతికి ఉన్నప్పుడే నలుగురికి ఉపయోగపడే పనులు కనీసం ఒక్కటైన చేసి మనిషి అనిపించుకోమని. కనీసం కౌమర, యవ్వన దశలో తెలిసో తెలియకో ఉడుకురక్తంతో ఉచితానుచితాలు ఆలోచించకుండా చేసి ఉండొచ్చు. కనీసం వృద్ధాప్యంలోనైనా తనకు చేతనైనంతలో ఇతరులకు సేవ చేసి తరించాలి. బహుశా అందుకే కాబోలు పెద్దలు మనిషి జీవితం విస్తరాకులాంటిది అని చెప్పారేమో! ఎందుకిలా అన్నారంటే.. ఇది వరకు ఎక్కువగా పెళ్లిళ్లు, పేరంటాలు, వేడుకల్లో.. భోజనాలు విస్తరాకుల్లోనే వడ్డించేవారు. అందువల్ల దీనితో మనిషి జీవితాన్ని పోల్చి ఉండవచ్చు. ఇక మనిషి జీవితానికి విస్తరాక్కి ఉన్న పోలిక ఏంటో చూస్తే.. భోజనం చేసేటప్పుడు మనం కొద్దిగా నీళ్లు విస్తరిలో జల్లి శుభ్రంగా చేసుకుంటాం. ఆ తర్వాత భోజనం పూర్తయ్యేవరకు దానిని జాగ్రత్తగా చూసుకుంటాం. తిన్న మరుక్షణం, ఆ ఆకుని మడిచి దూరంగా విసిరేస్తాం. మనిషి జీవితం కూడా అంతే! ఊపిరి పోగానే ఒక్క క్షణం కూడా ఉంచం. అయితే ఇక్కడ విస్తరాకు పడేసినప్పుడు అది సంతోషడుతుందట. ఎందుకంటే తాను పోయే ముందు కనీసం ఒక్కరి ఆకలినైనా తీర్చటానికి ఉపయోగపడ్డానులే అని తృప్తి పడుతుందట. కానీ మనిషికి ఆ తృప్తి ఉండదు. పోయే ముందు వరకు ఏదో ఒక వ్యాపకంతో సతమతమవుతూ.. ఎవరో ఒకరితో పోట్లాడుతూనే ఉంటాడు మనిషి. చేద్దాంలే సేవ అనుకునేలోపే జీవితం జగడాలు, పట్టింపులతో ముగిసిపోతుంది. ఏ క్షణం మనల్ని మృత్యువు కౌగిలించుకుంటుందో చెప్పలేం. ఆ తరుణం రాగానే మన ఒంటిపై గుడ్డకూడా ఉంచరు. ఎంత పెద్ద ధనికుడైన శ్మశానానికి చేరుకోవాల్సిందే. ఏ డబ్బు కోసం అందరితో తగవులాడి, శత్రుత్వం తెచ్చుకున్నామో.. ఆ సొత్తులోంచి ఒక్క చిల్లిగవ్వ కూడా తీసుకుపోలేం. అందుకే పెద్దలు ఊపిరి ఉన్నప్పుడే నలుగురుకి ఉపయోగపడే పనులు చేసేలా జీవించండిరా! అని హితవు చెప్పేది. లేదంటే విస్తరాకు పాటి విలువ కూడా లేని వృథా జీవితంగా మారుతుందని వారి హెచ్చరిక. (చదవండి: సీతమ్మ తల్లి తనువు చాలించిన ప్రదేశం ఎక్కడో తెలుసా!) -
సన్ లైఫ్ గ్లోబల్ విస్తరణ బాట
న్యూఢిల్లీ: దేశీయంగా కార్యకలాపాలను విస్తరించనున్నట్లు సన్ లైఫ్ గ్లోబల్ సొల్యూషన్స్(ఎస్ఎల్జీఎస్) తాజాగా పేర్కొంది. ఇందుకు అనుగుణంగా రానున్న రెండేళ్లలో 700 మందిని ఉద్యోగాలలోకి తీసుకునే ప్రణాళికల్లో ఉన్నట్లు వెల్లడించింది. కంపెనీ ఇన్నోవేషన్ హబ్ ద్వారా నాలెడ్జ్ సరీ్వసులు, బిజినెస్ సరీ్వసులు అందిస్తోంది. ప్రధానంగా కెనడియన్ దిగ్గజం సన్ లైఫ్ ఫైనాన్షియల్ ఇంక్‌కు సేవలు సమకూరుస్తోంది. ఇండియా, ఫిలిప్పీన్స్ నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్న కంపెనీ ప్రస్తుతం 5,000 మంది సిబ్బందిని కలిగి ఉంది. దేశీయంగా 3,000 మందితో రెండు కేంద్రాల నుంచి, 2,000 మంది ఉద్యోగులతో కెనడా నుంచి సన్ లైఫ్ఫైనాన్షియల్కు తోడ్పాటునిస్తోంది. ఈ రెండు దేశాలలోనూ కలిపి 2025కల్లా మొత్తం 1,000 మందికి ఉపాధి కల్పించే లక్ష్యంతో ఉన్నట్లు ఎస్ఎల్జీఎస్ ఎండీ తరుణ్ సరీన్ తెలియజేశారు. 2022కల్లా సన్ లైఫ్ ఫైనాన్షియల్ నిర్వహణలోని ఆస్తులు 1.33 ట్రిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. -
రీసైక్లింగ్ పరిశ్రమ @ 20 బిలియన్ డాలర్లు!
ముంబై: వ్యర్థాల శుద్ధి పరిశ్రమ (రీసైక్లింగ్) 2030 నాటికి 20 బిలియన్ డాలర్లకు (రూ.1.64 లక్షల కోట్లు) విస్తరిస్తుందని అవెండస్ క్యాపిటల్ సంస్థ అంచనా వేసింది. ప్రస్తుతం ఈ పరిశ్రమ పరిమాణం 4 బిలియన్ డాలర్లుగానే ఉంది. అంటే ఏడేళ్లలో ఐదు రెట్లు పెరగనుంది. వ్యయాలను ఆదా చేయడం, అసలైన మెటీరియల్స్‌పై ఆధారపడడం దీనివల్ల తగ్గుతుందని పేర్కొంది. ప్లాస్టిక్ రీసైక్లింగ్ పరిశ్రమ ప్రస్తుతం 2.3 బిలియన్ డాలర్లుగా ఉండగా, ఎలక్ట్రానిక్ వ్యర్థాల పరిమాణం 1.4 బిలియన్ డాలర్లుగా ఉన్నట్టు తెలిపింది. బ్యాటరీ రీసైక్లింగ్ 100 మిలియన్ డాలర్లుగా ఉండొచ్చని అంచనా వేసింది. ఈ మూడు విభాగాలు కలసి 2030 నాటికి 20 బిలియన్ డాలర్ల స్థాయికి చేరుకుంటాయని తన తాజా నివేదికలో అ వెండస్ క్యాపిటల్ పేర్కొంది. రీసైక్లింగ్ మెటీరియల్ వినియోగం వల్ల సహజ వనరుల క్షీణత తగ్గుతుందని తెలిపింది. ప్లాస్టిక్ వ్యర్థాల శుద్ధి పరిమాణం ఏటా 24 శాతం చొప్పున పెరుగుతూ 2030 నాటికి 10.2 బిలియన్ డాలర్ల స్థాయి విలువకు చేరుకుంటుందని అవెండస్ క్యాపి టల్ వైస్ ప్రెసిడెంట్ ఆశిష్ అహుజా తెలిపారు. ఈ వేస్ట్ రీసైక్లింగ్ ఏటా 23 శాతం చొప్పున పెరుగుతూ ఇదే కాలంలో 7.5 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందన్నారు. ఇక ప్రస్తుతం 100 మిలియన్ డాలర్లుగానే ఉన్న బ్యాటరీ వ్యర్థాల రీసైక్లింగ్ 2 బిలియన్ డాలర్లకు చేరుకోవచ్చని చెప్పారు. -
తెలంగాణలో ‘డెల్టా’ కేసులే ఎక్కువ..!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో నమోదవుతున్న కరోనా కేసుల్లో అత్యధికంగా డెల్టా వేరియంట్ రకానివే ఉన్నట్లు తేలింది. క్రమంగా ఈ వేరియంటే స్థిరపడిపోతున్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ వేరియంట్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన కేసుల్లో రోజురోజుకూ డెల్టా వేరియంట్ కేసులు పెరుగుతున్నట్లు నిర్ధారణ అయింది. రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో నమోదైన కేసుల శాంపిళ్లను శాస్త్రవేత్తలు జీనోమ్ సీక్వెన్సింగ్ చేశారు. ఆ వివరాలు తాజాగా గ్లోబల్ ఇన్షియేటివ్ ఆన్ షేరింగ్ ఏవియన్ ఇన్‌ఫ్లూయెంజా డేటా (జీఐఎస్ఏఐడీ)లో పొందుపరిచారు. అన్ని దేశాల జీనోమ్ సీక్వెన్సింగ్ డేటాను ఇందులోనే అధికారికంగా పొందుపరుస్తారు. ఇందులో రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో డెల్టా వేరియంట్ ఏ స్థాయిలో ఉందో ప్రస్తావించడం గమనార్హం. జూలైలో రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల్లో 95 శాతం డెల్టా వేరియంట్‌వేనని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అందులో జగిత్యాల, జనగాం, మహబూబాబాద్, మంచిర్యాల, మేడ్చల్, ములుగు, నాగర్‌కర్నూలు, నల్లగొండ, రంగారెడ్డి, సంగారెడ్డి, సిరిసిల్ల, వికారాబాద్, వనపర్తి, వరంగల్ వంటి 14 జిల్లాల్లో నమోదైన కేసులన్నీ డెల్టా వేరియంట్‌వేనని నిర్ధారించారు. హైదరాబాద్‌లో నమోదైన వాటిల్లో 94 శాతం, గద్వాల జిల్లాలో 93%, సూర్యాపేట జిల్లాలో 86% కేసులు డెల్టా రకానివని కనుగొన్నారు. నెలనెలా పెరుగుతున్న తీవ్రత ఏప్రిల్ నుంచి రాష్ట్రంలో సెకండ్ వేవ్ తీవ్రత పెరిగిన విషయం విదితమే. డెల్టా వేరియంట్ రకం వైరస్ సోకిన రోగులకు తీవ్ర లక్షణాలు కనిపించాయి. దీంతో వారికి రెమిడెసివిర్, స్టెరాయిడ్స్ ఎక్కించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ సమయంలోనే మరణాలు కూడా అధికంగా నమోదయ్యాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో రాష్ట్రంలో నమోదైన కేసుల్లో 33 శాతం డెల్టా రకానివి ఉండగా, అవి మే నెలలో ఏకంగా 84 శాతానికి పెరిగాయి. జూన్‌లో 86 శాతానికి చేరగా, జూలైలో అదికాస్తా 95 శాతానికి చేరడం గమనార్హం. ఆగస్టులో ఇంకా పెరగవచ్చని భావిస్తున్నారు. ఇదిలా ఉండగా, ప్రస్తుతం రాష్ట్రంలో డెల్టా ప్లస్ కేసులు రెండు నమోదయ్యాయి. డెల్టా రకంతో పోలిస్తే ఇది ప్రమాదకరమా కాదా అన్నదానిపై స్పష్టత లేదు. మహారాష్ట్ర, కేరళలో డెల్టా ప్లస్ కేసులు పెరుగుతున్నాయి. మున్ముందు ఇది మరింత విస్తరించే ప్రమాదముందని హెచ్చరికలు వస్తున్నాయి. థర్డ్‌వేవ్‌లో ఏ రకం వైరస్ విజృంభిస్తుందో ఇంకా స్పష్టత రావడం లేదని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు చెబుతున్నాయి. టీకానే పరిష్కారం: డాక్టర్ శ్రీనివాసరావు, ప్రజారోగ్య సంచాలకుడు కరోనాకు సంబంధించి ఎలాంటి వేరియంట్ వచ్చినా జాగ్రత్తలతోనే తిప్పికొట్టాలి. మాస్క్‌లు ధరించడం, భౌతికదూరం పాటించడం, చేతులను ఎప్పటికప్పుడు పరిశుభ్రం చేసుకోవడంతోనే వైరస్‌ను ఎదుర్కోవచ్చు. వీటితోపాటు వ్యాక్సిన్ వేసుకుంటేనే అన్ని రకాల వైరస్‌లకు చెక్ పెట్టొచ్చు. కాబట్టి ప్రజలు టీకా వేయించుకునేందుకు ముందుకురావాలి. రాష్ట్రంలో 12 లక్షల టీకాలు అందుబాటులో ఉన్నాయి. రెండ్రోజులకోసారి రెండు లక్షల టీకా డోసులను కేంద్ర ప్రభుత్వం పంపిస్తుంది. కాబట్టి టీకాకు ఎక్కడా కొరతలేదు. -
తెలంగాణలో మరో అమెజాన్ ఫుల్ఫిల్మెంట్ సెంటర్...!
హైదరాబాద్: దేశ వ్యాప్తంగా ఫుల్‌ఫిల్ సెంటర్ల విస్తరణలో భాగంగా ప్రముఖ ఈ-కామర్స్ కంపెనీ అమెజాన్ రాష్ట్రంలో మరో ఫుల్ఫిల్మెంట్ సెంటర్‌ను ఏర్పాటుచేయనుంది. ఈ కేంద్రాన్ని హైదరాబాద్ సరిహద్దు ప్రాంతంలోని సిద్దిపేట జిల్లా ములుగు మండలంలో ఫుల్ఫిల్మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేయనుంది. ఇప్పటికే మేడ్చల్‌లో ఉన్న ఫుల్ఫిల్మెంట్ సెంటర్‌ను అదనంగా ఒక లక్ష చదరపు అడుగులతో మొత్తంగా నాలుగు లక్షల చదరపు అడుగులతో స్టోరేజ్ కెపాసిటీపి పెంచింది. తాజాగా అమెజాన్ తీసుకున్న నిర్ణయంతో రాష్ట్రంలో కంపెనీ ఐదు ఫుల్ఫిల్మెంట్ సెంటర్లను కలిగి ఉండనుంది. అంతేకాకుండా రాష్ట్రంలో ఒక మిలియన్ చదరపు అడుగుల స్థలాన్ని కలిగి ఉన్న సంస్థగా అమెజాన్ అవతరించనుంది. రాష్ట్రంలో అమెజాన్ మొత్తం నిల్వ సామర్థ్యం 5 మిలియన్ క్యూబిక్ అడుగులకు చేరనుంది. ఈ సందర్బంగా అమెజాన్ ట్రాన్స్‌పోర్టేషన్ సర్వీస్ డైరక్టర్ అభినవ్ సింగ్ మాట్లాడుతూ..తాజా విస్తరణతో అమెజాన్ తన కస్టమర్లకు లార్జ్ అప్లయేన్సస్, ఫర్నిచర్ విభాగంలో సరికొత్త అనుభూతిని అందిస్తోందని పేర్కొన్నారు. అంతేకాకుండా రాష్ట్రంలోని చిన్న, మధ్య తరగతి వ్యాపారాలకు సాధికారిత వస్తోందని తెలిపారు. ప్రస్తుత విస్తరణతో రాష్ట్రంలో అమెజాన్ ఫ్లోర్ ఏరియా 35 శాతం మేర, ఒవరాల్ స్టోరేజీ కెపాసిటీ 25 శాతానికి పెరుగుతుందని వెల్లడించారు. -
70 నగరాలకు గ్రాసరీ: ఫ్లిప్‌కార్ట్
సాక్షి, ముంబై: గ్లోబల్ రీటైల్ దిగ్గజం వాల్‌మార్ట్ యాజమాన్యంలోని ఫ్లిప్‌కార్ట్ దేశీయంగా కిరాణా సేవల్లో మరింత దూసుకుపోవాలని చూస్తోంది. ఈ క్రమంలో రానున్న ఆరు నెలల్లో 70కి పైగా నగరాలకు తన గ్రాసరీ సేవలను విస్తరించనున్నామని ప్రకటించింది. ఆగస్టు నాటికి గ్రాసరీ సర్వీస్‌ను మరో 20 కిపైగా నగరాలకు పెంచాలని భావిస్తున్నట్టు ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. దేశవ్యాప్తంగాప్రస్తుతం 50 నగరాల్లో ఈ సేవలను కంపెనీ అందిస్తోంది. కోల్‌కతా, పూణే ,అహ్మదాబాద్ వంటి మెట్రో నగరాలతోపాటు, మైసూర్, కాన్పూర్, వరంగల్, అలహాబాద్, అలీగడ్, జైపూర్, చండీగఢ్; రాజ్‌కోట్,వడోదర, వెల్లూరు, తిరుపతి, డామన్ తదితర నగరాలకు గ్రాసరీ సేవలను అందించనున్నట్టు తెలిపింది. (డెలివరీ : ఫ్లిప్‌కార్ట్ కీలక నిర్ణయం) కరోనా మహమ్మారి విస్తృతి నేపథ్యంలో లక్షలాది కస్టమర్లు కిరాణా సరుకుల కోసం ఆన్లైన్ బాట పట్టారు. దీంతో మెట్రోలతోపాటు ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ ఈ-గ్రాసరీ డిమాండ్ పెరిగిందని కంపెనీ తెలిపింది. ఏడాదిలో వ్యాపారం మూడింతలైందని వివరించింది. మార్కెట్‌ప్లేస్ ద్వారా స్థానిక ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలకు ఊతమివ్వడమేగాక లక్షలాది మంది వినియోగదార్లను రైతులతో అనుసంధానిస్తున్నట్టు తెలిపింది. కంపెనీ మెట్రోలతోపాటు తిరుపతి, వరంగల్ వంటి నగరాల్లోనూ అడుగుపెట్టింది. ఫ్లిప్‌కార్ట్ గ్రాసరీ విభాగంలో 200లపైచిలుకు విభాగాల్లో కలిపి 7,000లకుపైగా ఉత్పత్తులను ఆన్లైన్లో విక్రయిస్తోంది. 2020లో రూ.24,090 కోట్లున్న ఈ-గ్రాసరీ విపణి 2025 నాటికి రూ.1,75,200 కోట్లకు చేరనుందని కన్సల్టింగ్ సంస్థ రెడ్‌సీర్ ఇటీవల వెల్లడించింది. 50 శాతంపైగా కిరాణా సరుకుల రిటైల్ మార్కెట్‌ను ఈ-గ్రాసరీ ప్లాట్‌ఫామ్స్ సేవలందించే వీలుందని వివరించింది. అమెజాన్, రిలయన్స్, బిగ్ బాస్కెట్, గ్రోఫర్స్ వంటి సంస్థలూ ఈ రంగంలో పోటీపడుతున్నాయి. -
దక్కకపాయె..
సాక్షిప్రతినిధి, ఖమ్మం: రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో జిల్లాకు చోటు లభించలేదు. తొలివిడత విస్తరణలోనే జిల్లాకు మంత్రి పదవి లభిస్తుందని అందరూ భావించినా.. చివరి నిమిషంలోనైనా చోటు కల్పిస్తారని టీఆర్ఎస్ శ్రేణులు ఆశించినా.. చివరికి నిరాశే మిగిలింది. కొత్తగా కొలువుదీరిన మంత్రివర్గంలో సంఖ్య పరిమితంగా ఉండడం.. వివిధ సమీకరణాల ఆధారంగా కూర్పు ఉండడంతో తొలివిడతలో అవకాశం దక్కలేదని టీఆర్ఎస్ వర్గాలు పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులకు సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నాయి. రాష్ట్రంలోనే ఖమ్మం జిల్లాలో ప్రత్యేక రాజకీయ పరిస్థితులు ఉండడం.. జిల్లాలో ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ నుంచి ఖమ్మం నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేసిన పువ్వాడ అజయ్‌కుమార్ మాత్రమే గెలవడంతో ఆయనకు మంత్రి పదవి ఖాయమని కొంతకాలంగా పార్టీ వర్గాల్లో ప్రచారం హోరెత్తింది. అజయ్ వర్గీయులు సైతం మంత్రి పదవి వస్తుందనే భరోసాతో ఉన్నా.. చివరి నిమిషంలో సీఎం కేసీఆర్ జిల్లా విషయంలో అనూహ్య నిర్ణయం తీసుకోవడంతో రాష్ట్రంలో ఒక్క ఖమ్మం జిల్లాకు మాత్రమే మంత్రివర్గంలో చోటు లభించలేదు. అయితే లోక్‌సభ ఎన్నికల తర్వాత మరోసారి మంత్రివర్గాన్ని పూర్తిస్థాయిలో విస్తరించే అవకాశం ఉన్నందున జిల్లా నుంచి అనూహ్య పరిణామాలు సంభవిస్తే తప్ప టీఆర్ఎస్కు ఏకైక ఎమ్మెల్యేగా ఉన్న అజయ్‌కుమార్‌కు మంత్రివర్గంలో చోటు లభించే అవకాశాలే ఎక్కువ అని పార్టీలోని ఆయన అభిమాన గణం విశ్లేషిస్తోంది. మంగళవారం జరిగిన మంత్రివర్గ విస్తరణకు ముందు ఖమ్మం జిల్లా నుంచి ఎవరికి స్థానం లభిస్తుందనే అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరిగినా.. చివరికి జిల్లాలో ఎవరికీ అవకాశం లభించని పరిస్థితి ఏర్పడింది. ‘సండ్ర’ స్థానంపై ప్రచారం.. సత్తుపల్లి నుంచి టీడీపీ అభ్యర్థిగా విజయం సాధించిన సండ్ర వెంకటవీరయ్య టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకుంటారని, ఆయనకు మంత్రివర్గంలో స్థానం కల్పిస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే సండ్ర టీఆర్ఎస్లో చేరిక అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో మంత్రివర్గ విస్తరణకు ఒక్కరోజు ముందు వరకు అజయ్‌కి మంత్రివర్గంలో అవకాశం ఇస్తారని జిల్లాలో ప్రచారం జరిగింది. అయితే జిల్లా రాజకీయ పరిస్థితులు, రాష్ట్ర రాజకీయ అవసరాలను బేరీజు వేసుకుని టీఆర్ఎస్ అధినేత మంత్రివర్గాన్ని కూర్పు చేశారని.. అందుకే జిల్లాకు తొలివిడతలో అవకాశం రాలేదని టీఆర్ఎస్ వర్గాలు అనుకూల వాదనలు వినిపిస్తున్నాయి. జిల్లాకు చెందిన మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క సీఎల్పీ నేతగా ఎన్నిక కావడంతో టీఆర్ఎస్ సైతం జిల్లాకు అదేస్థాయి ప్రాధాన్యం కల్పిస్తుందని రాజకీయంగా జిల్లాలో బలోపేతం కావడానికి వ్యూహ ప్రతివ్యూహాలు రూపొందిస్తుందని భరోసాగా ఉన్న టీఆర్ఎస్ శ్రేణుల్లో తొలి మంత్రివర్గ విస్తరణలో జిల్లాకు అవకాశం లేకపోవడం కొంత నిస్తేజాన్ని మిగిల్చింది. మరోసారి విస్తరించే మంత్రివర్గంలో జిల్లాకు స్థానం దక్కుతుందనే ఆశతో టీఆర్ఎస్ నేతలు ఉన్నారు. 2014లోనూ.. 2014లో ఏర్పడిన తొలి తెలంగాణ ప్రభుత్వంలోనూ ఖమ్మం జిల్లాకు మొదటి మంత్రివర్గ విస్తరణలో అవకాశం చిక్కలేదు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 నియోజకవర్గాలకుగాను.. టీఆర్ఎస్ తరఫున ఆ సమయంలో కొత్తగూడెం నుంచి పోటీ చేసిన జలగం వెంకట్రావు విజయం సాధించారు. 2014, జూన్ 2న జరిగిన తొలి మంత్రివర్గ విస్తరణలో మాత్రం వెంకట్రావుకు స్థానం లభించలేదు. 2014, డిసెంబర్ 16వ తేదీన రెండోసారి మంత్రివర్గాన్ని విస్తరించిన సమయంలో జిల్లాకు ప్రాతినిధ్యం లభించింది. ఖమ్మం నియోజకవర్గం నుంచి ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందిన తుమ్మల నాగేశ్వరరావు సెప్టెంబర్‌లో టీఆర్ఎస్లో చేరారు. సీఎం కేసీఆర్‌కు సన్నిహితుడిగా పేరొందిన తుమ్మలకు రెండో విడత మంత్రివర్గ విస్తరణలో స్థానం లభించింది. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది రోజులకు ఆయన ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత పాలేరు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున విజయం సాధించి.. తెలంగాణ తొలి ప్రభుత్వంలో మంత్రిగా వ్యవహరించారు. గతంలోనూ టీడీపీ, కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో సైతం ఖమ్మం జిల్లాకు తొలి మంత్రివర్గ విస్తరణలో అవకాశం లభించని సంఘటనలు ఉన్నాయని, అయితే జిల్లాకు రాజకీయంగా గల ప్రాధాన్యత దృష్ట్యా.. పార్టీ అవసరాలను పరిగణనలోకి తీసుకుని జిల్లాకు మంత్రివర్గంలో స్థానం లేని లోటును తీర్చే దిశగా ప్రభుత్వం కసరత్తు చేసే అవకాశం ఉందని.. మంత్రివర్గ విస్తరణ మరోసారి జరిగేలోపే జిల్లా నేతలను కేబినెట్ స్థాయి పదవులు వరించే అవకాశం ఉన్నట్లు సైతం పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కేవలం ఖమ్మం జిల్లాకు మాత్రమే మంత్రివర్గంలో స్థానం కల్పించకపోవడంపై సైతం రాజకీయ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో నెలకొన్న వర్గపోరు కారణంగా పార్టీ ఒక స్థానానికే పరిమితం కావాల్సి వచ్చిందని భావిస్తున్న టీఆర్ఎస్ అధిష్టానం.. కొంత వేచిచూసే ధోరణితో ఉన్నట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. -
హెచ్ఎస్ఐఎల్ మరో ప్లాంటు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హింద్‌వేర్ బ్రాండ్‌తో శానిటరీ వేర్ తయారీలో ఉన్న హెచ్ఎస్ఐఎల్ మరో ప్లాంటును ఏర్పాటు చేయనుంది. ప్రస్తుతం కంపెనీకి హైదరాబాద్ సమీపంలోని బీబీ నగర్‌తోపాటు హర్యానాలోని బహదూర్‌గఢ్‌లో శానిటరీ వేర్ తయారీ కేంద్రాలున్నాయి. మూడవ యూనిట్‌ను పోర్టు సమీపంలో నెలకొల్పుతామని హెచ్ఎస్ఐఎల్ సీఎండీ రాజేంద్ర కె సొమానీ గురువారమిక్కడ మీడియాకు తెలిపారు. ఎప్పుడు, ఎక్కడ నెలకొల్పేది ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. ‘ప్రస్తుతమున్న ప్లాంట్లు పూర్తి స్థాయిలో నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త ఫ్యాక్టరీ స్థాపించాల్సిందే. ఇందుకోసం సుమారు రూ.110 కోట్లు ఖర్చు చేస్తాం’ అని వివరించారు. ఈ ఏడాది విస్తరణ కోసం రూ.150 కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలియజేశారు. మరో రూ.90 కోట్లతో.. పటాన్చెరు వద్ద నెలకొల్పిన ప్లాస్టిక్ పైప్స్, ఫిట్టింగ్స్ యూనిట్లో ఈ ఏడాది ఆగస్టులో ఉత్పత్తి ప్రారంభమైంది. తొలిదశలో రూ.160 కోట్లు పెట్టుబడి పెట్టారు. 2020 నాటికి మరో రూ.90 కోట్లు ఖర్చు చేస్తామని పైప్స్ విభాగం ప్రెసిడెంట్ రాజేశ్ పజ్నూ వెల్లడించారు. ‘రెండేళ్లలో వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 30 వేల టన్నుల నుంచి 45 వేల టన్నులకు చేరుతుంది. ట్రూఫ్లో బ్రాండ్ ద్వారా 2018–19లో రూ.200 కోట్ల వ్యాపారం ఆశిస్తున్నాం. 2022 నాటికి టాప్–5 బ్రాండ్లలో ఒకటిగా నిలుపుతాం’ అని వివరించారు. కాగా, ఏప్రిల్–సెప్టెంబరు కాలంలో హెచ్ఎస్ఐఎల్ రూ.1,172 కోట్ల టర్నోవరుపై రూ.6.8 కోట్ల నికరలాభం ఆర్జించింది. -
మరో 20 నగరాలకు ట్రూజెట్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టర్బో మేఘ ఎయిర్వేస్కు చెందిన విమానయాన సంస్థ ‘ట్రూజెట్’... వచ్చే మార్చి నాటికి మరో 20 నగరాల్లోకి అడుగుపెట్టనుంది. తక్కువ ధరలో సామాన్యులకూ విమాన సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉడాన్ పథకంలో భాగంగా అహ్మదాబాద్ నుంచి కాండ్లా, పోర్బందర్, కేశోడ్, జైసల్మేర్, జల్గావ్, నాసిక్ నగరాలకు ట్రూజెట్ సర్వీసులు నడపనుంది. అలాగే అస్సాం రాజ«ధాని గువహటి నుంచి బర్న్‌పూర్, కూచ్ బిహార్, తేజు, రూప్సి పట్టణాలను కూడా అనుసంధానించనుంది. ఈ సేవల ద్వారా తూర్పు, పశ్చిమ భారత్‌లో అడుగుపెట్టనుంది. ప్రస్తుతం ఈ సంస్థ దక్షిణాదిన హైదరాబాద్, విజయవాడ, కడపతో పాటు 14 నగరాలకు విమాన సర్వీసులు నడుపుతోంది. ఇందులో ఉడాన్ కింద కడప, నాందేడ్, బళ్లారి, మైసూర్, సేలం ఉన్నాయి. ఉడాన్ కింద దక్కించుకున్న అన్ని రూట్లలో సర్వీసులను విజయవంతంగా నడుపుతున్న తొలి సంస్థ ట్రూజెట్ కావడం గమనార్హం. మరో 7 విమానాలు.. ట్రూజెట్ 2015 జూలైలో కార్యకలాపాలు ప్రారంభించింది. మూడు వసంతాలు పూర్తి చేసుకుని నాల్గవ వసంతంలోకి అడుగుపెట్టింది. ఇప్పటి వరకు తమ విమానాల్లో 12 లక్షల పైచిలుకు ప్రయాణికులు రాకపోకలు సాగించారని, తమ వద్ద ఏటీఆర్–72 రకం విమానాలు 5 ఉన్నాయని, మార్చినాటికి కొత్తగా మరో 5 నుంచి 7 విమానాలను లీజు ప్రాతిపదికన సమకూర్చుకుంటామని ట్రూజెట్ సీఈవో విశోక్ మాన్సింగ్ తెలిపారు. మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా గురువారమిక్కడ విలేకరుల సమావేశంలో ఆయన ఈ విషయాలు చెప్పారు. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలను లక్ష్యంగా చేసుకుని విస్తరణ చేపడుతున్నట్టు చెప్పారు. ‘‘ప్రస్తుతం రోజుకు 32 సర్వీసులు నడుపుతున్నాం. ఆగస్టు నుంచి ఈ సంఖ్య 44 లేదా 48కి చేరుతుంది. 85 శాతం ఆక్యుపెన్సీ ఉంది’’ అని వివరించారు. అంతటా పైలట్ల కొరత.. ప్రపంచవ్యాప్తంగా విమానయాన సంస్థలు పైలట్ల కొరతను ఎదుర్కొంటున్నట్లు మాన్సింగ్ తెలియజేశారు. ఇందుకు ట్రూజెట్ మినహాయింపు కాదన్నారు. ‘‘ఒక్కో విమానానికి ఆరుగురు పైలట్లు అవసరమవుతారు. కాకపోతే పైలట్లు అనుభవం సంపాదించిన కొద్దీ పెద్ద విమానాలు నడపటానికి ఆసక్తి చూపిస్తుంటారు. దీంతో కొరత తప్పటం లేదు’’ అన్నారాయన. దేశీయంగా ఏ రూట్లో అయినా 6 నుంచి 9 నెలల్లో ఆపరేషనల్ బ్రేక్ ఈవెన్‌కు చేరుకోవచ్చని సంస్థ సీఎఫ్‌వో విశ్వనాథ్ ఈ సందర్భంగా చెప్పారు. -
బీబీసీ భారీ విస్తరణ..తెలుగులో కూడా
లండన్: ప్రపంచవ్యాప్తంగా వార్తలను అందించడంలో ప్రసిద్ధిగాంచిన బీబీసీ వరల్డ్ సర్వీస్ భారీ విస్తరణ చేపట్టింది. నాలుగు ఆసియా భాషల్లో, ఏడు ఆఫ్రికన్ భాషల్లో మొత్తం 11 కొత్త సేవలను ప్రారంభిస్తున్నట్టు ప్రకటించింది. తెలుగు, గుజరాతీ, మరాఠీ, పంజాబీ భాషల్లో తన సేవలను బుధవారం లాంచ్ చేసింది. వీటితో మరో ఇతర ఏడు భాషల్లో కూడా తన సేవలను విస్తరించనుంది. అఫాన్ ఓరామా, అమ్హారిక్, ఇగ్బో, కొరియన్, పిడ్గిన్, తిగ్రిన్యా, యోరుబా భాషల్లోకూడా తమ సేవలను విస్తరిస్తున్నట్టు బీబీసీ ప్రకటించింది. దీంతోపాటుగా దేశ రాజధాని ఢిల్లీలో బ్రిటన్ వెలుపల అతిపెద్ద బ్యూరోను ఏర్పాటు చేయనుంది. ఈ విస్తరణ ద్వారా 157 మందికి కొత్త ఉద్యోగాలను లభించనున్నాయి. జర్నలిజంలో స్వతంత్ర, నిష్పాక్షికమైన సేవలు అందించే లక్ష్యంతో సాగుతున్నామని బీబీసీ డైరెక్టర్ జనరల్ టోనీ హాల్ తెలిపారు. శతాబ్దం దిశగా సాగుతున్న బీబీసీ ఈ లక్ష్యాన్ని సాధించే ఆత్మవిశ్వాసంతో ఉందన్నారు. బీబీసికి ఇది ఒక చారిత్రాత్మక రోజని ఆయన అభివర్ణించారు. భారతీయ భాషల్లో డిజిటల్, టీవీ, వీడియో ఔట్ పుట్ సేవలను సంయుక్తంగా లాంచ్ చేయనుంది. 1922లో స్థాపించిన బీబీసీ వరల్డ్ సర్వీస్ ..1940 తర్వాత ఇదే అతిపెద్ద విస్తరణ అని అంచనా. దీని ద్వారా లక్షలాది ప్రజలకు తన జర్నలిజం తీసుకుని పోవడానికి సంస్థ యోచిస్తోంది. ముఖ్యంగా భారీ పెరుగుదులను నమోదుచేస్తున్న , యువత, మహిళా ప్రేక్షకులపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించనుంది. ఈ కొత్త సర్వీసులు 2017 నుంచి అందుబాటులోకి రానున్నాయి. అలాగే థాయ్ లో ఈ రోజు పూర్తి డిజిటల్ సేవలను ప్రారంభించింది. 2014లో ప్రవేశపెట్టిన ఫేస్ బుక్ పాప్ అప్ సర్వీసులు విజయవంతంకావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే 2020 నాటికి ప్రపంచవ్యాప్తంగా 500 మిలియన్ ప్రేక్షకులకుచేరువ కావాలని బీబీసీ డైరెక్టర్ జనరల్ టార్గెట్ గా ఎంచుకున్నారు. ఈ తాజా విస్తరణతో బీబీసీ ఇంగ్లీష్ సహా మొత్తం 40 భాషలకు విస్తరించినట్టయింది.