బీబీసీ భారీ విస్తరణ..తెలుగులో కూడా
లండన్: ప్రపంచవ్యాప్తంగా వార్తలను అందించడంలో ప్రసిద్ధిగాంచిన బీబీసీ వరల్డ్ సర్వీస్ భారీ విస్తరణ చేపట్టింది. నాలుగు ఆసియా భాషల్లో, ఏడు ఆఫ్రికన్ భాషల్లో మొత్తం 11 కొత్త సేవలను ప్రారంభిస్తున్నట్టు ప్రకటించింది. తెలుగు, గుజరాతీ, మరాఠీ, పంజాబీ భాషల్లో తన సేవలను బుధవారం లాంచ్ చేసింది. వీటితో మరో ఇతర ఏడు భాషల్లో కూడా తన సేవలను విస్తరించనుంది. అఫాన్ ఓరామా, అమ్హారిక్, ఇగ్బో, కొరియన్, పిడ్గిన్, తిగ్రిన్యా, యోరుబా భాషల్లోకూడా తమ సేవలను విస్తరిస్తున్నట్టు బీబీసీ ప్రకటించింది. దీంతోపాటుగా దేశ రాజధాని ఢిల్లీలో బ్రిటన్ వెలుపల అతిపెద్ద బ్యూరోను ఏర్పాటు చేయనుంది. ఈ విస్తరణ ద్వారా 157 మందికి కొత్త ఉద్యోగాలను లభించనున్నాయి.
జర్నలిజంలో స్వతంత్ర, నిష్పాక్షికమైన సేవలు అందించే లక్ష్యంతో సాగుతున్నామని బీబీసీ డైరెక్టర్ జనరల్ టోనీ హాల్ తెలిపారు.
శతాబ్దం దిశగా సాగుతున్న బీబీసీ ఈ లక్ష్యాన్ని సాధించే ఆత్మవిశ్వాసంతో ఉందన్నారు. బీబీసికి ఇది ఒక చారిత్రాత్మక రోజని ఆయన అభివర్ణించారు.
భారతీయ భాషల్లో డిజిటల్, టీవీ, వీడియో ఔట్ పుట్ సేవలను సంయుక్తంగా లాంచ్ చేయనుంది. 1922లో స్థాపించిన బీబీసీ వరల్డ్ సర్వీస్ ..1940 తర్వాత ఇదే అతిపెద్ద విస్తరణ అని అంచనా. దీని ద్వారా లక్షలాది ప్రజలకు తన జర్నలిజం తీసుకుని పోవడానికి సంస్థ యోచిస్తోంది. ముఖ్యంగా భారీ పెరుగుదులను నమోదుచేస్తున్న , యువత, మహిళా ప్రేక్షకులపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించనుంది. ఈ కొత్త సర్వీసులు 2017 నుంచి అందుబాటులోకి రానున్నాయి.
అలాగే థాయ్ లో ఈ రోజు పూర్తి డిజిటల్ సేవలను ప్రారంభించింది. 2014లో ప్రవేశపెట్టిన ఫేస్ బుక్ పాప్ అప్ సర్వీసులు విజయవంతంకావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే 2020 నాటికి ప్రపంచవ్యాప్తంగా 500 మిలియన్ ప్రేక్షకులకుచేరువ కావాలని బీబీసీ డైరెక్టర్ జనరల్ టార్గెట్ గా ఎంచుకున్నారు. ఈ తాజా విస్తరణతో బీబీసీ ఇంగ్లీష్ సహా మొత్తం 40 భాషలకు విస్తరించినట్టయింది.