
మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ మరణానికి అంతర్జాతీయ మీడియా సంతాపం తెలిపింది. ఆర్థిక సంస్కరణలతో దేశాన్ని అభివృద్ధి బాటన నడిపిన నాయకుడని ప్రపంచ మీడియా ప్రశంసించింది.
ఆర్థిక సంస్కరణల రూపశిల్పి: బీబీసీ
1991లో ఆర్థిక మంత్రిగా, 2004 నుంచి 2014 వరకు ప్రధానిగా భారత ఆర్థిక వ్యవస్థను ఆధునీకరించడంలో మన్మోహన్‌సింగ్ కీలక పాత్ర పోషించారు. ఆయన కీలక సరళీకృత ఆర్థిక సంస్కరణల రూపశిల్పి. భారత అత్యున్నత పదవిని నిర్వహించిన మొదటి సిక్కుగా చారిత్రక ప్రాముఖ్యత కలిగిన నేత. 1984 సిక్కు వ్యతిరేక అల్లర్లకు ఆయన బహిరంగ క్షమాపణ చెప్పారు.
పదవులు నచ్చని రాజు: రాయిటర్స్
మన్మోహన్ సింగ్.. పదవులు నచ్చని రాజు. భారత్‌లో అత్యంత విజయవంతమైన నాయకులలో ఒకరు. ఆయన పాలనలో జరిగిన ఆర్థిక వృద్ధి లక్షలాదిమందిని పేదరికం నుండి బయటకు తీసుకొచ్చింది. గొప్ప ప్రధానిగా ప్రపంచవ్యాప్తంగా గౌరవం పొందినా.. సోనియాగాంధీ చేతిలోనే ప్రభుత్వం ఉందనే విమర్శలను ఆయన ఎదుర్కోవాల్సి వచ్చింది.
దూరదృష్టిగల నేత: న్యూయార్క్ టైమ్స్
మన్మోహన్‌సింగ్ భారతదేశాన్ని ప్రపంచ ఆర్థిక వేదికపైకి నడిపించిన దూరదృష్టి గల నేత, మృదుభాíÙ. పాకిస్తాన్‌తో సయోధ్య కోసం ఆయన అనేక ప్రయత్నాలు చేశారు.
సమగ్రతకు చిహ్నం: వాషింగ్టన్ పోస్ట్
మన్మోహన్‌సింగ్ టెక్నోక్రాట్ నుంచి ప్రధాని స్థాయికి నాటకీయంగా ఎదిగారు. భారత్–అమెరికా సంబంధాలను బలోపేతం చేయడంలో కీలక పాత్రను పోషించారు. ఆయన హయాంలో జరిగిన ఇండో–యూఎస్ పౌర అణు ఒప్పందం ఒక మైలురాయి. సమగ్ర నాయకుడైన ఆయన శక్తిహీనులని ప్రత్యర్థుల నుంచి విమర్శలు ఎదుర్కొన్నారు.
భారత ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టిన వ్యక్తి: బ్లూమ్‌బర్గ్
మన్మోహన్‌సింగ్ గొప్ప సంస్కర్త. 1990లలో భారత ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడంలో కీలక పాత్ర పోషించారు. అవినీతి కుంభకోణాలతో రెండో పర్యాయంలో ఆయన సవాళ్లు ఎదుర్కొన్నారు. ఇది పెట్టుబడిదారులను నిరాశపరిచింది. ఆయన ప్రతిష్ఠను దెబ్బతీసింది.
ఎల్లలెరుగని స్నేహితుడు: ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్
ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించడంలో మన్మోహన్‌సింగ్ పాత్ర అమోఘం. వేగవంతమైన ఆర్థిక వృద్ధికి ఆయన చేసిన కృషి, సంస్కరణలు ఆయన పదవీకాలంలో మైలురాళ్లు. సామాజిక విధానం, దౌత్యంలో ఆయన నాయకత్వం గొప్పది. 2జీ స్పెక్ట్రమ్ కేసు, బొగ్గు కుంభకోణం వంటి వివాదాలు ఆయన తర్వాతి కాలాన్ని దెబ్బతీశాయి.
సౌమ్యుడైన నాయకుడు: అల్ జజీరా
మన్మోహన్ సింగ్ సౌమ్య ప్రవర్తన కలిగిన టెక్నోక్రాట్. గొప్ప వ్యక్తిగత సమగ్రత కలిగిన నాయకుడు. దూర దృష్టితో సామాజిక, ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చారు.