former Prime Minister Manmohan Singh
-
మహమ్మారిపై పోరులో టీకాయే కీలకం
న్యూఢిల్లీ: కోవిడ్ మహమ్మారిపై పోరులో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగవంతం చేయడం చాలా అవసరమని మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ పేర్కొన్నారు. కోవిడ్–19 సంక్షోభంపై కాంగ్రెస్ అత్యంత సీనియర్ నేత అయిన మన్మోహన్ సింగ్ ఈ మేరకు ఆదివారం ప్రధాని మోదీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. తన నిర్మాణాత్మక సలహాలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుని, తదనుగుణంగా చర్యలు తీసుకుంటుందని నమ్మకం ఉందని ఆ లేఖలో పేర్కొన్నారు. ఆయన పేర్కొన్న అంశాలివీ... ► దేశంలో ప్రస్తుతం కొనసాగుతున్న వ్యాక్సినేషన్లో ఎంతమందికి టీకా వేశామన్నది కాకుండా జనాభాలో ఎంత శాతం మందికి టీకా అందిందనే విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. మొత్తం జనాభాతో పోలిస్తే కోవిడ్ బాధితుల సంఖ్య చాలా సంఖ్య చాలా తక్కువ కాబట్టి, సత్వరమే సరైన విధానాలను అమలు చేస్తే మెరుగైన ఫలితాలను మనం సాధించవచ్చు. ► కోవిడ్–19 నివారణలో వాడే కీలక ఔషధాల ఉత్పత్తిని పెంచాలి. హెచ్ఐవీ/ఎయిడ్స్ డ్రగ్స్ అనుమతుల విషయంలో విధించిన నిబంధనలనే కోవిడ్ విషయంలోనూ అమలు చేయాలి. దీని ఫలితంగా, కరోనా టీకా ఉత్పత్తిని చేపట్టే కంపెనీల సంఖ్య పెరుగుతుంది. ► వ్యాక్సిన్ అందాల్సిన 45 ఏళ్లలోపు ఫ్రంట్‌లైన్ వర్కర్ల ఎంపిక విషయంలో రాష్ట్రాలకు కొంత స్వేచ్ఛ కల్పించాలి. ► వచ్చే 6 నెలలకు గాను ఎన్ని డోసుల వ్యాక్సిన్ల కొనుగోలుకు ఆర్డర్లు ఇచ్చింది? ఆయా డోసులను రాష్ట్రాలకు ఎలా పంపిణీ చేయనుంది? వంటి అంశాలనుబహిరంగ పర్చాలి. ► దేశ అవసరాలకు తగ్గట్లుగా టీకా డోసుల ఉత్పత్తిని పెంచేందుకు వ్యాక్సిన్ తయారీదారులకు ప్రభుత్వం సాయంగా నిలవాలి. పెరుగుతున్న అవసరాల దృష్ట్యా.. యూరోపియన్ యూనియన్, అమెరికాలలో పర్మిషన్ పొందిన విదేశీ టీకాలను నేరుగా వ్యాక్సినేషన్‌కు అనుమతించాలి. -
కరణ్ థాపర్‌కు జీకే రెడ్డి పురస్కారం
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: పాత్రికేయరంగంలో ఎనలేని కృషిచేసిన ప్రముఖ జర్నలిస్టు, టీవీ వ్యాఖ్యాత కరణ్ థాపర్‌ను జీకే రెడ్డి స్మారక అవార్డు వరించింది. రాజ్యసభ సభ్యుడు, జీకే రెడ్డి స్మారక అవార్డు వ్యవస్థాపకుడు టి.సుబ్బరామిరెడ్డి, టీఎస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఢిల్లీలో అవార్డు ప్రదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రధాని మన్మోహన్ చేతుల మీదుగా థాపర్ ఈ అవార్డును అందుకున్నారు. సుబ్బరామిరెడ్డి, అవార్డు కమిటీ చైర్మన్, మాజీ కేంద్రమంత్రి కరణ్ సింగ్, మాజీ కేంద్ర మంత్రి ఆనంద్ శర్మ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. అవార్డుతోపాటు ప్రశంసా పత్రం, రూ.5లక్షల నగదు అందజేశారు. -
మన్మోహన్ సింగ్ విమానం ల్యాండవుతుండగా..!
న్యూఢిల్లీ: అది 2007 నవంబర్ 11.. అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ రష్యాలో అధికారిక పర్యటన కోసం ఎయిరిండియా విమానంలో బయలుదేరారు. ప్రధాని ప్రయాణిస్తున్న ఈ వీవీఐపీ విమానం సరిగ్గా మాస్కో విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యే సమయానికి సాంకేతికలోపం తలెత్తింది. బోయింగ్ 747 విమానం ల్యాండింగ్ గేర్ సరిగ్గా పనిచేయలేదు. మాస్కో ఏటీసీ సిబ్బంది వెంటనే విమాన పైలట్లకు సమాచారమిచ్చారు. కాక్‌పిట్‌లో వార్నింగ్ లైట్స్ వెలిగాయి. అందరిలో ఉత్కంఠ రేపిన ఈ ఘటనకు సంబంధించిన ఫ్లయింట్ డాటా రికార్డర్ (ఎఫ్డీఆర్)ను తాజాగా ఓ మీడియా సంస్థ వెలుగులోకి తెచ్చింది. మాస్కో విమానాశ్రయంలో అప్పటి ప్రధాని మన్మోహన్సింగ్ ప్రయాణిస్తున్న విమానం దాదాపు క్రాష్ అయ్యే పరిస్థితి తలెత్తింది. చివరినిమిషంలో సరైన చర్యలు (కరెక్టివ్ యాక్షన్స్) తీసుకోవడం వల్ల ఈ ముప్పు తప్పింది. విమానం ల్యాండింగ్ కావడానికి అవసరమైన లోయర్ గేర్.. ‘ఎలక్ట్రానిక్ గ్లైడ్ స్లోప్’కు కొంత ఎత్తులో ఉన్నంతవరకు పనిచేయలేదు. రన్‌వేపై విమానం ల్యాండవుతున్నప్పుడు వాటి టైర్లు సున్నితంగా నేలను తాకేందుకు వీలుగా ఎలక్ట్రానిక్ గ్లైడ్ స్లోప్ ఉంటుంది. చివరినిమిషం వరకు ఉత్కంఠ రేపిన ఈ వీవీఐపీ విమాన ల్యాండింగ్ ఘటనలో భద్రతా నిబంధనలను ఏమైనా ఉల్లంఘించారా? అనే అంశంపై సదరు జాతీయ పత్రిక ఆరాతీయగా.. విమానం దిగుతున్నప్పుడు రన్‌వేకు తక్కువ ఎత్తులో ఉన్నంతవరకు కరెక్టివ్ యాక్షన్ తీసుకోకపోవడం వల్ల ఇలా జరిగి ఉండొచ్చునని, అందువల్లే ఏటీసీ హెచ్చరికలు జారీచేయడం, కాక్‌పిట్‌లో ప్రమాదఘంటికలు మోగించడం వంటివి జరిగి ఉండవచ్చునని ఓ సీనియర్ పైలట్ తెలిపారు. పైలట్లు లోయర్ గేర్‌ను ఆలస్యంగా వినియోగించడం కూడా ఈ ఘటనకు కారణమై ఉండొచ్చునని చెప్పారు. -
జీఎస్టీపై సహకరించండి
కాంగ్రెస్‌కు ప్రభుత్వం వినతి * సోనియా, మన్మోహన్‌లతో భేటీ అయిన వెంకయ్య * హామీ ఇవ్వని సోనియా.. పార్టీలో చర్చించి చెప్తామని వెల్లడి సాక్షి, న్యూఢిల్లీ: వస్తువులు, సేవల పన్ను (జీఎస్టీ) బిల్లు ఆమోదం కోసం కేంద్ర ప్రభుత్వం మరోసారి కాంగ్రెస్ గడప తొక్కింది. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్యనాయుడు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌లతో గురువారం భేటీ అయ్యారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జీఎస్టీ, రియల్ ఎస్టేట్ బిల్లుల ఆమోదానికి సహకరించాలని.. కాంగ్రెస్ సానుకూలంగా స్పందించినట్లయితే, పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలను సాధారణ షెడ్యూలు కంటే ముందస్తుగా జరపడానికి ప్రభుత్వ సన్నద్ధతను సోనియాకు వెంకయ్య వివరించారు. గత నవంబర్ 27న ప్రధానమంత్రి నివాసంలో మోదీతో సోనియా, మన్మోహన్‌ల భేటీ తర్వాత ప్రభుత్వం తరపున కాంగ్రెస్‌తో అధికారికంగా జరిగిన భేటీ ఇదే. దాదాపు 20 నిమిషాల పాటు సాగిన చర్చల అనంతరం వెంకయ్య మీడియాతో మాట్లాడుతూ జీఎస్టీతో పాటు ఇతర కీలక బిల్లులపై కాంగ్రెస్ తుది వైఖరిని స్పష్టం చేయాలని కోరినట్లు తెలిపారు. బిల్లుపై కాంగ్రెస్ లేవనెత్తిన వివిధ అంశాలపై జైట్లీ ఇప్పటికే సమాధానాలిచ్చారని కాగ్రెస్ నాయకత్వానికి తెలియజేసినట్లు వివరించారు. రియల్ ఎస్టేట్ బిల్లుపై సెలెక్ట్ కమిటీ నివేదికను కేంద్రం ఆమోదించిందని,అందువల్ల ఈ రెండు బిల్లులకు ఆమోదం లభించేలా సహకరించాలని వెంకయ్య కోరారు. తమ పార్టీలో అంతర్గతంగా చర్చించి చెబుతామని సోనియా గాంధీ తమతో చెప్పారని వెంకయ్య నాయుడు తెలిపారు. ఈ అంశంపై రాజ్యసభలో కాంగ్రెస్ పక్ష నేత గులాంనబీ ఆజాద్, ఉపనేత ఆనందశర్మలతో ఇప్పటికే ప్రభుత్వం చర్చలు జరిపింది. కాంగ్రెస్ సానుకూలత వ్యక్తం చేస్తే ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో కలిసి సోనియా లేదా రాహుల్‌గాంధీలను మరోసారి కలవటానికి సిద్ధంగా ఉన్నామని ఆయన వివరించారు. లిఖితపూర్వకంగా జవాబివ్వండి: కాంగ్రెస్ ప్రభుత్వం ఆశలపై నీళ్లు చల్లుతూ కాంగ్రెస్ పార్టీ జీఎస్టీ బిల్లుపై తమ విధానాన్ని పునరుద్ఘాటించింది. జీఎస్టీ బిల్లుకు తాము వ్యతిరేకం కాదంటూనే, ఈ బిల్లుపై తాము లేవదీసిన అంశాలపై ప్రభుత్వం నుంచి లిఖితపూర్వక జవాబు కోసం ఎదురుచూస్తున్నామని కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి కపిల్ సిబల్ స్పష్టం చేసారు.ఈ బిల్లుకు ఆమోదం పొందే విషయంలో ప్రభుత్వం సీరియస్‌గా లేదని కపిల్ సిబల్ ఆరోపించారు. ప్రభుత్వానికి శ్రద్ధ ఉంటే కాంగ్రెస్ లేవదీసిన అంశాలపై సంప్రదింపులు జరపాలని సిబల్ అన్నారు. జీఎస్టీ బిల్లును గత యూపీఏ ప్రభుత్వం రూపొందించిన విషయాన్ని గుర్తు చేస్తూ, అప్పట్లో ఈ బిల్లును మోడీ వ్యతిరేకించారని సిబల్ చెప్పారు. అంతేకాకుండా రాజ్యసభలో కాంగ్రెస్ బలం క్షీణిస్తోందని, అందువల్ల జీఎస్టీ బిల్లుకు త్వరలో పార్లమెంట్ ఆమోదం లభిస్తుందని ఆర్ధిక మంత్రి అరుణ్ జేట్లీ చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. వాస్తవానికి స్వదేశీ జాగరణ్ మంచ్, ఆర్‌ఎస్‌స్‌లు ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నాయని, ఆర్ధిక మంత్రి కాంగ్రెస్ పై నిందలు వేస్తున్నారని సిబల్ చెప్పారు. -
మన్మోహన్‌కు సమన్లు జారీ చేయాల్సిందే
బొగ్గు స్కామ్‌పై సీబీఐ ప్రత్యేక కోర్టులో దాసరి పిటిషన్ న్యూఢిల్లీ: బొగ్గు క్షేత్రాల కేటాయింపు స్కామ్‌లో మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. స్కామ్‌కు సంబంధించిన ఓ కేసులో మన్మోహన్‌కు సమన్లు జారీ చేయాలని అదే కేసులో నిందితుడైన కేంద్ర బొగ్గుశాఖ మాజీ సహాయ మంత్రి దాసరి నారాయణరావు సోమవారం ఢిల్లీలోని సీబీఐ ప్రత్యేక కోర్టును కోరారు. పారిశ్రామికవేత్త, కాంగ్రెస్ మాజీ ఎంపీ నవీన్ జిందాల్‌కు చెందిన కంపెనీలకు జార్ఖండ్‌లోని అమర్‌కొండా ముర్గాదంగల్ గనిని నిబంధనలకు విరుద్ధంగా కేటాయించారన్న కేసులో మన్మోహన్‌ను అదనపు నిందితుడిగా చేర్చి సమన్లు జారీ చేయాలంటూ జార్ఖండ్ మాజీ సీఎం మధు కోడా వేసిన పిటిషన్‌ను దాసరి సమర్థించారు. అప్పటి బొగ్గు మంత్రి కూడా అయిన మన్మోహన్ రెండు పర్యాయాలు పరిశీలించాకే జిందాల్ సంస్థలకు బొగ్గు క్షేత్రాన్ని కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. ఈ మేరకు దాసరి న్యాయవాది సతీశ్ మనేషిండే.. జడ్జి భరత్ పరాశర్ ఎదుట వాదనలు వినిపించారు. కాగా, కోడా పిటిషన్‌ను తాము సమర్థించట్లేదని అదే సమయంలో దానికి వ్యతిరేకమూ కాదని నవీన్ జిందాల్ న్యాయవాది ఎస్.వి. రాజు చెప్పారు. అయితే కోడా పిటిషన్‌పై వెలువరించే తీర్పు ఈ కేసులో జిందాల్ డిశ్చార్జ్ పిటిషన్ హక్కు సహా ఇతర హక్కులకు విఘాతం కలిగించేలా ఉండరాదన్నారు. సహ నిందితుల్లో చాలా మంది ఇదే వాదన వినిపించారు. కాగా, ఈ కేసు విచారణలో వ్యక్తిగత హాజరు నుంచి శాశ్వతంగా మినహాయింపు ఇవ్వాలన్న జిందాల్ విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చింది. మరోవైపు కోడా పిటిషన్‌పై మంగళవారం వాదనలు వినిపిస్తానని ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆర్.ఎస్. చీమా కోర్టుకు తెలిపారు. జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్, గగన్ స్పాంజ్ ఐరన్ ప్రైవేట్ లిమిటెడ్‌కు అక్రమంగా గనిని కేటాయించారని ఆరోపిస్తూ దాసరి, మధుకోడా, జిందాల్ సహా 15 మందిని సీబీఐ ఈ కేసులో నిందితులుగా పేర్కొంటూ చార్జిషీట్ వేసింది. అయితే మన్మోహన్తోపాటు అప్పటి ఇంధనశాఖ కార్యదర్శి ఆనంద్ స్వరూప్, నాటి గనులు, భూగర్భశాఖ కార్యదర్శి జైశంకర్ తివారీలను ఈ కేసులో అదనపు నిందితులుగా చేర్చాలని మధుకోడా పిటిషన్ వేశారు. దీనిపై అభిప్రాయం తెలపాల్సిందిగా కోర్టు నిందితులకు సూచించింది. -
మన్మోహన్ వద్ద మోదీ పాఠాలు
ఆర్థికవృద్ధి ఎలా సాధించాలని అడుగుతున్నారు: రాహుల్ అందరి అభిప్రాయాలు వినడం కాంగ్రెస్ డీఎన్ఏలోనే ఉంది ఆర్ఎస్ఎస్ క్రమశిక్షణ సాకుతో వ్యక్తిత్వాన్ని హత్య చేస్తోంది న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. మాజీ ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ వద్ద అర్థశాస్త్ర పాఠాలు నేర్చుకుంటున్నారని, దేశ ఆర్థికవృద్ధి సాధించడం ఎలా అని అడిగి తెలుసుకుంటున్నారని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఎద్దేవా చేశారు. వ్యక్తిత్వాన్ని హత్య చేయటం ఆర్ఎస్ఎస్ విశ్వాసమని, ఆ ఆలోచనా విధానమే ఇప్పుడు దేశాన్ని పరిపాలిస్తోందని.. రైతుల నుంచి దుస్తుల వరకూ అంతా కేవలం ఒకే ఒక్క వ్యక్తికి తెలుసుననే భావన రాజ్యమేలుతోందని.. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ తీవ్ర విమర్శలు ఎక్కుపెట్టారు. ‘‘ఆర్థికవ్యవస్థ ఆరోగ్య పరిస్థితిపై మాజీ ప్రధాని మన్మోహన్ నిన్న (బుధవారం) ఉద యం విమర్శలు చేస్తే.. సాయంత్రం ఆయన నుంచి మోదీ ఆర్థశాస్త్ర పాఠాలు చెప్పించుకున్నారు. దేశాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేయటం ఎలా అని అడిగి తెలుసుకున్నారు’’ అంటూ ఎద్దేవా చేశారు. ఢిల్లీలో జరుగుతున్న కాంగ్రెస్ విద్యార్థి విభాగం ఎన్ఎస్యూఐ జాతీయ సదస్సు ‘దృష్టికోణ్’లో రాహుల్ గురువారం ప్రసంగిస్తూ.. మోదీ సర్కారు పైన, అధికార బీజేపీ సైద్ధాంతిక మార్గదర్శి ఆర్ఎస్ఎస్ పైన పదునైన విమర్శలు చేశారు. ‘‘గతంలో నాకు అర్థమయ్యేది కాదు. సభలో అటు వైపు నుంచి, ఇటు వైపు నుంచి రకరకాల అభిప్రాయాలు వినపడుతుండేవి. ఇదేంటి క్రమశిక్షణ తగ్గుతుందేమో అనుకునేవాడిని. కానీ అందరి వాణి వినడం కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం అని తరువాత నాకు అర్థమైంది. అన్ని వర్గాల అభిప్రాయాలను వినడం కాంగ్రెస్ డీఎన్ఏలోనే ఇమిడిఉంది. అంతర్గత ప్రజాస్వామ్యానికి, అంతర్గత చర్చకు అవకాశం ఉందని, అంతిమంగా అది ప్రజలందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయానికి దారితీస్తుందని అర్థమైంది. కానీ ఆర్ఎస్ఎస్ను చూడండి. ఆ ఆర్ఎస్ఎస్ శాఖను చూడండి. ఒక గీత గీస్తారు. ఆ గీత దాటితే లాఠీదెబ్బ పడుతుంది. వ్యక్తిత్వాన్ని హత్య చేసేందుకు క్రమశిక్షణను వారు సాకుగా చేసుకున్నారు. అదే భావజాలంతో ఇప్పుడు బీజేపీ, ఆర్ఎస్ఎస్ దే శాన్ని నడిపిస్తున్నాయి’’ అని విమర్శలు గుప్పించారు. ‘‘ఈ దేశంలో విభిన్న సంస్కృతులు, విభిన్న అవసరాలు, విభిన్న అభిప్రాయాలు ఉంటాయి. వాటిన్నంటినీ గౌరవించాల్సిన అవసరం ఉంది. కానీ బీజేపీలో అలా కాదు. విద్య గురించి అయినా ఒక్కరిదే నిర్ణయం. బట్టల గురించి అయినా ఒక్కరిదే నిర్ణయం. రైతుల గురించి అయినా ఒక్కరే మాట్లాడతారు. ఎవరూ మాట్లాడకూడదు.’’ అని వ్యాఖ్యానించారు. ‘‘నరేంద్రమోదీ ఫ్రాన్స్ వెళ్లారు. అమెరికా వెళ్లారు. మంగోలియా, చైనా వెళ్లారు. కానీ రైతులు, కూలీల ఇంటికి మాత్రం వెళ్లలేకపోయారు’’ అని విమర్శించారు. ‘‘ఆర్ఎస్ఎస్ శాఖలో ఎవరూ మాట్లాడకూడదు. అలాగే దేశంలో కూడా ఎవ్వరూ మాట్లాడకూడదు. దేశంలో విద్యారంగాన్ని ఆర్ఎస్ఎస్ తన గుప్పిట్లోకి తీసుకుంటోంది. ఆర్ఎస్ఎస్ తన ఆలోచనా ప్రక్రియను రుద్దుతున్న విద్యా సంస్థల్లో ఆ సంస్థతో పోరాడాలి’’ అని ఎన్ఎస్యూఐ కార్యకర్తలకు రాహుల్ పిలుపునిచ్చారు. -
మన్మోహన్లా మోదీ డమ్మీ కాదు: కేంద్ర మంత్రి రాథోడ్
హైదరాబాద్: మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌లా ప్రధాని నరేంద్ర మోదీ డమ్మీ కాదని కేంద్ర సమాచార శాఖ మంత్రి రాజ్యవర్ధన్‌సింగ్ రాథోడ్ వ్యాఖ్యానించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డితో కలిసి హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్డీయే సర్కారు ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా కేంద్రం తీసుకున్న నిర్ణయాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ఈ సందర్భంగా కేంద్ర మంత్రి వివరించారు. కేంద్ర మంత్రులను కాంగ్రెస్ డమ్మీ అనడాన్ని తిప్పికొడుతూ.. యూపీఏ హయాంలో ప్రధానినే డమ్మీ అనేవారని, ఇప్పుడు కాంగ్రెస్ వ్యాఖ్యలను బట్టి ప్రస్తుత ప్రధాని నిర్ణయాలు తీసుకుంటున్నట్లు అంగీకరించారని ఎద్దేవా చేశారు. అయితే మోదీ ఏకపక్షంగా, వ్యక్తిగతంగా నిర్ణయాలు తీసుకోకుండా మంత్రులందరితో చర్చించాకే ముందుకు సాగుతున్నారని వివరించారు. తమ మంత్రివర్గం టీమ్ ఇండియాలా పనిచేస్తోందన్నారు. ఏడాదిలోనే 60 ఏళ్ల పనులు చేయలేమని, అయినా గణనీయమైన మార్పులను తీసుకొచ్చామని రాథోడ్ చెప్పారు. కుంభకోణాలు, అవినీతిని రూపుమాపామన్నారు. మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రపంచ దేశాలన్నీ భారత్‌ను పెద్దన్నలా చూస్తున్నాయన్నారు. కోట్లాది బ్యాంకు ఖాతాలు తెరవడం, అందరికీ బీమా సౌకర్యం కల్పించడం తమ ఘనతగా చెప్పారు. యూపీఏ పథకాలను ఎన్డీయే కాపీ కొట్టిందనే ఆరోపణలను ఆయన కొట్టిపారేశారు. -
సీల్డ్ కవర్లో వాంగ్మూలాలు
బొగ్గు కుంభకోణం కేసులో దర్యాప్తు పురోగతి నివేదికను ప్రత్యేక కోర్టుకు సమర్పించిన సీబీఐ సీల్డ్ కవర్ తెరిచి పరిశీలించిన న్యాయమూర్తి రెండు వారాల్లో దర్యాప్తు పూర్తిచేస్తామన్న సీబీఐ న్యూఢిల్లీ: బొగ్గు క్షేత్రాల కేటాయింపుల కుంభకోణం కేసులో కొనసాగుతున్న దర్యాప్తులో ప్రగతిపై నివేదికను, ఈ కేసుకు సంబంధించి తాజాగా సీబీఐ అధికారులు ప్రశ్నించిన మాజీ ప్రధానమంత్రి మన్మోహన్సింగ్, నాటి పీఎంఓ ఉన్నతాధికారుల వాంగ్మూలాలను.. కేంద్ర దర్యాప్తు సంస్థ మంగళవారం సీబీఐ ప్రత్యేక కోర్టుకు సీల్డ్కవర్లో సమర్పించింది. ఈ కేసులో మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ను కూడా ప్రశ్నించాల్సిందిగా సీబీఐని కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. బొగ్గు మంత్రిత్వశాఖ మాజీ కార్యదర్శి పి.సి.పరేఖ్, పారిశ్రామికవేత్త కుమార్ మంగళం బిర్లా తదితరులు నిందితులుగా ఉన్న ఈ బొగ్గు కుంభకోణం కేసులో దర్యాప్తును పూర్తిచేసేందుకు మరో రెండు వారాల గడువును సీబీఐ కోరింది. విచారణ సందర్భంగా సీల్డ్ కవర్‌ను తెరచి.. సీబీఐ సమర్పించిన వాంగ్మూలాలు, ఇతర పత్రాలను ప్రత్యేక న్యాయమూర్తి భరత్‌పరాశర్ పరిశీలించారు. అయితే.. ఈ వాంగ్మూలాలు, పత్రాలను తదుపరి దర్యాప్తు పూర్తయ్యేవరకూ సీల్డ్ కవర్లోనే ఉంచాలని, వాటిని పరిశీలించేందుకు అనుమతించరాదని సీనియర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వి.కె.శర్మ కోర్టుకు విజ్ఞప్తిచేశారు. ఈ నేపధ్యంలో ఆయా పత్రాలన్నిటినీ మళ్లీ సీల్డ్ కవర్లో ఉంచి, కోర్టు సీల్‌తో సీల్ చేయాలని సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తి ఆదేశించారు. దర్యాప్తును రెండు వారాల్లో పూర్తిచేస్తామని సీబీఐ పేర్కొనడంతో.. కేసు విచారణను ఫిబ్రవరి 19వ తేదీకి వాయిదా వేశారు. బొగ్గు స్కాం కేసులో మాజీ ప్రధాని మన్మోహన్సింగ్, అప్పటి ప్రధానమంత్రి కార్యాలయంలోని ఉన్నతస్థాయి అధికారులైన మన్మోహన్ ముఖ్య కార్యదర్శి టి.కె.ఎ.నాయర్, వ్యక్తిగత కార్యదర్శి బి.వి.ఆర్.సుబ్రమణ్యం తదితరులను కూడా ప్రశ్నించాల్సిందిగా ప్రత్యేక కోర్టు గత డిసెంబర్ 16వ తేదీన ఆదేశించటంతో.. సీబీఐ ఆ మేరకు వారిని ప్రశ్నించి తాజాగా పురోగతి నివేదికను, వాంగ్మూలాల పత్రాలను కోర్టుకు సమర్పించింది. ఒడిశాలోని తాలాబిరా-2 బొగ్గు క్షేత్రాన్ని 2005 సంవత్సరంలో హిందాల్కో సంస్థకు కేటాయించటంలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై ఈ కేసు నమోదైంది. హిందాల్కోకు అనుకూలంగా వ్యవహరించలేదన్న మన్మోహన్! తాలాబిరా-2 కేటాయింపులో హిందాల్కోకు ఏ విధంగానూ అనుకూలంగా వ్యవహరించలేదని.. నిర్దిష్ట విధివిధానాల ప్రకారమే కేటాయింపు జరిగిందని మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ సీబీఐకి స్పష్టంచేసినట్లు తెలిసింది. ఈ కేసులో కోర్టు ఉత్తర్వుల మేరకు 10 రోజుల కిందట తనను ప్రశ్నించిన సీబీఐ అధికారులకు ఆయన పై విధంగా వాంగ్మూలం ఇచ్చినట్లు సమాచారం. తాలాబిరా-2 బొగ్గు క్షేత్రం కేటాయింపు జరిగినపుడు కేంద్ర బొగ్గు మంత్రిత్వశాఖ నాటి ప్రధాని మన్మోహన్ పర్యవేక్షణలోనే ఉన్న విషయం తెలిసిందే. హిందాల్కో సంస్థకు తాలాబిరా-2 బొగ్గు క్షేత్రాన్ని కేటాయించాలని విజ్ఞప్తి చేస్తూ పారిశ్రామికవేత్త కుమార మంగళం బిర్లా 2005 మే 7, జూన్ 17 తేదీల్లో ప్రధానికి రెండు లేఖలు రాసిన తర్వాత ప్రధానమంత్రి కార్యాలయంలో చోటుచేసుకున్న పరిణామాల గురించి.. సీబీఐ అధికారులు కొద్ది రోజుల కిందట మన్మోహన్‌ను ప్రశ్నించినట్లు అభిజ్ఞవర్గాలు తెలిపాయి. -
మాజీ ప్రధాని మన్మోహన్‌ను సీబీఐ విచారించడాన్ని స్వాగతిస్తున్నాం
సాక్షి, న్యూఢిల్లీ:బొగ్గు గనుల కేటాయింపుల్లో జరిగిన అక్రమాలపై మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ను సీబీఐ విచారించడాన్ని బీజేపీ స్వాగతించింది. ఈ కుంభకోణంలో లబ్ధిపొందిన కార్పొరేట్ వ్యక్తులతో పాటు రాజకీయ శక్తులను సీబీఐ బయటకు తీయాలని తాము కోరుకుంటున్నట్లు వెల్లడించింది. గతంలో యూపీఏ పదేళ్ల ప్రభుత్వం బొగ్గు కేటాయింపుల్లో అధికార దుర్వినియోగానికి పాల్పడిందని, స్వాతంత్య్రానంతరం దేశంలో ఇదే భారీ కుంభకోణమని ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు బుధవారం ఇక్కడ విలేకరుల సమావేశంలో అన్నారు. సీబీఐ, ఈడీ వంటి సంస్థల్ని గుప్పిట్లో పెట్టుకొని కుంభకోణాన్ని తొక్కిపెట్టే యత్నాలు అనేకం యూపీఏ ప్రభుత్వ హయాంలో జరిగాయని, కానీ అవే సంస్థలు ఇప్పుడు స్వతంత్రంగా పనిచేస్తున్నాయని చెప్పారు. గనుల కేటాయింపులతో లబ్ధిపొందిన కార్పొరేట్ శక్తులను ప్రశ్నిస్తున్నప్పుడు, వాటివల్ల లబ్ధి గడించిన రాజకీయ శక్తులను ప్రశ్నించాల్సి ఉంటుందని, ఆ శక్తులన్నింటినీ బయటకు తీయాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఇదే సమయంలో పాకిస్తాన్ జైలులో ఉన్న ఉగ్రవాది జియహర్ రెహమాన్ లఖ్వీని భారత్‌కు అప్పగించాలని యూఎస్, యూకేలు చేసిన డిమాండ్‌ను ఆయన స్వాగతించారు. లఖ్వీతో పాటు హఫీజ్ సయీద్, దావూద్ ఇబ్రహీంలను సైతం భారత్‌కు అప్పగించేలా అంతర్జాతీయ సమాజం పాకిస్తాన్‌పై ఒత్తిడి తేవాలని కోరారు.